private bus travels
-
బాబోయ్ ప్రైవేట్ ట్రావెల్స్.. అడ్డంగా దోచేస్తున్నారు
ప్రత్తిపాడు(గుంటూరు): సంక్రాంతి పండగ పేరు చెప్పి ప్రయాణికులను నిలవునా దోచుకునేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ సిద్ధమయ్యాయి. హైదరాబాద్ నుంచి జిల్లాకు, జిల్లా నుంచి హైదరాబాద్‌కు వచ్చి వెళ్లే టికెట్ ధరలను ఇష్టారాజ్యం పెంచేశాయి. అడ్డగోలుగా ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. ఇదేమని అడిగే నాథులు కనపడడం లేదు. అధికారయంత్రాంగం కూడా చోద్యం చూస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా అయితే గుంటూరు నుంచి హైదరాబాద్‌కు నాన్ ఏసీ బస్సుకు రూ.400, ఏసీ బస్సుకు రూ. 500, స్లీపర్ ఏసీ బస్సుకు రూ.700, హైదరాబాద్ నుంచి గుంటూరుకు నాన్ఏసీ రూ.400, ఏసీ రూ.500, స్లీపర్ ఏసీ రూ.800 డిమాండ్‌ను బట్టి కొంచెం అటుఇటుగా చార్జీలు ఉంటాయి. అయితే ఇప్పుడు సంక్రాంతి పేరు చెప్పి ఈ టికెట్ల వెలను ఆయా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు అమాంతం పెంచేశాయి. ఒక్కో టికెట్‌పై అదనంగా రూ.400 నుంచి రూ.1,000 వరకూ దోచుకుంటున్నాయి. ఆయా ట్రావెల్స్ తమ ఆన్లైన్ వెబ్సైట్లలో పెంచిన ధరలను ప్రదర్శిస్తున్నాయి. రాష్ట్రంలోని నలుమూలల నుంచి లక్షల మంది ప్రజలు బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్‌లో నివసిస్తుంటారు. కొందరు స్వగ్రామాల నుంచి వెళ్లి హైదరాబాద్‌లో స్థిరపడిన వారూ ఉంటారు. తెలుగునాట పెద్ద పండుగైన సంక్రాంతికి వీరంతా స్వగ్రామాలకు రావడం సహజం. దీంతో సంక్రాంతి సమయంలో సగం హైదరాబాద్ ఖాళీ అవుతుంది. ఈనేపథ్యంలో ఒక్కసారిగా ప్రజలు సంక్రాంతి సెలవులకు స్వగ్రామాలకు పయనమయ్యే అవకాశాలు ఉండటంతో ట్రావెల్స్ యాజమాన్యాలు దోపిడీకి తెరలేపాయి. అయినా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి గుంటూరుకు ధరలు ఇలా (రూపాయల్లో).. బస్సు రకం సాధారణ ధర పండగ ముందు చార్జి నాన్ఏసీ 300–500 1,000 నాన్ ఏసీ స్లీపర్ 600–700 1.000 ఏసీ 540 1,200 స్లీపర్ ఏసీ 700–800 1,400/1,500 గుంటూరు నుంచి హైదరాబాద్‌కు ధరలు ఇలా(రూపాయల్లో).. . బస్సు రకం సాధారణ ధర పండగ ముందు చార్జి నాన్ఏసీ 400 900–1,500 నాన్ ఏసీ స్లీపర్ 600 1000–1,500 ఏసీ 500–700 1,150–1,500 స్లీపర్ ఏసీ 800–900 1,300/2,500 ప్రత్యేక బృందాలతో తనిఖీలు సంక్రాంతి నేపథ్యంలో ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. స్పెషల్ బృందాలు వేస్తున్నాం. ముమ్మరంగా తనిఖీలు చేస్తాం. ప్రైవేట్ ట్రావెల్స్ అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తే పెద్ద ఎత్తున అపరాధ రుసుములు విధిస్తాం. అవసరమైతే బస్సులు సీజ్ చేస్తాం. – శివ నాగేశ్వరరావు, ఎంవీఐ, చిలకలూరిపేట ధరలు నియంత్రించాలి సంక్రాంతి పండగ సందర్భంగా ప్రైవేట్ ట్రావెల్స్ రెట్టింపు ధరలకు టిక్కెట్లు విక్రయిస్తున్నాయి. అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. అడిగేవారు లేకపోవడంతో వారి ఇష్టారాజ్యమైంది. అధికారులు ధరలను నియంత్రించాలి. వెంటనే తనిఖీలు చేపట్టాలి. – సాధినేని కోటేశ్వరరావు (పెద గొట్టిపాడు) చదవండి: అమెరికాను మేము ఓడించగలం అనడానికి ఇదే గుర్తు: తాలిబన్లు -
