సవాళ్లు ఎదుర్కోడానికి సిద్ధం: డీజీపీ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోడానికి పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉందని డీజీపీ ప్రసాదరావు చెప్పారు. రాష్ట్ర విభజనపై తానేమీ మాట్లాడబోనన్నారు. ఢిల్లీలో జరుగుతున్న వార్షిక పోలీస్ బాస్‌ల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. సదస్సులో ఉగ్రవాదం, నక్సలిజంపై చర్చించినట్టు తెలిపారు. ఉగ్రవాదాన్ని అరికట్టడానికి కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోందని, దానికి అనుగుణంగా తాము కూడా భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
కొత్త రాష్ట్రం ఏర్పాటు వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని ఐబీ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ, తెలంగాణ నిర్ణయం తర్వాత సీమాంధ్రలో ఉద్యమం రావడంపై ఆయన సదరు వ్యాఖ్యలు చేసి ఉంటారని వ్యాఖ్యానించారు. అయితే, 2 నెలల నుంచి సీమాంధ్రలో పరిస్థితులను చక్కదిద్దుతున్నట్టు చెప్పారు.