రైళ్లు, రైల్వే స్టేషన్లలో దొంగతనాలు పెరిగాయి
- ధృవీకరించిన రైల్వేశాఖ గణాంకాలు
న్యూఢిల్లీ: 2014 ఏడాదితో పోల్చితే 2015లో రైళ్లు, రైల్వే స్టేషన్లలో దొంగతనాలు, చోరీలు పెరిగాయని రైల్వేశాఖ ధృవీకరించింది. 2014లో 16,798 దొంగతనాల కేసులు నమోదవగా, 2015లో ఆ సంఖ్య 21,688కు పెరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు అందిన సమాచారం ప్రకారం.. రైళ్లు, ప్లాట్‌ఫాంలపై ప్రయాణికుల లగేజీలు, బ్యాగుల చోరీ కేసులు 3,583 నమోదయ్యాయని రైల్వే మంత్రిత్వశాఖ గణాంకాలు చెబుతున్నాయి.
నడుస్తున్న రైళ్లలో దొంగతనాల కేసులు ఈ ఏడాది 2489 నమోదవగా, ప్లాట్‌ఫాంలపై చోటు చేసుకున్న దొంగతనాల కేసులు 1094గా నమోదయ్యాయి. నేరాల నియంత్రణ, కేసుల నమోదు, పరిశోధన, శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతేనని రైల్వే మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ దొంగతనాలు నియంత్రించేందుకు రైల్వే శాఖ ఆర్పీఎఫ్ సిబ్బందిని నియమించింది.