
కమనీయం.. రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
సింగరేణిలో
నైపుణ్యాభివృద్ధి శిక్షణ
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి గనుల పరిసర ప్రాంతాలు, సంస్థ కార్మికులు, వారి పిల్లలు, ప్రభావిత ప్రాంత నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటికే మందమర్రి, రామగుండం ఏరియాల్లో సంస్థ ఆధ్వర్యాన శిక్షణ కేంద్రాలు కొనసాగుతుండగా, భూపాలపల్లిలోనూ ఏర్పాటుకు నిర్ణయించారు. ఈ మేరకు స్కిల్ డెవలప్‌మెంట్ రీజినల్ డైరెక్టర్ కె.శ్రీనివాసరావును సింగరేణి జీఎం(కార్పొరేట్ హెచ్‌ఆర్‌డీ) జి.రఘుపతి బుధవారం కలిశారు. ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణపై అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. కార్యక్రమంలో డీజీఎం నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
మూగజీవాల సంరక్షణకు చర్యలు తీసుకోవాలి
డీఎఫ్‌ఓ కిష్టాగౌడ్
గుండాల: అడవుల్లో మూగజీవాలకు నీటి సదుపాయం కల్పించడంతో పాటు వాటి రక్షణ కోసం సిబ్బంది ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని డీఎఫ్‌ఓ కిష్టాగౌడ్ అన్నారు. మండలంలోని గణపురం, పాలగూడెం ప్లాంటేషన్లను బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొక్కలు ఎండిపోకుండా నిత్యం నీరందించాలని, ప్లాంటేషన్ చుట్టూ ట్రెంచ్‌లు ఉండాలని అన్నారు. అడవుల్లో జంతువులకు ఏర్పాటు చేసిన తొట్లలో ఎప్పుడూ నీరు నిల్వ ఉండాలన్నారు. వేటగాళ్ల ఉచ్చులకు జంతువులు బలికాకుండా నిఘా పటిష్టం చేయాలని, వేటగాళ్లపై చర్యలు తీసుకోవాలని సూచించారు. వేసవిలో అడవులకు నిప్పు పెట్టకుండా జాగత్ర చర్యలు తీసుకోవాలని, ప్రమాదవశాత్తు కాలిపోతున్న ప్రదేశాలను వెంటనే ఆర్పివేయాలని ఆదేశించారు. అడవులు, అటవీ జంతువుల రక్షణలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అక్రమ కలప రవాణాపై దృష్టి సారించాలన్నారు. ఆయన వెంట ఇల్లెందు ఎఫ్‌డీఓ కోటేశ్వరరావు, గుండాల రేంజర్ నర్సింహారావు, డీఆర్‌ఓ బాలాజీ, సిబ్బంది కోటేశ్వరావు, రవి, వెంకన్న తదితరులు ఉన్నారు.

కమనీయం.. రామయ్య నిత్యకల్యాణం

కమనీయం.. రామయ్య నిత్యకల్యాణం