Shravan month
-
పూల ధర.. జేబులదర..
ఆలమూరు: తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన కడియపులంక పూల మార్కెట్ శ్రావణ శోభతో కళకళలాడుతోంది. పూల దిగుబడికన్నా డిమాండ్ అధికంగా ఉండటంతో ధరలు మూడింతలు పెరిగాయి. వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల కొంతకాలంగా ఇబ్బందులు పడుతున్న పూల రైతులకు ప్రస్తుత ధరలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, విజయ దశమి, దీపావళి వంటి వరుస శుభకార్యాలు, నాలుగు నెలల పాటు వివాహాలు ఉండటంతో మార్కెట్ సందడిగా మారింది. అన్ని రకాల పూలకూ డిమాండ్కడియపులంక పూల మార్కెట్లో అన్ని రకాల పూలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. చామంతి, మల్లి, జాజులు, లిల్లీ రైతులకు ప్రస్తుత ధరలు సిరుల్ని కురిపిస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే పూల ధరలు మూడు రెట్లు పెరిగినా.. తోటలు ఖాళీ అవడంతో చాలామంది రైతులు నిరుత్సాహానికి గురవుతున్నారు. జిల్లాలో సాగు చేస్తున్న కొత్త రకం చామంతి పూలకు ఎండలను తట్టుకునే శక్తి ఉండటంతో జిల్లాలో కొంతమేర పూల దిగుబడి ఆశాజనకంగా ఉంది. వాతావరణ మార్పుల ప్రభావంతో పూల తోటలు ఎండిపోయి దిగుబడి గణనీయంగా పడిపోతోంది. దీంతో స్థానికంగా పండించే పూలు అవసరాలకు సరిపోని పరిస్థితి ఏర్పడింది.దిగుమతుల వల్లే..ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని నదీ పరీవాహక ప్రాంతాల వెంబడి సుమారు 5 వేల ఎకరాల్లో వివిధ రకాల పూల సాగు జరుగుతోంది. రైతులు పండించిన పూలను కడియపులంక పూల మార్కెట్‌కు తరలించి విక్రయాలు జరుపుతారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కడియం, ఆలమూరు, ఆత్రేయపురం, రాజమహేంద్రవరం రూరల్, సీతానగరం, కె.గంగవరం, కపిలేశ్వరపురం మండలాల నుంచి నిత్యం సుమారు 20 టన్నుల పూలు కడియపులంక మార్కెట్‌కు వస్తుంటాయి. ఇదే సమయంలో ఇతర రాష్ట్రాలకు, జిల్లాలకు ఎగుమతులు జరుగుతుండటంతో పూల కొరత ఏర్పడుతోంది. దీంతో మార్కెట్ డిమాండ్‌ను అనుసరించి కడియపులంక హోల్‌సేల్ వ్యాపారులు బెంగళూరు, చెన్నై, మహారాష్ట్ర నుంచి వివిధ రకాల పూలను దిగుమతి చేసుకుంటున్నారు. దీనికితోడు వరుస శుభకార్యాలు, దిగుమతుల ప్రభావంతో పాటు రవాణా ఖర్చులు పెరిగిపోవడంతో పూల ధర పెరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.అలంకరణ పూలకు భలే డిమాండ్శుభకార్యాల్లో అలంకరణకు ఉపయోగించే జర్బరా పూలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కల్యాణ వేదికలకు అవసరమయ్యే పూలు స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో బెంగళూరు, ఊటీ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇప్పటివరకూ రూ.40 పలికిన పది పూల కట్ట ధర ప్రస్తుతం రూ.110కి చేరింది. వివాహ, శుభకార్యాల వల్ల మంటపాలు అలంకరించే వారు జిల్లా నలుమూలల నుంచి భారీ స్థాయిలో ఆర్డర్లు పెడుతున్నారు. దీంతో డెకరేషన్ పూల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.ధర ఆశాజనకంఈ సీజన్లో అన్ని రకాల పూల ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. జిల్లాలో పూల దిగుబడి తగ్గడంతో మార్కెట్‌కు రికార్డు స్థాయిలో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు జరుగుతున్నాయి. ప్రస్తుతం శుభ ముహూర్తాలు వరుసగా రావడంతో పూల ధరలు ఇంచుమించు ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. – సాపిరెడ్డి సత్తిబాబు, పూల వ్యాపారి, కడియపులంకచామంతి సాగుతో లాభాలు ఇప్పటివరకూ అంతంత మాత్రంగానే ఉన్న పూల సాగు ప్రస్తుతం లాభాలను తెచ్చిపెడుతోంది. వరుసగా వివాహాలు, పండుగలు ఉండటంతో పూల ధర ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందని ఆశిస్తున్నాం. – మందపల్లి శ్రీధర్, ఉద్యాన రైతు, బడుగువానిలంక -
Varalakshmi Vratham 2024: సిరి వరాలు
లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. కుచేలుర నుంచి కుబేరుల వరకు అందరికీ ఆమె అనుగ్రహం కావలసిందే. ఉన్నత స్థితి, రాజరికం, అదృష్టం, దాతృత్వం, సముజ్వల సౌందర్యం వంటి ఎన్నో ఉన్నత లక్షణాలు కలిగిన లక్ష్మీదేవి చల్లని చూపు ప్రసరిస్తే సకల సంపదలు పొందగలమనడంలో సందేహం లేదు. శ్రావణ మాసం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. ఈ మాసంలో వచ్చే శుక్రవారాలు... అందులోనూ రెండవ శుక్రవారమంటే ఇంకా ఇష్టం. ఈ రోజున వరలక్ష్మీవ్రతం చేసుకున్న వారికి సకల సంపదలూ ప్రసాదిస్తుంది ఆ చల్లని తల్లి.మన ఇంటికి వచ్చిన అతిథిని మనం ఎలా గౌరవాదరాలతో మర్యాదలు చేస్తామో అదేవిధంగా అమ్మవారు మన ఇంటికి వచ్చిందని భావించి, మనసు పెట్టి ఈ వ్రతాచరణ చేస్తే శుభఫలితాలు కలుగుతాయి.సమకూర్చుకోవలసిన సామగ్రిపసుపు, కుంకుమ, గంధం, విడి పూలు, పూలమాలలు, తమలపాకులు, వక్కలు, ఖర్జూరాలు, అగరుబత్తీలు, కర్పూరం, చిల్లర పైసలు, కండువా, రవికల బట్టలు రెండు, మామిడాకులు, అరటిపండ్లు, ఇతర రకాల పండ్లు ఐదు రకాలు, అమ్మవారి పటం, కలశం, మూడు కొబ్బరి కాయలు, తెల్ల దారం లేదా నోము దారం లేదా పసుపు రాసిన కంకణాలు రెండు, నైవేద్యం కోసం ఓపికను బట్టి ఐదు లేదా తొమ్మిది రకాల స్వీట్లు, బియ్యం, పంచామృతం లేదా పాలు, ఇంకా దీపాలు, గంట, హారతి పళ్లెం, స్పూన్లు, పళ్లేలు, నూనె, వత్తులు, అగ్గిపెట్టె, గ్లాసులు, చిన్న చిన్న గిన్నెలు.వ్రత విధానంవరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున పొద్దున్నే లేచి తలస్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజామందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గువేసి, కలశం ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి ఫొటో అమర్చుకోవాలి. పూజాసామగ్రిని అంతా సిద్ధం చేసుకోవాలి. తోరాలు ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచాలి. అక్షతలు, పసుపు గణపతిని కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. ఇవన్నీ దగ్గర లేకపోతే పూజమీద మనసు నిలపడం కష్టం అవుతుంది..ముందుగా గణపతి పూజ చేసుకోవాలి.వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభనిర్విఘ్నం కురుమేదేవో సర్వ కార్యేషు సర్వదాఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందనపూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయకగణపతిపై అక్షతలు చల్లాలి. యధాశక్తి పూజ చేసి, స్వామికి పళ్ళుగానీ బెల్లం ముక్క గానీ నివేదించాలి. తర్వాత వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు శిరస్సున ధరించాలి. ఆ తర్వాత కలశం ఉంచి అమ్మవారిని ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచారాలతో పూజించాలి. మహాలక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి. అనంతరం తోరపూజ చేసుకుని, ‘బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధ్యంచ మమ సౌభాగ్యం దేహిమే రమే’ అని చదువుకుంటూ కుడిచేతికి తోరం కట్టుకోవాలి. ఆ తర్వాత వరలక్ష్మీ వ్రత కథ చదువుకొని అక్షతలు వేసుకుని, అమ్మవారికి ఐదు లేదా తొమ్మిది రకాల పిండివంటలు నైవేద్యం పెట్టాలి. ముత్తయిదువులకు తాంబూలాలు ఇచ్చిన తర్వాత పూజ చేసిన వారు తీర్థప్రసాదాలు స్వీకరించి, పేరంటాళ్లు అందరికీ తీర్థప్రసాదాలు ఇవ్వాలి. తర్వాత బంధుమిత్రులతో, పూజకు వచ్చిన వారితో కలిసి కూర్చుని భోజనం చేయాలి. రాత్రికి ఉపవసించాలి. ఇక్కడ ఒక విషయం చెప్పుకుందాం. అదేమంటే అమ్మవారికి ఐదు లేదా తొమ్మిది పిండివంటలు నివేదించాలి అన్నారు కదా అని ఎంతో శ్రమ పడి. ఓపిక లేకపోయినా అన్నీ చేయనక్కర లేదు. పులిహోర, పరమాన్నం, పూర్ణాలు, చలిమిడితోపాటు పానకం, వడపప్పు, అరటిపండ్లు, సెనగలు వంటి వాటిని కూడా లెక్కలోకి తీసుకోవచ్చు. తోరం ఇలా తయారు చేసుకోవాలితెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు రాసుకోవాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటే ఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి, ఐదు లేక తొమ్మిదో పువ్వులతో ఐదులేక తొమ్మిది ముడులతో తోరాలను తయారుచేసుకుని, పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆ విధంగా తోరాలను తయారు చేసుకున్న తరువాత పూజకు సిద్ధంకావాలి.స్త్రీలలోని సృజనకు దర్పణం ఈ వ్రతంఅది ఎలాగంటే ఆ రోజున ఒక మంచి పెద్ద కొబ్బరికాయకి వీరు కళ్లు, ముక్కు, చెవులు, నోరు తీర్చి దిద్ది తగిన ఆభరణాలతో అలంకరించి మరీ వరలక్ష్మిని సృజిస్తారు. -
ఈ శ్రావణ మాసం ఇల్లుని ఇలా తీర్చిదిద్దుకుందామా!
సంప్రదాయ వేడుకలకు వేదిక శ్రావణం. కళ కళలాడే వెలుగులను మోసుకువచ్చే మాసం. తీరైన శోభను తీర్చడానికి శ్రమతోపాటు డబ్బునూ ఖర్చు పెడతారు. ఎక్కువ కష్టపడకుండా పర్యావరణ స్నేహితంగా శ్రావణ మాస వ్రతాలకు, పూజలకు ఎకోఫ్రెండ్లీ థీమ్‌తో ఇంటిని అందంగా ఎలా తీర్చిదిద్దుకోవచ్చో హైదరాబాద్ వాసి డెకార్ నిపుణులు కల్పనా రాజేష్ ఇస్తున్న సూచనలు ఇవి.. ఆకులు అల్లుకున్న గోడ ఎక్కడైతే వ్రతం పీట పెడతారో ఆ చోట గోడకు తమలపాకులు, విస్తరాకులు, మర్రి ఆకులను ఒకదానికి ఒకటి కుట్టి, సెట్ చేయవచ్చు. మధ్య మధ్యలో బంతిపూలు లేదా గులాబీలు అమర్చవచ్చు. లేదంటే, ఇరువైపులా దండ కట్టి వేలాడదీయవచ్చు. ఏది సహజంగా ఉంటుందో దానిని ఎంపిక చేసుకోవాలి. బ్యాక్‌డ్రాప్‌లో వెదురు బుట్టలను ఉపయోగించవచ్చు. ఈ బుట్టలకు పూల అలంకారం చేస్తే కళగా కనిపిస్తుంది. ఇప్పుడు చాలావరకు బ్యాక్ డ్రాప్లో వాడే కర్టెన్స్ ప్రింటెడ్‌వి వచ్చినవి వాడుతుంటారు. వాటిని ఎంపిక చేసుకుంటే మనం అనుకున్న థీమ్ రాదు. ఇక వీటిలో పాలియస్టర్వి వాడకపోవడం మంచిది. ఎకో థీమ్‌లో ఎంత పర్యావరణ హితంగా ఆలోచనను అమలు చేస్తే అంత కళ ఉట్టిపడుతుంది. రంగు రంగుల హ్యాండ్లూమ్ శారీస్‌ను కూడా బ్యాక్ డ్రాప్‌కి వాడచ్చు. వట్టివేళ్లతో తయారుచేసే తెరలు కూడా వాడచ్చు. అందమైన తోరణం... మామిడి ఆకులు చెట్టు నుంచి కోసిన తర్వాత కూడా ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. ఎలాగూ మామిడి ఆకులు తోరణం కడతారు. అలాగే, ఇప్పుడు వరికంకులతో తోరణాన్ని కట్టచ్చు. వీటిని వేడుక పూర్తయ్యాక మరుసటి రోజు బయట గుమ్మానికి అలంకారంగా వాడచ్చు. ఆ తర్వాత మట్టిలో వేస్తే ఎరువుగా మారిపోతుంది. అమ్మవారికి కట్టే చీర కూడా నారాయణ్‌పేట, ఇక్కత్ వంటి హ్యాండ్లూమ్ పట్టు చీర ఎంపిక చేసుకోవచ్చు. బ్యాక్ డ్రాప్ ఫ్రేమ్ చేసుకోవాలంటే మూడు వెదురు కర్రలు తీసుకొని, క్లాత్, అరటి ఆకులతో సెట్ చేయవచ్చు. ఇత్తడి బిందెలు .. గంటలు ఇంట్లో బిందెలు ఉంటాయి కదా... వాటిలో మట్టిని నింపి, అరటి చెట్లను సెట్ చేసుకోవచ్చు. స్టీల్ బిందె అయితే నచ్చిన క్లాత్ చుట్టి, మట్టి నింపితే చాలు. కుందులు జత అడుగు పొడవు ఉన్నవి ఎంచుకొని, రెండు వైపులా అమర్చుకోవచ్చు. ఒక వెడల్పాటి పాత్రలో బియ్యం నింపి, మధ్యలో కొబ్బరిపువ్వు సెట్ చేసి పెడితే ఎంతో అందంగా వచ్చేస్తుంది. అమ్మవారికి మల్లెపూల దండ, కలువపువ్వు మంచి కాంబినేషన్. లేదంటే గులాబీలు పెట్టుకోవచ్చు. గుమ్మం దగ్గర రెండువైపులా పాత కాలం నాటి ఇత్తడి పాత్రలు ఉంటే వాటిలో మొక్కలు పెట్టవచ్చు. ఇత్తడి గంటలు ఉంటే వాటిని డెకార్ ప్లేస్‌లో అలంకారంగా వేలాడదీయవచ్చు. అరటిగెల పెట్టచ్చు. ప్లాస్టిక్‌కు నో ఛాన్స్ ప్లాస్టిక్ పువ్వులతో వచ్చే అనర్థాలు ఎన్నో. వీటి బదులుగా బంతి, చామంతి, గులాబీ, కొబ్బరి ఆకుతో చేసిన దండలను, కాటన్ దారాలు ఉపయోగించవచ్చు. రంగవల్లికల కోసం రసాయన రంగులు వాడకుండా పువ్వులతో ముగ్గులు వేయచ్చు. ఆర్గానిక్ కలర్స్ వాడుకోవచ్చు. కింద కూర్చోవడానికి కోరాగ్రాస్ చాపలు, కలంకారీ, షోలాపూర్ బెడ్‌షీట్స్ వాడచ్చు. బొమ్మలతో భలే.. తెలుగు రాష్ట్రాల్లో మనవైన బొమ్మలు ఉన్నాయి. కొండపల్లి, నిర్మల్, చేర్యాల మాస్క్స్... ఆ బొమ్మలు పెట్టి కూడా అలంకారం చేసుకోవచ్చు. బ్రాస్ ఖరీదు ఎక్కువ అనుకుంటే టెర్రకోట ప్లాంటర్స్, గుర్రపు బొమ్మలు, మట్టి ప్రమిదలు, రంగురంగు గాజులు... వాడవచ్చు. అతిథులకు ఎకో కానుక మార్కెట్లో వెదురు బుట్టలు దొరుకుతున్నాయి. పండ్లు, పూలు వంటివి ఈ బుట్టల్లో సెట్ చేయవచ్చు. అతిథులకు అందజేయడానికి ఇవి బాగుంటాయి. రసాయనాలు కలపని ఆర్గానిక్ పసుపు, కుంకుమ ఎంచుకోవాలి. చేనేత బ్లౌజ్ పీస్ పెడితే గిఫ్ట్ ప్యాక్ రెడీ అవుతుంది. మన దగ్గర ఉన్న పర్యావరణ వస్తువులను సరిచూసుకొని, వాటితో ఎలా అలంకరణను పెంచుకోవచ్చనేది ముందుగా ఆలోచించి, ఆ విధంగా సిద్ధంగా చేసుకుంటే సంతృప్తికరమైన డిజైన్ వస్తుంది. పువ్వులు ఎక్కువ సేపు తాజాగా ఉండటానికి కెమికల్ స్ప్రే చేస్తుంటారు. థర్మోకోల్ మీద ఆకులు పెట్టి చాలా మంది ఎకో ఫ్రెండ్లీ అంటుంటారు. కానీ, మనం ఎంచుకునే థీమ్ మొత్తం తిరిగి మట్టిలో కలిసిపోయే విధంగా ఉంటేనే అది పర్యావరణ హితం అవుతుంది. – కల్పనా రాజేశ్, డెకార్‌బై కృష్ణ నిర్వాహకురాలు -
చికెన్, మటన్‌కు తగ్గిన డిమాండ్!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మాంసం, చేపల విక్రయాలకు డిమాండ్ తగ్గిపోయింది. శ్రావణ మాసంలో పడిపోయిన విక్రయాలు ఇంకా పుంజుకోలేదు. ప్రస్తుతం దుర్గామాత నవరాత్రి పూజలు, వ్రతాల వల్ల చికెన్, మటన్, చేపలకు అంతగా గిరాకీ లేకుండా పోయిందని వ్యాపారులు వ్యాఖ్యానిస్తున్నారు. సాధారణంగా ఆదివారం వచ్చిందంటే చాలు... చాలామంది అది మాంసాహార దినంగా పరిగణిస్తుంటారు. అయితే... ఈ ఆదివారం మాత్రం మాంసం, చేపల వ్యాపారులకు షాక్ ఇచ్చింది. అమ్మకాలు 30-35శాతం మేరకు పడిపోయాయి. సాధారణంగా ప్రతి ఆదివారం నగరంలో సుమారు 600-650 టన్నులకు పైగా చికెన్, 250-300 టన్నుల మటన్, 80-120 టన్నుల మేర చేపల విక్రయాలు సాగుతుంటాయి. అయితే... ఈ ఆదివారం చికెన్ 400టన్నుల లోపు అమ్ముడుపోగా, మటన్ సుమారు 180 టన్నులు, చేపలు 20 టన్నుల వరకు అమ్మకాలు సాగినట్టు వ్యాపార వర్గాల అంచనా. ఇప్పుడు దుర్గానవరాత్రి వేడుకలు జరుగుతుండటంతో చాలామంది పూజలు, వ్రతాలతో నియమ నిష్టలు పాటిస్తూ మంసాహారానికి దూరంగా ఉంటారు. ఈ కారణంగానే చికెన్, మటన్, చేపలకు డిమాండ్ పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నాయి. ముషీరాబాద్‌లోని ఒక్క దయారా ఫిష్ మార్కెట్‌కు ఆదివారం 50-60 టన్నుల చేపలు దిగుమతి అవుతుంటాయి. అయితే... ఇప్పుడు పెద్దగా వ్యాపారం లేకపోవడంతో ఆదివారం కేవలం 20 టన్నుల లోపే సరుకు దిగుమతి అయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. దిగివచ్చిన చికెన్.. చికెన్ ధరలు ఆదివారం బాగా దిగివచ్చాయి. పౌల్ట్రీ ఫారం దగ్గర లైవ్ కోడి కేజీ రూ.50లు ధర పలకగా... హోల్‌సేల్‌గా రూ.56లకు చేరింది. అదే రిటైల్ మార్కెట్లోకి వచ్చేసరికి కేజీ రూ.65ల ప్రకారం విక్రయించారు. ఇదే చికెన్ (స్కిన్‌తో) కేజీ రూ.90లకు విక్రయించగా, స్కిన్‌లెన్ రూ.110ల ప్రకారం విక్రయించారు. అలాగే మటన్ కేజీ రూ.450-500, బోన్ లెస్ రూ.650-700లకు విక్రయించగా, చేపలు రవ్వ కేజీ రూ.130, బొచ్చె రూ.120, కొరమీన్ రూ.150-800, గోల్డ్ ఫిష్ రూ.100, రొయ్య, రూ.200-250ల ప్రకారం విక్రయించారు. అయితే... నగరంలో అన్నిచోట్ల ఈ ధరలు ఒకేలా లేవు. గిరాకీని బట్టి ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ధర నిర్ణయించి సొమ్ము చేసుకున్నారు. ఒకచోట కిలో మటన్ రూ.450 ఉండగా, మరో చోట రూ.500లకు విక్రయించారు. -
శుచిభరితం...కడు రుచిభరితం
ఆకాశంలో నల్లటి మేఘాలు... నేల మీద తెల్లటి ముత్యపు చినుకులు... ఇదీ శ్రావణమాసం! వాన చినుకులు చిటపటమంటుంటే... నోటికి కూడా కరకరలు కావాలనిపిస్తుంది... పవిత్ర శ్రావణం కొందరికి ఉపవాస మాసం... కొందరికి పిండివంటల మాసం. అందుకే ఆ కొందరు, ఈ కొందరు ఆరగించడానికి వీలైన శుచిభరిత, రుచిభరిత వంటకాలను మీకు అందిస్తున్నాం. శ్రావణ మాసంలో శాకాహారం భారతీయుల క్యాలెండర్ ప్రకారం శ్రావణం వానలు దండిగా, కుంభవృష్టిలా కురుస్తూ, వరదలు వచ్చే మాసం. ఈ వానలు సాధారణంగా జూలై నెల మధ్య భాగంలోప్రారంభమై, ఆగస్టు మాసం వరకు కొనసాగుతాయి. ఎక్కువ మంది ఈ మాసంలో మాంసాహారం తీసుకోరు. ఇది మతపరంగా కంటె కూడా సంప్రదాయంగా వస్తున్న అలవాటు. శ్రావణంలో కేవలం శాకాహారం మాత్రమే తినడానికి ఆధ్యాత్మికతతో పాటు, శాస్త్రీయ కారణాలు కూడా చెబుతారు. వాటిలో ముఖ్యమైనవిగా కనపడేవి చూద్దాం... హిందువులకు శ్రావణం పవిత్ర మాసం. ఈ మాసమంతా చిన్నచితకా పండుగలు ఉంటాయి. రక్షాబంధన్, జంధ్యాల పౌర్ణమి, శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు, వరలక్ష్మీవ్రతం. ఆధ్యాత్మికంగా... శివునికి ప్రీతికరమైన మాసం. శివుని ఆరాధించడానికి పవిత్రమైన మాసం. ఈ మాసంలో ప్రత్యేకంగా శ్రావణ శివరాత్రిని నిర్వర్తిస్తారు. శ్రావణం అంటే వర్షాకాలం అని అర్థం. మామూలుగా శివరాత్రి అనేది ఫిబ్రవరి లేదా మార్చి మాసంలో వస్తుంది. ఈ శివరాత్రి మాత్రం వర్షకాలంలో వస్తుంది. ప్రతి సోమవారాన్ని శివుని ప్రీతిగా అర్చిస్తారు. ఈ సోమవారాలను శ్రావణ సోమవారాలుగా పూజిస్తారు. ఈ మాసంలో వచ్చే అన్ని సోమవారాలు ఉపవాసం ఉంటారు. అందువల్ల ఈ మాసంలో మాంసాహారం తీసుకోరు. శాస్త్రీయంగా... ఈ మాసంలో వర్షపాతం అధికంగా ఉండటం వల్ల నదులు పొంగిపొర్లుతూ, వరదలు వస్తాయి. పరిసరాలు అపరిశుభ్రంగా మారిపోతాయి. అంటువ్యాధులను వ్యాప్తి చేసే బ్యాక్టీరియా విపరీతంగా