ముందు ప్రణాళికేంటో చెప్పండి: బీజేపీ
రెండు రాష్ట్రాల అభివృద్ధిపై కేంద్ర హోంమంత్రికి బీజేపీ లేఖ
విభజన బిల్లు గడువు చెప్పకుండా, సీమాంధ్ర సమస్యలకు పరిష్కారం చూపకుండా అభిప్రాయాలు కోరటం అర్థరహితం
హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణకే కట్టుబడ్డాం
నీరు, భద్రత, ఉద్యోగాల సమస్యలను పరిష్కరించాలి
మంత్రుల బృందానికి మేం నివేదిక ఇవ్వం..
అఖిలపక్ష భేటీకి వెళ్లాలో లేదో పార్టీలో చర్చించి నిర్ణయిస్తాం
హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో వెల్లడించిన కిషన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లు ఎప్పుడు తెస్తారనే విషయమై కేంద్ర ప్రభుత్వం గడువు చెప్పకుండా, విభజన ప్రక్రియలో సమస్యల పరిష్కారాలపై కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం నిబద్ధతను కనబరచకుండా తమ అభిప్రాయాలను కోరటంలో అర్థంలేదని బీజేపీ తప్పుపట్టింది. సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధికి ఓ సమగ్ర అభివృద్ధి ప్రణాళికతో కేంద్రం ముందుకు రావాలని విజ్ఞప్తి చేసింది. ఈమేరకు పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి గురువారం కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండేకు ఒక లేఖ రాశారు. విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం విధివిధానాలపై పార్టీ తరఫున ఎలాంటి నివేదికా సమర్పించలేదు. షిండేకు మూడు పేరాలతో సంక్షిప్తంగా ఒక లేఖ మాత్రం రాశారు. ‘‘హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటుకే బీజేపీ కట్టుబడి ఉంది. రానున్న శీతాకాల సమావేశాల్లో సాధ్యమైనంత త్వరగా పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టాలన్నది మా డిమాండ్. అలాంటి బిల్లుకు మా మద్దతును పునరుద్ఘాటిస్తున్నాం.
అదే సమయంలో.. నీటి పంపిణీ, భద్రత, రక్షణ, ఉద్యోగులు, విభజనలో ఇమిడిన ఇతర అంశాల విషయంలో సీమాంధ్రులకున్న ఆందోళనలను కేంద్రం పరిష్కరించాలి. బిల్లు ఎప్పుడు తీసుకొస్తారనే విషయమై కేంద్రం ఏ గడువూ చెప్పలేదు. గడువుపై, విభజన ప్రక్రియలోని సమస్యలపై కాంగ్రెస్, కేంద్రం నిబద్ధతను కనబరచకుండా, మా అభిప్రాయాలు కోరడంలో అర్థం లేదు. సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధికి ఓ సమగ్ర అభివృద్ధి ప్రణాళికతో కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. ‘‘రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రిమండలి నియమించిన మంత్రుల బృందానికి (జీవోఎం) నివేదిక ఇవ్వం.. ఇవ్వాల్సిన పని లేదు’’ అని కిషన్‌రెడ్డి తేల్చిచెప్పారు. జీఓఎం అడిగిన 11 ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వ వైఖరేమిటో ముందు చెప్పి తర్వాత తమను అడగాలని స్పష్టంచేశారు. తెలంగాణ బిల్లును చూసిన తర్వాతే బేషరతు మద్దతు విషయం గురించి చెప్తామని పేర్కొన్నారు. ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో పార్టీ నేతలు బండారు దత్తాత్రేయ, నాగం జనార్దన్‌రెడ్డి, ప్రభాకర్, ఎస్.కుమార్‌లతో కలిసి మీడియాతో మాట్లాడారు.
విభజన వ్యవహారంలో కేంద్రం సమతుల్యత కోల్పోయినట్టు కనిపిస్తోందని.. కాంగ్రెస్ పార్టీ ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ‘‘జీవోఎం ఏదో ప్రశ్నపత్రం ఇస్తే రాజకీయ పార్టీలు సమాధానం ఇవ్వాలా? అయినా.. ముందు కేంద్రం తానేం చేయదల్చుకుందో చెప్పాలి కదా! అసలు కాంగ్రెస్ పార్టీలోనే స్పష్టత లేదు. కేంద్ర కేబినెట్‌లో తీర్మానం చేసిన మంత్రులే బయటో మాట లోపలో మాట మాట్లాడుతున్నారు. రాష్ట్ర విభజనపై కేంద్రానికి ఏమైనా చిత్తశుద్ధి ఉండి ఉంటే.. ఆ 11 ప్రశ్నలను ముందు వాళ్ల సీఎంకు, కాంగ్రెస్ మంత్రులు, నేతలకు పంపి సమాధానాలు రాబట్టి ఉండాల్సింది. ఆ పని చేయకుండా ప్రతిపక్షాలను ఎలా అడుగుతారు? మేమిచ్చే సమాధానాలను బట్టి మీరు నివేదికలు, బిల్లులు రూపొందిస్తారా?’’ అని ధ్వజమెత్తారు. ఇదంతా కాంగ్రెస్ నాటకమని, అందులో కిరణ్‌ది ఓ పాత్ర అని, దిగ్విజయ్ ఒక జోకరని విమర్శించారు.
పార్టీలు ఇప్పుడు గుర్తుకు వచ్చాయా?: విభజన విషయంలో ఈ-మెయిళ్లు పంపమనడమేమిటని కిషన్‌రెడ్డి తప్పుపట్టారు. ‘‘ఈ-మెయిళ్లు పంపమని కోరినప్పుడు పార్టీలు, అఖిలపక్ష భేటీలు గుర్తుకురాలేదా?’’ అని నిలదీశారు. ‘‘పార్టీలను పిలిచి మాట్లాడాలని జీవోఎంకు ఇప్పుడు గుర్తుకువచ్చిందా? ముందు ఐదు పార్టీలకే ఆహ్వానాలన్నారు. ఆ తర్వాత 8 పార్టీలన్నారు. పావుగంట, 20 నిమిషాల్లో చర్చించేదేముంటుంది? చిన్న ప్రతినిధి వర్గాన్ని రమ్మని 6న లేఖ పంపారు. ఆ తర్వాత ఇద్దరే రమ్మని 7న లేఖ పంపారు. ఇప్పుడేమో ఒక్కర్నే రమ్మని షిండే చెప్తున్నారు.. ఇదేమన్నా చిన్నపిల్లల ఆటా? మీ డొల్లతనానికి, చిత్తశుద్ధి లేమికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది?’’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
పది జిల్లాల తెలంగాణకే మద్దతు: హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ బిల్లుకు తమ మద్దతు ఇస్తామని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘తెలంగాణ బిల్లుకు బేషరతుగా మద్దతిస్తారా?’ అనే ప్రశ్నకు.. ‘‘బిల్లు వచ్చిన తర్వాత చూసి చెప్తాం’’ అని ఆయన బదులిచ్చారు. ‘జీవోఎంను గుర్తిస్తారా? లేదా?’ అనే ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం చెప్పలేదు. ‘జీవోఎంకు నివేదిక ఇస్తామని చెప్పి.. ఇప్పుడెందుకు లేఖ పంపారు?’ అన్న ప్రశ్నకు.. పార్టీ కేంద్ర నాయకత్వ సూచన మేరకే నడుచుకున్నామని ఆయన బదులిచ్చారు. అసలు జీఓఎంను గుర్తిస్తారా? లేదా? 12న కలుస్తారా? లేదా? అనేదాన్ని పార్టీలో చర్చించి నిర్ణయిస్తామని చెప్పారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత బీజేపీ నేతల స్వరం మారినట్టుందని విలేకరులు పేర్కొనగా.. తమ వైఖరిలో ఎలాంటి మార్పూ లేదని చెప్పారు.
కమలం స్వరం మారిందా?: రాష్ట్ర విభజనపై బీజేపీ స్వరం మారిందా? తెలంగాణపై ఏర్పాటైన జీవోఎంకు పార్టీ తరఫున నివేదిక సమర్పించడానికి మరో రెండు రోజుల గడువు సైతం కోరిన బీజేపీ.. చివరకు అలాంటి నివేదిక ఏదీ ఇవ్వకుండా కేవలం ఒక లేఖతో సరిపెట్టడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆ లేఖ కూడా జీవోఎంకు కాకుండా.. ముందు కేంద్రం వైఖరి చెప్పాలంటూ షిండేకు రాయటంలోని ఆంతర్యమేమిటన్న ప్రశ్న వ్యక్తమవుతోంది.
జీవోఎంకు సమర్పించటానికి సుదీర్ఘ కసరత్తుతో రూపొందించిన నివేదికను పార్టీ జాతీయ నాయకులతో చర్చలు జరిపిన తర్వాత పక్కనపెట్టి.. హోంమంత్రికి లేఖ ఇవ్వటంలోనే బీజేపీ స్వరంలో మార్పు కనపడుతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విభజన అంశంలో కాంగ్రెస్ నాయకత్వం గందరగోళ వైఖరితో ముందుకెళుతుండటంతో దాన్ని ఆసరాగా తీసుకుని చివరి నిమిషంలో బీజేపీ వ్యూహం మార్చుకున్నదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విభజనకు సంబంధించి కేంద్రం, కాంగ్రెస్ ఎటువంటి విధానాలు అవలంభిస్తుందో, బిల్లు ముసాయిదా ఎలా ఉంటుందో చూసి దాని ఆధారంగా పార్లమెంటులో అంశాల వారీగా మాట్లాడాలన్నది బీజేపీ నేతల కొత్త ఎత్తుగడగా చెబుతున్నారు.