రైళ్లు...బస్సులకు పండగే!
- మొదలైన ప్రయాణాలు
- కిటకిటలాడుతున్న స్టేషన్లు
- మరింత పెరగనున్న రద్దీ
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో అప్పుడే దసరా సందడి మొదలైంది. ఓ వైపు వాడవాడలూ బతుకమ్మ సంబరాలలో మునిగి తేలుతుండగా...మరోవైపు నగరం నుంచి స్వగ్రామాలకు వెళుతున్న వారితో రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. గురువారం సొంత ఊళ్లకు బయలుదేరిన ప్రయాణికులతో నగరంలోని రైల్వేస్టేషన్‌లు, బస్ స్టేషన్‌లలో సందడి నెలకొంది. నగర శివారు ప్రాంతాల నుంచి కూడా పెద్ద సం ఖ్యలో ప్రయాణికులు తరలివెళ్లారు.
సికింద్రాబాద్, నాంపల్లి, కాచి గూడ రైల్వేస్టేషన్లు, మహాత్మాగాంధీ, జూబ్లీ బస్‌స్టేషన్‌లలో ప్రయాణికుల రద్దీ కనిపించింది. ఎల్‌బీనగర్, ఉప్పల్, జగద్గిరిగుట్ట, జీడిమెట్ల, బాలానగర్ తదితర శివారు ప్రాంతాల నుంచి ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో బయలుదేరి వెళ్లారు. ముఖ్యంగా తెలంగాణ జిల్లాలకు వెళ్లే బస్సుల్లో రద్దీ బాగా కనిపించింది. ప్రయాణికుల రద్దీ మేరకు ఎంజీబీఎస్, జేబీఎస్, ఇతర ప్రధాన కూడళ్ల నుంచి 50 బస్సులు అదనంగా నడిపినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
హన్మకొండ, జనగామ, మహబూబ్‌నగర్, సంగారెడ్డి తదితర రూట్లలో సిటీ డీలక్స్ బస్సులను అదనంగా నడిపారు. దసరా రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది 3,335 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. సాధారణంగా హైదరాబాద్ నుంచి ఉభయ రాష్ట్రాలకు రాకపోకలు సాగించే 3,500 బస్సులకు ఇవి అదనం. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా విజయవాడ, విశాఖ, కాకినాడ తదితర రూట్లలో దక్షిణ మధ్య రైల్వే అదనపు రైళ్లను నడుపుతోంది.
ఈ ఏడాది ప్రభుత్వం దసరా సందర్భంగా ఏకంగా 15 రోజుల పాటు సెలవులు ప్రకటించడంతో నగర వాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుంచి వ చ్చి హైదరాబాద్‌లో చదువుకుంటున్న విద్యార్థులు, ఉద్యోగులు వివిధ వర్గాల ప్రజలు సొంత ఊళ్లకు తరలి వెళ్తున్నారు. మరో రెండు రోజుల్లో ప్రయాణికుల రద్దీ బాగా పెరిగే అవకాశం ఉన్నట్లు రైల్వే, ఆర్టీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.