అనునిత్యం తిరిగేది ఆడి కంపెనీ హైఎండ్ కారులో
హైదరాబాద్ సహా అనేక నగరాల్లో వరుస చోరీలు
సాక్షి, హైదరాబాద్: రోహిత్ కనూభాయ్ సోలంకి..ముంబై శివార్లలో రూ.కోటి ఖరీదైన ఫ్లాట్‌లో నివసిస్తుంటాడు. ఆడి హైఎండ్ కారులో సంచరిస్తుంటాడు. ఓ నగరాన్ని టార్గెట్ చేసుకుంటే అక్కడకు వెళ్లి స్టార్ హోటల్‌లో బస చేస్తాడు. సంపన్నుల ప్రాంతాలను గూగుల్ ద్వారా గుర్తిస్తాడు. అక్కడ పగలు రెక్కీ చేసి తాళం వేసున్న ఇళ్లల్లో రాత్రిళ్లు పంజా విసరుతాడు.
ఈ ఖరీదైన దొంగను గత వారం గుజరాత్‌తోని వల్సాద్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. విచారణ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోనూ రెండు నేరాలు చేసినట్లు అంగీకరించాడు. దీంతో ఇక్కడి పోలీసులకు త్వరలో సమాచారం ఇవ్వనున్నట్లు వల్సాద్ ఎస్పీ కరణ్ రాజ్ వాఘేలా ‘సాక్షి’కి తెలిపారు. మహారాష్ట్రకు చెందిన సోలంకి ప్రస్తుతం ముంబ్రాలోని ఖరీదైన సొంత ఫ్లాట్‌లో నివసిస్తున్నాడు. తన పేరును అర్హాన్‌గా మార్చుకున్న ఇతగాడు ఓ మైనార్టీ యువతిని వివాహం చేసుకున్నాడు.
ఆమెతో తాను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని చెప్తూ... కొన్నేళ్లుగా చోరీలు చేస్తున్నాడు. క్యాంపుల పేరుతో తరచు ఇల్లు వదిలి వెళ్లే ఇతగాడు కేవలం ప్రధాన నగరాలనే టార్గెట్‌గా చేసుకుంటాడు. విమానంలో అక్కడకు చేరుకుని స్టార్ హోటల్‌లో బస చేస్తాడు. గూగుల్ ద్వారా ఈ చుట్టుపక్కల ఉన్న సంపన్న వర్గాలు నివసించే ప్రాంతాలను గుర్తిస్తాడు. హోటల్‌కు చెందిన క్యాబ్‌ను బుక్ చేసుకునే ఇతగాడు పగటి పూటి అందులోనే తిరుగుతూ తాను ఎంచుకున్న ప్రాంతాల్లో రెక్కీ చేస్తాడు. తాళం వేసున్న ఇళ్లను గుర్తించి ఆ ప్రాంతాలకు సంబంధించిన లోకేషన్స్‌ను తన వాట్సాప్‌లోకి షేర్ చేసుకుంటాడు.
రాత్రి వేళ కాలినడకన బయలుదేరి..సమీపంలోని ఏదో ఒక దుకాణం నుంచి చిన్న రాడ్డు, స్క్రూడ్రైవర్ వంటివి ఖరీదు చేస్తాడు. వీటిలో టార్గెట్ చేసుకున్న ఇంటి తాళాలు పగులకొట్టి నగదు, సొత్తు స్వాహా చేస్తాడు. చోరీ సొత్తును తీసుకుని మాత్రం రైలులోనే ముంబైకి చేరుకుంటాడు. ఇంటికి చేరుకునేలోపే దాన్ని అమ్మి, క్యాష్ చేసుకుని, బ్యాంక్ ఖాతాలో వేసుకుంటాడు. ఇలా గడిచిన కొన్నాళ్లల్లో గుజరాత్‌లోని వల్సాద్, వాపి, సూరత్, పోర్‌బందర్, సెల్వాల్‌లతో పాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్‌ల్లో 19 నేరాలు చేశాడు. వీటిలో రెండు హైదరాబాద్‌లో చేసినవే. వల్సాలో జరిగిన వాపిలో జరిగిన రూ.లక్ష నగదు చోరీ కేసును వల్సాద్ జిల్లా పోలీసులు దర్యాప్తు చేశారు.
సాంకేతిక ఆధారాలతో పాటు సోలంకి బస చేసిన హోటల్, ప్రయాణించిన విమానం టిక్కెట్ తదితర వివరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. ముంబ్రాలోని అతడి ఫ్లాట్ వద్ద కాపుకాసిన పోలీసులు గత వారం అరెస్టు చేశారు. విచారణ నేపథ్యంలో జల్సాలకు అలవాటుపడిన ఇతగాడు ముంబైలోని నైట్ క్లబ్స్‌లో భారీ మొత్తం ఖర్చు చేస్తాడని తేలింది. మాదకద్రవ్యాలకు సైతం అలవాటుపడి బానిసగా మారిన సోలంకి ఏకంగా నెలకు రూ.1.5 లక్షలు వాటికే వెచి్చస్తాడని పోలీసులు గుర్తించారు.
వల్సాద్ ఎస్పీ కరణ్ రాజ్ వాఘేలా ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడుతూ...‘రోహిత్ సోలంకిని విచారించిన నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోని హైదరాబాద్‌ల్లో రెండేసి చోరీలు చేసినట్లు వెలుగులోకి వచి్చంది. అయితే ఏ ప్రాంతంలో చేశాడనేది అతడు స్పష్టంగా చెప్పలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడు ఆయా నగరాల్లో సంచరించిన తేదీలతో పాటు ఇతర వివరాలను సాంకేతికంగా గుర్తిస్తున్నాం. ఆపై ఆ అంశాలకు అక్కడ పోలీసులకు తెలుపుతాం. డ్రగ్స్‌కు బానిసైన సోలంకిని రీహాబ్‌కు పంపాలని యోచిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment