నగరం పెళ్లి ‘టూరు’
- రైళ్లు, బస్సుల్లో సీట్లు ఫుల్
- అదనపు సదుపాయాలు కల్పించని ఆయా శాఖలు
- ఆందోళన చెందుతున్న ప్రయాణికులు
సాక్షి,సిటీబ్యూరో: నగరం ‘పెళ్లి’ టూరుకు సిద్ధమైంది. ఉభయ రాష్ట్రాల్లోని సొంత ఊళ్లలో సమీప బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో ఈనెల 13 నుంచి మూడు రోజుల పాటు జరుగనున్న పెళ్లిళ్ల కోసం ప్రజలు పెద్ద ఎత్తున తరలి వెళ్లేందుకు ప్రణాళికలను రూపొందించుకున్నారు. దీంతో ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు, రైళ్లకు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. హైదరాబాద్ నుంచి దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే సుమారు 850 ఆర్టీసీ బస్సుల్లో ఒక్క 13వ తేదీ నాటికే 80 శాతానికి పైగా సీట్లు బుక్ అయ్యాయి.
ఆర్టీసీ బస్సులు, రైళ్లలో అవకాశం లభించని వారు ప్రైవేట్ బస్సులను ఆశ్రయించడంతో వాటికి కూడా డిమాండ్ పెరిగింది. మరోవైపు అన్ని ప్రధాన రైళ్లలోనూ బుకింగ్‌లు నిండిపోయి చాంతాడంత వెయిటింగ్ లిస్ట్ దర్శనమిస్తోంది. వరుస సెలవులు, పండుగలు వంటి ప్రత్యేక సందర్భాలలో ప్రత్యేక బస్సులు, రైళ్లు నడిపే ఆర్టీసీ, ద.మ.రైల్వే శాఖలు అటువంటి ఏర్పాట్లు చేపట్టకపోవడంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బస్సులు కిటకిట...
శ్రావణ మాసంతో పాటే దివ్యమైన ముహూర్తాలు రావడంతో రెండు మూడు నెలలుగా ఎదురు చూస్తున్న వారికి ఈ మాసం బాగా కలిసి వచ్చింది. ఈనెల 22 వరకు పెళ్లి ముహూర్తాలు ఉన్నప్పటికీ 13,14,15 తేదీల్లోనే ఎక్కువ సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. దీంతో ఫంక్షన్‌హాళ్లు, మండపాలు, పూలు, తదితర వస్తువులకు డిమాండ్ పెరిగింది. రవాణా సదుపాయాలకు సైతం భారీ డిమాండ్ ఏర్పడింది.
నగరంలోని మహాత్మగాంధీ, జూబ్లీ బస్‌స్టేషన్లు, కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు, అమీర్‌పేట్, లక్డీకాపూల్, ఈసీఐఎల్ తదితర ప్రాంతాల నుంచి దూరప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల కు అడ్వాన్స్ బుకింగ్ తాకిడి బాగా పెరిగింది. విజయవాడ, గుంటూరు, కాకినాడ, అమలాపురం, విశాఖ, చిత్తూరు, కడప, కర్నూలు, తిరుపతి తదితర ప్రాంతాలకు వెళ్లే అన్ని బస్సుల కు డిమాండ్ భారీగా వచ్చేసింది. ఏపీలో కూడా ఇదే పరిస్థితి ఉండటంతో అటు వైపు నుంచి హైదరాబాద్‌కు అదనపు బస్సులు నడిపేందుకు అక్కడి ఆర్టీసీ అధికారులు సాహసం చేయలేకపోతున్నట్టు తెలిసింది.
వందల్లో వెయిటింగ్ లిస్టు...
పెళ్లి ముహూర్తాలతో రైళ్లలోనూ రద్దీ నెలకొంది. అన్ని ప్రధాన రైళ్లలో వెయిటింగ్ లిస్టు వందల్లో చేరింది. బెంగళూరు, తిరుపతి, విశాఖ, కాకినాడ తదితర ప్రాంతాలకు వెళ్లే రైళ్లన్నింటిలోనూ సీట్ల రిజర్వేషన్లు అయిపోయాయి. ఈనెల 13,14,15 తేదీల్లో పలు ప్రధాన ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అత్యధిక మంది ప్రయాణించే స్లీపర్ క్లాస్‌లో వెయిటింగ్ లిస్టు ఈ విధంగా ఉంది.