‘డబ్బు’ల్ దోపిడి.. బస్సెక్కాలంటే భయమేస్తోంది
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో మహమ్మారి కట్టడి కోసం విధించిన లాక్డౌన్ ప్రైవేట్ ట్రావెల్స్‌కు కాసుల వర్షం కురిపిస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులపైన రెట్టింపు భారం మోపుతూ నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. సాధారణ రోజుల్లో విధించే చార్జీలపైన మూడింతలు వసూలు చేస్తున్నారు. ఏసీ, నాన్ ఏసీ బస్సుల్లో ప్రయాణికుల డిమాండ్ మేరకు చార్జీలను అమాంతంగా పెంచేస్తున్నారు. ఇక స్లీపర్ క్లాస్ బస్సుల్లో విమాన చార్జీలను తలపిస్తున్నాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు నాన్ ఏసీ బస్సుల్లో రూ.650 వరకు ఉంటే ఇప్పుడు రూ.1000 నుంచి రూ.1200 వరకు వసూలు చేస్తున్నారు. ఏసీ బస్సుల్లో రూ.2000 నుంచి రూ.2500 వరకు చార్జీలు ఉన్నాయి. స్లీపర్ సదుపాయం ఉన్న ఏసీ బస్సుల్లో మాత్రం రూ.3000 పైనే తీసుకుంటున్నట్లు ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అర్జెంట్‌గా విజయవాడకు వెళ్లవలసి వచ్చింది. అప్పటికప్పుడు ట్రైన్లో వెళ్లే అవకాశం లేదు.దీంతో ప్రైవేట్ ఏసీ బస్సెక్కాను. రూ.2200 తీసుకున్నారు... అని మల్కాజిగిరికి చెందిన సతీష్ ఆందోళన వ్యక్తం చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో తెలంగాణ, ఏపీల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో రెండు రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ఈ అవకాశాన్ని ప్రైవేట్ ట్రావెల్స్ సొమ్ము చేసుకుంటున్నాయి. ప్రైవేట్ బస్సులతో పాటు, రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే ట్రావెల్స్ కార్లు, మ్యాక్సీ క్యాబ్‌లలోనూ అడ్డగోలు దోపిడీ కొనసాగుతోంది. సడలింపు వేళలే అవకాశంగా.... ►రెండు రాష్ట్రాల్లో సడలింపు వేళలను అవకాశంగా చేసుకొని ప్రైవేట్ బస్సులు నడుస్తున్నాయి. ►ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం చేయవలసిన వాళ్లు ఈ బస్సులను ఆశ్రయిస్తున్నారు. ►ఏపీలో ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, తెలంగాణలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు లాక్డౌన్ వేళలను సడలించడంతో పాటు మరో గంట సమయం ప్రజలు ఇళ్లకు చేరుకొనేందుకు వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే. ►ఈ సడలింపు సమయానికి అనుగుణంగానే ప్రైవేట్ బస్సులు రోడ్డెక్కుతున్నాయి. ట్రావెల్స్ సంస్థలు పోటా పోటీగా బస్సులు నడుపుతున్నాయి. ►బస్సుల్లో పెద్దగా ఆక్యుపెన్సీ లేకపోయినా కరోనా సమయంలో రెండు రాష్ట్రాల సరిహద్దులను దాటిస్తున్న నెపంతో ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. ►ఒక ట్రావెల్స్ సంస్థ చార్జీలకు, మరో సంస్థ చార్జీలకు మధ్య ఎలాంటి పొంతన ఉండడం లేదు. ప్రత్యేక అనుమతుల పేరిట వసూళ్లు... ప్రైవేట్ బస్సుల్లో పరిస్థితి ఇలా ఉంటే, మ్యాక్సీ క్యాబ్‌లు, ట్యాక్సీలు, క్యాబ్‌లు మరో విధంగా దోపిడీకి