ఒకే జాతి.. ఒక్కటే రాష్ట్రం అనే నినాదంతో వెల్లువెత్తిన సమైక్యాంధ్ర పరిరక్షణ పోరాటం ఇసుమంతైనా సడలకుండా జోరుగా సాగుతోంది. 24రోజుల కిందట సీమాంధ్రలో ఎగసిన సమైక్యఉద్యమం రోజురోజుకూ బలపడుతూ తీవ్రతరమవుతోంది. సకలజనుల సమ్మెతో జీవనం స్తంభిస్తున్నా ప్రజలు ఏమాత్రం లెక్కచేయక సమైక్యమే లక్ష్యంగా ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు. రాజకీయపార్టీలు, కులాలు, వర్గాలకతీతంగా జనం స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి వినూత్నరీతిల్లో సమైక్యభావనను ప్రకటిస్తున్నారు.
- సాక్షి నెట్‌వర్క్
ఆంధ్రప్రదేశ్‌ను యథాతథంగా ఉండాలనే డిమాండ్‌తో రోజూ మాదిరిగానే శుక్రవారం కూడా కోస్తా, రాయలసీమ జిల్లాలు ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, నిరసన ప్రదర్శనలతో దద్దరిల్లాయి. సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించటానికి ఈ నెల 27న సీమాంధ్రలోని 13 జిల్లాల విద్యార్థి జేఏసీ నేతలు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోసమావే శం కానున్నారు. తాడేపల్లిగూడెంలో 72 గంటల బంద్‌లో భాగంగా రెండో రోజు శుక్రవారం బంద్ సంపూర్ణంగా సాగింది. విద్యుత్ ఉద్యోగులు బైక్ ర్యాలీ చేసి ఆశ్రం ఆస్పత్రి సమీపంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. టీడీపీ నేత, మాజీ మంత్రి మాగంటి బాబు భీమవరంలో వైఎస్సార్ సీపీ దీక్షా శిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన రాజీవ్ విద్యామిషన్ వీడియో కాన్ఫరెన్స్‌ను జేఏసీ నేతలు అడ్డుకున్నారు. కలిగిరిలో జరుగుతున్న రిలే దీక్షలలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు.
రోడ్లు ఊడ్చిన న్యాయవాదులు
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో రాష్ట్ర విభజనను నిరసిస్తూ న్యాయవాదులు పుష్కరాల రేవు వద్ద రోడ్లు ఊడ్చారు. కాకినాడలో న్యాయశాఖ ఉద్యోగులు కోర్టు వద్ద వినూత్నంగా గంజి వార్పు కార్యక్రమం చేపట్టి గంజి తాగారు. రాష్ట్ర విభజన చేపడితే తమకు గంజే గతి అంటూ నిరసన తెలిపారు. జిల్లావ్యాప్తంగా పౌరసరఫరాల శాఖ మండల గోదాముల్లో పనిచేసే హమాలీలు శుక్రవారం నుంచి ఈ నెల 26 వరకూ విధులు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. యూటీఎఫ్ సమైక్యాంధ్ర ఉద్యమానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నదంటూ ఏలేశ్వరంలో 16మంది ఉపాధ్యాయులు ఆ సంఘానికి రాజీనామా చేశారు.
ఐదు కిలోమీటర్ల పొడవున వాహనాల ర్యాలీ
కోనసీమ ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్ల జేఏసీ అమలాపురంలో ఆటోలు, మినీ వ్యాన్‌లు, లారీలు, ట్యాక్సీలు, ఆర్టీసీ అద్దెబస్సులు, ఇతర వాహనాలతో భారీ ర్యాలీ చేపట్టింది. సుమారు ఐదు కిలోమీటర్ల పొడవున వాహనాలు సాగాయి. పిఠాపురంలో జేఏసీ ఆధ్వర్యంలో రహదారులు దిగ్బంధం చేసి బంద్ పాటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ కో ఆర్డినేటర్ వరుపుల సుబ్బారావు ఏలేశ్వరం బాలాజీ సెంటర్‌లో అర్ధనగ్నంగా నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. రాజానగరంలో సమైక్యవాదులు మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు.
గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలను ఉద్యమంవైపు నడిపిస్తున్న అధికారులు
వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో అధికారులు స్వయంగా రంగంలోకి దిగి గ్రామాల్లో పర్యటిస్తూ సమైక్య ఉద్యమంలో పాల్గొనేలా ప్రజలను చైతన్య పరుస్తున్నారు. శుక్రవారం సాయంత్రం జమ్మలమడుగు మండల పరిధిలోని మోరగుడి, ఎస్.ఉప్పలపాడు గ్రామాల్లో తహశీల్దార్ శివరామయ్య, ఎంపీడీఓ మల్లయ్య, ఎంఈఓ గంగిరెడ్డి, వ్యవసాయాశాఖాధికారి రాంమోహన్‌రెడ్డి పర్యటించి రాష్ట్ర విభజన వల్ల జరిగే పరిణామాలు, నష్టాల గురించి ప్రజలకు వివరించారు. నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఇటువంటి కార్యక్రమాలు చేపడతామన్నారు.
నల్లదుస్తులతో వైద్యుల నిరసన
విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రి వైద్యులు నల్ల దుస్తులు వేసుకొని నిరసన వ్యక్తం చేశారు. ఎన్జీఓ జేఏసీ ఆధ్వర్యంలో కోట జంక్షన్ వద్ద 10 వేల మంది ఉద్యోగులు,విద్యార్థులు సమైక్య నినాదాలతో హోరెత్తించారు. గెజిటెడ్ ఉద్యోగులు కలెక్టరేట్ జంక్షన్‌లో ఒంటికాలిపై నిలుచొని నిరసన తెలిపారు.
ముస్లింల శాంతి యాత్ర
కర్నూలు నగరంలో ముస్లిం ఐక్య కార్యచరణ సమితి ఆధ్వర్యంలో శాంతి యాత్ర చేపట్టారు. నగరంలోని వివిధ కాలనీల నుంచి భారీగా తరలివచ్చిన ముస్లిం యువకులు.. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ అసెంబ్లీ ఆహూతులను ఆకట్టుకుంది.
ఉద్యోగానికి రాజీనామా చేసిన వాణిజ్యపన్నుల శాఖ డీసీ
వాణిజ్యపన్నుల శాఖ డీసీ వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ ఎం.లింగారెడ్డి ఉద్యోగానికి రాజీనామా చేసి సమైక్యాందోళనలో పాల్గొన్నారు. నందికొట్కూరు నియోజకవర్గం అల్లూరు గ్రామానికి చెందిన లింగారెడ్డి.. హైదరాబాద్‌లోని వాణిజ్య పన్నుల శాఖలో విధులు నిర్వహిస్తున్నారు. మరో మూడేళ్ల పాటు సర్వీసు ఉన్నప్పటికీ రాష్ట్ర విభజన నిర్ణయంతో మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో విద్యుత్ ఉద్యోగులు రోడ్డుకు అడ్డంగా పడుకొని వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. వేలాదిమంది విద్యార్ధులు బెజవాడ బెంజిసర్కిల్ వద్ద మానవహారం చేపట్టడంతో ట్రాఫిక్ స్తంభించింది.
పర్యాటక హోటళ్లు మూత
విశాఖ జిల్లా అరకులో గిరిజన మ్యూజియం, గిరిజన గార్డెన్ మూసివేశారు. ఎక్కడికక్కడ పర్యాటక హోటళ్లు మూతపడ్డాయి. దీంతో అరకులో పర్యాటకం పూర్తిగా పడకేసింది. పాడేరు పట్టణంలో ఎన్జీవోలు బిక్షాటన చేశారు. విశాఖలో ఆరు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడును కేజీహెచ్‌కు తరలించారు. చిత్తూరు ఎమ్మెల్యే సీకేబాబు మహాపాదయాత్ర శుక్రవారం తిరుపతికి చేరుకుంది.
ఏడుగంటలపాటు హైవేపై వాహనాల అడ్డగింత
చంద్రగిరిలో 36 గంటలపాటు బంద్ కొనసాగింది. జాతీయ రహదారిలో 7 గంటలపాటు రాకపోకలను అడ్డుకున్నారు. అనంతపురంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యార్థులకు రోడ్లపైనే చదువులు చెప్పి..నిరసన తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆర్టీసీ కార్మికులు బైక్‌ర్యాలీ చేయగా, వినుకొండలో ఏపీఎన్జీవోస్ సమైక్య జేఏసీ కాగడాల ప్రదర్శన నిర్వహించింది. తెనాలిలో మున్సిపల్ కమిషనర్‌ల సమావేశం జరగ్గా.. తాము కూడా ఉద్యోగుల సమ్మెకు సంఘీభావంగా విధులు బహిష్కరించాలని తీర్మానించారు. ప్రకాశం జిల్లా ఒంగోలుకలెక్టరేట్ వద్ద అన్ని ప్రభుత్వవిభాగాల ఉద్యోగులు ధర్నా చేపట్టారు.
విభజన కలతతో మరో 9మంది మృత్యువాత
తూ.గో.జిల్లాలో ఉరేసుకుని యువకుడి బలవన్మరణం
సాక్షి నెట్‌వర్క్: రాష్ర్టం ముక్కలవుతుందనే భయంతో ప్రాణాలొదిలేస్తున్న వారి సంఖ్య ఇంకా తగ్గడం లేదు. శుక్రవారం ఒక్కరోజే సీమాంధ్ర జిల్లాల్లో గుండెపోటుతో ఎనిమిదిమంది మృత్యువాతపడగా, తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం కూనవరం గ్రామానికి చెందిన లంకే సత్తిబాబు (27) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆటో డ్రైవర్‌గా కుటుంబాన్ని పోషిస్తున్న సత్తిబాబుకు తల్లిదండ్రులు, భార్య, ఏడాదిన్నర పాప ఉన్నారు. భార్య ప్రస్తుతం గర్భిణిగా ఉంది.
రాష్ట్ర విభజనను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటానంటూ చెప్పిన సత్తిబాబు చివరికి అన్నంత పనీ చేశాడని స్నేహితులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా అమడగూరులో గుండం హరి(37), కనగానపల్లె మండలం పర్వతదేవరపల్లెకు చెందిన నారాయణప్ప (50) రాష్ట్ర విభజనను తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందారు. సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తున్న ఏలూరు ప్రభుత్వాసుపత్రి ఉద్యోగి డీవీ ఇంద్రశేఖర్ (54) శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు.
నరసాపురం మండలం ఎల్‌బీ చర్ల గ్రామానికి చెందిన అడ్డాల రామలక్ష్మి (51) విభజన వార్తలు చూస్తూ గుండె ఆగి మరణించింది. ఉంగుటూరు మండలం నారాయణపురానికి చెందిన కల్లూరి శ్రీనివాసరావు (33) రాష్ట్రం విడిపోతే పిల్లల భవిష్యత్ దెబ్బతింటుందన్న బెంగతో గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచాడు. వైఎస్సార్ జిల్లా చక్రాయపేట మండలం కొండప్పగారిపల్లెకు చెందిన సమైక్యవాది లేబాకు వెంకటేశు(35) శుక్రవారం టీవీ చూస్తూ గుండెపోటుతో మృతి చెందాడు. వెంకటేశు మృతితో శనివారం జరగాల్సిన అతని చెల్లెలు దామోదరమ్మ వివాహం ఆగిపోయింది. చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం వనదుర్గాపురం గ్రామానికి చెందిన రమణ య్య(33) శుక్రవారం ఇంట్లో టీవీలో సమైక్యఉద్యమం.. విభజన నేపథ్యం వార్తలు ఉద్వేగానికి లోనై అక్కడే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. ఆత్మకూరు డిపో గ్యారేజ్ ఇన్‌చార్జ్ వెంకటేశ్వర్లు(54) శుక్రవారం రాత్రి కర్నూలు జిల్లా ఆదోనిలో గుండె పోటుతో మృతి చెందారు. రాష్ట్ర విభజన నిర్ణయంతో తీవ్ర వేదనకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
కాంగ్రెస్, టీడీపీ నేతలపై జనాగ్రహం
సాక్షి నెట్‌వర్క్: వేర్పాటు ప్రకటన వచ్చిన దరిమిలా కాంగ్రెస్, టీడీపీ నేతలపై వ్యక్తమవుతున్న జనాగ్రహం ఇప్పట్లో చల్లారేలా లేదు. శుక్రవారం సీమాంధ్రలోని పలు జిల్లాల్లో కాంగ్రెస్, టీడీపీ నేతలను సమైక్యవాదులు అడ్డుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో టీడీపీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావును అడ్డుకుని ఇంకా రాజీనామా చేయనందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లాలో సోనియా, దిగ్విజయ్, కేసీఆర్, బొత్స, కిల్లికృపారాణి, పళ్లంరాజు, రాహుల్, చిరంజీవి మాస్కులు ధరించిన వారిని కర్రలతో కొడుతూ, కాళ్లతో తంతూ సమైక్యవాదులు నిరసన వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో న్యాయవాదులు సోనియా చిత్రపటాన్ని కొరడాతో కొట్టి నిరసన తెలిపారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్‌లో ఆర్టీసీ కార్మికులు కేసీఆర్ దిష్టి బొమ్మకు శవ యాత్ర నిర్వహించి దహనం చేశారు. శ్రీకాకుళం రిమ్స్ వైద్యాధికారులు, ఉద్యోగులు పట్టణంలోని డేఅండ్‌నైట్ కూడలి వద్ద సోనియా, కేసీఆర్ వేషధారణలతో ఉన్న వ్యక్తులను స్ట్రెచర్‌పై తీసుకొచ్చి మెదడు, మోకాలు శస్త్ర చికిత్సలు చేస్తున్నట్టు ప్రదర్శన నిర్వహించారు.
ఆంటోనీ కమిటీ అనుకూలంగా లేకుంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తా: కావూరి
శుక్రవారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి వచ్చిన కేంద్రమంత్రి కావూరి సాంబశివరావును సమైక్యవాదులు అడ్డుకుని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు కావూరి స్పందిస్తూ తాను ఎప్పుడూ సమైక్యవాదినేనని, ఆంటోని కమిటీ సమైక్యాంధ్రకు అనుకూలంగా నిర్ణయం వెలువరించకుంటే వెంటనే రాజీనామా చేస్తానని చెప్పడంతో నిరసనకారులు శాంతించారు. తొలుత ఆయన తిరుమలలో విలేకరులతో మాట్లాడుతూ ఎన్‌జీవోల సమ్మెను తాను సమర్థిస్తున్నానన్నారు. విభజన దుష్పరిణామాలను వివరించడంవల్ల కేంద్రం పునరాలోచనలో పడిందన్నారు.
ఉద్యమకారులపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అనుచరుల దాడి
సమైక్యాంధ్ర ఉద్యమకారులపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు అనుచరులు దాడికి పాల్పడ్డారు. శుక్రవారం వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరులో ధర్నా చేపట్టిన ఉపాధ్యాయులకు సంఘీభావం పలికేందుకు ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు రాగా, రాజీనామా చేసిన తర్వాతే ఉద్యమంలో పాల్గొనాలని ఆయనకు సమైక్యవాదులు సూచించారు. దీంతో రెచ్చిపోయిన బత్యాల అనుచరులు శ్రీనివాసరాజు అనే సమైక్యవాదిపై పిడిగుద్దులతో చితకబాదారు. ఇదంతా చూస్తున్నా ఎమ్మెల్సీ వారిని ఆపే ప్రయత్నం చేయలేదు. కాగా, ఈ దాడిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తిరుపతి నుంచి వెళ్లే ప్రైవేటు బస్సులు బంద్
సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుపతి నుంచి వివిధ పట్టణాలకు వెళ్లే ప్రైవేటు బస్సులనూ శనివారం నుంచి రద్దు చేసినట్లు శ్రీవెంకటేశ్వర ట్రావెల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బీ.మునిరాజా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం సమైక్యాంధ్ర ఉద్యమ జేఏసీ నేతలు శ్రీకాంత్‌రెడ్డి, అవుల ప్రభాకర్, చల్లా చంద్రయ్య ట్రావెల్స్ అసోసియేషన్ నాయకులతో చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. తిరుపతి నుంచి బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై వెళ్లే ప్రైవేటు బస్సుల టికెట్లు రిజర్వేషన్ చేయకుండా నిలుపుదల చేసినట్లు వెల్లడించారు. ఎవరైనా ముందస్తుగా ఆయా నగరాలకు టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుని ఉంటే వెంటనే రద్దు చేసుకోవాలని కోరారు.
ఒకే జాతి.. ఒక్కటే రాష్ట్రం
Published Sat, Aug 24 2013 2:33 AM | Last Updated on Fri, Sep 1 2017 10:03 PM
Advertisement
Advertisement