రాజ్యాంగ నిర్మాతల దూరదృష్టి | Sakshi Guest Column On BR Ambedkar and Indian Constitution | Sakshi
Sakshi News home page

రాజ్యాంగ నిర్మాతల దూరదృష్టి

Published Tue, Nov 26 2024 12:15 AM | Last Updated on Tue, Nov 26 2024 12:15 AM

Sakshi Guest Column On BR Ambedkar and Indian Constitution

1947 ఆగస్ట్‌ 29న ఏర్పడిన రాజ్యాంగ రచనా సంఘం సభ్యులు: డి.పి.ఖైతాన్, సయ్యద్‌ మొహమ్మద్‌ సాదుల్లా, బి.ఆర్‌.అంబేడ్కర్‌(చైర్మన్‌), అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, బి.ఎన్‌.రావ్‌; (నిల్చున్నవారు): బి.ఎల్‌.మిట్టర్, కె.ఎం.మున్షీ, నరసింహ గోపాలస్వామి అయ్యంగార్‌

సందర్భం

భారతదేశ చరిత్రలో స్వాతంత్య్ర సిద్ధి ఓ ప్రత్యేకమైన సందర్భం. భారతీయుల భవిష్యత్తును నిర్దేశించిన రోజది. రాజకీయంగా స్వాతంత్య్రాన్ని పొందాం. కానీ, భారతీయ విలువలకు అనుగుణంగా స్వపరిపాలన జరగాలన్న బలమైన ఆకాంక్ష భారతీయుల్లో వ్యక్తమైంది. దీనికి ప్రతిరూపంగానే, భారతీయ విలువలు, ఆదర్శాలను ప్రతిబింబించేలా పరమ పవిత్రమైన భారత రాజ్యాంగాన్ని రూపొందించుకుని, 1949 నవంబర్‌ 26 నాడు ఆమోదించుకున్న రోజు దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చింది.

నాటి నుంచి గత 75 ఏళ్లుగా భారతదేశంలో మూలవిలువలు, సామాజిక స్పృహలను ‘భారత రాజ్యాంగం’ సంరక్షిస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా, ఎప్పటికప్పుడు వ్యవస్థను పటిష్ఠపరుస్తూ ‘సజీవ పత్రం’గా నిరంతర మార్గదర్శనం చేస్తోంది. భారతీయ ఆత్మను, అస్తిత్వాన్ని సంరక్షించడం అనే రెండు అంశాల అద్భుత సమ్మేళనంగా మన రాజ్యాంగం ముందుకు నడిపిస్తోంది. రాజ్యాంగ నిర్మాతల ఈ ముందుచూపే రాజ్యాంగ సభ చర్చల్లో ప్రతిబింబించింది.

1949 సెప్టెంబర్‌ 18 నాడు భారత రాజ్యాంగ సభలో చర్చ సందర్భంగా... స్వాతంత్య్ర సమర యోధుడు, భారత జాతీయ కాంగ్రెస్‌ సభ్యుడు కల్లూరు సుబ్బారావు తన తొలి ప్రసంగంలో, రుగ్వేదంలో భారత్‌ అనే పదాన్ని వాడిన విషయాన్ని, వాయు పురాణంలో (45వ అధ్యాయం 75వ శ్లోకం) భారతదేశ సరిహద్దుల గురించి ఉన్న వివరణను తెలియజేశారు. 

‘ఇదంతు మాధ్యమం చిత్రం శుభాశుభ ఫలోదయం, ఉత్తరం యత్‌ సముద్రస్య హిమవన దక్షిణం చ యత్‌’... హిమాలయాల దక్షిణం వైపు, సముద్రానికి ఉత్తరం వైపున్న పవిత్ర భూమే భారతమాత అని అర్థం. భారత్‌ అనేది కేవలం ఒక పదం కాదు, వేలాది సంవత్సరాల ఘనమైన వార సత్వ విలువలకు సజీవ రూపం అని ఈ మాటలు స్పష్టం చేస్తున్నాయి. 

ఆనాటి కాంగ్రెస్‌ సిద్ధాంతంలో, నేటి కాంగ్రెస్‌ ఆలోచనలో నక్కకూ నాకలోకానికీ ఉన్నంత తేడా ఉంది. వారు తరచుగా భారతదేశపు నాగరిక విలువలను అవమానించేలా, దేశాన్ని ‘నెగోషి యేటెడ్‌ సెటిల్‌మెంట్‌’ అని వ్యాఖ్యానిస్తున్నారు.

1948 నవంబర్‌ 4న రాజ్యాంగ సభ చర్చలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ మాట్లాడుతూ... భారతదేశం ఓ అవిభాజ్య భూఖండం అనీ, దేశం పరిపాలనా సౌలభ్యం కొరకు వేర్వేరు రాష్ట్రాలుగా విభజించబడి నప్పటికీ... ఈ దేశ అధికారం ఒకే మూలం నుంచి ఉద్భవిస్తుందని పేర్కొన్నారు. 

రాజ్యాంగ పీఠికలో ‘సోషలిస్ట్‌’ అనే పదాన్ని చేర్చాలన్న చర్చను అంబేడ్కర్‌ వ్యతిరేకించారు. ‘రాజ్యా నికి సంబంధించిన విధానం ఎలా ఉండాలి? సామాజిక, ఆర్థిక కోణంలో సమాజ నిర్వహణ ఎలా జరగాలి? వంటి అంశాలను సమయానుగుణంగా ప్రజలే నిర్ణయించుకోవాలి’ అని స్పష్టం చేశారు. రేపటి రోజు సోషలిజం కంటే మంచి విధానాలు వస్తే, వాటిని రాజ్యాంగంలో చేర్చుకుని, అమలుచేసుకునే అవకాశం రానున్న తరాలకు ఉండాలనేది అంబేడ్కర్‌ భావన. 

ఈ సౌలభ్య విధానాన్ని సద్వినియోగం చేసుకుంటూ... 1991లో లైసెన్స్‌ రాజ్‌ నుంచి... ఉదారవాద, సరళీకృత ఆర్థిక వ్యవస్థకు బాటలు పడ్డాయి. నాడు రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగ సభ వేదిక ద్వారా చేసిన సమగ్రమైన చర్చలు... నేటికీ వివిధ అంశాలపై లోతైన అవగాహనను కల్పిస్తున్నాయి. 

రాజ్యాంగ సభలో అంబేడ్కర్‌ మాట్లాడుతూ... రాజ్యాంగంలో పేర్కొన్నట్లుగా సౌభ్రాతృత్వం, సమానత్వం పదాలు సరిగ్గా అమలై అందరికీ అభివృద్ధి ఫలాలు అందినపుడే, నిజమైన జాతిగా మనం పురోగతి సాధించినట్లుగా భావించాలన్నారు. 

2014లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అంత్యోదయ నినాదంతో, ‘సబ్‌ కా సాథ్, సబ్‌ కా వికాస్‌’ విధానంతో సమగ్ర సాధికారత కోసం పనిచేస్తున్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలిచే క్రమంలో... సాధికారత అనేది ప్రతి పౌరుడి సహజమైన జీవన విధానంగా, భారతదేశ పురోగతిలో అంతర్లీనంగా ఉన్నటువంటి అంశంగా మారిపోయింది.

ముద్ర యోజన, స్టార్టప్‌ ఇండియా వంటి కార్యక్రమాలు, స్వచ్ఛభారత్, బేటీ బచావో–బేటీ పఢావో వంటి సామాజిక ఉద్యమాలు దేశం నడుస్తున్న దిశను పునర్నిర్వచించాయి. ప్రభుత్వ నియంత్రణలో ఉండే సోషలిజం అనే భావన నుంచి ఏనాడో బయటకు వచ్చి, అందరి సంక్షేమం కోసం సామాజిక న్యాయమనే నినాదంతో ప్రతి ఒక్కరికీ విస్తృతమైన అవకాశాలు కల్పిస్తున్నాం. 

వందకుపైగా యూనికార్న్స్‌ (1 బిలియన్‌కు పైగా పెట్టుబడులున్న కంపెనీలు)తో భారత్‌ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్‌ వ్యవస్థగా అవతరించింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్‌ తయారీదారుగా నిలిచింది. వ్యాక్సిన్‌ సప్లయ్, రక్షణ రంగ ఉత్పత్తిలో గ్లోబల్‌ లీడర్‌గా మన్ననలు అందుకుంటోంది. 

దేశంలో సెమీకండక్టర్ల తయారీ ఉద్యమం ఊపందుకుంది. ఫిన్‌ టెక్, హెల్త్‌ టెక్‌ సంస్థలు అంతర్జాతీయ వేదికపై భారత గౌరవాన్ని ఇనుమ డింపజేస్తున్నాయి. త్వరలోనే ప్రపంచ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించబోతోంది.

దేశం ఇలా అన్ని రంగాల్లో అగ్రదేశాల సరసన నిలుస్తున్న సందర్భంలో, భారతీయుల సామర్థ్యంపై విశ్వాసాన్ని ఉంచకుండా, సమాజాన్ని విభజించేందుకు, సంపదను అందరికీ పంచేవిషయంలో అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నాలు జరగడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వెళ్లడమే అవుతుంది. 

ప్రతి భారతీయుడి శక్తి సామర్థ్యాలపై విశ్వాసం ఉంచి, అందరికీ కలుపుకొని ముందుకెళ్తూ, వికసిత భారత లక్ష్యాలను చేరుకోవాలని సంకల్పించుకున్న ‘అమృత కాల’మిది. వ్యక్తులకు సాధికారత కల్పించినపుడే, సుసంపన్నమైన దేశంగా ఎదగడానికి, ప్రపంచానికి మరోసారి విశ్వగురుగా మారడానికి విçస్తృత అవకాశాలుంటాయి. 


జి. కిషన్‌ రెడ్డి 
వ్యాసకర్త కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి; బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement