జోరు వర్షంలోనూ ఉద్ధృతంగా సమైక్య ఉద్యమం | samaikyandhra movement continues in heavy rain | Sakshi
Sakshi News home page

జోరు వర్షంలోనూ ఉద్ధృతంగా సమైక్య ఉద్యమం

Published Sat, Aug 17 2013 12:43 AM | Last Updated on Fri, Sep 1 2017 9:52 PM

జోరు వర్షంలోనూ ఉద్ధృతంగా సమైక్య  ఉద్యమం

జోరు వర్షంలోనూ ఉద్ధృతంగా సమైక్య ఉద్యమం

 వేర్పాటు వద్దంటూ నడిరోడ్డుపై శ్రావణ వరలక్ష్మీ పూజలు    
 రాష్ర్టం సమైక్యంగానే ఉండాలని కోరుతూ పవిత్ర శ్రావణ శుక్రవారం రోజు సీమాంధ్రలోని జిల్లాల్లో మహిళలు నడిరోడ్డుపై వరలక్ష్మీ వ్రతాలు చేపట్టారు. సామూహిక పూజలు నిర్వహించారు. అధికార కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి ‘వేర్పాటు’ ప్రకటన వచ్చిన దరిమిలా కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఎగసిన సమైక్యాంధ్ర ఉద్యమం వరుసగా పదిహేడో రోజు శుక్రవారం కూడా ఉద్ధృతంగా సాగింది. పలు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నా సమైక్యవాదులు లెక్కచేయక పోరాటాన్ని సాగించారు.     
 - సాక్షి నెట్‌వర్క్
 
 సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉప్పెనలా సాగుతోంది. ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలతో హోరెత్తిస్తున్న సమైక్యవాదుల నిరసనలకు తోడు ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె, సకజల జన అందోళనలు మిన్నంటడంతో 13జిల్లాల్లో జనజీవనం స్తంభిస్తోంది. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయూలు మూతకొనసాగుతోంది. ఆర్టీసీ సర్వీసులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులపై జనాగ్రహం కొనసాగుతోంది. సోనియాగాంధీ, పీసీసీ చీఫ్ బొత్స, చిరంజీవిల దిష్టిబొమ్మల దహనాలు, శవయాత్రలు జరుగుతూనే ఉన్నాయి. విభజన విషయంలో యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ మనసు మారాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో సమైక్య వాదులు వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు.
 
 పశ్చిమగోదావరి జిల్లా భీమవరం తాలూకాఫీస్ సెంటర్‌లో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులు, పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్‌లో మహిళలు రోడ్డుపై శ్రావణ లక్ష్మీ పూజలు చేపట్టారు. నెల్లూరులో ట్రాన్స్‌కో ఆఫీసు ఎదుట మహిళా ఉద్యోగులు వరలక్ష్మీ వ్రతం నిర్వహించి సమైక్యాంధ్ర స్లిప్‌లు పెట్టి తాంబూలాలు పంచారు. అనంతపురంలో ఉపాధ్యాయ జాక్టో చేపట్టిన దీక్షా శిబిరంలోనే మహిళా ఉపాధ్యాయులు మహాలక్ష్మి వ్రతాన్ని పాటించారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో, వైఎస్సార్ జిల్లా కడపలోనూ, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం పూజారుల ఆధ్వర్యంలోనూ సమైక్యలక్ష్మి పేరిట శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.
 
 ఎమ్మెల్యే అర్ధశిరోముండనం
 పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే టీవీ రామారావు అర్ధశిరోముండనం చేరుుంచుకుని కాంగ్రెస్ వేర్పాటు వాదంపై నిరసన తెలిపారు. కొవ్వూరులోని ఉభయగోదావరి జిల్లాల నడుమ గల రోడ్ కం రైల్ వంతెనపై  జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, వివిధ వర్గాల ప్రజలు వేలాదిగా తరలివచ్చి 3 గంటలపాటు మహాధర్నా చేశారు.
 
 విభజిస్తే వరికి ఉరే
 తణుకులో వ్యవసాయ శాఖ ఉద్యోగులు, ఎరువులు, పురుగు మందుల డీలర్లు ఎండిన వరి దుబ్బలను చేతపట్టుకుని రాష్ట్రాన్ని విభజిస్తే ‘వరి పంటకు ఉరి’ పడుతుందంటూ వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. ఈనెల 22న భీమవరంలో 50వేల మంది రైతులతో మహాసభ నిర్వమించనున్నట్లు రైతు సమాఖ్య రాష్ట్ర నాయకులు ఎంవీ సూర్యనారాయణరాజు ఆకివీడులో ప్రకటించారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాలని దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఏనాడూ ప్రయత్నించలేదని రాజకీయేతర ఐకాస చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలమోహన్‌దాస్ పేర్కొన్నారు. విశాఖలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విభజనకు వైఎస్  బీజం వేశారని కొందరు రాజకీయ నేతలు చెప్పడాన్ని తప్పుబట్టారు.
 
 వైఎస్సార్ కాంగ్రెస్ బస్సు యాత్రలు ప్రారంభం
 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి, అమలాపురం పార్లమెంటు నియోజక వర్గాల్లో బస్సు యాత్రలు ప్రారంభించారు. రాజమండ్రిలో వీఎల్ పురం సాయిబాబా ఆలయం వద్ద ఉదయం ప్రారంభమైన యాత్ర తొలిరోజు లాలాచెరువు వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వరకు జరిగింది. ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కర రామారావు, ఆదిరెడ్డి అప్పారావు, గోపాలపురం ఎమ్మెల్యే తానేటి వనిత, రాజమండ్రి పార్లమెంటరీ పార్టీ కో ఆర్డినేటర్ బొడ్డు వెంకట రమణచౌదరి తదితరులు పాల్గొన్నారు.
 
 అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ యాత్ర తొలిరోజు అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి మామిడికుదురు వరకు సాగింది. ఈ యాత్రలో  పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, పార్టీ సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, రాష్ట్ర మహిళా విభాగం కన్వీనర్ కొల్లి నిర్మల కుమారి పాల్గొన్నారు. మంత్రి తోట నరసింహం సతీమణి వాణి కాకినాడలో సాగిస్తున్న నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున భగ్నం చేసి, ఆమెను ఆస్పత్రికి తరలించారు.
 
 ఎడతెరపి లేని వర్షంలోనూ..
 శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో శుక్రవారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నా ఉద్యమకారులు ఆందోళనలు కొనసాగించారు. నెల్లూరు వీఆర్‌సీ కూడలిలో సమైక్య ఉపాధ్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఆర్‌టీసీ ఉద్యోగులు  బస్టాండు ఎదుట వంటా వార్పు నిర్వహించారు.  
 
 ఆర్టీసీ అద్దె బస్సుల ర్యాలీ
 సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో బస్సుయాత్రను శుక్రవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో ప్రారంభించారు. జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ అద్దె బస్సులతో శ్రీకాకుళంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా కేబుల్ ఆపరేటర్లు ప్రసారాలను నిలిపివేశారు.
 
 కృష్ణా కరకట్ట దిగ్బంధం
 కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలంలోని వల్లూరుపాలెంలో కేసిఆర్ దిష్టిబొమ్మతో ప్రధాన వీధుల వెంట శవయాత్ర నిర్వహించారు. అనంతరం మూడు గంటలపాటు కృష్ణా కరకట్టను దిగ్బంధించి పెద్దఎత్తన ఆందోళన చేయటంతో, భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. విజయవాడ-పులిగడ్డల మధ్య గంటలసేపు రాకపోకలు స్తంభించాయి. మచిలీపట్నంలో ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు వర్షంలో తడుస్తూనే దీక్షా శిబిరాల్లో కూర్చున్నారు.
 
 వాల్మీకుల భారీ ప్రదర్శన
 అనంతపురం జిల్లా పెనుకొండలో పార్టీలకు అతీతంగా వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో వేలాది మందితో భారీ ఎత్తున సమైక్యర్యాలీ నిర్వహించారు. హిందూపురంలో కురుబ సంఘం ఆధ్వర్యంలో, ముస్లింలు సోదలు భారీ ర్యాలీ చేపట్టారు. రాయదుర్గంలో రైతులు ఎద్దులబండ్లు కట్టుకుని పట్టణమంతా సమైక్యనినాదాలతో ర్యాలీ తీశారు. అనంతపురం నగరంలో డీఎంహెచ్‌ఓ, వైద్య ఆరోగ్యశాఖ జేఏసీ చేపట్టిన రిలేదీక్షలకు ఎమ్మెల్యే బి.గురునాథ్‌రెడ్డి సంఘీభావం ప్రకటించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎస్కేయూ విద్యార్థులు వర్శిటీ నుంచి కలెక్టరేట్ సమీపం వరకు ర్యాలీ నిర్వహించారు.
 
  వైఎస్సార్ జిల్లాలో జోరు వానలో సైతం సమైక్య ఉద్యమ హోరు తగ్గలేదు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండాజిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు, మానవహారాలు, ఆందోళనలతో హోరెత్తించారు. కడపలో, రాయచోటిలో ముస్లింలు భారీ ర్యాలీని చేపట్టి నడిరోడ్డుపైనే ప్రార్థనలు చేశారు. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కమలాపురంతోపాటు జిల్లాలో పలుచోట్ల  రహదారులను దిగ్బంధం చేశారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు  సామూహిక సెలవులు తీసుకుని రిలే నిరాహారదీక్షలు ప్రారంభించారు. చీపురుపల్లిలో రాష్ట్రానికి చెందిన  9 మంది కేంద్ర మంత్రుల ఫొటోలపై గంగిరెద్దులు అని రాసి కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి దహనం చేశారు.
 
 రక్తం చిందించైనా..
 తిరుపతి సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి జేఏసీ కన్వీనర్ డాక్టర్ సుధారాణి ఆధ్వర్యంలో శుక్రవారం సమైక్యాంధ్ర చార్ట్‌కు రక్తపు తిలకం దిద్దారు. రక్తం చిందించైనా రాష్ట్రాన్ని కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. చిత్తూరు జిల్లాలోని 13 ఆర్టీసీ డిపోల్లో బస్సులు రోడ్డెక్కలేదు. పుంగనూరులో ముస్లింలు ర్యాలీ నిర్వహించి, గోకుల్ కూడలిలో ప్రార్థనలు చేశారు.  గుంటూరు జిల్లాలో అన్నిచోట్లా వైఎస్‌ఆర్ సీపీ నేతల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. గుంటూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు, నర్సులు మహాత్ముని బాటలో మేమూ.. అంటూ నోటికి మాస్క్‌లు, చెవుల్లో దూది, కళ్లకు నల్లరిబ్బన్‌లు కట్టుకుని నిరసన తెలిపారు.
 
 జీతాలు రాకుంటే ఉద్యమం దెబ్బతింటుంది..
 ఎన్జీవోలపై టీజీ వివాదాస్పద వ్యాఖ్యలు
 కర్నూలు జిల్లాలో జోరువానలోనూ సమైక్యాంధ్ర ఉద్యమం ఉప్పెనై ఎగిసింది. కర్నూలులోని పాతబస్తీలో చిన్న వ్యాపారుల సంఘం నిర్వహించిన వంటావార్పు కార్యక్రమానికి హాజరైన మంత్రి టీజీ వెంకటేశ్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్జీవోల సమ్మెకు ఇది తగిన సమయం కాదని, వారు పునరాలోచించుకోవాలని సూచించారు. రెండు నెలలు జీతాలు రాకపోతే ఎన్జీవోల ఉద్యమం దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు. రాజకీయాల కోసం సమైక్యాంధ్ర ఉద్యమాల్లో పాల్గొనకుండా చిత్తశుద్ధితో పాల్గొనాలని సూచిం చారు. కర్నూలు నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్‌లో ప్రభుత్వ వైద్యులు, నర్సింగ్ కళాశాల విద్యార్థులు వర్షంలో తడుస్తూ మానవహారంగా ఏర్పడి రాస్తారోకో నిర్వహించారు.
 
 ఒంగోలులో ‘తెలంగాణ’ అధికారులకు సన్మానం
 ప్రకాశం జిల్లా ఒంగోలులో తెలంగాణ ప్రాంతానికి చెందిన జిల్లా విద్యాశాఖాధికారి రాజేశ్వరరావు, బీసీ సంక్షేమ శాఖ అధికారి మయూరిలను ఘనంగా సన్మానించారు.  నగర ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. చీరాలలో ఆందోళన చేస్తున్న విద్యార్థులను కొట్టారంటూ ఎపీఎన్‌జీఓల ఆధ్వర్యంలో పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించి ఆందోళనకు దిగారు. దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గిద్దలూరులో ఆందోళనకారులు అటవీశాఖ కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసం చేశారు.
 
 ఆగని మృత్యుఘోష
 శుక్రవారం ఒక్కరోజే ఆరుగురి కన్నుమూత
 సాక్షి నెట్‌వర్క్: ‘వేర్పాటు’ భయంతో ప్రాణాలు విడుస్తున్న వారి సంఖ్య ఇంకా తగ్గడం లేదు. ఒక్క శుక్రవారం రోజునే సీమాంధ్ర జిల్లాల్లో ఆరుగురు గుండెపోటుతో మృత్యువాత వడ్డారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో నాలుగు రోజులుగా చురుగ్గా పాల్గొంటున్న గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని దోబీఘాట్‌కు చెందిన పగిళ్ల నాగరాజు (24) శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందాడు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని గూబగుండం గ్రామానికి చెందిన నాగరాజు(34) టీవీలో విభజన, ఉద్యమం వార్తలు చూస్తూ గుండెపోటుతో మృత్యువాత పడ్డాడు. ఇదే జిల్లా తుగ్గలి మండలం రాంపల్లికి చెందిన పందికోన జయన్న(48) రాష్ట్రం విడిపోతే తనకు జీవనాధారం పోతుందేమోనన్న బెంగతో గుండె ఆగి శుక్రవారం కన్నుమూశాడు.
 
 సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటున్న అనంతపురం జిల్లా  నార్పల మండలం నాయునిపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ అభిమాని సాయిరాం(47), పుట్టపర్తి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన పెయింటర్ అంజన్‌రెడ్డి (36), శెట్టూరు మండలం మాకొడికి చెందిన నేసే కిష్టప్ప (42) గుండెపోటుతో మృతి చెందినట్టు కుటుంబసభ్యులు తెలిపారు.
 
 విమానం మోత!
 విజయవాడ, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావం ప్రయాణికులపై తీవ్రంగా ఉంది. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో బస్సు సర్వీసులు రద్దుచేసిన విషయం విదితమే. ఇక రైళ్ళలో విపరీతమైన రద్దీ నెలకొన్న నేపథ్యంలో విజయవాడ నుంచి ముఖ్య నగరాలకు వెళ్లే విమానాల చార్జీలు మోతమోగుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, ఖమ్మం, పశ్చిమగోదావరి జిల్లాల ప్రయాణికులకు అనువైన గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్‌వేస్ ధరలకు రెక్కలొచ్చాయి. గన్నవరం-హైదరాబాద్‌కు గతంలో ఉన్న రూ.2,600 టికెట్ రూ.7 వేలకు పెరిగింది. ఇక్కడి నుంచి హైదరాబాద్ మీదుగా ఢిల్లీ టికెట్ రూ.5,800 నుంచి రూ.12 వేలకు, బెంగళూరు టికెట్ రూ.2,700 నుంచి రూ.6 వేలకు, చెన్నైకు రూ.2,800 ఉన్న ధర దాదాపు రూ.6 వేలకు పెరిగాయి. టికెట్ల ధర మూడింతలు పెరిగినప్పటికీ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, వారి కుటుంబసభ్యులు విమానయానానికి పోటీపడుతుండటం గమనార్హం.
 
 కేశినేనీ.. ఇదేం పని?
 సాక్షి, విజయవాడ : తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తరహాలోనే ఆ పార్టీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి కేశినేని శ్రీనివాస్ (నాని) రెండు కళ్ల సిద్ధాంతం అమలు చేస్తున్నారు. సమైక్యవాదిగా ఉదయం పూట ఉద్యమంలో పాల్గొని బంద్‌లు చేయిస్తున్నారు. రాత్రయ్యేసరికి కేశినేని ట్రావెల్స్‌కు చెందిన బస్సుల్ని యథావిధిగా నడిపిస్తున్నారు. కేశినేని ట్రావెల్స్‌కు చెందిన 22 బస్సులు విజయవాడ నుంచి హైదరాబాద్, చెన్నై, కోయంబత్తూరు, బెంగళూరు, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు జోరుగా నడుస్తున్నాయి.
 
  సమైక్య ఉద్యమంలో ఆయన పాల్గొంటూనే, తనకు వచ్చే లక్షల రూపాయల ఆదాయానికి గండిపడకుండా జాగ్రత్తలు తీసుకోవడాన్ని టీడీపీ నేతలే తప్పుపడుతున్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రెండు కళ్ల సిద్దాంతంతో సీమాంధ్ర ప్రాంతంలో తలెత్తుకోలేకపోతున్నామని, ఇప్పుడు నాని వంటి వారి చర్యలతో ప్రజల్లో పార్టీ చులకనైపోతోందని ఆవేదన చెందుతున్నారు. కేశినేని ట్రావెల్స్ బస్సులు నడపటాన్ని ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆక్షేపిస్తున్నాయి. ప్రైవేటు ట్రావెల్స్ కూడా ఉద్యమంలో కలిసి రావాలని డిమాండ్ చేస్తున్నాయి. కేశినేని ట్రావెల్స్ బస్సుల్ని తొలుత ఆపేస్తే మిగిలిన ప్రైవేటు ట్రావెల్స్ కూడా ఆయన దారిలోకే వస్తాయని ఆర్టీసీ కార్మికులు పేర్కొంటున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement