దసరా వేళ..ప్రయాణం కిటకిట
- కిక్కిరిసిన బస్సులు, రైళ్లు
- అదనపు చార్జీల వడ్డన
- ఆర్టీసీలోనూ 50 శాతం బాదుడే
- రెగ్యులర్ రైళ్లలో ‘ప్రీమియం’ దోపిడీ
- రెట్టింపు చార్జీల ‘ప్రైవేట్’
సాక్షి, సిటీబ్యూరో: మహానగరం పల్లె బాట పట్టింది. దసరా ఉత్సవాల కోసం నగర వాసులు భారీ సంఖ్యలో సొంత ఊళ్లకు తరలి వెళ్లారు. వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో బుధవారం రైళ్లు, ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు కిటకిటలాడాయి. మరోవైపు సొంత వాహనాల్లోనూ పెద్ద ఎత్తున బయలుదేరి వెళ్లారు. బుధవారం ఒక్క రోజే 750కి ప్రత్యేక బస్సులు నడిపినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపా రు.
మహాత్మాగాంధీ, జూబ్లీబస్‌స్టేషన్‌లు, ఉప్ప ల్, ఎల్‌బీనగర్, కూకట్‌పల్లి, ఈసీఐఎల్, జగద్గిరిగుట్ట, జీడిమెట్ల తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు సొంత ఊళ్లకు వెళ్లారు. మరోవైపు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టే షన్లు ప్రయాణికులతో పోటెత్తాయి. రిజర్వేషన్ బోగీలు నిండిపోవడంతో జనరల్ బోగీల్లో పెద్ద ఎత్తున రద్దీ నెలకొంది. వందల సంఖ్యలో ప్రత్యేక రైళ్లను ప్రకటించినప్పటికీ పండుగ పూట అదనపు రైళ్లు, బోగీలు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఆర్టీసీ 50 శాతం బాదుడే..
ఈ ఏడాది రద్దీ మేరకు 3,335 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేపట్టిన ఆర్టీసీ యథావిధిగా 50 శాతం అదనపు చార్జీలు విధిస్తూ ప్ర యాణికులను నిలువుదోపిడీ చేస్తోంది. ప్రైవేట్ ట్రావెల్స్ మరో అడుగు ముందుకేసి రెట్టింపు చార్జీలను వసూలు చేస్తున్నాయి. ప్రత్యేక రైళ్లలో మాత్రమే ప్రీమియం చార్జీల పేరుతో ప్రయాణికులపై భారం మోపిన రైల్వేశాఖ తాజాగా ఏపీ ఎక్స్‌ప్రెస్, దక్షిణ్ ఎక్స్‌ప్రెస్, గోదావరి ఎక్స్‌ప్రెస్ వంటి రెగ్యులర్ రైళ్లలోనూ దోపిడీకి తెరలేపింది. కాగా, బస్సుల పరిస్థితి ఇలావుంటే పేద, మధ్యతరగతి వర్గాలకు చౌకగా లభించే రైలు ప్రయాణం కూడా భారంగానే మారుతోంది.
స్లీపర్ బోగీలను సైతం వదిలిపెట్టకుండా ప్రీమియం సర్వీసుల పేరుతో బెర్తుల బేరానికి పాల్పడుతున్న దక్షిణమధ్య రైల్వే ఏపీ ఎక్స్‌ప్రెస్, దక్షిణ్‌ఎక్స్‌ప్రెస్, ఫలక్‌నుమా, బెంగళూర్, పాట్నా, గోదావరి, శబరి ఎక్స్‌ప్రెస్ రైళ్లలో సైతం 50 శాతం బెర్తులపై ప్రీమియం చార్జీలు విధిస్తూ అమ్మకానికి పెట్టింది. దీంతో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణం వరకు స్లీపర్ క్లాస్ చార్జి రూ.475. అయితే ప్రీమియం రైళ్లలో ఇది రూ.600తో ప్రారంభమై రూ.1200 వరకు కూడా పెరిగిపోయింది.