తెర లేపాయి. పోలీస్ చెక్‌పోస్టుల వద్ద ప్రత్యేక అనుమతులు తీసుకొని బండ్లు నడుపుతున్నట్లు చెప్పి అదనపు వసూళ్లకు పాల్పడుతున్నా యి. ఎల్బీ నగర్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వందలాది క్యాబ్‌లలో ఈ తరహా దోపిడీ కొనసాగుతోంది. సాధారణ రోజుల్లో రూ.1000 వరకు డిమాండ్ చేస్తే ఇప్పుడు రూ.2500 పైనే వసూ లు చేస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందే గమ్యస్థానాలకు చేరుకోవాలనే ఉద్దేశంతో అడిగినంత చెల్లించవలసి వస్తుందని ప్రయాణికులు చెబుతున్నారు. తగ్గిన రైళ్లు... కరోనా సెకెండ్ వేవ్ దృష్ట్యా ప్రయాణికుల రాకపోకలు తగ్గుముఖం పట్టడంతో దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్ల ను భారీగా రద్దు చేసింది. ఈ నెల 16వ తేదీ వరకు రెండు రాష్ట్రాల మీదుగా రాకపోకలు సాగించే సుమారు 25 రైళ్లు రద్దయ్యాయి. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే మరో 20 రైళ్లను కూడా రద్దు చేశారు. దీంతో తప్పనిసరిగా బయలుదేరవలసిన వాళ్లు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. చదవండి: రూ. 300 కోసం.. రూ.1.90 లక్షలు పోగొట్టుకున్న యువతి -
ఛీ.. బస్సులో పాడుపని
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థినితో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడంతో రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఎల్బీనగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని(20) నగరంలోని శంకర్‌పల్లిలో ఎంబీఏ చదువుతోంది. గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన మన్నె రవిచంద్ర గచ్చిబౌలిలో ఉంటూ ప్రైవేటు హాస్టల్ నిర్వహిస్తున్నాడు. 23వ తేదీన 11 గంటల సమయంలో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చేందుకు మార్నింగ్‌స్టార్ ట్రావెల్స్ బస్సులో రవిచంద్ర, అతని భార్య సీటు బుక్ చేసుకున్నారు. అదే బస్సులో ఎంబీఏ విద్యార్థిని తనకు కాబోయే భర్తతో అదే బస్సులో ప్రయాణిస్తున్నారు. రవిచంద్ర భార్యకు సీటు దొరకగా అతనికి సీటు దొరకకపోవడంతో బస్సు డ్రైవర్ వెనుకాల కూర్చున్నాడు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో వెనకకు వెళ్లిన రవిచంద్ర ఎంబీఏ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అప్రమత్తమైన విద్యార్థిని పక్కనే ఉన్న కాబోయే భర్తకు విషయం చెప్పింది. అప్పటికే బస్సు హయత్‌నగర్ చేరుకోవడంతో బాధిత విద్యార్థిని హయత్‌నగర్, షీటీమ్ పోలీసులకు సమాచారం అందించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రవిచంద్రను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. విలేకరుల సమావేశంలో షీటీమ్ రాచకొండ అడిషనల్ డీసీపీ సలీమా, ఎస్ఐ రమన్‌గౌడ్ పాల్గొన్నారు. -
రేపటి నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ నిలిపివేస్తాం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా రేపటి నుంచి సీమాంధ్రలో ప్ర్రైవేట్ ట్రావెల్ బస్సు సర్వీసులను నిలిపి వేస్తున్నట్లు సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి అధ్యక్షుడు పరకాల ప్రభాకర్ శనివారం విశాఖపట్నంలో వెల్లడించారు. సమైక్యాంధ్ర ఉద్యమం పాలపొంగు కాకూడదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తేనే రాష్ట్ర విభజన సమస్యకు పరిష్కారం ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పార్లమెంట్‌కు, అసెంబ్లీలకు తాళాలు వేసి తెలుగువారి వాడి ఏంటో చూపించాలని సీమాంధ్ర ప్రజలకు, నాయకులుకు పరకాల ప్రభాకర్ సూచించారు. -
ఉద్యమం పేరుతో ‘ప్రైవేట్’ దోపిడీపై ఆందోళన
సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా ఆర్టీసీ బస్సులు నడవకుండా ఉంటే ప్రజల నుంచి అధిక మొత్తం రాబట్టి దోపిడీ చేయడం సరికాదంటూ జేఏసీ నాయకులు కొవ్వూరు బాలచంద్రారెడ్డి, ఆర్టీసీ యూనియన్ నాయకులు శనివారం ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులపై ధ్వజమెత్తారు. రాత్రి వేళ బస్సులు తిప్పవద్దని, సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరేందుకు శనివారం జేఏసీ నాయకులు ప్రొద్దుటూరులోని బీబీవీఆర్ ట్రావెల్స్ కార్యాలయానికి వెళ్లారు. బస్సుల తిప్పి తీరుతామంటూ యాజమాన్యం జేఏసీ నాయకులతో వాగ్వాదానికి దిగింది. దీంతో కొంత సేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. ట్రావెల్స్ నిర్వాహకుల వ్యవహార శైలికి నిరసనగా జేఏసీ ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు రోడ్డుపై బైఠాయించారు. ప్రైవేటు ట్రావెల్స్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ బస్సులు తిరగకుండా ఉద్యమానికి అండగా నిలిస్తే ప్రైవేటు బస్సుల యాజమాన్యం వారు హైదరాబాద్‌కు వెళ్లే ఒక్కో టికెట్‌కు రూ.1500 రాబట్టి దోపిడీ చేస్తున్నారంటూ మండిపడ్డారు. దీన్ని అరికట్టకపోతే బస్సులకు జరిగే నష్టానికి తమది బాధ్యత కాదని తేల్చి చెప్పారు. బస్సులు తిరిగితే కచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న సీఐ బాలిరెడ్డి, ఎస్ఐ ఇబ్రహీం ఆ ప్రాంతానికి చేరుకుని జేఏసీ నాయకులతో మాట్లాడారు. ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యం వ్యవహరించిన తీరుపై సీఐ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో ట్రావెల్స్ భవనంలోకి సమైక్యవాదులు ఎక్కువ మంది చేరుకోవడంతో తొపులాటలో గదిలో ఉన్న ఒక అద్దం పగిలిపోయింది. ఓ వ్యక్తి జేఏసీ ఉద్యమానికి ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యం లక్ష రూపాయలు ఇచ్చిందని మాట్లాడటంతో జేఏసీ కన్వీనర్ మాదాసు మురళీ చేరుకున్నారు. ఎవరికి ఇచ్చారని నిలదీయడంతో ఉద్యమంలో వంటావార్పు సమయంలో డబ్బు ఖర్చయిందని ట్రావెల్స్ యాజమాన్యం మాట మార్చింది. సీఐ బాలిరెడ్డి బీబీవీఆర్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసి జేఏసీ ఆర్టీసీ నాయకులను అక్కడి నుంచి పంపించారు. జేఏసీ నాయకులు కొవ్వూరు బాలచంద్రారెడ్డి, మాదాసు మురళీ, ఆర్టీసీ యూనియన్ నాయకులు ఎన్నార్ శేఖర్, టీవీఆర్ రెడ్డి, మాచయ్య, కార్మికులు కాళేశ్వరి, బీసీవీఆర్, ఇందు ట్రావెల్స్ కార్యాలయాల వద్దకు వెళ్లి సమైక్యాంద్రకు సహకరించి బస్సులు తిప్పకుండా ఉండాలని కోరారు.