పల్లెకు పోదాం చలో..చలో..
► సొంతూళ్లకు పయనమైన నగరవాసులు
► రైళ్లు, బస్సులు, ప్రైవేట్,
సొంత వాహనాల్లో తరలిన జనం
► సంక్రాంతి రద్దీతో కిక్కిరిసిన రైళ్లు, బస్సులు
► తీవ్ర ఇబ్బందుల మధ్యే ప్రయాణం
► 15 లక్షల మందికి పైగా పల్లె బాట
► టోల్‌ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జాం
సాక్షి, హైదరాబాద్: మహానగరం పల్లె వైపు పరుగులు తీసింది. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతిని సంబురాల మధ్య జరుపుకునేందుకు లక్షలాది మంది నగర వాసులు పల్లె తోవ పట్టారు. దీంతో నగరానికి నలువైపులా ఉన్న రహదారులన్నీ పల్లె దారి పట్టాయి. గురువారం స్కూళ్లు, కళాశాలలకు సెలవులు ప్రకటించడం, ప్రభుత్వ కార్యాలయాలకు సైతం వరుసగా సెలవులు రావడంతో నగర ప్రజలు భారీ సంఖ్యలో బయలుదేరారు. గురువారం మహాత్మాగాంధీ, జూబ్లీ బస్‌స్టేషన్లు, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. చాలామంది బస్సులు, కార్లు, సొంత వాహనాల్లో సొంతూళ్లకు బయలుదేరడంతో ఉప్పల్, ఎల్‌బీనగర్, మెహిదీపట్నం తదితర ప్రధాన కూడళ్లు స్తంభించాయి.
ప్రయాణం.. పెనుభారం..
నాలుగైదు రోజులుగా వివిధ మార్గాల్లో సుమారు 15 లక్షల మంది వ్యయప్రయాసల కోర్చి సొంత ఊళ్లకు వెళ్లారు. రిజర్వేషన్లు లభించక పోవడంతో ఎక్కువ మంది ప్యాసిం జర్ రైళ్లు.. జనరల్ బోగీలను ఆశ్రయించారు. రైళ్లపై ఆశలు వదులుకున్న వాళ్లు ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులపైనే ఆధారపడ్డారు. ప్రత్యేక బస్సులపై ఆర్టీసీ 50 శాతం అదనపు వసూళ్లకు పాల్ప డితే.. ప్రైవేట్ బస్సులు మరో అడుగు ముందు కేసి డబుల్ చార్జీలతో ఇష్టారాజ్యంగా వసూళ్లకు దిగాయి. దీంతో నగరవాసులకు పండుగ ప్రయాణం పెను భారంగా పరిణమించింది. పిల్లలు, వృద్ధులు, మహిళలు, వికలాంగులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. విజయవాడ, విశాఖపట్టణం, అమలాపురం, కాకినాడ, తిరుపతి, కర్నూలు, కడప, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ తదితర ప్రాంతాలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.
నోట్ల రద్దుతో తగ్గిన ప్రయాణాలు..
ఈసారి సంక్రాంతి ప్రయాణాలపైనా నోట్ల రద్దు ప్రభావం స్పష్టంగా కనిపించింది. నగ దు కొరత కారణంగా నగరవాసులు కొంత మంది సొంత ఊరి ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. గతేడాది 20 లక్షల మంది సొంతూళ్లకు తరలివెళ్లగా ఈసారి ఆ సంఖ్య 15 లక్షలకు పరిమితమైంది. ఈ ఏడాది సుమారు 25% ప్రయాణాలు తగ్గినట్లు ఆర్టీ సీ, రైల్వే వర్గాలు అంచనా వేస్తున్నాయి.
టోల్‌ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జాం
చౌటుప్పల్/అడ్డాకుల: సంక్రాంతి పండుగకోసం పట్నం వాసులు సొంతూరు బాట పట్టడంతో టోల్‌ప్లాజాలు కిటకిటలాడాయి. కిలోమీటర్ల కొద్దీ వాహనాలు బారులుదీరడంతో ట్రాఫిక్‌జాం అయ్యింది. గురువారం మధ్యాహ్నం మొదలైన వాహనాల రద్దీ రాత్రి వరకు కొనసాగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా, మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండల శాఖాపూర్ టోల్‌ప్లాజాలు వాహనాలతో కిక్కిరిసిపోయాయి. పంతంగి టోల్‌ప్లాజా వద్ద విజయవాడ వైపు 10 గేట్లు తెరిచినా రద్దీ తగ్గలేదు. రద్దీని నియంత్రించేందుకు పోలీసులు, జీఎమ్మార్ సిబ్బంది ఎక్కడికక్కడ పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. వాహనాలను ఇతర మార్గాల మీదుగా మళ్లించారు. అలాగే, శాఖాపూర్ టోల్‌గేట్ వద్ద కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ వైపు నుంచి కర్నూలు వైపు వెళ్లే వాహనాలతో రోడ్లు కిక్కిరిశాయి.
నగరం నుంచి ప్రయాణం ఇలా..
► రోజువారీ బయలుదేరే 80 ఎక్స్‌ప్రెస్ రైళ్లు కాక, వివిధ ప్రాంతాల మధ్య సంక్రాంతి సందర్భంగా దక్షిణమధ్య రైల్వే మరో 45 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ప్రధాన రైళ్లకు అదనపు బోగీలను అందుబాటులోకి తెచ్చింది. అయినా ప్రయాణికుల డిమాండ్‌ను ఈ రైళ్లు భర్తీ చేయలేకపోయాయి. రైళ్లలో ప్రతి రోజూ 2.5 లక్షల చొప్పున మూడు రోజుల్లో 7.5 లక్షల మంది ప్రయాణికులు బయలుదేరి వెళ్లారు.
► జంట నగరాల నుంచి తెలుగు రాష్ట్రాలకు రాకపోకలు సాగించే 3,500 రెగ్యులర్ బస్సులతో పాటు, 3,195 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. మరో 1000కి పైగా ప్రైవేట్ బస్సులు హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించాయి. సుమారు 3.5 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లో తరలి వెళ్లారు.
► బస్సులు, రైళ్లు కాకుండా హైదరాబాద్ నుంచి అన్ని రూట్లలో వ్యక్తిగత వాహనా లు, ట్రావెల్స్ కార్లు, ద్విచక్ర వాహనా లు, మ్యాక్సీక్యాబ్‌లు, తూఫాన్‌లు, టాటాఏస్‌లు, ఆటోలు వంటి 1.5 లక్షల వాహనాలు సొంత ఊళ్లకు తరలి వెళ్లా యి. ఈ వాహనాల్లో సుమారు 4 లక్షల మందికిపైగా బయలుదేరి వెళ్లారు.