సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా ఆర్టీసీ బస్సులు నడవకుండా ఉంటే ప్రజల నుంచి అధిక మొత్తం రాబట్టి దోపిడీ చేయడం సరికాదంటూ జేఏసీ నాయకులు కొవ్వూరు బాలచంద్రారెడ్డి, ఆర్టీసీ యూనియన్ నాయకులు శనివారం ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులపై ధ్వజమెత్తారు. రాత్రి వేళ బస్సులు తిప్పవద్దని, సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరేందుకు శనివారం జేఏసీ నాయకులు ప్రొద్దుటూరులోని బీబీవీఆర్ ట్రావెల్స్ కార్యాలయానికి వెళ్లారు. బస్సుల తిప్పి తీరుతామంటూ యాజమాన్యం జేఏసీ నాయకులతో వాగ్వాదానికి దిగింది. దీంతో కొంత సేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. ట్రావెల్స్ నిర్వాహకుల వ్యవహార శైలికి నిరసనగా జేఏసీ ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు రోడ్డుపై బైఠాయించారు. ప్రైవేటు ట్రావెల్స్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆర్టీసీ బస్సులు తిరగకుండా ఉద్యమానికి అండగా నిలిస్తే ప్రైవేటు బస్సుల యాజమాన్యం వారు హైదరాబాద్‌కు వెళ్లే ఒక్కో టికెట్‌కు రూ.1500 రాబట్టి దోపిడీ చేస్తున్నారంటూ మండిపడ్డారు. దీన్ని అరికట్టకపోతే బస్సులకు జరిగే నష్టానికి తమది బాధ్యత కాదని తేల్చి చెప్పారు. బస్సులు తిరిగితే కచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న సీఐ బాలిరెడ్డి, ఎస్‌ఐ ఇబ్రహీం ఆ ప్రాంతానికి చేరుకుని జేఏసీ నాయకులతో మాట్లాడారు. ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యం వ్యవహరించిన తీరుపై సీఐ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో ట్రావెల్స్ భవనంలోకి సమైక్యవాదులు ఎక్కువ మంది చేరుకోవడంతో తొపులాటలో గదిలో ఉన్న ఒక అద్దం పగిలిపోయింది. ఓ వ్యక్తి జేఏసీ ఉద్యమానికి ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యం లక్ష రూపాయలు ఇచ్చిందని మాట్లాడటంతో జేఏసీ కన్వీనర్ మాదాసు మురళీ చేరుకున్నారు.
ఎవరికి ఇచ్చారని నిలదీయడంతో ఉద్యమంలో వంటావార్పు సమయంలో డబ్బు ఖర్చయిందని ట్రావెల్స్ యాజమాన్యం మాట మార్చింది. సీఐ బాలిరెడ్డి బీబీవీఆర్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసి జేఏసీ ఆర్టీసీ నాయకులను అక్కడి నుంచి పంపించారు. జేఏసీ నాయకులు కొవ్వూరు బాలచంద్రారెడ్డి, మాదాసు మురళీ, ఆర్టీసీ యూనియన్ నాయకులు ఎన్నార్ శేఖర్, టీవీఆర్ రెడ్డి, మాచయ్య, కార్మికులు కాళేశ్వరి, బీసీవీఆర్, ఇందు ట్రావెల్స్ కార్యాలయాల వద్దకు వెళ్లి సమైక్యాంద్రకు సహకరించి బస్సులు తిప్పకుండా ఉండాలని కోరారు.
ఉద్యమం పేరుతో ‘ప్రైవేట్’ దోపిడీపై ఆందోళన
Published Sun, Aug 18 2013 8:21 AM | Last Updated on Mon, Aug 20 2018 3:26 PM
Advertisement