- రైళ్లు, బస్సులు హౌస్‌ఫుల్
- ఫ్లైట్ చార్జీలను తలపిస్తున్న ప్రైవేటు బస్సుల రేట్లు
- ప్రత్యేక బస్సులు సిద్ధం
- మూడు రెట్లు పెరిగిన విమాన టికెట్ ధరలు
సాక్షి, విజయవాడ : దసరా పండుగ సందర్భంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో జిల్లా వాసులు ప్రయాణాలకు సిద్ధమౌతున్నారు. అయితే ఇప్పటికే రైళ్లు, బస్సులు, విమానాల టికెట్ల బుకింగ్ అయిపోవడంతో ప్రయాణికులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాలకు వెళ్లే రూట్లలో బస్సులు, రైళ్లలో టికెట్ దొరకడం గగనమైపోతోంది. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రైవేటు ట్రావెల్స్ చార్జీలను మూడు రెట్లు పెంచేశారు. దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నప్పటికీ 150 శాతం అదనపు చార్జీలను వసూలు చేస్తోంది.
ఆర్టీసీ నడిపే ప్రత్యేక సర్వీసులివే....
హైదరాబాద్‌లో నివసించే వారు పండుగకు తమ స్వస్థలాలకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 26వ తేదీ నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణికుల్ని తీసుకొచ్చేందుకు 400 బస్సుల్ని అదనంగా ఆర్టీసీ నడుపుతోంది. అక్టోబర్ 5 వతేదీ ఆదివారం రాత్రి విజయవాడ నుంచి తిరుగు ప్రయాణమయ్యే అవకాశం ఉన్నందున ఆరోజు నగరంలో వివిధ ప్రాంతాల నుంచి సుమారు 200 బస్సులు హైదరాబాద్ వెళ్లేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేశారు.
అలాగే ఇక్కడ నుంచి చైన్నై, బెంగళూరు, రాజమండ్రి, భద్రాచలం, కడప, కర్నూలు ప్రాంతాలకు వెళ్లేందుకు మరో 50 బస్సుల్ని సిద్ధం చేశారు. 28వ తేదీ నుంచి కార్పొరేట్ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నారు. అందువల్ల ప్రస్తుతం ఉన్న షెడ్యూళ్లకు అదనంగా మరో 60 బస్సులను రాయలసీమ జిల్లాలకు పంపేందుకు ఆర్టీసీ అధికారులు సిద్ధం చేశారు. ఇవే కాకుండా గ్రూపుగా ఒకే ఊరుకు వెళ్లేవారు కోరితే వారికి ప్రత్యేకంగా బస్సు కేటాయిస్తామని ఆర్టీసీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ నాగేంద్ర ప్రసాద్ ‘సాక్షి’కి తెలిపారు.
ఏసీ బస్సులు, రైల్వే సీట్లకు యమా డిమాండ్!
ప్రస్తుతం సాధారణ బస్సులు, రైళ్ల కంటే ఏసీ సర్వీసులకు యమా డిమాండ్ ఉంది. చైన్నై, బెంగళూరు రూట్లలో ఏసీ బస్సుల కోసం ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. రైల్వేలో త్రీటైర్ బెర్త్‌ల కోసం కొల్లేటి చాంతాడంత వెయిటింగ్ లిస్టులున్నాయి. పండుగ రోజుల్లో శేషాద్రి, ప్రశాంతి, ఫలక్‌నామా, నర్సపూర్, మచిలీపట్నం, అమరావతి తదితర రైళ్లలో త్రీటైర్ బర్త్‌లు రెండు నెలల ముందుగానే బుకింగ్ అయిపోయాయయని ప్రయాణికులు చెబుతున్నారు. ప్రస్తుతం పరపతి ఉన్న వారు ఈక్యూలపై దృష్టిసారిస్తున్నారు. త్రీటైర్ ఈక్యూ కంటే స్లీపర్ సీట్లు సులభంగా లభిస్తున్నాయని రైల్వే వ ర్గాలు చెబుతున్నాయి.
విమాన చార్జీలు ఆకాశంలో....
విమాన చార్జీలు ఆకాశంలో విహరిస్తున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు రేట్లను బాగా పెంచేశారు. సాధారణంగా విజయవాడ నుంచి బెంగళూరుకు రూ.3000 చార్జీల ఉంటుంది. ప్రస్తుతం ఇదే చార్జీ రూ.9000కు చేరిందని సమాచారం. రాబోయే రోజుల్లో చార్జీ మరింత పెరిగే అవకాశం ఉంది.
అడ్డంగా దోచుకుంటున్న ప్రైవేటు ఆపరేటర్లు....
ప్రైవేటు ఆపరేటర్లు చార్జీలను మూడు రెట్లు పెంచేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఏసీ బస్సు చార్జీలను రూ.1500 వసూలు చేస్తున్నారు. విజయవాడ నుంచి బెంగళూరుకు సాధారణ రోజుల్లో రూ.1000 తీసుకువెళ్లితే ప్రస్తుతం రూ.3000కు పెంచేశారు. అలాగే ఇతర రూట్లలో బస్సుల చార్జీల ధరలు చుక్కల్ని అంటుతున్నాయి. సాధారణ రోజుల్లో బెంగళూరుకు రూ.3000తో విమానంలో ప్రయాణం చేయవచ్చు. అదే రేటుతో ఇప్పుడు ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు చెల్లించాల్సి వస్తోందని ప్రయాణికులు చెబుతున్నారు.