పత్తి రైతులకు పొంచి ఉన్న విపత్తు | Guest Column On Cotton Crop Farmers | Sakshi
Sakshi News home page

పత్తి రైతులకు పొంచి ఉన్న విపత్తు

Published Sun, Oct 27 2019 1:03 AM | Last Updated on Sun, Oct 27 2019 1:04 AM

Guest Column On Cotton Crop Farmers - Sakshi

భూమిలో విత్తనాలు నాటిన నాటినుండి మొదలైన రైతు కష్టాలు పంటచేతికి వచ్చి మార్కెట్‌లో పంటలను అమ్ముకునేవరకు నిత్యకృత్యంగా మారాయి. రైతులకు గిట్టుబాటు ధర లేకుండా పోతుంటే పాలకులు, అధికారులు మాత్రం ‘‘నిమ్మకు నీరెత్తనట్లుగా’’ వ్యవహరిస్తున్నారు. పత్తివిత్తనాల్లో కల్తీ, వాటి ధరలను పెంచుకుపోతున్న దోపిడీకి పాలకులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. పత్తిరైతులకు నష్టాలు విత్తనాల విక్రయంలో అధిక ధరలు నకిలీల బెడద నుండి మొదలై మార్కెట్లో మద్దతు ధర ఇచ్చే వరకు అన్ని స్థాయిల్లోనూ దోపిడీకి గురవుతున్నారు. చరిత్రలోనే అత్యధికంగా తెలంగాణలో 46.92 లక్షల ఎకరాల్లో పత్తిపంట సాగు చేశారు. ఈ పంటకు మద్దతు ధర ఇప్పించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, అన్నదాతలకు చేరడం లేదు. ఈ ఏడాది పత్తి మద్దతు ధర క్వింటాలుకు రూ. 5,550గా కేంద్రం నిర్ణయించింది.

కొత్త పత్తిపంటను రైతులు మార్కెట్టుకు తేవడం మొదలైంది. తీరా తొలిపంట ఉత్పత్తికి మార్కెట్‌లో మద్దతు ధరను వ్యాపారులు చెల్లించిన దాఖలాలు లేవు. ఇప్పుడిప్పుడే వస్తున్న కొత్తపత్తికి మద్దతు ధర లేకపోవడాన్ని బట్టిచూస్తే పంటల దిగుబడి పూర్తిస్థాయిలోకి వచ్చాక రైతులకు మద్దతు ధర లభించడం ఎండమావుల్లో నీటిని వెతుక్కున్నట్లే అనిపిస్తుంది. మార్కెట్‌లో కనిష్టంగా క్వింటాలుకు రూ. 4,221 నుంచి గరిష్టంగా రూ. 5,211 వరకు అతికష్టంమీద చెల్లిస్తున్నారు. దూదిలో తేమ సాకుతో ధరను వ్యాపారులు బాగా తగ్గిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం తరపున ‘భారత పత్తి సంస్థ’ (సీసీఐ) మద్దతు ధరకు పత్తిని కొంటుంది. అలాకొనే కేంద్రాలను 340 వరకు ఏర్పాటు చేయాలని కోరింది. అందులో వ్యవసాయ మార్కెట్లు ఏర్పాటు చేసినవి 34 మాత్రమే సుమా ! మిగిలిన 306 కేంద్రాలను జిన్నింగ్‌ మిల్లులో పెట్టాలని నిర్ణయించారు.

మిల్లు యాజమాన్యాలు మద్దతు ధర ఇస్తారనేది అందని ద్రాక్షేనని రైతులు భావిస్తున్నారు. కొత్తపత్తికే మద్దతు ధర అందడం లేదు. డిసెంబర్‌ నాటికి దేశవ్యాప్తంగా మార్కెట్లకు పత్తిపంట వస్తే, పత్తిపంట అంతటికి మద్దతు ధర ఇస్తారనడం రైతులు నమ్మలేకపోతున్నారు. ప్రభుత్వం ప్రతిరైతుకు మద్దతు ధర చెల్లించి పత్తి కొనుగోలు చేసేలా వెంటనే జాగ్రత్త తీసుకోవాలి. ఇది ఇలా వుంటే ? అందరికీ మద్దతు ధర ఇచ్చినా క్వింటాలుకు రైతు పెట్టిన వ్యయాన్ని ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ. 9,502. కేంద్రం ఇస్తున్న మద్దతు ధర రూ. 5,550. ఈ లెక్కన చూసినా క్వింటాలుకు రూ. 4,000 నష్టాన్ని రైతులు పెట్టుబడిలోనే భరిస్తున్నారు. ఇలా ఇట్టి వ్యయాన్ని లెక్కించినపుడు నష్టాల బారిన రైతాంగం పడక తప్పదు. 

రైతులు పండించే అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధరను కల్పించాల్సి ఉంది. రాయితీలు మాత్రమే కాదు? మార్కెట్ల మాయాజాలం, కల్తీ విత్తనాలు, పురుగు మందులు ఇలా అన్ని స్థాయిల్లో దోపిడీని నివారించినప్పుడే రైతులు వ్యవసాయం చేయగలుగుతారు. ఈ సంవత్సరం భారీగా పత్తి ఉత్పత్తి రాబోతున్న వేళ... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేలుకోకపోతే చాలా విపత్కర పరిస్థితికి కారకులవుతారని గమనించండి. రైతుల పంటలకు స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసుల మేరకు పెట్టుబడికి కనీసం 150 శాతం వచ్చేలా ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించాలి. ఆ ధరకు మార్కెట్‌లో వ్యాపారులు కొనుగోలు చేయని ఎడల ఎలాంటి షరతులు పెట్టకుండా రైతుల వద్ద నుండి ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలి. రైతు పెట్టుబడికి  మద్దతు ధరకు మధ్య క్వింటాలుకు రూ. 4,000 వరకు నష్టపోతున్నందువల్లనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

అన్ని ఉత్పత్తులకు అండగా ఉంటున్న పాలకులు రైతు ఉత్పత్తులకు ఎందుకు అండగా ఉండరు?  రైతుకు భిక్షం వేసినట్టు కేంద్రం మద్దతు ధర రూ. 100, రూ. 200 పెంచుతూ పోవడం భావ్యం కాదు. మట్టిని నమ్ముకున్న రైతు నోట మట్టికొట్టే విధానాలు మారనంత కాలం రైతు కుటుంబాల్లో వెలుగులు రావు. పత్తి రైతుల మద్దతు ధరకు ఉత్పత్తి వ్యయానికి మధ్య అగాధాన్ని పూడ్చాలి. వ్యవసాయాన్ని లాభాలబాట పట్టించాలి. రైతు ఆత్మహత్యలను నివారించాల్సిన బాధ్యత ప్రస్తుత పాలకులదే.

మేకిరి దామోదర్‌ 
వ్యాసకర్త రచయిత, ఉపాధ్యాయుడు
మొబైల్‌ : 95736 66650 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement