కాకతీయ.. ఎక్స్‌ప్రెస్‌గా మారినా ప్రయోజనం శూన్యం | - | Sakshi
Sakshi News home page

కాకతీయ.. ఎక్స్‌ప్రెస్‌గా మారినా ప్రయోజనం శూన్యం

Published Sun, May 7 2023 6:36 AM | Last Updated on Sun, May 7 2023 6:58 PM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి నిత్యం నడుస్తున్న రైళ్లు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. పేరుకే టైం టేబుల్‌ తప్ప ఆచరణలో అమలు కావడంలేదు. నెలలో సగం రోజులకుపైగా ఆలస్యంగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఫలితంగా ఇటు భద్రాచలంరోడ్‌ , అటు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్లలో ప్రయాణికులు అర్ధరాత్రి వేళ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఎట్టకేలకు బెళగావి..
కరోనాకు ముందుకు జిల్లా కేంద్రమైన కొత్తగూడెం (భద్రాచలం రోడ్‌) రైల్వే స్టేషన్‌ నుంచి నిత్యం మూడు రైళ్లు రాకపోకలు సాగించేవి. ఇందులో మణుగూరు, కొల్హాపూర్‌లు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లుగా ఉండగా కాకతీయ ఫాస్ట్‌ ప్యాసింజర్‌గా సేవలు అందించేంది. మూడు రైళ్లూ మణుగూరులో బయల్దేరి కొత్తగూడెం మీదుగా సికింద్రాబాద్‌కు ప్రయాణికులను చేరవేసేవి. దీంతో కొత్తగూడెంతోపాటు పాల్వంచ, భద్రాచలం, బూర్గంపాడు, చర్ల, ఇల్లెందు, టేకులపల్లి తదితర మండలాల ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉండేది. కరోనా సమయంలో ఈ మూడు రైళ్లు రద్దు చేయగా.. ఆ తర్వాత మణుగూరు సూపర్‌ఫాస్ట్‌, ప్యాసింజర్‌గా ఉన్న కాకతీయను ఎక్స్‌ప్రెస్‌గా మారుస్తూ పునరుద్ధరించారు. కొల్హాపూర్‌ స్థానంలో బెళగావి అంటూ గత జనవరిలో రైల్వే అధికారుఉలు ప్రకటించి రద్దు చేశారు. బెళగావి నుంచి సికింద్రాబాద్‌ వరకు నడుస్తున్న ఈ రైలును మణుగూరు వరకు పొడిగిస్తూ ఎట్టకేలకు శనివారం రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

సికింద్రాబాద్‌లో అర్ధరాత్రి ఎదురుచూపులు
సికింద్రాబాద్‌ –మణుగూరు సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ సికింద్రాబాద్‌ స్టేషన్‌లో రోజూ రాత్రి 11:45 గంటలకు బయల్దేరి తెల్లవారుజామున 4:15 గంటలకు భద్రాచలంరోడ్‌ చేరుకోవాలి. కానీ ఈ రైలు నెలలో సగం రోజులకు పైగా సికింద్రాబాద్‌లో సమయానికి బయల్దేరడం లేదు. ఫలితంగా సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ప్రయాణికులు అర్ధరాత్రి వేళ జాగారం చేయాల్సి వస్తోంది. నగరంలోని చాలా మంద్రి ప్రయాణికులు రాత్రి 9:30 నుంచి 10:30 గంటల మధ్యలోనే ఇంటి నుంచి పిల్లాపాపలు, లగేజీతో బయల్దేరితేనే 11:30 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటారు. తీరా స్టేషన్‌కి వచ్చాక రైలు గంట నుంచి రెండు గంటలు ఆలస్యంగా ఫ్లాట్‌ఫారమ్‌ మీదకు వస్తోంది. దీని వల్ల చిన్నపిల్లలు, భారీ లగేజీతో అర్ధరాత్రి రెండు గంటలకుపైగా పసిపిల్లలు సహా ప్రయాణికులు మేల్కోవాల్సి వస్తోంది. చివరి నిమిషంలో ఫ్లాట్‌ఫారమ్‌ మారితే అటు ఇటు వెళ్లడం మరో ప్రయాస. సికింద్రాబాద్‌లో ఆలస్యంగా బయల్దేరడంతో కొత్తగూడేనికి నిర్దేశిత సమయానికి రావడం లేదు. ఫలితంగా ఈ రైలును నమ్ముకుని ఉదయం వేళ భద్రాచలంలో సీతారాముల దర్శనం చేసుకోవాలనుకునే భక్తులకు ఇబ్బందులు వస్తున్నాయి.

సింగరేణి ఇక అంతేనా!
సికింద్రాబాద్‌కు వెళ్లే రైళ్ల పరిస్థితి ఇలా ఉంటే కోల్‌బెల్ట్‌ ప్రాంతాలను కలిపే ఏకై క రైలు సింగరేణి ఫాస్ట్‌ ప్యాసింజర్‌ను నడిపేతీరు ఇంకా మారలేదు. రైలు వేగం పెంచుతామంటూ రెగ్యులర్‌ కోచ్‌లు తీసి పుష్‌పుల్‌ కోచ్‌లతో నడిపినా, ప్యాసింజర్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తూ ఎక్స్‌ప్రెస్‌గా మార్చినా ఇసుమంతైనా మార్పు రాలేదు. ఈ రైలు కూడా నెలలో ఇరవై రోజులకు పైగా గమ్యస్థానాలకు ఆలస్యంగా చేరుకుని ప్రయాణికులను ఇబ్బంది పెడుతోంది. ఫలితంగా ఒకప్పుడు కిక్కిరిసిన ప్రయాణికులతో నడిచిన సింగరేణి ఇప్పుడు ఆ స్థాయిలో ప్రయాణికులను ఆకట్టుకోలేకపోతోంది. బొగ్గు రవాణా ద్వారా రైల్వేకు కోట్లాది రూపాయల ఆదాయం అందిస్తున్న ఈ జిల్లాకు, ఇక్కడి ప్రజలు, వారి సమయం, అవసరాలను రైల్వేశాఖ ఇప్పటికై నా గుర్తించాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు. తమ సమయాన్ని వృథా చేయొద్దని, టికెట్‌ రూపంలో తాము చెల్లిస్తున్న సొమ్ములకు సరిపడా నాణ్యమైన సేవలు అందించాలని ప్రయాణికులు రైల్వే శాఖను డిమాండ్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement