యాక్సెంచర్లో ఉద్యోగం...విలాసాల కోసం చోరీలు
బెంగళూరు : స్నేహితుల ఇళ్లో చోరీలకు పాల్పడిన ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను హెణ్ణూరు పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన నిందితురాలిని గోవిందశెట్టిపాళ్యలో నివాసముంటున్న ఎలిజబెత్ అలియాస్ మారీ(22)గా గుర్తించినట్లు బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ తెలిపారు. నిందితురాలి వివరాలను ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బెంగళూరులోని యాక్సెంచర్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్న ఎలిజబెత్, నాలుగు నెలలుగా పలుమార్లు హెణ్ణూరులోని తన స్నేహితురాలు పూజాశర్మ ఇంటికి వెళ్లింది.
ఆ సమయంలో పూజాశర్మ కుటుంబసభ్యుల కళ్లు కప్పి బంగారు నగలు, విలువైన వస్తువులను తన వ్యానిటీ బ్యాగ్‌లో వేసుకుని గుట్టుచప్పుడు కాకుండా వెళ్లిపోయేది. పదేపదే ఇంటిలో నగలు చోరీ అవుతుండడంతో పూజాశర్మ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఇంటిలో పనిచేస్తున్న వారిని ప్రశ్నించి వారి ప్రమేయం లేదని తెలుసుకున్నారు.
అనంతరం నాలుగు నెలలుగా పూజాశర్మ ఇంటికి వచ్చివెళ్లిన వారిపై నిఘా పెంచారు. ఆ సమయంలో ఎలిజబెత్ వైఖరిపై అనుమానం కలిగింది. ఆమె గురించి వాకాబు చేశారు. ఎలిజబెత్ తండ్రికి తాహతుకు మించి అప్పులు ఉన్నాయని, అయితే ఎలిజబెత్ మాత్రం విలాసవంతమైన జీవనం గడుపుతోందని గుర్తించారు. అనుమానితురాలిగా అదుపులో తీసుకుని పోలీసులు తమదైన శైలీలో విచారణ చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది.
ఆమె వద్ద నుంచి పోలీసులు నాలుగున్నర లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేసిన ఆభరణాలను తాకట్టు వ్యాపారికి అమ్మి ఆ డబ్బుతో ఖరీదైన సెల్ఫోన్లు కొనుగోలు చేయటంతో పాటు, విలాసవంత జీవితం గడపటం చేసేంది. అంతేకాకుండా తండ్రి అప్పులను కూడా ఎలిజబెత్ తీర్చేది.