TSRTC: Private Bus Operators Fare Hike In Hyderabad For This Sankranti - Sakshi
Sakshi News home page

బాబోయ్‌ ప్రైవేట్‌ ట్రావెల్స్‌.. అడ్డంగా దోచేస్తున్నారు

Published Thu, Jan 6 2022 7:55 AM | Last Updated on Thu, Jan 6 2022 10:44 AM

Private Bus Operators Fare Hike In Hyderabad For This Sankranti - Sakshi

ప్రత్తిపాడు(గుంటూరు): సంక్రాంతి పండగ పేరు చెప్పి ప్రయాణికులను నిలవునా దోచుకునేందుకు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ సిద్ధమయ్యాయి. హైదరాబాద్‌ నుంచి జిల్లాకు, జిల్లా నుంచి హైదరాబాద్‌కు వచ్చి వెళ్లే టికెట్‌ ధరలను ఇష్టారాజ్యం పెంచేశాయి. అడ్డగోలుగా ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. ఇదేమని అడిగే నాథులు కనపడడం లేదు. అధికారయంత్రాంగం కూడా చోద్యం చూస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా అయితే గుంటూరు నుంచి హైదరాబాద్‌కు నాన్‌ ఏసీ బస్సుకు రూ.400, ఏసీ బస్సుకు రూ. 500, స్లీపర్‌ ఏసీ బస్సుకు రూ.700, హైదరాబాద్‌ నుంచి గుంటూరుకు నాన్‌ఏసీ రూ.400, ఏసీ రూ.500, స్లీపర్‌ ఏసీ రూ.800 డిమాండ్‌ను బట్టి కొంచెం అటుఇటుగా చార్జీలు ఉంటాయి. అయితే ఇప్పుడు సంక్రాంతి పేరు చెప్పి ఈ టికెట్ల వెలను ఆయా ప్రైవేట్‌ ట్రావెల్స్‌ యాజమాన్యాలు అమాంతం పెంచేశాయి.

ఒక్కో టికెట్‌పై అదనంగా రూ.400 నుంచి రూ.1,000 వరకూ దోచుకుంటున్నాయి. ఆయా ట్రావెల్స్‌ తమ ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లలో పెంచిన ధరలను ప్రదర్శిస్తున్నాయి. రాష్ట్రంలోని నలుమూలల నుంచి లక్షల మంది ప్రజలు బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్‌లో నివసిస్తుంటారు. కొందరు స్వగ్రామాల నుంచి వెళ్లి హైదరాబాద్‌లో స్థిరపడిన వారూ ఉంటారు. తెలుగునాట పెద్ద పండుగైన సంక్రాంతికి వీరంతా స్వగ్రామాలకు రావడం సహజం. దీంతో సంక్రాంతి సమయంలో సగం హైదరాబాద్‌ ఖాళీ అవుతుంది. ఈనేపథ్యంలో ఒక్కసారిగా ప్రజలు సంక్రాంతి సెలవులకు స్వగ్రామాలకు పయనమయ్యే అవకాశాలు ఉండటంతో ట్రావెల్స్‌ యాజమాన్యాలు దోపిడీకి తెరలేపాయి. అయినా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.


హైదరాబాద్‌ నుంచి గుంటూరుకు 
ధరలు  ఇలా (రూపాయల్లో).. 
బస్సు రకం         సాధారణ ధర    పండగ ముందు చార్జి  
నాన్‌ఏసీ              300–500           1,000   
నాన్‌ ఏసీ స్లీపర్‌    600–700          1.000   
ఏసీ                      540                  1,200  
స్లీపర్‌ ఏసీ            700–800          1,400/1,500

గుంటూరు నుంచి హైదరాబాద్‌కు ధరలు ఇలా(రూపాయల్లో).. . 
బస్సు రకం     సాధారణ ధర    పండగ ముందు చార్జి 
నాన్‌ఏసీ               400              900–1,500   
నాన్‌ ఏసీ స్లీపర్‌    600              1000–1,500  
ఏసీ                     500–700       1,150–1,500   
స్లీపర్‌ ఏసీ           800–900       1,300/2,500

ప్రత్యేక బృందాలతో తనిఖీలు  
సంక్రాంతి నేపథ్యంలో ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. స్పెషల్‌ బృందాలు వేస్తున్నాం. ముమ్మరంగా తనిఖీలు చేస్తాం.  ప్రైవేట్‌ ట్రావెల్స్‌ అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తే పెద్ద ఎత్తున అపరాధ రుసుములు విధిస్తాం. అవసరమైతే బస్సులు సీజ్‌ చేస్తాం.  
– శివ నాగేశ్వరరావు, ఎంవీఐ, చిలకలూరిపేట 

ధరలు నియంత్రించాలి   
సంక్రాంతి పండగ సందర్భంగా ప్రైవేట్‌ ట్రావెల్స్‌ రెట్టింపు ధరలకు టిక్కెట్లు విక్రయిస్తున్నాయి. అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. అడిగేవారు లేకపోవడంతో వారి ఇష్టారాజ్యమైంది. అధికారులు ధరలను నియంత్రించాలి. వెంటనే తనిఖీలు చేపట్టాలి.  
– సాధినేని కోటేశ్వరరావు (పెద గొట్టిపాడు) 

చదవండి: అమెరికాను మేము ఓడించగలం అనడానికి ఇదే గుర్తు: తాలిబన్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement