- ప్రత్యేక హోదా తెస్తే పాలాభిషేకం
- లేకపోతే కృష్ణానదిలో ముంచుతాం
విజయవాడ (మొగల్రాజపురం) : రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురాకపోతే కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజల దృష్టిలో చరిత్రహీనులుగా మిగిలిపోతారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. మొగల్రాజపురం నిమ్మతోట సెంటర్‌లో ఆదివారం ప్రత్యేక హోదా సాధన సమితి, సీపీఐ సంయుక్త ఆధ్వర్యంలో 'ప్రత్యేక హోదా కావాలా? ప్రత్యేక ప్యాకేజీ కావాలా?' అనే అంశంపై ప్రజా బ్యాలెట్ జరిగింది.
నారాయణ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ.. వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదాపై అనుసరిస్తున్న వైఖరిపై ధ్వజమెత్తారు. ప్రత్యేకహోదా వల్ల ఉపయోగం లేదని ఇప్పుడు చెబుతున్న వెంకయ్య, చంద్రబాబు గతంలో అదే హోదా కావాలని ఎందుకు డిమాండ్ చేశారని సూటిగా ప్రశ్నించారు. ప్రత్యేకహోదా ఇవ్వడానికి ఫైనాన్స్ కమిషన్ అడ్డు చెబుతుందని కుంటి సాకులు చెబుతుందన్నారు. పార్లమెంట్‌లో జీఎస్టీ బిల్లును ఆమోదింపజేసుకున్న కేంద్రానికి.. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనుకుంటే హోదా బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించడం పెద్ద పని కాదన్నారు.
గతంలో ప్రత్యేక హోదా ఇస్తామంటూ 13 జిల్లాలు తిరిగి సన్మానాలు చేయించుకున్న వెంకయ్యనాయుడు, ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీలు తెచ్చానని సన్మానాలు చేయించుకుంటున్నారని దుయ్యబట్టారు. సన్మానాలకు ఉన్న విలువను వెంకయ్యనాయుడు దిగజార్చారని మండిపడ్డారు. రూ.2.25 లక్షల కోట్లు ప్యాకేజీల రూపంలో వస్తాయని వెంకయ్య, చంద్రబాబు అబద్ధాలు చెప్పి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రానికి ప్రత్యేకహోదా తీసుకువస్తే వెంకయ్యనాయుడు, చంద్రబాబులకు పాలాభిషేకం చేస్తామని, తీసుకురాకపోతే కృష్ణానది నీటిలో ముంచుతామని నారాయణ ఘాటుగా స్పందించారు. చంద్రబాబు నాయుడు ఆటలు ప్రధాని నరేంద్రమోదీ దగ్గర సాగడం లేదన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, నగర కార్యదర్శి దోనేపూడి శంకర్‌లతో పాటుగా స్థానిక నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
'వెంకయ్య, బాబు చరిత్రహీనులుగా మిగిలిపోతారు'
Published Sun, Sep 25 2016 6:57 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement
Advertisement