సాక్షి, హైదరాబాద్: మళ్లీ అదే సీన్..! టీడీపీ-బీజేపీ మధ్య పొత్తు చర్చలు సా..గుతూనే ఉన్నాయి. శనివారం నాడు రాత్రి పొద్దుపోయే దాకా దశలవారీగా మంతనాలు సాగినా విషయం కొలిక్కిరాలేదు. దేశం అధ్యక్షుడు చంద్రబాబుతో కమల నాయకులు విడిగా భేటీ అయినా పురోగతి లేదు. సీట్ల విషయంలో బిగుసుకున్న పీటముడి వీడక ప్రతిష్టంభన అలాగే నెలకొంది. అకాళీదల్ ఎంపీ నరేశ్ గుజ్రాల్, ఆర్‌ఎస్‌ఎస్ నేత సతీష్, బీజేపీ జాతీయ కోశాధికారి పీయూశ్ గోయల్‌లతో కలిసి ఢిల్లీ నుంచి వచ్చిన పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇన్‌చార్జి ప్రకాశ్ జవదేకర్.. టీడీపీ నేతలు సుజనాచౌదరి, ఎర్రబెల్లి, మోత్కుపల్లి, రమణలతో శనివారమంతా పలుమార్లు చర్చలు జరిపారు. కీలక నియోజకవర్గాలు తమకంటే తమకేనంటూ ఇరుపక్షాలూ మంకుపట్టు పట్టాయి.
దీంతో చర్చల్లో ముందడుగు పడక పొత్తుపై హైడ్రామా కొనసాగుతూనే ఉంది. పీయూశ్ గోయల్ తొలుత చంద్రబాబు ఇంటికి వెళ్లి కొద్దిసేపు చర్చించారు. ఆ తర్వాత సీన్ బేగంపేటలోని ఓ స్టార్ హోటల్‌లోకి మారింది. అక్కడ ఇరు పార్టీల నేతలు సాయంత్రం వరకు సుదీర్ఘ మంతనాలు జరిపారు. టీ-బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, సీనియర్ నేత దత్తాత్రేయ కూడా ఇందులో పాల్గొన్నారు. రాత్రికి మళ్లీ చంద్రబాబు ఇంట్లో బీజేపీ బృందంతో చర్చలు జరిగినా ప్రతిష్టంభన వీడలేదు. బీజేపీ పోటీ చేసే స్థానాలకు సంబంధించి 33 నియోజకవర్గాలపై గతంలోనే స్పష్టత వచ్చింది. అవి కాకుండా మిగిలిన వాటిల్లో రెండు పార్టీల మధ్య సయోధ్య కుదరడం లేదు. కిషన్‌రెడ్డి ముందునుంచి అడుగుతున్న మహేశ్వరం, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, పటాన్‌చెరు, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, బోధన్, పెద్దపల్లి, సూర్యాపేట, భూపాలపల్లి నియోజకవర్గాలను ఇచ్చేందుకు దేశం నేతలు ససేమిరా అంటున్నారు. దీంతో శనివారం వీటిల్లోంచి కొన్ని పేర్లను తొలగించి మరికొన్నింటిని జతజేసి కొత్త జాబితాను కిషన్‌రెడ్డి అందించారు. దానిపై కూడా స్పష్టత రాలేదు. దీంతో ఇక ఆదివారమే వీటిపై మరోసారి చర్చించి పట్టువిడుపుల ధోరణిలో ఏకాభిప్రాయానికి రావాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయించారు.