చోరీలు చేయిస్తూ చిక్కిన సాప్ట్వేర్ ఇంజినీర్
హైదరాబాద్ : చిన్నారులతో రైళ్లలో చోరీ చేయిస్తున్న ఓ సాప్ట్వేర్ ఇంజినీర్ను అంబర్ పేట పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు గోల్నాక నివాసి సుభాష్ సాప్ట్వేర్ ఇంజినీర్. వ్యసనాలకు బానిసైన అతగాడు చిన్నపిల్లలతో చోరీలు చేయిస్తున్నాడు.
ఛేనంబర్ శంకర్ నగర్లోని ఓ ఇంటర్ నెట్ సెంటర్కు నిత్యం వెళ్లే అతడు అక్కడికి వీడియో గేమ్స్ ఆడేందుకు వచ్చే చిన్న పిల్లలను మచ్చిక చేసుకునేవాడు. వారిని హోటల్కి తీసుకెల్లి బిర్యానీ, ఐస్క్రీమ్ వంటివి తినిపించేవాడు. తర్వాత వారిని రైల్వే స్టేషన్కు తీసుకెళ్లి...రైళ్లలో ప్రయాణిస్తాడు. బోగీల్లో ఛార్జింగ్ పెట్టిన సెల్ఫోన్లు, ల్యాప్టాప్లు చోరీ చేయిస్తాడు. ఇలా వెంకటాద్రి, నారాయణాద్రి,రాజ్కోట్, యశ్వంత్పుర తదితర రైళ్లలో చోరీలు చేయించేవాడు.
దొంగతనం చేసిన వాటిని విక్రయించగా వచ్చిన డబ్బుతో జల్సా చేసేవాడు. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం అంబర్ పేట మారుతీనగర్ కు చెందిన 13ఏళ్ల బాలుడిని సుభాష్ రైళ్లలో చోరీ చేయించడానికి తీసుకెళ్లాడు. ఆ బాలుడు కనిపించకపోవటంతో తమ కుమారుడు అదృశ్యమయ్యాడని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. దీంతో సుభాష్, అతనికి సహకరించిన ఇంటర్ నెట్ సెంటర్ నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమచారం.