తేలని పొత్తులు నూరుతున్న కత్తులు | worry in alliance | Sakshi
Sakshi News home page

తేలని పొత్తులు నూరుతున్న కత్తులు

Published Sun, Apr 6 2014 1:35 AM | Last Updated on Sat, Aug 18 2018 4:16 PM

తేలని పొత్తులు నూరుతున్న కత్తులు - Sakshi

తేలని పొత్తులు నూరుతున్న కత్తులు

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పొత్తులు తేలకముందే మెతుకుసీమ తెలుగు తమ్ముళ్లు- కమలనాథులు సిగపట్లు పడుతున్నారు. మొత్తం పది అసెంబ్లీ స్థానాలున్న జిల్లాలో మోజార్టీ స్థానాలు తమకే కావాలంటే.. లేదు తమకే కావాలని రెండు పార్టీల నేతలు పట్టుబడుతున్నారు.
 
ఈ నేపథ్యంలోని జిల్లా బీజేపీ నేతలు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని, సీనియర్ నేత బండారు దత్తాత్రేయను కలిసి ఆరు సీట్లు కావాలని కోరగా.. తెలుగు తమ్ముళ్లు సైతం చంద్రబాబునాయుడిని కలిసి ఆరుసీట్లు టీడీపీకే దక్కేలా చూడాలని విన్నవించారు. బీజేపీకి ఇచ్చే నాలుగు సీట్లు కూడా టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు బలం గా ఉన్న  సిద్దిపేట, అందోల్, దుబ్బాక,గజ్వేల్ స్థానాలను ఇవ్వాలని తమ్ముళ్లంతా చంద్రబాబును కోరినట్లు తెలుస్తోంది.
 
గజ్వేల్ స్థానాన్ని టీడీపీ తీసుకుని దానికి బదులుగా జహీరాబాద్ సీటు బీజేపీకి ఇవ్వాలని కూడా తెలుగు తమ్ముళ్లు బాబుకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో గుర్రుగా ఉన్న కమలనాథులు మొత్తం సీట్లు టీడీపీకి కేటాయిస్తే తాము తీర్థయాత్రలు చేసుకోవాలా? అని మండిపడుతున్నారు.
 
 పార్టీ బలపడిన వేళ..

‘తెలంగాణ బిల్లుకు మద్దతిచ్చి ప్రజలకు బాగా దగ్గరయ్యాం.. జిల్లా సమస్యలపై అనేక కార్యక్రమాలు, ఉద్యమాలు నిర్వహించాం. గతంతో పోలిస్తే... పార్టీ మారుమూల పల్లెలకు కూడా విస్తరించింది. పల్లెల్లో శాఖలు కూడా ఏర్పాటు చేశాం. పైగా మోడీ హవా నడుస్తోంది. దీనిని సద్వినియోగం చేసుకుని మెదక్ పార్లమెంటును దక్కించుకోవాలంటే పార్టీ అభ్యర్థులను మెజార్టీ అసెంబ్లీ స్థానాల్లో పోటీకి దింపాల్సిందే’ అని జిల్లా బీజేపీ నేతలు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితోపాటు సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయకు ఇటీవల విన్నవించారు.
 
జిల్లాలోని సంగారెడ్డి, పటాన్‌చెరు, దుబ్బాక, మెదక్, నర్సాపూర్, సిద్దిపేట స్థానాలు కావాలని బీజేపీ జిల్లా నేతలు అడుగుతున్నారు. ఈ సీట్లలో పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్న అభ్యర్థులు ఇప్పటికే పార్టీ అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసి బరిలో దిగుతున్నట్లు తెలిపారని, కార్యకర్తల నుంచి కూడా మంచి స్పందన ఉందని పార్టీ నాయకులు వివరించినట్లు తెలిసింది.

బీజేపీతో పోలిస్తే టీడీపీకి జిల్లాలో ఎక్కడా బలం లేదని, అందువల్లే ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావు రంగారెడ్డి జిల్లా మల్కాజ్‌గిరికి వెళ్లిపోతున్నారని జిల్లా బీజేపీ కమిటీ నేతలు రాష్ట్ర నాయకులకు నివేదించినట్లు తెలుస్తోంది. అంపశయ్య మీదున్న టీడీపీకి అడిగినన్ని టికెట్లు ఇస్తే.. ఇంతకాలం కష్టపడిన తాము తీర్థయాత్రలు చేసుకోవాల్సిందేనని కమలనాథులు చెప్తున్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలల్లోనే ఏమాత్రం ప్రజాబలం లేని టీడీపీ మీద ఆధారపడితేభవిష్యత్తు ఏముంటుందనే ప్రశ్న వారిని వేధిస్తోంది. అసలు టీడీపీతో పొత్తు ఎందుకుంటూ మండిపడుతున్నారు.
 
గ్రామ పంచాయతీ ఎన్నికలతోపాటు మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు పలుచోట్ల పోటీలో దిగారని, గతంతో పోలిస్తే ఓటు బ్యాంకు పెరిగిందని ఇంతవరకు వచ్చిన తర్వాత పార్టీకి మెజార్టీ స్థానాలు లేకపోతే నిలబడటం కష్టమని వారు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీని ప్రభావం మెదక్ ఎంపీ స్థానం మీద పడే అవకాశం ఉందని రాష్ట్ర నాయకత్వాన్ని హెచ్చరించినట్లు సమాచారం.  
 టీడీపీ అవే సీట్లు అడుగుతోంది..మరోవైపు టీడీపీ కూడా ఆ ఆరు సీట్లనే కోరుకుంటోంది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న సిద్దిపేట, దుబ్బాక, అందోల్, గజ్వేల్ సీట్లను బీజేపీకి ఇవ్వాలని జిల్లా టీడీపీ నేతలు పార్టీ అధినేత  చంద్రబాబునాయుడుకు సూచించినట్లు సమాచారం.
 
ఓ వైపు టీడీపీ, బీజేపీ పొత్తుపై ఆ పార్టీ అధినేతలు చర్చలు సాగిస్తుండగా, జిల్లా నేతలు మాత్రం ఎవరికి వారు తమకే ఎక్కువ స్థానాలు కావాలంటూ పోటీపడుతున్నారు. ఆ పొత్తులు ఎప్పుడు పొడుస్తాయో...ఏ పార్టీకి ఎన్ని సీట్లు దక్కుతాయో...లేక ఎవరికివారు పోటీలో ఉంటారో తెలియాలంటే ఇంకొన్నిరోజులు ఆగాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement