సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర ఉద్యమంలో భాగంగా సమ్మెలో పాల్గొన్న ప్రభుత్వోద్యోగులకు శుభవార్త. వారికి రెండు నెలల జీతాన్ని అడ్వాన్సుగా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగ సంఘాల డిమాండ్‌కు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అంగీకరించటంతో ఇందుకు మార్గం సుగమమైంది. సీమాంధ్ర ఉద్యమంలో భాగంగా ఏపీ ఎన్జీవోలతో పాటు పలు శాఖల ప్రభుత్వోద్యోగులు 66 రోజులు సమ్మెలో పాల్గొనడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు నెలల జీతాన్ని అడ్వాన్సుగా చెల్లించాల్సిందిగా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. 60 రోజులను గానీ, 45 రోజులను గానీ పరిగణనలోకి తీసుకుని అడ్వాన్సు చెల్లించాలని ఆర్థిక శాఖకు సాధారణ పరిపాలన శాఖ సూచించింది. నిర్ణయం కోసం ఫైలును మూడు రోజుల క్రితం సీఎం కార్యాలయానికి పంపింది.
వరద ముంపు ప్రాంతాల పర్యటనకు వెళ్లే హడావుడిలో ఆయన దానిపై ఏ నిర్ణయమూ తీసుకోకపోవడంతో ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి, రెండు నెలలను పరిగణనలోకి తీసుకోవాలని మళ్లీ కోరారు. సోమవారం ఉద్యోగ సంఘాల జేఏసీ ఆఫీస్ బేరర్ల సమావేశంలోనూ దీనిపై చర్చించారు. రెండు నెలల జీతాన్ని అడ్వాన్సుగా చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని తీర్మానించారు. దీపావళి వస్తున్నందున రెండు నెలల జీతాన్ని అడ్వాన్సుగా ఇవ్వాలని సోమవారం సాయంత్రం పొద్దుపోయాక సీఎం నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఉత్తర్వు వెలువడవచ్చు. దీనిపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. విభజన కోసం తెలంగాణకు చెందిన ప్రభుత్వోద్యోగులు గతంలో సమ్మె చేసినప్పుడు ఒక నెల జీతాన్ని ప్రభుత్వం అడ్వాన్సుగా ప్రకటించడం తెలిసిందే. ఇటీవల ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించినప్పుడు కూడా, దసరా దృష్ట్యా వెంటనే విధుల్లో చేరిన వారందరికీ ప్రభుత్వం వెంటనే అడ్వాన్సు చెల్లించింది.
సీమాంధ్ర ఉద్యోగులకు రెండు నెలల అడ్వాన్సు
Published Tue, Oct 29 2013 1:35 AM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM
Advertisement
Advertisement