
73వ రోజు ధర్నాలతో దద్దరిల్లిన సీమాంధ్ర
సాక్షి నెట్‌వర్క్ : ఫైలిన్ తుపాను హెచ్చరికలు.. ఈదురుగాలులు.. అక్కడక్కడా భారీవర్షాలు.. అయినా సరే లెక్కచేయని సీమాంధ్ర ప్రజ సమైక్యాంధ్రప్రదేశ్ పరిరక్షణే లక్ష్యంగా ఉప్పెనంత ఉద్యమంతో కదంతొక్కుతోంది. రాష్ర్టం ఒక్కటిగా ఉంచాలని కోరుతూ కోస్తా, రాయలసీమ ప్రజలు వరుసగా 73వ రోజైన శుక్రవారం కూడా ఆందోళనలు చేపట్టారు.
జాతీయ రహదారి దిగ్బంధం
పశ్చిమ గోదావరి జిల్లా కలపర్రు టోల్‌గేట్ వద్ద సమైక్యవాదులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. తాడేపల్లిగూడెంలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ప్రత్తిపాడు జంక్షన్ వద్ద రాస్తారోకో చేపట్టారు. భీమవరంలో జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు మానవహారం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పశు సంవర్థక శాఖ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో పశువుల ఆస్పత్రి వద్ద తప్పెటగుళ్లు కళాకారులు సమైక్యాంధ్ర గీతాలను ఆలపిస్తూ ప్రదర్శన చేశారు. వివిధ శాఖల రాష్ర్ట నాయకులు కాకినాడ కలెక్టరేట్ వద్ద దీక్షల్లో పాల్గొన్నారు. ఉప్పలగుప్తంలో నలుగురు ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో జేఏసీ సభ్యులు మోకాళ్లపై నిల్చుని నిరసన వ్యక్తం చేశారు. నక్కపల్లిలో ఏపీఎన్‌జీవోల దీక్షలు కొనసాగుతున్నాయి. గాజువాకలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. విజయనగరం జిల్లా గంట్యాడలో సాక్షర భారత్ కోఆర్డినేటర్లు నిరసన ర్యాలీ చేశారు. గజపతినగరంలో విజయనగరం-సాలూరు జాతీయ రహదారిని దిగ్బంధించి రాస్తారోకో చేశారు. పార్వతీపురంలో మహిళా ఉద్యోగులు మోకాళ్లపై నిల్చొని నిరసన వ్యక్తం చేశారు.
బతుకమ్మ ఆటతో సమైక్య స్ఫూర్తి
చిత్తూరులో న్యాయశాఖ ఉద్యోగులు బతుకమ్మ ఆడి సమైక్యస్ఫూర్తిని ప్రదర్శించారు. పీలేరులో జేఏసీ నాయకులు రాష్ట్ర విభజన జరిగితే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మృగ్యమై తెలంగాణ వాదుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తుందన్న ఇతిృత్తంతో లఘునాటికను ప్రదర్శించారు. చంద్రగిరిలో సమైక్యవాదులు బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయాన్ని ముట్టడించారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో జేఏసీ ఆధ్వర్యంలో వందలాది మంది డ్వాక్రా మహిళలు సోనియా, కేంద్రమంత్రుల ఫ్లెక్సీలను చాటలు, పొరకలతో కొడుతూ పురవీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. పులివెందులలో సమైక్యవాదులు మోకాళ్లపైనడుస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరులో 21 మంది సమైక్యవాదులు చేపట్టిన ఆమరణ దీక్ష 5వ రోజుకు చేరింది. అనంతపురం, గుంతకల్లులో సోనియాగాంధీ, దిగ్విజయ్‌సింగ్‌లకు వ్యతిరేకంగా ప్రదర్శన చేశారు. కర్నూలులో ఆర్‌అండ్‌బీ ఉద్యోగులు స్థానిక ఎస్‌ఈ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
విద్యార్థి గర్జన
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలో విద్యార్థి గర్జన పేరిట భారీసభ నిర్వహించారు. నెల్లూరులో ఎన్‌జీఓ భవన్‌లో ప్రభుత్వ వైద్యులు దీక్షలు నిర్వహించారు. ఉదయగిరిలో జేఏసీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. వెంకటగిరిలో సోనియా, దిగ్విజయ్‌సింగ్, ఆనం రామనారాయణరెడ్డి దిష్టిబొమ్మలను కోడిగుడ్లతో కొట్టారు. విజయవాడలో విద్యార్థినులు ప్రదర్శన నిర్వహించారు. జగ్గయ్యపేటలో ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలకు వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను మద్దతు తెలిపారు. పామర్రులో విద్యార్థులు మానవహారం, ర్యాలీ చేశారు. గుంటూరులో ఏపీఎన్జీవోలు బైక్ ర్యాలీ నిర్వహించారు. అత్తలూరు, పిడుగురాళ్ళ, దాచేపల్లిలో ముస్లింలు రోడ్డుపై నమాజ్‌చేసి రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ప్రార్ధించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎన్‌జీఓలు కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. కనిగిరిలో కాపు, బలిజ సామాజికవర్గానికి చెందిన వారు ర్యాలీ నిర్వహించారు.
