హోదాకు మించి ఏపీకి తోడ్పాటు
- కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు
సాక్షి, హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హోదాకు మించిన ఆదా (తోడ్పాటు) కేంద్రం ఇస్తోందని కేంద్రమంత్రి ఎం.వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఇస్తే బాగుంటుందని అనుకున్నా 14వ ఆర్థిక సంఘం నిబంధనలతో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయామని చెప్పారు. పలు రంగాలకు సంబంధించి కేంద్రం విరివిగా కేటాయింపులు చేస్తోందన్నారు. ప్రత్యేక హోదా ఉంటేనే పెట్టుబడులు పెడతామని విశాఖలో పెట్టుబడుల సదస్సు సందర్భం గా ఎవరూ అనలేదన్నారు. రోడ్లు, రవాణ, అనుమతులు, నిర్ణయం తీసుకునే సామర్థ్య మున్న నాయకత్వంతో రాష్ట్రంలో పెట్టుబడు లు పెరుగుతాయన్నారు. ప్రత్యేక హోదాపై ఇప్పుడు గోదాలో దిగుతున్న నాయకులు, విభజనసమయంలో ఏమై పోయారని ప్రశ్నించారు. అప్పుడు అధికారంలో ఉన్న వారు ద్రోహం చేశారని మండిపడ్డారు.
అప్పుడు బీజేపీ గట్టిగా నిలబడి పోరాడిందన్నారు. ఇప్పుడు మంచిపేరు వస్తోందని కొందరు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని శనివారం బీజేపీ కార్యాల యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో వెంకయ్య ఇష్టాగోష్ఠి గా మాట్లాడారు. తెలంగాణకు కూడా రోడ్లు, విద్యుత్, పేదలకు ఇళ్ల కోసం హడ్కోరుణాలు, నీటిపారుదల ప్రాజెక్టులు ఇలా అనేక రకాలుగా కేంద్రం సాయమందిస్తోందన్నారు. మతప్రాతిపదికన ముస్లింలకు రిజర్వేషన్లకు బీజేపీ అంగీకరించే ప్రసక్తి లేదన్నారు. ఈ రిజర్వేషన్లను ఎవరు చేసినా నిలవవన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూ లంగా సీఎం కేసీఆర్ తీర్మానం చేయడాన్ని స్వాగతిస్తున్నామ న్నారు. తెలంగాణలో వెనుకబడ్డ జిల్లాల అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు. ప్రధాని మోదీ అభివృ ద్ధిని వివరిస్తూ రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలు విస్తృత ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.
ట్విటర్ వేదికగా కొందరి రాజకీయాలు..
కొందరు ఏం చేయకుండా ట్విటర్ వేదికగా రాజకీయాలు చేస్తున్నారని సినీహీరో పవన్‌కల్యాణ్‌ను ఉద్దేశించి వెంకయ్య వ్యాఖ్యానించారు. ఉత్తరాది, దక్షిణాది అంటూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే పద్ధతి మంచిదికాదని హెచ్చరించారు. జల్లికట్టును 2011లో నాటి యూపీఏ ప్రభుత్వం నిషేధించగా, బీజేపీయే ఆర్డినెన్స్ తెచ్చిందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బీజే పీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్యేలు ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, రాజాసింగ్, పార్టీనాయకులు ప్రేమేందర్‌రెడ్డి, ఎస్.మల్లారెడ్డి, అశోక్, ఆకుల విజయ, కాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.