
ఈ నెలలోనే తెలంగాణ బిల్లు పెట్టాలి: జి.కిషన్‌రెడ్డి
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసైనా ఈ నెలలోనే తెలంగాణ బిల్లు సభలో ప్రవేశ పెట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
సాక్షి, వరంగల్: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసైనా ఈ నెలలోనే తెలంగాణ బిల్లు సభలో ప్రవేశ పెట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా హన్మకొండలో శుక్రవారం ‘తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన మ హాదీక్ష’ జరిగింది. కిషన్‌రెడ్డితో పాటు ఆ పార్టీ జాతీయ నాయకుడు బండారు దత్తాత్రేయ, పార్టీ శాసన సభాపక్ష నేత యెండల లక్ష్మినారాయణ, సీనియర్ నాయకులు బద్దం బాల్‌రెడ్డి, ప్రభాకర్‌తో సహా 1,100 మంది ఈ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ సీడబ్ల్యుసీలో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న తరువాత పది రోజుల్లో రాష్ట్రపతికి,వ ర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెడతామని చెప్పి, ఇప్పటివరకు పెట్టలేదని విమర్శించారు. హైదరాబాద్‌లో ఐటీని, హైటెక్ సిటీని తాను అభివృద్ధి చేశానని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పడంలో అర్థం లేదన్నారు. సీమాంధ్ర ఉద్యమానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అంతా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిదేనని ఆరోపించారు. పుండు మీద కారం చల్లినట్లుగా ముఖ్యమంత్రి హైదరాబాద్‌లో సమైక్య సభ పెట్టించారని ధ్వజమెత్తారు.
హైదరాబాద్ మినహా బంద్‌కు మద్దతు
హైదరాబాద్ మినహా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో బంద్‌కు బీజేపీ మద్దతు ఇస్తుందని కిషన్‌రెడ్డి చెప్పారు. శుక్రవారం రాత్రి హన్మకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఏపీఎన్జీవోల సభ సందర్భంగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌లో గొడవలు సృష్టించనున్నారని తమకు సమాచారం ఉందన్నారు. హైదరాబాద్‌లో ప్రశాంతత ఉండటం కోసమే అక్కడ బంద్‌లో బీజేపీ పాల్గొనడం లేదని చెప్పారు.
ఏపీఎన్జీవోల సభను వ్యతిరేకిస్తున్నా: నాగం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ఎపీఎన్జీవోల సభను బీజేపీ వ్యతిరేకించకున్నా వ్యక్తిగతంగా తాను వ్యతిరేకిస్తున్నానని ఆ పార్టీ నేత నాగం జనార్దన్‌రెడ్డి చెప్పారు.