రైళ్లు, బస్సులకు దసరా తాకిడి
సొంతూళ్లకు వెళ్లేవారితో కిటకిట
సాక్షి, హైదరాబాద్: దసరా పండగ సెలవులు... ఆపై వారాంతం కలిసి రావడంతో సొంతూళ్లకు వెళ్లేవారితో నగరంలోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి. రైళ్లు, బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడాయి. దీంతో మహాత్మాగాంధీ బస్ స్టేషన్, నగరంలోని పలు ప్రాంతాల నుంచి ప్రధాన మార్గాల్లో రెగ్యులర్‌గా నడిచే 1,500 సర్వీసులకు తోడు శనివారం మరో 60 బస్సులను ఆర్టీసీ అధికారులు అదనంగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీ, ఎల్‌బీనగర్, ఉప్పల్ తదితర శివారు ప్రాంతాల్లో రద్దీ అధికంగా కనిపించింది.
ఖమ్మం, విజయవాడ, గుంటూరు, వరంగల్ మార్గాల్లో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో పయనమయ్యారు. 25 వేల మంది: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శనివారం ఒక్కరోజే అదనంగా 25 వేల మంది సొంతూళ్లకు తరలివెళ్లినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఇక్కడి నుంచి రోజుకు సుమారు 2లక్షల మంది రాకపోకలు సాగిస్తారు. పండగ రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ మార్గాల్లో దక్షిణమధ్య రైల్వే 60కి పైగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. కాగా, నగరంలో ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా దసరా స్పెషల్ బస్సులను వీలైనంత వరకు నగర శివార్ల నుంచే నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ వేణు తెలిపారు.
మొత్తం 3,060 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. 58 మంది ఉన్నతాధికారులు, 250 మంది ఉద్యోగులను బస్సుల నిర్వహణ కోసం ప్రత్యేకంగా నియమించామన్నారు. ఎంజీబీఎస్, జూబ్లీ, దిల్‌సుఖ్‌నగర్ వంటి ప్రధాన బస్ స్టేషన్ల నుంచే కాకుండా... బీహెచ్‌ఈఎల్, కేపీహెచ్‌బీ, జీడిమెట్ల, ఈసీఐఎల్, ఎల్‌బీనగర్, ఆరాంఘర్ చౌరస్తా, ఉప్పల్ రింగ్‌రోడ్డుల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతారు. ఈ నెల 5 నుంచి 10 వరకు విజయవాడ, విశాఖ, నెల్లూరు, తిరుపతి, బెంగళూర్, పునె, ముంబై, చెన్నై తదితర ప్రాంతాలకు అవసరాన్నిబట్టి ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతారు.