అల్లారుముద్దుగా పెంచిన ఏకైక కుమార్తె పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించాడు. గొప్ప సంబంధమే దొరికిందని మురిసిపోయాడు. ఇక కుమార్తె జీవితం బంగారు మయమేనంటూ బంధువులతో చెప్పుకొని సంతోషంగా గడిపాడు. పెళ్లి తంతు ముగిశాక దగ్గరి బంధువులతో కలిసి సంతోషంగా స్వగ్రామానికి బయలుదేరారు. అయితే, ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. వాహనంలో పెళ్లి కబుర్లు చెప్పుకుంటూ వెళ్తూ మరో అరగంటలో ఇంటికి చేరుకుంటామనే లోపు మృత్యువు లారీ రూపంలో దూసుకొచ్చింది. కళ్లు తెరిచేలోపే అయిన వారందరినీ కబళించేసింది. తీవ్ర గాయాలపాలైన ఆయన కూడా ఆస్పత్రిలో తుది శ్వాస వదిలాడు.
ఉరవకొండ: మండలంలోని నింబగల్లు గ్రామానికి చెందిన బీజేపీ నేత కోకా వెంకటప్ప నాయుడు (58) ఏకైక కుమార్తె ప్రశాంతి. ఒక్కగానొక్క బిడ్డ కావడంతో ఈమెను అల్లారుముద్దుగా పెంచాడు. ఆదివారం ఉదయం బళ్లారిలోని అల్లంభవన్ ఫంక్షన్ హాలులో ఎంతో వైభవంగా ప్రశాంతి వివాహం జరిపించాడు. పెళ్లి తంతు ముగిసిన తర్వాత వెంకటప్ప నాయుడు, ఆయన దగ్గరి బంధువులు ఎనిమిది మంది ఇన్నోవా వాహనంలో నింబగల్లుకు బయలుదేరారు. వీరి వాహనం బూదగవి వద్ద వస్తుండగా.. అనంతపురం నుంచి బళ్లారి వైపు వెళుతున్న 16 చక్రాల ఐరన్‌ఓర్ లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఇన్నోవా ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. డ్రైవింగ్ సీటులోని వెంకటప్ప నాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. కొన ఊపిరితో ఉన్న ఆయన్ను ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించగా కొద్ది నిమిషాల్లోనే ప్రాణాలొదిలాడు. మిగిలిన ఎనిమిది మంది తీవ్రగాయాలతో వాహనంలోనే మృతి చెందారు.
మరో అరగంటలో ఇంటికి చేరాల్సి ఉండగా..
ఘటనా స్థలం నుంచి నింబగల్లుకు కొద్ది దూరమే. మరో అరగంటలో వీరు గ్రామం చేరేవారు. అయితే, ఊహించని విధంగా దూసుకొచ్చిన మృత్యువు అందరినీ కబళించేసింది. మృతులంతా దగ్గరి బంధువులే. పైగా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. వీరి మరణవార్త తెలియడంతో నింబగల్లు గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. వెంకటప్ప నాయుడి ఇంటి వద్దకు గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వెంకటప్ప నాయుడు బీజేపీ సీనియర్ నేత కూడా కావడంతో విషయం తెలుసుకున్న పలు పార్టీల నాయకులు హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. నిన్నటి వరకూ సందడిగా ఉన్న ఇంటి పరిసరాల్లో ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం అలుముకుంది. మృతులతో తమ అనుబంధాన్ని తలచుకుని పలువురు కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఎంత పనిచేశావు దేవుడా అంటూ బంధువులు విలపించిన తీరు పలువురిని కలచివేసింది. ఇదే ప్రమాదంలో బొమ్మనహాళ్‌కు చెందిన సరస్వతి, ఆమె కుమారుడు అశోక్, కుమార్తె స్వాతి, మనవడు జశ్వంత్, మనవరాలు జాహ్నవి చనిపోవడంతో బొమ్మనహాళ్‌లోని సరస్వతి ఇంటి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. అలాగే రాధమ్మ మృతితో కణేకల్లు మండలం హనుమాపురం, శివమ్మ, సుభద్రమ్మ మృతితో బ్రహ్మసముద్రం మండలం పిల్లలపల్లి, రాయలప్ప దొడ్డి శోకసంద్రంగా మారాయి.
ఆస్పత్రిలో మిన్నంటిన ఆర్తనాదాలు..
మృతదేహాలను ఘటనాస్థలం నుంచి పోస్టుమార్టం నిమిత్తం ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సాయంత్రం వరకూ తమ కళ్లెదుటే ఎంతో సంతోషంగా కనిపించిన వారు.. ఒక్కసారిగా విగతజీవులుగా పడి ఉండడం చూసి బంధువులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఆస్పత్రి ప్రాంగణంలో వారి ఆర్తనాదాలు మిన్నంటాయి. విదేశాల నుంచి కూడా కొంత మంది బంధువులు పెళ్లి వేడుకకు వచ్చారు. ఈ ఘోరాన్ని చూసేందుకే తమను రప్పించావా దేవుడా అంటూ వారు విలపించారు.
Comments
Please login to add a commentAdd a comment