18 నుంచి వరుస ఆందోళనలు
ప్రైవేటు విద్యా సంస్థల జేఏసీ ప్రకటన
సాక్షి, విజయవాడ : సమైక్య ఉద్యమాన్ని ఈ నెల 18వ తేదీ నుంచి వరుస ఆందోళనలు చేపట్టి మరింత ఉధృతం చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విద్యా సంస్థల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ప్రకటించింది. శుక్రవారం విజయవాడలో విద్యాసంస్థల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థి నేతలు, సమైక్యాంధ్ర ఉద్యమ నేతలు ఎల్.రత్తయ్య, చిగురుపాటి వరప్రసాద్, ప్రొఫెసర్ శామ్యూల్, ప్రొఫెసర్ నర్సింహారావు, చలసాని శ్రీనివాస్, ఎ.కిశోర్, పున్నం రాజు తదితరులు సమావేశమై జేఏసీ ఏర్పాటుచేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆందోళనల్లో భాగంగా ఒకరోజు రాత్రంతా జనజాగరణ చేపడతామని, మరో రోజు పెట్రోల్ బంకులను మూయించివేస్తామని, ఇంకో రోజు ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడించి మౌనప్రదర్శన చేస్తామని చెప్పారు. 22 నుంచి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూయించివేస్తామన్నారు. అన్ని జేఏసీలను కలుపుకొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేస్తామన్నారు. కాగా, కృష్ణాజిల్లా వ్యాప్తంగా ఎక్సైజ్‌శాఖ అధికారులు, ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి సహాయ నిరాకరణ ప్రారంభమైంది. సమైక్యాంధ్ర కోరుతూ గురువారం అర్ధరాత్రి నుంచి విధులు బహిష్కరిస్తూ ఉద్యమ బాట పట్టారు.
విజయనగరం ప్రశాంతం
నేడు పగటి పూట కర్ఫ్యూ ఎత్తివేత
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఆందోళనలతో అట్టుడికిన విజయనగరంలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చింది. శుక్రవారం ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటుచేసుకోలేదు. ఉదయం ఏడు నుం చి సాయంత్రం నాలుగు గంటల వరకూ కర్ఫ్యూ సడలించడంతో ప్రజలు పెద్దఎత్తున వీధుల్లోకి వచ్చి కొనుగోళ్లు చేశారు. వారం రోజుల తరువాత బ్యాంకులు తెరవడంతో కౌంటర్ల వద్ద ఖాతాదారులు బారులు తీరారు. ఆలయాలు సైతం వారం రోజుల తరువాత తెరచుకోవడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వెళ్లి పూజలు నిర్వహించారు. కాగా, విధ్వంసానికి సంబంధించి 11 ఆస్తుల ధ్వంసం కేసులు, రెండు లూటీ కేసుల్లో 168 మందిని అరెస్టు చేశామని ఎస్పీ కార్తికేయ తెలిపారు. అలాగే, మరో 47 క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. శనివారం ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు కర్ఫ్యూ సడలిస్తున్నట్లు కలెక్టర్ కంతిలాల్ దండే తెలిపారు.