misfortune
-
లే.. నాన్నా.. లే! ...అందర్నీ కంటతడి పెట్టించే ఆక్రందన!
ఉరవకొండ(అనంతపురం): రెండ్రోజుల్లో వస్తానమ్మా అన్నావ్‌గా నాన్నా.. అంతలోనే ఇలా నన్ను వదిలి వెళతావా..? నీవు నాకు కావాలి.. లే నాన్నా.. లే’ అంటూ నవ వధువు ప్రశాంతి తన తండ్రి కోకా వెంకటప్ప మృతదేహాన్ని పట్టుకుని గుండెలవిసేలా రోదించడం స్థానికులను కలచివేసింది. బళ్లారిలో కుమార్తె ప్రశాంతి వివాహ వేడుక అనంతరం దగ్గరి బంధువులతో కలిసి బీజేపీ నేత కోకా వెంకటప్పనాయుడు ఇన్నోవా వాహనంలో ఆదివారం సాయంత్రం నింబగల్లుకు వస్తుండగా బూదగవి వద్ద లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం చెందిన విషయం విదితమే. వెంకటప్ప మృతదేహాన్ని స్వగ్రామం నింబగల్లుకు సోమవారం తీసుకొచ్చారు. తండ్రిని కడసారి చూసేందుకు కర్ణాటక రాష్ట్రం దావణగెరె నుంచి నవ వధువు ప్రశాంతి, కుమారుడు సతీష్ స్వగ్రామానికి వచ్చారు. మృతదేహం వద్ద ప్రశాంతిని పట్టుకుని తల్లి దాక్షాయణి ‘నీకు ఇక నాన్న లేడమ్మా’ అంటూ రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఎవరి కోసం బతకాలి... ప్రమాదంలో మృతి చెందిన లత్తవరం గ్రామానికి చెందిన స్వాతి భర్త శ్రీధర్ రోదన వర్ణనాతీతంగా మారింది. బళ్లారిలో వివాహ వేడుకలు ముగించుకుని శ్రీధర్ తన భార్య స్వాతి, ఇద్దరు కవలలు జాహ్నవి, జశ్వంత్‌తో ఇన్నోవా వాహనం ఎక్కారు. అయితే స్వాతి తమ్ముడు అశోక్ వచ్చి ‘బావా నేను చాలా అలసిపోయాను. నీవు బైక్‌లో ఉరవకొండకు రా. నేను, అక్క, పిల్లలు ఇన్నోవాలో వెళతాం’ అని శ్రీధర్‌ను కోరాడు. ప్రమాదంలో వారంతా చనిపోవడంతో ‘నాకు ప్రాణ భిక్ష పెట్టి.. మీరంతా కానరాని లోకాలకు వెళ్లిపోతిరా’ అంటూ శ్రీధర్ విలపించాడు. కవలల మృతితో పాఠశాలకు సెలవు ఉరవకొండలోని ఎడిసన్ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న కవలలు జాహ్నవి, జశ్వంత్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో సోమవారం పాఠశాలకు సెలవు ఇచ్చారు. మృత్యువులోనూ వీడని అక్కాచెల్లెళ్ల బంధం బూదగవి రోడ్డు ప్రమాదం బ్రహ్మసముద్రం మండలం రాయలప్పదొడ్డి, పిల్లలపల్లి గ్రామాల్లో విషాదం నింపింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఈ ప్రమాదంలో మృతి చెందారు. రాయలప్పదొడ్డికి చెందిన కవలకుంట్ల లచ్చన్న, ఈరమ్మ దంపతులకు నలుగురు కుమార్తెలు సరస్వతి, శివమ్మ, సుభద్రమ్మ, దాక్షాయణి, కుమారుడు బసవరాజు ఉన్నారు. బసవరాజు రెండు నెలల క్రితం గుండెపోటుతో మరణించాడు. అక్కాచెల్లెళ్లు సరస్వతి, శివమ్మ, సుభద్రమ్మలు కోకా వెంకటప్ప కుమార్తె ప్రశాంతి వివాహానికని బళ్లారికి వెళ్లారు. ఆదివారం వేడుక ముగియగానే తిరిగింపుల ఏర్పాట్ల కోసం బంధువులతో కలిసి ఇన్నోవా వాహనంలో నింబగల్లుకు వస్తుండగా బూదగవి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తొమ్మిది మంది మరణించారు. మృతుల్లో సరస్వతి, శివమ్మ, సుభద్రమ్మ ఉన్నారు. కడచూపునకు నోచని కుమారుడు సుభద్రమ్మ, తిమ్మప్ప దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. వీరిది బ్రహ్మసముద్రం మండలం రాయలప్పదొడ్డి గ్రామం. కుటుంబ పెద్ద సుభద్రమ్మ భర్త తిమ్మప్ప ఏడాది క్రితం కోవిడ్‌తో మృతిచెందాడు. పెద్ద కుమార్తె భారతికి వివాహమైంది. చిన్న కుమార్తె సునీత తల్లితో కలిసి ఉంటోంది. కుమారుడు సతీష్ జర్మనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా స్థిరపడ్డాడు. తల్లి, పెద్దమ్మలు మృతి చెందారన్న విషయం తెలుసుకున్న సతీష్ వెంటనే భారత్‌కు వచ్చేందుకు బయల్దేరాడు. అయితే జర్మనీ అయితే జర్మనీ ఎయిర్‌పోర్టులో కోవిడ్ పరీక్షలు నిర్వహించగా సతీష్‌కు పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో అక్కడే నిలిచిపోయాడు. కన్నీటి వీడ్కోలు బూదగవి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తొమ్మిది మందికి ఆదివారం అర్ధరాత్రి ఉరవకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యాధికారులు డాక్టర్ ఎర్రిస్వామిరెడ్డి, డాక్టర్ గంగాధర్, డాక్టర్ ఆశా, గుంతకల్లుకు చెందిన డాక్టర్ రామాంజనేయులు, డాక్టర్ అబుబకర్ పోస్టుమార్టం నిర్వహించారు. సోమవారం ఉదయానికల్లా నింబగల్లుకు చెందిన బీజేపీ నేత కోకా వెంకటప్ప (58), బొమ్మనహాళ్‌కు చెందిన సరస్వతి (60), ఆమె కుమారుడు అశోక్ (35), లత్తవరానికి చెందిన స్వాతి(38), ఆమె కవల పిల్లలు జాహ్నవి, జశ్వంత్ (12), కణేకల్లు మండలం హనుమాపురానికి చెందిన రాధమ్మ (48), బ్రహ్మసముద్రం మండలం పిల్లలదొడ్డికి చెందిన శివమ్మ (35), రాయలప్పదొడ్డికి చెందిన సుభ్రదమ్మ (58) మృతదేహాలు స్వగ్రామాలకు చేరాయి. పెళ్లికని వెళ్లి విగతజీవులుగా వచ్చిన వారిని చూసి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తులు కన్నీరుపెట్టారు. అదే రోజు అంత్యక్రియలు పూర్తి చేశారు. -
పెళ్లి జరిగిందన్న ఆనందం నిలువక మునుపే ఆ ఇంట మృత్యుఘోష
అల్లారుముద్దుగా పెంచిన ఏకైక కుమార్తె పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించాడు. గొప్ప సంబంధమే దొరికిందని మురిసిపోయాడు. ఇక కుమార్తె జీవితం బంగారు మయమేనంటూ బంధువులతో చెప్పుకొని సంతోషంగా గడిపాడు. పెళ్లి తంతు ముగిశాక దగ్గరి బంధువులతో కలిసి సంతోషంగా స్వగ్రామానికి బయలుదేరారు. అయితే, ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. వాహనంలో పెళ్లి కబుర్లు చెప్పుకుంటూ వెళ్తూ మరో అరగంటలో ఇంటికి చేరుకుంటామనే లోపు మృత్యువు లారీ రూపంలో దూసుకొచ్చింది. కళ్లు తెరిచేలోపే అయిన వారందరినీ కబళించేసింది. తీవ్ర గాయాలపాలైన ఆయన కూడా ఆస్పత్రిలో తుది శ్వాస వదిలాడు. ఉరవకొండ: మండలంలోని నింబగల్లు గ్రామానికి చెందిన బీజేపీ నేత కోకా వెంకటప్ప నాయుడు (58) ఏకైక కుమార్తె ప్రశాంతి. ఒక్కగానొక్క బిడ్డ కావడంతో ఈమెను అల్లారుముద్దుగా పెంచాడు. ఆదివారం ఉదయం బళ్లారిలోని అల్లంభవన్ ఫంక్షన్ హాలులో ఎంతో వైభవంగా ప్రశాంతి వివాహం జరిపించాడు. పెళ్లి తంతు ముగిసిన తర్వాత వెంకటప్ప నాయుడు, ఆయన దగ్గరి బంధువులు ఎనిమిది మంది ఇన్నోవా వాహనంలో నింబగల్లుకు బయలుదేరారు. వీరి వాహనం బూదగవి వద్ద వస్తుండగా.. అనంతపురం నుంచి బళ్లారి వైపు వెళుతున్న 16 చక్రాల ఐరన్‌ఓర్ లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఇన్నోవా ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. డ్రైవింగ్ సీటులోని వెంకటప్ప నాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. కొన ఊపిరితో ఉన్న ఆయన్ను ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించగా కొద్ది నిమిషాల్లోనే ప్రాణాలొదిలాడు. మిగిలిన ఎనిమిది మంది తీవ్రగాయాలతో వాహనంలోనే మృతి చెందారు. మరో అరగంటలో ఇంటికి చేరాల్సి ఉండగా.. ఘటనా స్థలం నుంచి నింబగల్లుకు కొద్ది దూరమే. మరో అరగంటలో వీరు గ్రామం చేరేవారు. అయితే, ఊహించని విధంగా దూసుకొచ్చిన మృత్యువు అందరినీ కబళించేసింది. మృతులంతా దగ్గరి బంధువులే. పైగా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. వీరి మరణవార్త తెలియడంతో నింబగల్లు గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. వెంకటప్ప నాయుడి ఇంటి వద్దకు గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వెంకటప్ప నాయుడు బీజేపీ సీనియర్ నేత కూడా కావడంతో విషయం తెలుసుకున్న పలు పార్టీల నాయకులు హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. నిన్నటి వరకూ సందడిగా ఉన్న ఇంటి పరిసరాల్లో ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం అలుముకుంది. మృతులతో తమ అనుబంధాన్ని తలచుకుని పలువురు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎంత పనిచేశావు దేవుడా అంటూ బంధువులు విలపించిన తీరు పలువురిని కలచివేసింది. ఇదే ప్రమాదంలో బొమ్మనహాళ్‌కు చెందిన సరస్వతి, ఆమె కుమారుడు అశోక్, కుమార్తె స్వాతి, మనవడు జశ్వంత్, మనవరాలు జాహ్నవి చనిపోవడంతో బొమ్మనహాళ్‌లోని సరస్వతి ఇంటి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. అలాగే రాధమ్మ మృతితో కణేకల్లు మండలం హనుమాపురం, శివమ్మ, సుభద్రమ్మ మృతితో బ్రహ్మసముద్రం మండలం పిల్లలపల్లి, రాయలప్ప దొడ్డి శోకసంద్రంగా మారాయి. ఆస్పత్రిలో మిన్నంటిన ఆర్తనాదాలు.. మృతదేహాలను ఘటనాస్థలం నుంచి పోస్టుమార్టం నిమిత్తం ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సాయంత్రం వరకూ తమ కళ్లెదుటే ఎంతో సంతోషంగా కనిపించిన వారు.. ఒక్కసారిగా విగతజీవులుగా పడి ఉండడం చూసి బంధువులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఆస్పత్రి ప్రాంగణంలో వారి ఆర్తనాదాలు మిన్నంటాయి. విదేశాల నుంచి కూడా కొంత మంది బంధువులు పెళ్లి వేడుకకు వచ్చారు. ఈ ఘోరాన్ని చూసేందుకే తమను రప్పించావా దేవుడా అంటూ వారు విలపించారు. -
పత్తి రైతులకు పొంచి ఉన్న విపత్తు
భూమిలో విత్తనాలు నాటిన నాటినుండి మొదలైన రైతు కష్టాలు పంటచేతికి వచ్చి మార్కెట్లో పంటలను అమ్ముకునేవరకు నిత్యకృత్యంగా మారాయి. రైతులకు గిట్టుబాటు ధర లేకుండా పోతుంటే పాలకులు, అధికారులు మాత్రం ‘‘నిమ్మకు నీరెత్తనట్లుగా’’ వ్యవహరిస్తున్నారు. పత్తివిత్తనాల్లో కల్తీ, వాటి ధరలను పెంచుకుపోతున్న దోపిడీకి పాలకులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. పత్తిరైతులకు నష్టాలు విత్తనాల విక్రయంలో అధిక ధరలు నకిలీల బెడద నుండి మొదలై మార్కెట్లో మద్దతు ధర ఇచ్చే వరకు అన్ని స్థాయిల్లోనూ దోపిడీకి గురవుతున్నారు. చరిత్రలోనే అత్యధికంగా తెలంగాణలో 46.92 లక్షల ఎకరాల్లో పత్తిపంట సాగు చేశారు. ఈ పంటకు మద్దతు ధర ఇప్పించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, అన్నదాతలకు చేరడం లేదు. ఈ ఏడాది పత్తి మద్దతు ధర క్వింటాలుకు రూ. 5,550గా కేంద్రం నిర్ణయించింది. కొత్త పత్తిపంటను రైతులు మార్కెట్టుకు తేవడం మొదలైంది. తీరా తొలిపంట ఉత్పత్తికి మార్కెట్లో మద్దతు ధరను వ్యాపారులు చెల్లించిన దాఖలాలు లేవు. ఇప్పుడిప్పుడే వస్తున్న కొత్తపత్తికి మద్దతు ధర లేకపోవడాన్ని బట్టిచూస్తే పంటల దిగుబడి పూర్తిస్థాయిలోకి వచ్చాక రైతులకు మద్దతు ధర లభించడం ఎండమావుల్లో నీటిని వెతుక్కున్నట్లే అనిపిస్తుంది. మార్కెట్లో కనిష్టంగా క్వింటాలుకు రూ. 4,221 నుంచి గరిష్టంగా రూ. 5,211 వరకు అతికష్టంమీద చెల్లిస్తున్నారు. దూదిలో తేమ సాకుతో ధరను వ్యాపారులు బాగా తగ్గిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం తరపున ‘భారత పత్తి సంస్థ’ (సీసీఐ) మద్దతు ధరకు పత్తిని కొంటుంది. అలాకొనే కేంద్రాలను 340 వరకు ఏర్పాటు చేయాలని కోరింది. అందులో వ్యవసాయ మార్కెట్లు ఏర్పాటు చేసినవి 34 మాత్రమే సుమా ! మిగిలిన 306 కేంద్రాలను జిన్నింగ్ మిల్లులో పెట్టాలని నిర్ణయించారు. మిల్లు యాజమాన్యాలు మద్దతు ధర ఇస్తారనేది అందని ద్రాక్షేనని రైతులు భావిస్తున్నారు. కొత్తపత్తికే మద్దతు ధర అందడం లేదు. డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా మార్కెట్లకు పత్తిపంట వస్తే, పత్తిపంట అంతటికి మద్దతు ధర ఇస్తారనడం రైతులు నమ్మలేకపోతున్నారు. ప్రభుత్వం ప్రతిరైతుకు మద్దతు ధర చెల్లించి పత్తి కొనుగోలు చేసేలా వెంటనే జాగ్రత్త తీసుకోవాలి. ఇది ఇలా వుంటే ? అందరికీ మద్దతు ధర ఇచ్చినా క్వింటాలుకు రైతు పెట్టిన వ్యయాన్ని ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ. 9,502. కేంద్రం ఇస్తున్న మద్దతు ధర రూ. 5,550. ఈ లెక్కన చూసినా క్వింటాలుకు రూ. 4,000 నష్టాన్ని రైతులు పెట్టుబడిలోనే భరిస్తున్నారు. ఇలా ఇట్టి వ్యయాన్ని లెక్కించినపుడు నష్టాల బారిన రైతాంగం పడక తప్పదు. రైతులు పండించే అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధరను కల్పించాల్సి ఉంది. రాయితీలు మాత్రమే కాదు? మార్కెట్ల మాయాజాలం, కల్తీ విత్తనాలు, పురుగు మందులు ఇలా అన్ని స్థాయిల్లో దోపిడీని నివారించినప్పుడే రైతులు వ్యవసాయం చేయగలుగుతారు. ఈ సంవత్సరం భారీగా పత్తి ఉత్పత్తి రాబోతున్న వేళ... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేలుకోకపోతే చాలా విపత్కర పరిస్థితికి కారకులవుతారని గమనించండి. రైతుల పంటలకు స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు పెట్టుబడికి కనీసం 150 శాతం వచ్చేలా ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించాలి. ఆ ధరకు మార్కెట్లో వ్యాపారులు కొనుగోలు చేయని ఎడల ఎలాంటి షరతులు పెట్టకుండా రైతుల వద్ద నుండి ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలి. రైతు పెట్టుబడికి మద్దతు ధరకు మధ్య క్వింటాలుకు రూ. 4,000 వరకు నష్టపోతున్నందువల్లనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అన్ని ఉత్పత్తులకు అండగా ఉంటున్న పాలకులు రైతు ఉత్పత్తులకు ఎందుకు అండగా ఉండరు? రైతుకు భిక్షం వేసినట్టు కేంద్రం మద్దతు ధర రూ. 100, రూ. 200 పెంచుతూ పోవడం భావ్యం కాదు. మట్టిని నమ్ముకున్న రైతు నోట మట్టికొట్టే విధానాలు మారనంత కాలం రైతు కుటుంబాల్లో వెలుగులు రావు. పత్తి రైతుల మద్దతు ధరకు ఉత్పత్తి వ్యయానికి మధ్య అగాధాన్ని పూడ్చాలి. వ్యవసాయాన్ని లాభాలబాట పట్టించాలి. రైతు ఆత్మహత్యలను నివారించాల్సిన బాధ్యత ప్రస్తుత పాలకులదే. మేకిరి దామోదర్ వ్యాసకర్త రచయిత, ఉపాధ్యాయుడు మొబైల్ : 95736 66650 -
ట్రాక్టర్‌తో తొక్కించి.. కల్టివేటర్‌తో చుట్టేసి..
సారంగాపూర్ (జగిత్యాల): ఆస్తి ముందు వారికి అనుబంధాలు కనిపించలేదు. భర్తతో కలసి కూతురే తన తండ్రి ప్రాణాలను తీసింది. ఆదివారం జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలో ఈ దారుణ సంఘటన జరిగింది. సారంగాపూర్ మండలం రేచపల్లికి చెందిన పూరెల్లి మల్లయ్య(48) కుమార్తె జల అలియాస్ కావ్యను పదేళ్ల క్రితం రేచపల్లికి చెందిన దీటి కొమురయ్యకు ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ సమయంలో కట్నం కింద రెండెకరాల భూమి, రూ.5 లక్షలు ఇచ్చాడు. మల్లయ్య మిగిలిన నాలుగెకరాల భూమిని సాగు చేసుకుంటున్నాడు. అయితే ఆ నాలుగెకరాలను సైతం తామే సాగు చేసుకుంటామని అల్లుడు, కూతురు ఇటీవల దున్నారు. విషయం తెలుసుకున్న మల్లయ్య తిరిగి అదే భూమిని ట్రాక్టర్ తో దున్నించాడు. ఈ క్రమంలో అల్లుడు, కూతురు ఆదివారం ఉదయం అదే భూమిలో పసుపు, మొక్కజొన్న వేసేందుకు వెళ్లగా మల్లయ్య, అతని తండ్రి గంగారాం అక్కడికెళ్లి నిలదీశారు. ట్రాక్టర్‌కు అడ్డుగా వెళ్లి నిల్చున్నారు. దీంతో కోపోద్రిక్తురాలైన కూతురు తండ్రిని నెట్టివేసింది. అల్లుడు ట్రాక్టర్‌ను మల్లయ్య మీదికి తోలాడు. ట్రాక్టర్ అతనిమీది నుంచి దాట గానే కల్టివేటర్‌తో మల్లయ్య చనిపోయే వరకు పొలంలోనే చక్కర్లు కొట్టించాడు. ఈ విషయాన్ని గమనిస్తున్న పక్క పొలంలో ఉన్న మల్లయ్య అన్న గంగారెడ్డి అడ్డుకునేందుకు పరుగెడుతూ వస్తుండగా.. ‘రారా! మీ తమ్ముడిని చంపినట్లు నిన్ను కూడా తొక్కిస్తా..’అంటూ కొమురయ్య అరవడంతో అక్కడే పనిచేస్తున్న కూలీలు గంగారెడ్డిని అడ్డుకున్నారు. మల్లయ్య చనిపోయాడని నిర్ధారించుకున్న అల్లుడు, కూతురు ట్రాక్టర్‌పై ఇంటికెళ్లి, అక్కడి నుంచి బైక్‌పై పరారయ్యారు. అల్లుడు, కూతురు సాయంత్రం పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. -
'ఫ్రెంచ్ ఓపెన్'లో వీక్షకులకు గాయాలు
పారిస్: ఫిలిప్ చాట్రియర్ స్టేడియం వేదికగా మంగళవారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లో ముగ్గురు వీక్షకులు గాయపడ్డారు. ఈదురు గాలుల ధాటికి స్కోర్ బోర్డుకు అమర్చిఉన్న స్టీల్ షీటు జనసమూహంపై ఊడిపడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారని, చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించామని నిర్వాహకులు ప్రకటించారు. కాగా, ఈ మ్యాచ్‌లో ఫ్రెంచ్ ఆటగాడు సోంగా.. జపాన్ ప్లేయర్ నిషికోరిపై విజయం సాధించి సెమీస్‌లోకి ప్రవేశించాడు. ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌కు అర్హత సాధించడం సోంగాకు ఇది రెండోసారి.