ఉరవకొండ(అనంతపురం): రెండ్రోజుల్లో వస్తానమ్మా అన్నావ్‌గా నాన్నా.. అంతలోనే ఇలా నన్ను వదిలి వెళతావా..? నీవు నాకు కావాలి.. లే నాన్నా.. లే’ అంటూ నవ వధువు ప్రశాంతి తన తండ్రి కోకా వెంకటప్ప మృతదేహాన్ని పట్టుకుని గుండెలవిసేలా రోదించడం స్థానికులను కలచివేసింది. బళ్లారిలో కుమార్తె ప్రశాంతి వివాహ వేడుక అనంతరం దగ్గరి బంధువులతో కలిసి బీజేపీ నేత కోకా వెంకటప్పనాయుడు ఇన్నోవా వాహనంలో ఆదివారం సాయంత్రం నింబగల్లుకు వస్తుండగా బూదగవి వద్ద లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం చెందిన విషయం విదితమే. వెంకటప్ప మృతదేహాన్ని స్వగ్రామం నింబగల్లుకు సోమవారం తీసుకొచ్చారు. తండ్రిని కడసారి చూసేందుకు కర్ణాటక రాష్ట్రం దావణగెరె నుంచి నవ వధువు ప్రశాంతి, కుమారుడు సతీష్ స్వగ్రామానికి వచ్చారు. మృతదేహం వద్ద ప్రశాంతిని పట్టుకుని తల్లి దాక్షాయణి ‘నీకు ఇక నాన్న లేడమ్మా’ అంటూ రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.
ఎవరి కోసం బతకాలి...
ప్రమాదంలో మృతి చెందిన లత్తవరం గ్రామానికి చెందిన స్వాతి భర్త శ్రీధర్ రోదన వర్ణనాతీతంగా మారింది. బళ్లారిలో వివాహ వేడుకలు ముగించుకుని శ్రీధర్ తన భార్య స్వాతి, ఇద్దరు కవలలు జాహ్నవి, జశ్వంత్‌తో ఇన్నోవా వాహనం ఎక్కారు. అయితే స్వాతి తమ్ముడు అశోక్ వచ్చి ‘బావా నేను చాలా అలసిపోయాను. నీవు బైక్‌లో ఉరవకొండకు రా. నేను, అక్క, పిల్లలు ఇన్నోవాలో వెళతాం’ అని శ్రీధర్‌ను కోరాడు. ప్రమాదంలో వారంతా చనిపోవడంతో ‘నాకు ప్రాణ భిక్ష పెట్టి.. మీరంతా కానరాని లోకాలకు వెళ్లిపోతిరా’ అంటూ శ్రీధర్ విలపించాడు.
కవలల మృతితో పాఠశాలకు సెలవు
ఉరవకొండలోని ఎడిసన్ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న కవలలు జాహ్నవి, జశ్వంత్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో సోమవారం పాఠశాలకు సెలవు ఇచ్చారు.
మృత్యువులోనూ వీడని అక్కాచెల్లెళ్ల బంధం
బూదగవి రోడ్డు ప్రమాదం బ్రహ్మసముద్రం మండలం రాయలప్పదొడ్డి, పిల్లలపల్లి గ్రామాల్లో విషాదం నింపింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఈ ప్రమాదంలో మృతి చెందారు. రాయలప్పదొడ్డికి చెందిన కవలకుంట్ల లచ్చన్న, ఈరమ్మ దంపతులకు నలుగురు కుమార్తెలు సరస్వతి, శివమ్మ, సుభద్రమ్మ, దాక్షాయణి, కుమారుడు బసవరాజు ఉన్నారు. బసవరాజు రెండు నెలల క్రితం గుండెపోటుతో మరణించాడు. అక్కాచెల్లెళ్లు సరస్వతి, శివమ్మ, సుభద్రమ్మలు కోకా వెంకటప్ప కుమార్తె ప్రశాంతి వివాహానికని బళ్లారికి వెళ్లారు. ఆదివారం వేడుక ముగియగానే తిరిగింపుల ఏర్పాట్ల కోసం బంధువులతో కలిసి ఇన్నోవా వాహనంలో నింబగల్లుకు వస్తుండగా బూదగవి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తొమ్మిది మంది మరణించారు. మృతుల్లో సరస్వతి, శివమ్మ, సుభద్రమ్మ ఉన్నారు.
కడచూపునకు నోచని కుమారుడు
సుభద్రమ్మ, తిమ్మప్ప దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. వీరిది బ్రహ్మసముద్రం మండలం రాయలప్పదొడ్డి గ్రామం. కుటుంబ పెద్ద సుభద్రమ్మ భర్త తిమ్మప్ప ఏడాది క్రితం కోవిడ్‌తో మృతిచెందాడు. పెద్ద కుమార్తె భారతికి వివాహమైంది. చిన్న కుమార్తె సునీత తల్లితో కలిసి ఉంటోంది. కుమారుడు సతీష్ జర్మనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా స్థిరపడ్డాడు. తల్లి, పెద్దమ్మలు మృతి చెందారన్న విషయం తెలుసుకున్న సతీష్ వెంటనే భారత్‌కు వచ్చేందుకు బయల్దేరాడు. అయితే జర్మనీ అయితే జర్మనీ ఎయిర్‌పోర్టులో కోవిడ్ పరీక్షలు నిర్వహించగా సతీష్‌కు పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో అక్కడే నిలిచిపోయాడు.
కన్నీటి వీడ్కోలు
బూదగవి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తొమ్మిది మందికి ఆదివారం అర్ధరాత్రి ఉరవకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యాధికారులు డాక్టర్ ఎర్రిస్వామిరెడ్డి, డాక్టర్ గంగాధర్, డాక్టర్ ఆశా, గుంతకల్లుకు చెందిన డాక్టర్ రామాంజనేయులు, డాక్టర్ అబుబకర్ పోస్టుమార్టం నిర్వహించారు. సోమవారం ఉదయానికల్లా నింబగల్లుకు చెందిన బీజేపీ నేత కోకా వెంకటప్ప (58), బొమ్మనహాళ్‌కు చెందిన సరస్వతి (60), ఆమె కుమారుడు అశోక్ (35), లత్తవరానికి చెందిన స్వాతి(38), ఆమె కవల పిల్లలు జాహ్నవి, జశ్వంత్ (12), కణేకల్లు మండలం హనుమాపురానికి చెందిన రాధమ్మ (48), బ్రహ్మసముద్రం మండలం పిల్లలదొడ్డికి చెందిన శివమ్మ (35), రాయలప్పదొడ్డికి చెందిన సుభ్రదమ్మ (58) మృతదేహాలు స్వగ్రామాలకు చేరాయి. పెళ్లికని వెళ్లి విగతజీవులుగా వచ్చిన వారిని చూసి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తులు కన్నీరుపెట్టారు. అదే రోజు అంత్యక్రియలు పూర్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment