breaking news
god lakshmi
-
గోరంత దీపం జగమంత వెలుగు
శ్రీమహావిష్ణువు వామనావతారంలో బలి చక్రవర్తిని పాతాళ లోకానికి అణగ దొక్కి సుతల రాజ్యాధిపతిని చేసినందుకుగాను ఈ అమావాస్యను దీపావళిగా జరుపుకుంటారనీ, శ్రీరామచంద్రుడు రావణాసురుడిని వధించి శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయాదులతో అయోధ్యకేతెంచి, పట్టాభిషిక్తుడైనదీవేళే కనుక ఈ రోజును దీపావళిగా జరుపుకుంటారని, శ్రీ కృష్ణుడు సత్యభామా సమేతుడై నరకుని వధించిన సందర్భంగా ప్రజలు దీపావళి జరుపుకుంటున్నారని, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాలకు సంబంధించిన కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇంకా, పంచపాండవులు వనవాస, అజ్ఞాతవాసాలు పూర్తి చేసుకుని విజయవంతులై తిరిగి వచ్చినందుకు ఆనందంతో ప్రజలు దీపావళి జరుపుతున్నారని కూడా ప్రచారంలో ఉంది. ఆదిపరాశక్తి శుంభ నిశుంభులనే రాక్షసులను సంహరించినందుకు ఆనందంతో వెలిగించిన జ్యోతులే దీపావళి అని కూడా ప్రచారంలో ఉంది. ఇవేకాక, క్షీరసాగర సమద్భూత అయిన శ్రీ మహాలక్ష్మి శ్రీమన్నారాయణుడిని వరించినందుకు దేవతలు, మానవులు, అందరూ ఆనందోత్సాహాలతో దీపావళిని జరుపుకుంటున్నారు అని కూడా చెప్తారు. భారతీయులందరూ అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఒకటి దీపావళి. మన మహర్షులు ఏర్పరచిన పండుగలన్నీ ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువలు కలిగి, ఆచార వ్యవహారాలతో కలిసి ఉంటాయి. ఈ పండుగల వెనుక అపారమైన శాస్త్రీయత, సమాజానికి హితకరమైన అంశాలు అనేకం దాగి ఉంటాయి. కాలంలో వచ్చే మార్పులతోపాటు, ఖగోళంలో వచ్చే మార్పులను కూడా ఆధారంగా చేసుకుని మన మహర్షులు మనకు ప్రతి నెలలోనూ పండుగలను నిర్దేశించారు. అలా మన సంస్కృతికి, సంప్రదాయాలకు, నాగరికతకు, మానవతా విలువలకు ప్రతీకగా మారింది దీపావళి పండుగ. నేటి కాలంలో ప్రపంచ దేశాలలో ఎందరో దీపావళి పండుగను జరుపుకుంటున్నారు. అమెరికాలో వైట్‌హౌస్‌లో కూడా దీపావళి నాడు దీపాలు వెలిగిస్తున్నారు. ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలి పాడ్యమి, భగినీ హస్త భోజనం అని, తరువాత నాగుల చవితి, నాగ పంచమి అని – ఇన్ని రోజులు పండుగ చేసుకుంటాము.దీపావళి పండుగనాడు సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానమాచరించి, పితృ తర్పణాలివ్వటం, దానం చెయ్యటం, వత్తులు వేసి, నూనె దీపాలను వెలిగించటం, ఆకాశదీపం పెట్టటం చేస్తాం. ఆకాశదీపం పెట్టడం వల్ల దూర్రపాంతాల వారికి కూడా ఈ దీప దర్శనమవుతుంది. దాని వెలుగు మార్గ దర్శనం చేస్తుంది.మనం ప్రతిరోజు ఉభయ సంధ్యలలోను మన ఇంట్లో దీపం వెలిగిస్తాము. దీపాన్ని, దీపజ్యోతిని ఆరాధిస్తాం. ఏ శుభకార్యాలు చేసినా, ఏ వేడుకలు జరిగేటప్పుడు అయినా ముందుగా దీప ప్రజ్జ్వలన చేసి, అప్పుడు ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము. వివాహాలు కూడా అగ్నిసాక్షిగా చేసుకుంటాం, అంటే దీపం, దీపంలో ఉన్న దేవతలు మన ప్రతి కర్మకు సాక్షిభూతులుగా ఉంటారన్నమాట. వారు మనల్ని అనుగ్రహిస్తారు. కనుక దీపం వెలిగించటం అన్నది అత్యంత ప్రధానమైనదని అందరికీ తెలియజేయటానికి, అందరూ దీపాలు వెలిగించేలా చేయడానికి దీపావళి పండగను మన మహర్షులు ఏర్పాటు చేశారు. దీపం సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపం ఆశ్వయుజ బహుళ అమావాస్యకు ముందు మూడు రోజుల నుంచి ఇంటి ముందు దీపాలు పెట్టటం ప్రారంభిస్తాం. అలా వెలిగించడం ప్రారంభించిన ఈ దీపాలను కార్తీక మాసమంతా వెలిగిస్తాందీపాల కథపూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుడు దేవతలను, ధర్మాత్ములైన మానవులను హింసిస్తూ, యావద్భూమండలాన్ని క్షోభిల్లజేస్తుంటే, శ్రీమన్నారాయణడు వరాçహావతారంలో వచ్చి హిరణ్యాక్షుడిని సంహరించాడు, భూమాతను రక్షించాడు. ఆ సమయంలో భూదేవి తనకొక కుమారుడిని ప్రసాదించమని స్వామిని ప్రార్థిస్తుంది. వారి సంతానమే నరకాసురుడు. స్వామి రాక్షస సంహారం కోసం అవతరించిన తరుణంలో భూమాతకి కలిగిన పుత్రుడు కనుక, నరకుడు తమోగుణ భరితుడై రాక్షసుడయ్యాడు. అతడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి, మరణం లేకుండా వరం కోరాడు. బ్రహ్మదేవుడు అది సాధ్యం కాదని అంటే, ‘కన్నతల్లి బిడ్డలను పొరపాటున కూడా చంపదు కదా’ అని ఆలోచించి, ‘నాకు మా అమ్మ చేతిలో తప్ప మరణం లేకుండా వరం ఇవ్వండి‘ అని కోరాడు. బ్రహ్మదేవుడు తథాస్తు అన్నాడు. ఇంక తనకు చావే లేదనే భ్రమతో నరకుడు లోకకంటకుడై వేద సంస్కృతిని వ్యతిరేకిస్తూ, యజ్ఞయాగాదులు జరగకుండా అడ్డుకుంటూ, బ్రాహ్మణులను బాధిస్తూ రావణాసురుని వలె పరస్త్రీ వ్యామోహంతో 16 వేల మంది స్త్రీలను బంధించాడు. దుష్ట శిక్షణ కోసం పరమాత్మ శ్రీ కృష్ణునిగా అవతరించాడు. భూదేవి సత్యభామగా అవతరించింది. తన తల్లి అయిన సత్యభామ వదిలిన బాణాహతితో నరకుడు మృతి చెందాడు. శ్రీకృష్ణ పరమాత్మ నరకుని స్మృతిగా ఆ అమావాస్య నాడు దీపాలను వెలిగించి పండుగ చేసుకోవాలని నిర్దేశించాడు. నరకుని చెరలో ఉన్న 16,000 మంది స్త్రీలను విడిపించటమే కాక, నరకుని హస్తగతమైన ధనలక్ష్మిని విడిపించి, తన పాంచజన్య శంఖంతో, కామధేను క్షీరంతో, చతుస్సాగర జలాలతో ధనలక్ష్మికి ఈ రోజునే సామ్రాజ్య పట్టాభిషేకం చేశాడు. కనుకనే దీపావళి రోజున ప్రదోషకాలంలో లక్ష్మీపూజ చేయాలి అని శాస్త్రం చెప్తోంది. నరకుడు చనిపోయిన రోజును నరక చతుర్దశిగాను, ఆ మరునాడు అమావాస్యను దీపావళి గాను పండుగ చేసుకుంటున్నాము. నరకాసురుడి పీడ వదలగానే ప్రజలందరూ మంగళ వాద్యాలు మోగించి సత్యభామా శ్రీ కృష్ణులకు స్వాగతం చె΄్పారు. ఆ మంగళ ధ్వనులే నేటికీ బాణసంచా రూపంలో ప్రతిధ్వనిస్తున్నాయి.కొన్ని ప్రాంతాలలో బాణసంచా కాల్చి ఇంట్లోకి వచ్చాక, ఆడవాళ్ళందరూ కలిసి చేటలు, పళ్ళాలు వాయిస్తారు. అది దరిద్ర దేవతను తరిమి వేయటమన్నమాట. దీనిని ‘అలక్ష్మీ నిస్సరణము’ అంటారు. ఎలా జరుపు కోవాలంటే..?దీపావళి నాడు పితృదేవతలు సాయం సంధ్యా సమయాన ఆకాశంలో దక్షిణ దిక్కుగా వచ్చి, తమ సంతానాల గృహాలను సందర్శిస్తారట. వారికి దారి కనిపించటం కోసమే దివ్వెలు కొట్టే సంప్రదాయం ఏర్పడింది. ఇంట్లోని పెద్దవారు పిల్లలతో ఈ దివిటీను కొట్టిస్తారు. పొడుగాటి గోగు కాడలకు నూనెతో తడిపిన బట్ట వత్తులు కట్టి, వాటిని పిల్లల చేతులకిచ్చి, వారిని వీధి గుమ్మం ముందు నిలబెట్టి దివిటీలను వెలిగించి, ఆకాశంలో దక్షిణం వైపుకి చూపిస్తూ గుండ్రంగా మూడుసార్లు తిప్పి, నేలకు వేసి కొట్టిస్తూ, ‘దుబ్బు దుబ్బు దీపావళి, మళ్ళీ వచ్చే నాగుల చవితి‘ అని అనిపిస్తారు. ఆ తరువాత ఆ కాడలను ఒకపక్కగా పడేస్తారు. పిల్లల కాళ్లూ చేతులు కడిగి, కళ్ళు తడిచేతితో తుడిచి, నోరు పుక్కిలించి శుభ్రం చేసుకోమని, తరువాత ఆ పిల్లలచేత మిఠాయిలు తినిపిస్తారు. తరువాత ఇంటిల్లిపాది టపాకాయలు కాల్చడం ప్రారంభిస్తారు. బాణసంచా కాల్చటం లాంటి సంబరాలు పూర్తయ్యాక, అర్ధరాత్రి దాటాక, ఇళ్ళు వాకిళ్ళను తుడిపించుకోవాలని ధర్మశాస్త్రం చెప్తోంది.ఈసారి రికార్డ్ బ్రేక్ కావాల్సిందే!గత సంవత్సరం అక్టోబర్‌లో అయోధ్యలో 25.12 లక్షల దీపాలను వెలిగించి ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సెట్ చేసింది. తాజాగా...28 లక్షల దీపాలను వెలిగించి తన రికార్డ్‌ను తానే బ్రేక్ చేయాలనుకుంటోంది.వారణాసిలో దేవతల దీపావళిదీపావళి తరువాత పదిహేను రోజులకు వారణాసిలో దేవ దీపావళిని జరుపుకుంటారు. కార్తిక పూర్ణిమ రాత్రి గంగానది వెంబడి ఉన్న ఘాట్లు లక్షలాది దీపాలతో వెలుగుతాయి. ఆ వెలుగుల ప్రతిబింబాలు నదిలో అందమైన చిత్రాలను ఆవిష్కరిస్తాయి. గంగానదిలో స్నానం చేయడానికి దేవతలు భూమి మీదికి దిగి వచ్చిన రోజుగా ఈ రోజును జరుపుకుంటారు.దీపావళి పూట...శివాజీ కోట!దీపావళి సీజన్లో మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో శివాజీ పాలించిన కోటకు ప్రతిరూపంగా మట్టికోటలను తయారుచేయడం అనేది ఆచారం. ఈ కోటను నిర్మించే క్రమంలో బురదలో విత్తనాలు నాటుతారు. కోట చుట్టూ పచ్చదనం ఉండేలా చేస్తారు. రాత్రివేళల్లో ఈ మట్టి కోటపై చిన్న చిన్న దీపాలను వెలిగిస్తారు.దేవతలకు స్వాగతంజార్ఖండ్లో దీపావళి పండగ సందర్భంగా సోహ్రై వేడుకను జరుపుకుంటారు. ఈ వేడుకలో భాగంగా దేవతలను స్వాగతించడానికి ఘరోండాలు (మట్టి బొమ్మల ఇళ్ళు) తయారుచేస్తారు. లక్ష్మీదేవిని స్వాగతించడానికి అగరువత్తులు కాల్చుతారు. సోహ్రై వేడుకలలో పశువులకు స్నానం చేయించి పూజ లు చేస్తారు.పేడ పూసుకుని వేడుక చేసుకుంటారు!కర్నాటక, తమిళనాడు సరిహద్దులలోని గుమతాపుర గ్రామంలో దీపావళి ముగింపును పురస్కరించుకొని ‘గోరెహబ్బ’ వేడుక జరుపుకుంటారు. ఈ వేడుకలో భాగంగా మగవాళ్లు ఆవు పేడను ఒకరిపై ఒకరు విసురుకుంటారు. ఆడవాళ్లు ఒంటికి రాసుకుంటారు. ఆవుపేడలో ఔషధగుణాలు ఉన్నాయనే నమ్మకంతో ఏర్పడిన శతాబ్దాల నాటి సంప్రదాయం ఇది.– డా. సోమంచి (తంగిరాల) విశాలాక్షి. విశ్రాంత సంస్కృతాచార్య -
Varalakshmi Vratham 2024: సిరి వరాలు
లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. కుచేలుర నుంచి కుబేరుల వరకు అందరికీ ఆమె అనుగ్రహం కావలసిందే. ఉన్నత స్థితి, రాజరికం, అదృష్టం, దాతృత్వం, సముజ్వల సౌందర్యం వంటి ఎన్నో ఉన్నత లక్షణాలు కలిగిన లక్ష్మీదేవి చల్లని చూపు ప్రసరిస్తే సకల సంపదలు పొందగలమనడంలో సందేహం లేదు. శ్రావణ మాసం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. ఈ మాసంలో వచ్చే శుక్రవారాలు... అందులోనూ రెండవ శుక్రవారమంటే ఇంకా ఇష్టం. ఈ రోజున వరలక్ష్మీవ్రతం చేసుకున్న వారికి సకల సంపదలూ ప్రసాదిస్తుంది ఆ చల్లని తల్లి.మన ఇంటికి వచ్చిన అతిథిని మనం ఎలా గౌరవాదరాలతో మర్యాదలు చేస్తామో అదేవిధంగా అమ్మవారు మన ఇంటికి వచ్చిందని భావించి, మనసు పెట్టి ఈ వ్రతాచరణ చేస్తే శుభఫలితాలు కలుగుతాయి.సమకూర్చుకోవలసిన సామగ్రిపసుపు, కుంకుమ, గంధం, విడి పూలు, పూలమాలలు, తమలపాకులు, వక్కలు, ఖర్జూరాలు, అగరుబత్తీలు, కర్పూరం, చిల్లర పైసలు, కండువా, రవికల బట్టలు రెండు, మామిడాకులు, అరటిపండ్లు, ఇతర రకాల పండ్లు ఐదు రకాలు, అమ్మవారి పటం, కలశం, మూడు కొబ్బరి కాయలు, తెల్ల దారం లేదా నోము దారం లేదా పసుపు రాసిన కంకణాలు రెండు, నైవేద్యం కోసం ఓపికను బట్టి ఐదు లేదా తొమ్మిది రకాల స్వీట్లు, బియ్యం, పంచామృతం లేదా పాలు, ఇంకా దీపాలు, గంట, హారతి పళ్లెం, స్పూన్లు, పళ్లేలు, నూనె, వత్తులు, అగ్గిపెట్టె, గ్లాసులు, చిన్న చిన్న గిన్నెలు.వ్రత విధానంవరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున పొద్దున్నే లేచి తలస్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజామందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గువేసి, కలశం ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి ఫొటో అమర్చుకోవాలి. పూజాసామగ్రిని అంతా సిద్ధం చేసుకోవాలి. తోరాలు ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచాలి. అక్షతలు, పసుపు గణపతిని కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. ఇవన్నీ దగ్గర లేకపోతే పూజమీద మనసు నిలపడం కష్టం అవుతుంది..ముందుగా గణపతి పూజ చేసుకోవాలి.వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభనిర్విఘ్నం కురుమేదేవో సర్వ కార్యేషు సర్వదాఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందనపూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయకగణపతిపై అక్షతలు చల్లాలి. యధాశక్తి పూజ చేసి, స్వామికి పళ్ళుగానీ బెల్లం ముక్క గానీ నివేదించాలి. తర్వాత వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు శిరస్సున ధరించాలి. ఆ తర్వాత కలశం ఉంచి అమ్మవారిని ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచారాలతో పూజించాలి. మహాలక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి. అనంతరం తోరపూజ చేసుకుని, ‘బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధ్యంచ మమ సౌభాగ్యం దేహిమే రమే’ అని చదువుకుంటూ కుడిచేతికి తోరం కట్టుకోవాలి. ఆ తర్వాత వరలక్ష్మీ వ్రత కథ చదువుకొని అక్షతలు వేసుకుని, అమ్మవారికి ఐదు లేదా తొమ్మిది రకాల పిండివంటలు నైవేద్యం పెట్టాలి. ముత్తయిదువులకు తాంబూలాలు ఇచ్చిన తర్వాత పూజ చేసిన వారు తీర్థప్రసాదాలు స్వీకరించి, పేరంటాళ్లు అందరికీ తీర్థప్రసాదాలు ఇవ్వాలి. తర్వాత బంధుమిత్రులతో, పూజకు వచ్చిన వారితో కలిసి కూర్చుని భోజనం చేయాలి. రాత్రికి ఉపవసించాలి. ఇక్కడ ఒక విషయం చెప్పుకుందాం. అదేమంటే అమ్మవారికి ఐదు లేదా తొమ్మిది పిండివంటలు నివేదించాలి అన్నారు కదా అని ఎంతో శ్రమ పడి. ఓపిక లేకపోయినా అన్నీ చేయనక్కర లేదు. పులిహోర, పరమాన్నం, పూర్ణాలు, చలిమిడితోపాటు పానకం, వడపప్పు, అరటిపండ్లు, సెనగలు వంటి వాటిని కూడా లెక్కలోకి తీసుకోవచ్చు. తోరం ఇలా తయారు చేసుకోవాలితెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు రాసుకోవాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటే ఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి, ఐదు లేక తొమ్మిదో పువ్వులతో ఐదులేక తొమ్మిది ముడులతో తోరాలను తయారుచేసుకుని, పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆ విధంగా తోరాలను తయారు చేసుకున్న తరువాత పూజకు సిద్ధంకావాలి.స్త్రీలలోని సృజనకు దర్పణం ఈ వ్రతంఅది ఎలాగంటే ఆ రోజున ఒక మంచి పెద్ద కొబ్బరికాయకి వీరు కళ్లు, ముక్కు, చెవులు, నోరు తీర్చి దిద్ది తగిన ఆభరణాలతో అలంకరించి మరీ వరలక్ష్మిని సృజిస్తారు. -
అదృష్టం సరే అర్హతను కల్పిస్తున్నామా?
ఒక ఆలోచన ఆడపిల్లను చిట్టి తల్లి బంగారు తల్లి అంటాం మనం. అదృష్టం అంటాం మనం. అమ్మాయిది లక్ష్మీ పాదం అని మురిసిపోతాం. తల్లులకు తండ్రులకు సాధారణ స్థాయిలో ఈ మురిపెం ఉంటుంది. అయితే దీనికి ఆవల ఈ అదృష్ట దేవతకు సకల అర్హతలు అందే వీలు కల్పించడం జరుగుతున్నదా? ఆడపిల్ల చేత డబ్బు ఇచ్చి బీరువాలో దాచి పెట్టించే సెంటిమెంటు పాటించే తల్లిదండ్రులు తమ ఆర్థిక, వ్యాపార వారసత్వాలలో ఆమెకు మగ పిల్లలతో పాటు సమాన అవకాశం ఇవ్వొచ్చనే ఆలోచనకు వస్తున్నారా? ఆడపిల్ల కొన్నింటికే యోగ్యురాలు, కొన్నింటికే పరిమితం అనే ఆలోచనా చట్రం ఉన్నంత కాలం ఆమెను అదృష్టానికి చిహ్నమని ఎంత భావించినా అసలైన అదృష్టం ఆమెకు దక్కుతుందా? ఆమె అదృష్టం ఆమెతో అదృష్టం ఆమెకు సమాన అవకాశాలను కల్పించడంలోనే ఉంటుందని ఇటీవలి ఒక చర్చ సూచిస్తోంది. ఇటీవల ట్విట్టర్లో ఒక వీడియో నెటిజన్లను ఆకట్టుకుంది. ఒక తండ్రి కొత్తగా కొన్న ట్రాక్టర్ మీద తన చిన్న కుమార్తె అదృష్టానికి చిహ్నంగా ఆమె పాదముద్రలను ముద్రించాడు. కుమార్తెకు విలువనిచ్చినందుకు ఆ తండ్రిని చాలా మంది ప్రశంసించారు. ఎందుకంటే మన కుటుంబాల్లోని ఆడపిల్లలను అదృష్టానికి గుర్తుగా చూస్తారు. ఆడపిల్ల పాదం ఇటు పుట్టింటికీ, అటు అత్తగారింటికీ అత్యంత శుభాన్ని కలిగిస్తుందని విశ్వసిస్తారు. ఉత్తర భారతదేశంలో ఘరోండా (దీపావళి సందర్భంగా జరుపుకునే పూజ) సమయంలో కుటుంబంలో ఆడపిల్లలు ఉంటే దేవతలు ఆశీర్వదిస్తారని నమ్మకం ఉంది. అందులో భాగంగానే ఈ వీడియోను ట్విట్టర్ వేదికగా ఓ తండ్రి పంచుకున్నాడు. ఈ నమ్మకాలు ఆడపిల్ల ఎంత విలువైనదో చెప్పేందుకు పెద్దలు ఏర్పరిచిన సంకేతాలు అనుకోవచ్చు. ఇవి ఆడ శిశుహత్యల రేటుకు విరుద్ధంగా సానుకూల సంకేతాలను ఇస్తాయి. అయితే, రచయిత్రి, నెటిజన్ రుద్రాణి గుప్త ఈ వీడియోపై స్పందిస్తూ కొన్ని ప్రశ్నలు వేశారు. ఇవీ ఆ ప్రశ్నలు... ‘ఒక తండ్రి తన కుమార్తెను అధికంగా ప్రేమిస్తూండవచ్చు. ఆ తండ్రి మనసును మనం వేనోళ్లగా కొనియాడవచ్చు. అయితే, ఆ తండ్రి ఆమెను తన కుటుంబ వ్యాపారానికి అదృష్టంగా మాత్రమే చూసుకుంటే సరిపోతుందా?! స్త్రీని డబ్బుకు, శ్రేయస్సుకి దేవతగా కొనియాడిన తల్లిదండ్రులు నిజ జీవితంలో ఆమె ఆర్థిక సాధికారతకు మార్గం వేస్తున్నారా? కూతురును లక్ష్మీగా భావించే కుటుంబాలు తమ కుటుంబ వ్యాపారాలలో ఆమెను వారసురాలిగా, యజమానిగా ఉంచాలనే ఆలోచన కలిగి ఉన్నారా?!’ ఇవీ నెటిజన్ రుద్రాణి గుప్త సంధించిన ప్రశ్నలు. వీటితో పాటు తన కుటుంబంలోనే జరిగిన ఓ సంఘటననూ ఆమె పంచుకున్నారు. వ్యాపారానికి వారసురాలు అవగలదా?! ‘‘ఈ వీడియో నా ఇంట్లో జరిగిన ఇలాంటి సంఘటనను ఒకటి గుర్తు చేసింది. నా తండ్రి తన ట్రక్కు ఎక్కి డ్రైవర్ సీటుపై కూర్చోవడానికి నా చెల్లెలికి సహాయం చేశాడు. ఆమె వల్ల వచ్చిన అదృష్టంగా భావించి, ఆమె పుట్టినరోజున ఆ ట్రక్కు కొన్నాడు. ఆ క్షణంలో సరదాగా కొన్ని సెల్ఫీలు తీసుకున్నారు. ఎప్పుడైనా ఆమె ఆ ట్రక్కు లేదా వ్యాపారాన్ని సొంతం చేసుకుంటుందా అనే ఆలోచన నా తండ్రి ఊహల్లో కూడా వస్తుందంటే నేను నమ్మను. ‘ఆమె’ ఎప్పుడైనా వ్యాపారానికి వారసత్వంగా ఉంటుందా? ‘ఆమె’ సంపాదనతో కుటుంబం నడుస్తుందని గర్వంగా చెప్పుకునే స్థితి ఉంటుందా? ఆమె ఆత్మవిశ్వాసంతో కుటుంబ వ్యాపారాన్ని నడుపుతుందా? అంటే మనలో చాలా మంది దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే నా చెల్లెలు వివాహం చేసుకుని మరొక కుటుంబానికి పంపబడుతుందనే భావనలో నా కుటుంబం ఇప్పటికే ఉంది. అప్పుడు వ్యాపారాన్ని ఆమెకు అప్పగించే పాయింట్ ఎలా చేరుతుంది? నేను మరింత వాదించడానికి ముందు, ఓ విషయం గమనించాను. నా సోదరుడు అప్పటికే నా తండ్రి రోలింగ్ కుర్చీపై కూర్చోవడానికి వారసుడిగా సిద్ధంగా ఉన్నాడు. (నా చెల్లెలు అత్తింటికి వెళ్లినా అక్కడి వ్యాపారాల్లోనూ ఆమె ఎప్పటికీ కీలకం కాలేదు.. ఎక్కడో అరుదుగా ఎంతో శ్రమ పడితే తప్ప. అది మరో గమనించాల్సిన విషయం) సామర్థ్యం ఎంపిక కూతురికేనా?! వీడియో చూశాక రేపు ఆ కుమార్తె పెద్దయ్యాక, తండ్రి ఆమెను ట్రాక్టర్ నడపడానికి అనుమతిస్తాడా అనే ప్రశ్న దగ్గరే నా ఆలోచన ఆగిపోయింది. ఆమె ఎర్రటి పాదముద్రలతో అలంకరించబడిన ట్రాక్టర్ ఎప్పుడైనా ఆమె సాధికారతకు మాధ్యమంగా మారుతుందా? తల్లితండ్రుల ఆస్తిలో ‘ఆమె’ వాటా ఉంటుందా అని నేను నా తల్లిని అడిగినప్పుడు, ఆమె వెంటనే దానిని ఖండించింది. ఆమె సోదరుడు ఆస్తికి నిజమైన వారసుడని, దానిలో ఆమె వాటా ఐచ్ఛికమని చెప్పింది. చట్ట ప్రకారం కుమార్తె వారసురాలు అయితే, ఆమెలో సామర్థ్యం ఉందా, లేదా అని వేరొకరు ఎందుకు నిర్ణయించాలి? ఒక కొడుకు తన సామర్ధ్యం లేదా ఎంపికతో సంబంధం లేకుండా, అప్పటికే వారసుడిగా భావించబడుతున్నప్పుడు, కుమార్తె వారసురాలిగా తన సమర్థతను ఎందుకు నిరూపించుకోవాలి?! నిరుపేద కూతురు..?! మన కుటుంబాలు కుమార్తెను లక్ష్మిగా వర్ణిస్తాయన్నది కాదనలేని నిజం. కానీ, నిరుపేద కుటుంబాల్లో కూతురు చదువుకోవడానికంటే ముందు పని చేయాల్సి వస్తే ఆ కుటుంబాల్లో లక్ష్మి స్థానం ఏంటి?! కుటుంబానికి సహాయంగా పనిచేసే చాలా మంది మహిళలు, కూలీలు తమ కుమార్తెలను అదే పనిలోకి లాగడం వల్ల వారు ఆ పనుల్లోనే నైపుణ్యాలను నేర్చుకుంటున్నారు. ఆమె వయస్సు 18 ఏళ్ళకు మించి ఉంటే, కుమార్తె తనకు నచ్చిన విద్య, ఉపాధిని పొందడం కంటే కుటుంబం కోసం సంపాదించాలనే ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఇంటి లక్ష్మి కావడం అంటే ఒక స్త్రీ తన కుటుంబానికి.. ఆ కుటుంబ ఆనందానికి, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అనీ ఆ పేరుతో ఇంటి గడప లోపలే ఉండిపోవాలి అనేనా సమాజపు ఆలోచన? ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు? ప్రియమైన తల్లిదండ్రులారా మీ కుమార్తెలను అదృష్టదేవతగా చూసే బదులు ఆమెను కుటుంబంలో నిజమైన వారసురాలిగా పరిగణించండి. ఆమెను ఆర్థికంగా స్వతంత్రంగా ఎదగనివ్వండి. దాని కోసం ఆమె చేపట్టే మార్గం కూడా ఆమెకు నచ్చినదిగా ఉండాలి. ఆమెను ఎదగనివ్వండి, ఎన్నుకోనివ్వండి, సంపాదించనీయండి, పాలించనీయండి. అదృష్ట స్వరూపం అని ఓ వైపు అంటూనే మరోవైపు ‘నీకు ఇందులో హక్కు లేదు’, ‘నీవు ఆడ..పిల్లవు’ అని అంతర్లీనంగా హెచ్చరికలు జారీచేయడం ఎందుకు. ద్వంద్వ ప్రమాణాల(డబుల్ స్టాండర్స్)తో కన్ఫ్యూజ్ చేయడం ఎందుకు. ఆడపిల్లను ఆడపిల్లగానైనా ఎదగనివ్వండి.’’ ఇటీవల కోర్టులో నానుతున్న వల్లి అరుణాచలం కేసు విషయమే తీసుకుందాం. తమిళనాడులోని అంబాడి ఇన్వెస్ట్మెంట్ బోర్డ్‌లో వల్లి అరుణాచలంను నియమించాలనే ప్రతిపాదనకు వ్యతిరేకంగా మురుగప్ప (ఆమె పుట్టింటివారే) కుటుంబ సభ్యులే అధికంగా ఓటువేశారు. భారత రాజ్యాంగం ప్రకారం కుమార్తెకు తన కుటుంబం ఆస్తి, వ్యాపారాన్ని వారసత్వంగా పొందటానికి సమాన హక్కులు ఉన్నాయి. కానీ, వల్లి అరుణాచలం వంటి ప్రభావవంతమైన, విద్యావంతురాలైన స్త్రీ తన రాజ్యాంగ హక్కులను పొందటానికి సమర్థతను నిరూపించుకోవడానికి సుదీర్ఘ పోరాటం చేయవలసి వస్తే, సాధారణ కుటుంబాలు మరింత శ్రద్ధగా ఉంటాయని ఆశించవచ్చా?! వల్లి అరుణాచలం కొత్తగా కొనుగోలు చేసి ట్రాక్టర్ మీద కుమార్తె పాదముద్రలను ముద్రిస్తున్న తండ్రి – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
‘అమ్మాయిపుడితే లక్ష్మీదేవి అనుకోవాలి’
హైదరాబాద్‌సిటీ: ప్రతి ఇంట్లో అమ్మాయి పుడితే లక్ష్మీదేవి పుట్టిందనుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కె. లక్ష్మణ్ అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ.. వంట గ్యాస్ మీద సబ్సిడీ వదులుకునే పధకం మహిళలను దృష్టిలో ఉంచుకుని ప్రవేశ పెట్టినదేనని తెలిపారు. పేదలను, మహిళలను దృష్టిలో పెట్టుకునే బీజేపీ పాలన కొనసాగుతున్నదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 33 శాతం సీట్లు మహిళలకు కేటాయిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణా మంత్రివర్గంలో మహిళలకు అవకాశం లేదంటే ప్రభుత్వ వైఖరి మహిళలపట్ల ఏమిటో మీరు అర్ధం చేసుకోవాలని తెలిపారు. వారసత్వ రాజకీయాలకి బీజేపీలో అవకాశం లేదని స్పష్టం చేశారు. జాజుల గౌరీ లాంటి మహిళా కార్యకర్తను రాష్ట్ర నాయకురాలుని చేసిన ఘనత బీజేపీదేనన్నారు. 33 శాతం వాటా కోసం అందరం కృషి చేయాలన్నారు. ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేలం పంచపాండవులు లెక్క ధర్మం కోసం పోరాడుతున్నామని పేర్కొన్నారు.


