విభజనకు సీమాంధ్ర కాంగ్రెస్ ఓకే | Seemandhra Congress Leaders Agree to State Bifurcation | Sakshi
Sakshi News home page

విభజనకు సీమాంధ్ర కాంగ్రెస్ ఓకే

Published Thu, Nov 14 2013 2:52 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

విభజనకు సీమాంధ్ర కాంగ్రెస్ ఓకే - Sakshi

విభజనకు సీమాంధ్ర కాంగ్రెస్ ఓకే

 సమైక్య రాష్ట్రాన్ని కాపాడతామని నేతల మాయమాటలు
 విభజనను అడ్డుకునేందుకే కొనసాగుతున్నామని సీఎం బుకాయింపు
 కేబినెట్ నోట్ వచ్చినా, జీవోఎం ఏర్పాటైనా రాజీనామాలు చేయలేదు
 ఇప్పుడు సీమాంధ్రలో ఉద్యమం తగ్గిందంటూ ప్యాకేజీల కోసం డిమాండ్
 ఇన్నాళ్లూ మభ్యపెట్టి, ఇప్పుడు విభజనకు సహకరిస్తున్నారంటూ సీమాంధ్ర ప్రజల మండిపాటు

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనను అడ్డుకుంటామని ఇంతకాలం చెబుతూ వస్తున్న సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు చివరకు తోకముడిచారు. ఇంతకాలం విభజనను అడ్డుకుంటామని మభ్యపెట్టిన ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఆ ప్రాంత ఎంపీలు, సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధుల ఫోరం ఒక్కొక్కరుగా తమ నిజస్వరూపాల్ని ఆవిష్కరిస్తున్నారు. సీమాంధ్రలో ఉద్యమం తగ్గిందన్న కారణాన్ని చూపుతూ గడిచిన కొన్ని రోజులుగా ప్యాకేజీ కోరడం మొదలుపెట్టారు. రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తీర్మానం చేసిన తర్వాత సీమాంధ్ర ఎమ్మెల్యేలు, మంత్రులు వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం మినహా మరో ప్రత్యామ్నాయాన్ని అంగీకరించబోమని, దానికోసం ఎంతవరకైనా వెళతామని గొప్పలు చెప్పారు.
 
 సమైక్యం కోసం రాజీనామాలకు వెనకాడబోమని, కేంద్రం విభజనపై ముందడుగువేస్తే రాజీనామాలు చేస్తామంటూ రకరకాల ప్రకటనలు చేసిన నాయకులే ఇప్పుడు ఒక్కొక్క గ్రూపుగా కేంద్ర పెద్దల ముందుకు వెళ్లి ప్యాకేజీలు కోరుతున్నారు. రాజీనామాలు చేసైనా సరే విభజనను అడ్డుకుంటామని ప్రకటించిన సీమాంధ్ర ఎంపీలు కొద్దిరోజులుగా తమ హడావిడిని తగ్గించారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు కొద్ది రోజుల కిందటే కేంద్ర మంత్రి వీరప్పమొయిలీ, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను కలిసి ప్యాకేజీపై ఏకంగా నివేదికనే సమర్పించి చేతులు దులుపుకున్నారు. దీంతో కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల తీరుపై సీమాంధ్ర ప్రజలు మండిపడుతున్నారు.
 
 మొదటినుంచీ మోసపూరిత మాటలే
 సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇంతకాలం పోటాపోటీగా సీమాంధ్ర ప్రజలను మోసగిస్తూ వచ్చారు. రాజీనామా డిమాండ్ వచ్చిన ప్రతిసారీ... కేబినెట్‌కు తెలంగాణ నోట్ రాకుండా అడ్డుకోవడానికే పదవుల్లో కొనసాగుతున్నామని సీమాంధ్ర కేంద్రమంత్రులు చెబుతూ వచ్చారు. ఇక ముఖ్యమంత్రి తెలంగాణ బిల్లు అసెంబ్లీలో తీర్మానం కోసం వస్తుందని, దాన్ని ఓడించాలంటే రాజీనామాలు చేయకూడదని పక్కదారి పట్టిస్తూ వచ్చారు. కానీ బిల్లు అసెంబ్లీ అభిప్రాయం కోసం మాత్రమే వస్తుందని, దానిపై తీర్మానం చేయడం కోసం కాదని కేంద్ర హోమ్ మంత్రి షిండే, ఏఐసీసీ ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌లు తేల్చిచెప్పారు. కేంద్రం తెలంగాణ నోట్‌ను ఆమోదించడం, మంత్రుల బృందం ఏర్పాటుకావడం తదితర పరిణామాలన్నీ చకచకా జరిగిపోయాయి. కానీ సీమాంధ్ర కేంద్ర మంత్రులుకానీ, ముఖ్యమంత్రికానీ రాజీనామాలు చేయలేదు. ఇపుడు సీమాంధ్రలో ఉద్యమం తగ్గుముఖం పట్టిందని ప్రచారం చేస్తూ నెమ్మదిగా సమైక్యాన్ని విడిచిపెట్టి విభజనకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. సీమాంధ్ర కేంద్రమంత్రులు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కలసి సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ కావాలని నివేదిక ఇచ్చారు.
 
 ఇప్పుడదే బాటలో సీమాంధ్ర రాష్ట్ర మంత్రులు, ఇతర నాయకులు విభజనతో తలెత్తే సమస్యలను పరిష్కరించాలంటూ కొత్త రాగాన్ని అందుకున్నారు. కేంద్ర మంత్రుల బృందం రాసిన లేఖకు సమాధానంగా పంపిన నివేదికలో, అఖిలపక్షానికి పీసీసీ తరఫున అందించిన నివేదికలోనూ విభజనకు అనుకూలంగా సీమాంధ్ర నేతలు పలు ప్రతిపాదనలను పొందుపరిచారు. హైదరాబాద్‌లో నెలకొల్పిన దాదాపు 30కి పైగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం సీమాంధ్రలో ఏర్పాటుచేయాలని, ప్రైయివేటు పరిశ్రమలు, పెట్టుబడులు సీమాంధ్రకు వచ్చేలా కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. హెచ్‌ఎండీయే పరిధిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకంచడంతో పాటు అక్కడి ఆదాయ వనరుల్లో జనాభా ప్రాతిపదికన తెలంగాణ, సీమాంధ్రులకు వాటా కల్పించాలని పేర్కొన్నారు.
 
 కొత్త రాజధాని నిర్మాణానికి లక్ష ఎకరాల భూమి అవసరమని, పరిశ్రమలు, ఐటీ సంస్థల ఏర్పాటుకు మరో లక్ష ఎకరాలు కావాలని, ఇంత భూమిని కేంద్రం సమకూర్చాలంటే రెండు లక్షల ఎకరాలున్న అటవీప్రాంతాన్ని కేంద్రం డీనోటిఫై చేయాల్సి ఉంటుందని చెబుతూ రకరకాలుగా కేంద్రానికి నివేదిస్తున్నారు. ఇవన్నీ విభజన జరిగాక కావాల్సిన వనరుల గురించి మాత్రమేననే విషయం గమనార్హం. కేంద్రమంత్రి చిరంజీవి బుధవారం గోదావరి జిల్లాల్లో పర్యటిస్తూ గోదావరి తీరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయిస్తానని హామీ ఇవ్వడం కూడా ఇందులో భాగమే. మరో కేంద్రమంత్రి పనబాక లక్ష్మి రెండురోజుల కిందట సీమాంధ్రను సింగపూర్‌లా మారుస్తానని, బాపట్లను భాగ్యన గరంగా తీర్చిదిద్దుతానని చెప్పడం అంతా ఒక పథకం ప్రకారమే నడిపిస్తున్నారని తెలుస్తోంది. ఈ డిమాండ్లన్నీ అసాధ్యమన్న విషయం తెలిసినా... విభజన ప్రక్రియ పూర్తయ్యేవరకు కాలయాపన కోసమే ఈ రకమైన ప్రకటనలు చేస్తున్నారా? అన్న అనుమానాలు సీమాంధ్ర ప్రజల్లో తలెత్తుతున్నాయి. తమను ఇన్నాళ్లూ మభ్యపెట్టే ప్రకటనలతో కాలయాపన చేసి ఇప్పుడు విభజనకు సహకరిస్తూ నట్టేట ముంచారని మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement