సాక్షి, హైదరాబాద్: దసరా పండుగకు ప్రయాణాలు పెట్టుకున్న వారికి కష్టాలు తప్పేలా లేవు. సీమాంధ్రలో ఉద్యమంతో ఆయా ప్రాంతాలకు బస్సుల రాకపోకలు నిలిచిపోవడం, అదే సమయంలో దేవీ నవరాత్రోత్సవాలు, పాఠశాలలకు దసరా సెలవు లు ప్రారంభం కానుండడంతో హైదరాబాద్ నుంచి స్వస్థలాలకు వెళ్లాలనుకునేవారికి రైల్వేనే పెద్ద దిక్కు కానుంది. కానీ దసరాకు రైల్వే అధికారులు చేసిన ఏర్పాట్లు ప్రయాణికుల అవసరాలను తీర్చేలా లేవు. 137 ప్రత్యేక రైళ్లతోపాటు, రోజువారీ నడిచే రైళ్లకు 1,088 అదనపు బోగీలను ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు మంగళవారం ప్రకటించారు.
విశాఖ, కాకినాడ, విజయవాడ, మచిలీపట్నం, రేణిగుంట, ముంబై, కోల్‌కతా, నాగర్‌సోల్, గువాహటి, మంగళూరు, కొల్లాం లాంటి ముఖ్య మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్‌ఓ సాంబశివరావు పేర్కొన్నారు. ఇవిగాక రద్దీని పర్యవేక్షిస్తూ అవసరమైతే మరిన్ని అదనపు బోగీలను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. కానీ దసరా రద్దీని తీర్చడానికి ఇవి ఏ మూలకూ సరిపోయేలా లేవు. హైదరాబాద్ నుంచి దాదాపు 30 లక్షల మందికిపైగా స్వస్థలాలకు వెళ్తారు. సాధారణంగా బస్సులు అందుబాటులో ఉన్నప్పుడే అవి చాలక ప్రజలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది. ఈసారి సీమాంధ్రవైపు బస్సుల్లేనందున రైల్వే అధికారులు చేసిన అరకొర ఏర్పాట్లు సరిపోయే పరిస్థితి కనిపించట్లేదు. దీంతో దసరా ప్రయాణాలకు నగర వాసులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
దసరా ప్రయాణం కష్టమే..!
Published Wed, Oct 2 2013 1:05 AM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM
Advertisement
Advertisement