26న అమరావతికి ఉపరాష్ట్రపతి
సాక్షి, అమరావతి: ఉపరాష్ట్రపతి హోదాలో ఎం.వెంకయ్యనాయుడు తొలిసారిగా ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. ఈ నెల 26, 27న రెండు రోజులు పాటు ఉపరాష్ట్రపతి రాష్ట్రంలో పర్యటించనున్నారని, ఇందుకు సంబంధించి ప్రోటాకాల్ ప్రకారం స్వాగత కార్యక్రమాలు, వసతి ఏర్పాట్లను చేస్తున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మికాంతం తెలిపారు. ఈనెల 26న అమరావతిలో ప్రభుత్వం ఘనంగా పౌరసన్మానం చేయడానికి ఏర్పాట్లు చేస్తోందని, దీనికి సంబంధించి సచివాలయంలో మూడు హెలీపాడ్లను సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పౌరసన్మాన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కూడా పాల్గొననున్నారు.
అనంతరం సాయంత్రం తెనాలిలో జరిగే ఒక పుస్తకావిష్కరణ సభలో వెంకయ్య నాయుడు పాల్గొననున్నారు. 27వ తేది విజయవాడ సమీపంలో ఆత్కూరులో నిర్వహించే మెగా మెడికల్ క్యాంపులో పాల్గొనన్నుట్లు కలెక్టర్ తెలియచేశారు. సోమవారం సచివాలయం సమీపంలో ఏర్పాటు చేస్తున్న హెలీపాడ్లను కలెక్టర్‌తో సహా ఉన్నతాధికారులు పరిశీలించారు. పోలీస్ బ్యాండ్, జాతీయ గీతాలాపనతో ఘనంగా స్వాగతించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, బహిరంగ సభ, ఆహారం, వసతి, రవాణా, విద్యుత్ వంటి అన్ని విభాగాలు ప్రోటోకాల్‌ను అనుసరించి సమర్థవంతగా విధులు నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమీక్షలో విజయవాడ మున్సిపల్ కమిషనర్ జె.నివాస్, విజయవాడ ఆర్డీవో హరీష్, డీసీపీ బ్రహ్మానంద రెడ్డి, ట్యాన్స్‌కో, ఆర్‌అండ్‌బీ అధికారులు పాల్గొన్నారు.