Varalakshmi Vratham 2024: సిరి వరాలు | Celebrating Varalakshmi Vratham 2024 | Sakshi
Sakshi News home page

Varalakshmi Vratham 2024: సిరి వరాలు

Published Fri, Aug 16 2024 4:21 AM | Last Updated on Fri, Aug 16 2024 7:19 AM

Celebrating Varalakshmi Vratham 2024

లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. కుచేలుర నుంచి కుబేరుల వరకు అందరికీ ఆమె అనుగ్రహం కావలసిందే. ఉన్నత స్థితి, రాజరికం,  అదృష్టం, దాతృత్వం, సముజ్వల సౌందర్యం వంటి ఎన్నో ఉన్నత  లక్షణాలు కలిగిన లక్ష్మీదేవి చల్లని చూపు ప్రసరిస్తే సకల సంపదలు  పొందగలమనడంలో సందేహం లేదు.  శ్రావణ మాసం లక్ష్మీదేవికి  చాలా ప్రీతికరమైనది. ఈ మాసంలో వచ్చే శుక్రవారాలు... అందులోనూ రెండవ శుక్రవారమంటే ఇంకా ఇష్టం. ఈ రోజున వరలక్ష్మీవ్రతం చేసుకున్న వారికి సకల సంపదలూ ప్రసాదిస్తుంది ఆ చల్లని తల్లి.

మన ఇంటికి వచ్చిన అతిథిని మనం ఎలా గౌరవాదరాలతో మర్యాదలు చేస్తామో అదేవిధంగా అమ్మవారు మన ఇంటికి వచ్చిందని భావించి,  మనసు పెట్టి ఈ వ్రతాచరణ చేస్తే శుభఫలితాలు కలుగుతాయి.

సమకూర్చుకోవలసిన సామగ్రి
పసుపు, కుంకుమ, గంధం, విడి పూలు, పూలమాలలు, తమలపాకులు, వక్కలు, ఖర్జూరాలు, అగరుబత్తీలు, కర్పూరం, చిల్లర పైసలు, కండువా, రవికల బట్టలు రెండు, మామిడాకులు, అరటిపండ్లు, ఇతర రకాల పండ్లు ఐదు రకాలు, అమ్మవారి పటం, కలశం, మూడు కొబ్బరి కాయలు, తెల్ల దారం లేదా నోము దారం లేదా పసుపు రాసిన కంకణాలు రెండు, నైవేద్యం కోసం ఓపికను బట్టి ఐదు లేదా తొమ్మిది రకాల స్వీట్లు, బియ్యం, పంచామృతం లేదా పాలు, ఇంకా దీపాలు, గంట, హారతి పళ్లెం, స్పూన్లు, పళ్లేలు, నూనె, వత్తులు, అగ్గిపెట్టె, గ్లాసులు, చిన్న చిన్న గిన్నెలు.

వ్రత విధానం
వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున పొద్దున్నే లేచి తలస్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. 
ఇంట్లోని పూజామందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గువేసి, కలశం ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి ఫొటో అమర్చుకోవాలి. పూజాసామగ్రిని అంతా సిద్ధం చేసుకోవాలి. తోరాలు ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచాలి. అక్షతలు, పసుపు గణపతిని కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. ఇవన్నీ దగ్గర లేకపోతే పూజమీద మనసు నిలపడం కష్టం అవుతుంది..

ముందుగా గణపతి పూజ చేసుకోవాలి.
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవో సర్వ కార్యేషు సర్వదా
ఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందన
పూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయక

గణపతిపై అక్షతలు చల్లాలి. యధాశక్తి పూజ చేసి, స్వామికి పళ్ళుగానీ బెల్లం ముక్క గానీ నివేదించాలి. తర్వాత వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు శిరస్సున ధరించాలి. ఆ తర్వాత కలశం ఉంచి అమ్మవారిని ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచారాలతో పూజించాలి. మహాలక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి. 

అనంతరం తోరపూజ చేసుకుని, ‘బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధ్యంచ మమ సౌభాగ్యం దేహిమే రమే’ అని చదువుకుంటూ కుడిచేతికి తోరం కట్టుకోవాలి. ఆ తర్వాత వరలక్ష్మీ వ్రత కథ చదువుకొని అక్షతలు వేసుకుని, అమ్మవారికి ఐదు లేదా తొమ్మిది రకాల పిండివంటలు నైవేద్యం పెట్టాలి. ముత్తయిదువులకు తాంబూలాలు ఇచ్చిన తర్వాత పూజ చేసిన వారు తీర్థప్రసాదాలు స్వీకరించి, పేరంటాళ్లు అందరికీ తీర్థప్రసాదాలు ఇవ్వాలి. తర్వాత బంధుమిత్రులతో, పూజకు వచ్చిన వారితో కలిసి కూర్చుని భోజనం చేయాలి. రాత్రికి ఉపవసించాలి. 

ఇక్కడ ఒక విషయం చెప్పుకుందాం. అదేమంటే అమ్మవారికి ఐదు లేదా తొమ్మిది పిండివంటలు నివేదించాలి అన్నారు కదా అని ఎంతో శ్రమ పడి. ఓపిక లేకపోయినా అన్నీ చేయనక్కర లేదు. పులిహోర, పరమాన్నం, పూర్ణాలు, చలిమిడితోపాటు పానకం, వడపప్పు, అరటిపండ్లు, సెనగలు వంటి వాటిని కూడా లెక్కలోకి తీసుకోవచ్చు. 
 

తోరం ఇలా తయారు చేసుకోవాలి
తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు రాసుకోవాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటే ఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి, ఐదు లేక తొమ్మిదో పువ్వులతో ఐదులేక తొమ్మిది ముడులతో తోరాలను తయారుచేసుకుని, పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆ విధంగా తోరాలను తయారు చేసుకున్న తరువాత పూజకు సిద్ధంకావాలి.

స్త్రీలలోని సృజనకు దర్పణం ఈ వ్రతం
అది ఎలాగంటే ఆ రోజున ఒక మంచి పెద్ద కొబ్బరికాయకి వీరు కళ్లు, ముక్కు, చెవులు, నోరు తీర్చి దిద్ది తగిన ఆభరణాలతో అలంకరించి మరీ వరలక్ష్మిని సృజిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement