'ఇద్దరు నాయుళ్లు పిరికిపందలు'
'ఇద్దరు నాయుళ్లు పిరికిపందలు'
Published Mon, Sep 12 2016 4:42 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
- చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఎదురుదాడి
- మీడియాతో సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ
హైదరాబాద్ : ప్రత్యేక హోదాపై మాట తప్పిన టీడీపీ, బీజేపీ నేతలు తమ చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికే ప్రత్యేక హోదాపై పోరాడుతున్న వారిపై ఎదురుదాడి చేస్తున్నారని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వెంకయ్య 2 లక్షల 25 వేల కోట్ల ప్యాకేజీ ఇస్తున్నామంటారు... మరి చంద్రబాబు ఈ ప్యాకేజీ వల్ల 70 వేల కోట్లు వస్తాయంటున్నారు. ఇలా ఇద్దరు నాయుళ్లు తలోమాటతో ప్రజలను గందరగోళ పరుస్తున్నారని విమర్శించారు.
హోదా విషయంలో సీఎం చంద్రబాబు ఇప్పటికి ఐదు స్టేట్‌మెంట్‌లు ఇచ్చి ఐదు రకాలుగా మాట్లాడారు.. అందులో దేన్ని విశ్వసించాలో ఆయన చెబితే బాగుంటుందన్నారు. పదమూడు పార్టీలు, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ హోదా కావాలన్నారు. హోదా ఆశ రేకెత్తించిన కేంద్ర మంత్రి వెంకయ్య, చంద్రబాబు మోదీకి బయపడుతున్నారు. ఢిల్లీ నాయుడు, గల్లీ నాయుడు ఇద్దరు పిరికిపందలేనని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఇవ్వకుంటే వైజాగ్ లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుకి ఎం జరిగిందో అన్ని చోట్ల అదే జరుగుతుందని, వదిలే ప్రసక్తే లేదన్నారు.
స్విస్ చాలెంజ్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి
రాజధాని మీ తెలుగు దేశం నాయుకులదికాదు.. ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్ అని రామకృష్ణ విమర్శించారు. రాజధానిలో అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం ఉండాలి. స్విస్ చాలెంజ్‌పై హైకోర్టు స్టే ఇచ్చింది. ఇప్పటికైన ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని అన్ని పక్షాల అభిప్రాయాలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎక్కడ చూసినా అవినీతే...
మెడికల్ కాలేజీల్లో ఏ కేటగిరి సీట్స్ నింపకుండా ‘బీ’ కేటగిరి సీట్లు నింపుతున్నారు. మెడికల్ కాలేజీలను ప్రభుత్వం నడుపుతుందా?అని ప్రశ్నించారు. అడ్మిషన్లలో రిజర్వేషన్లు నీరుగారుస్తున్నాయి. పద్మావతి యూనివర్శిటీలో అయితే ఉన్నతి తరగతి వాళ్లకు రిజర్వేషన్లు ఇస్తున్నారన్నారు. ప్రభుత్వాన్ని కార్పొరేట్ సంస్థలు నడుపుతున్నాయని ఆయన విమర్శించారు.
Advertisement
Advertisement