మంగళవారం ప్రయాణికులతో కిక్కిరిసిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
సాక్షి, హైదరాబాద్: దసరా పర్వదినానికి గ్రేటర్ నుంచి లక్షలాది మంది సిటిజన్లు పల్లెబాట పట్టారు. సుమారు 15 లక్షల మంది వ్యక్తిగత వాహనాలు, ఆర్టీసీ, ట్రావెల్స్ బస్సులు, రైళ్లలో ఊళ్లకు బయలుదేరారు. సోమ, మంగళవారాల్లో నగరవాసులు పెద్ద ఎత్తున సొంత ఊళ్లకు తరలివెళ్లారు. రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లు, ఎల్‌బీ నగర్, సాగర్ రింగ్ రోడ్డు, ఉప్పల్, మెహిదీపట్నం తదితర కూడళ్లు కిక్కిరిసాయి. గ్రామీణ ప్రాంతాల్లో బతుకమ్మ, దసరా ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్న దృష్ట్యా నగరం పల్లెబాట పట్టింది. రైళ్లు, బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలు, టాటా ఏసీలు, క్యాబ్‌లు, ట్యాక్సీలు, తదితర వాహనాలన్నీ ప్రయాణికులతో బయలుదేరాయి. నగరం నుంచి మంగళవారం సుమారు లక్ష వాహనాలు బయలుదేరి వెళ్లినట్లు విజయవాడ, వరంగల్ హైవేల్లోని టోల్‌ప్లాజా వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి.
టోల్‌గేట్ల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. మొత్తంగా దసరా సందర్భంగా ఇప్పటి వరకు సుమారు 15 లక్షల మంది ప్రయాణికులు సొంత ఊళ్లకు తరలివెళ్లారు. బుధవారం మరో 5 లక్షల మంది బయలుదేరే అవకాశం ఉంది. మరోవైపు ప్రయాణికుల రద్దీ బాగా పెరగడంతో ఆర్టీసీ సోమ, మంగళవారాల్లో 2000 ప్రత్యేక బస్సులను నడిపింది. దక్షిణమధ్య రైల్వే పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. అయినా జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సాధారణ బోగీల్లో నరకం చూశారు. టికెట్ కౌంటర్ల వద్ద కూడా భారీ ఎత్తున రద్దీ ఏర్పడటంతో సకాలంలో టికెట్లు లభించక తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మహిళలు, పిల్లలు, వయోధికుల పరిస్థితి మరింత దారుణం. సాధారణ బోగీల్లో ఊపిరి తీసుకొనేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. ఒత్తిడి కారణంగా ప్రయాణికులు ఉక్కిరి బిక్కిరయ్యారు. గంటల తరబడి ఒంటికాలిపై నిలుచుని ప్రయాణం చేయాల్సి వచ్చిందని పలువురు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.
అరకొర రైళ్లతో తప్పని అవస్థలు..
ఏటా ఇదే పరిస్థితి. రద్దీకి తగినన్ని రైళ్లు ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రతీసారి పండుగ ప్రయాణం నరకప్రాయమవుతోంది. ప్రతి సంవత్సరం అరకొర రైళ్లే దిక్కవుతున్నాయి. రెగ్యులర్‌గా రాకపోకలు సాగించే అన్ని రైళ్లలో 3 నెలల ముందే బెర్తులు బుక్ అయ్యాయి. అన్నింటిలోనూ ’నో రూమ్’దర్శనమిస్తోంది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని కనీసం 2 నెలల ముందే ప్రత్యేక రైళ్లను ప్రకటించాల్సిన దక్షిణమధ్య రైల్వే చివరి క్షణం వరకు మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో ప్రయాణికులు అప్పటికప్పుడు అందుబాటులో ఉన్న రైళ్లనే ఆశ్రయించాల్సి వస్తోంది. బెర్తులు లభించకపోయినా, జనరల్ బోగీల్లో సీట్లు లేకపోయినా ప్రయాణం అనివార్యం కావడంతో ఏదో విధంగా రైలెక్కేందుకు సాహసం చేయాల్సి వస్తోంది.
సాధారణ బోగీల్లో కిక్కిరిసి బయలుదేరుతున్నారు. ఏపీతో పాటు, తెలంగాణ జిల్లాలకు రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లన్నింటిలోనూ సాధారణ రోజుల్లో కంటే రెట్టింపు సంఖ్యలో బయలుదేరుతున్నారు. సికింద్రాబాద్ నుంచి ప్రతి రోజు 80 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, మరో 120 ప్యాసింజర్ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. రోజుకు 1.8 లక్షల మంది బయలుదేరుతారు. తాజా రద్దీ నేపథ్యంలో రోజుకు 30 వేల నుంచి 50 వేల వరకు అదనంగా బయలుదేరుతున్నట్లు అంచనా. ఈ అదనపు రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు వేయాల్సింది. కానీ విశాఖ, విజయవాడ, కాకినాడల వైపు మాత్రం మొక్కుబడిగా కొన్నింటిని వేశారు. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నల్లగొండ, మహబూబ్‌నగర్‌కు అదనంగా ఎలాంటి ప్యాసింజర్ రైళ్లను ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు నరకం చవి చూస్తున్నారు.
15 లక్షలు దాటిన ప్రయాణికులు..
దసరా సందర్భంగా ఇప్పటి వరకు 15 లక్షల మందికి పైగా సొంత ఊళ్లకు వెళ్లారు. మరో రెండు రోజుల్లో ఈ సంఖ్య 20 లక్షలు దాటే అవకాశం ఉంది. బస్సుల్లో గత నాలుగు రోజులుగా 6 లక్షల మంది తరలివెళ్లగా, రైళ్లలో మరో 5 లక్షల మంది వెళ్లినట్లు అంచనా.
ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో సొంత ఊళ్లకు బయలుదేరి వెళ్లినవారు 6,00,000
రైళ్లలో వెళ్లిన వారు 5లక్షలు
వ్యక్తిగత వాహనాల్లో వెళ్లినవారు 4లక్షలు
బుధవారం వెళ్లేవారు 5లక్షలు
Comments
Please login to add a commentAdd a comment