వ్యాపిస్తాయి. మాంసం మీద ఈ బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ మాసంలో మాంసం తినకుండా ఉండటం ఆరోగ్యకరమని భావిస్తారు. మరొక కారణం... అనేక జంతువులు ఈ మాసంలోనే సంతానోత్పత్తి చేస్తాయి. ఈ మాసంలో చేపలను పట్టడం నిషేధం. ఎందుకంటే చేపలన్నీ గుడ్లను తమ కడుపులో పొదువుకుని ఉంటాయి. పిల్లలకు జన్మనిచ్చే స్థితిలో ఉన్న చేపలను పట్టుకుని చంపడాన్ని పాపంగా భావిస్తారు. ఆ కారణంగా మాంసాహారం, చేపలను తినడాన్ని పాపంగా భావించి, కేవలం శాకాహారం మాత్రమే స్వీకరిస్తారు. సింఘారే కీ పూరీ కావలసినవి సింఘారా (వాటర్ చెస్ట్నట్) పిండి - 2 కప్పులు ఆలుగడ్డలు - 2 (ఉడికించి తొక్క తీసి మెదపాలి) పుదీనా ఆకులు - అర కప్పు (సన్నగా తరగాలి) వాము - అర టేబుల్ స్పూను పచ్చి మిర్చి - 2 (సన్నగా తరగాలి) ఉప్పు - తగినంత నీళ్లు - పిండి కలపడానికి తగినన్ని నూనె - డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ఒక పాత్రలో అన్ని పదార్థాలను (నీళ్లు, నూనె మినహాయించి) వేసి బాగా కలపాలి. తగినన్ని నీళ్లు జత చేసి చపాతీపిండిలా కలపాలి. బాణలిలో నూనె పోసి కాచాలి. పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి, పూరీలాగ ఒత్తాలి. ఒక్కో పూరీని నూనెలో వేసి బంగారు వర్ణంలోకి వచ్చే వరకు రెండువైపులా కాల్చి తీసేయాలి. కుట్టు కీ పూరీ కావలసినవి కుట్టు పిండి - 2 కప్పులు ఆలుగడ్డలు - 2 ఉప్పు - తగినంత నల్ల మిరియాల పొడి - అర టీ స్పూను నెయ్యి లేదా నూనె - అర కప్పు తయారీ: ముందుగా ఆలుగడ్డలను శుభ్రంగా కడిగి నాలుగు ముక్కలుగా కట్ చేసి కుకర్‌లో ఉంచి ఉడికించాలి. తొక్క తీసి మెత్తగా మెదపాలి. ఒక పాత్రలో కుట్టు పిండి, ఉప్పు, నల్ల మిరియాల పొడి, బంగాళదుంప ముద్ద వేసి గట్టిగా కలపాలి. అవసరమనుకుంటే కొద్దిగా నీళ్లు జత చేసి బాగా కలిపి సుమారు అరగంటసేపు నాననివ్వాలి. బాణలిలో నెయ్యి కాని, నూనె కాని వేసి కాచాలి. పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని పూరీలా ఒత్తి కాగిన నూనెలో వేసి రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. సాబుదానా థాలీపీఠ్ కావలసినవి సగ్గుబియ్యం - కప్పు కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు ఉప్పు - తగినంత, పచ్చి మిర్చి - 2 (సన్నగా తరగాలి) పల్లీలు - పావు కప్పు (వేయించి పైన పొట్టు తీసి, కచ్చాపచ్చాగా పొడి చేయాలి) నిమ్మరసం - టీ స్పూను, సింఘారా పిండి - పావు కప్పు నూనె - వేయించడానికి తగినంత తయారీ: సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి అరకప్పు నీళ్లలో సుమారు ఎనిమిది గంటలు నానబెట్టాలి. మిగిలిన పదార్థాలకు నానిన సగ్గుబియ్యం జత చేసి ఒక పాత్రలో వేసి బాగా కలపాలి. పిండిని చిన్న ఉండలా తీసుకుని, ఒక ప్లాస్టిక్ షీట్ మీద ఉంచి, ైెపైన మరొక ప్లాస్టిక్ షీట్ ఉంచి, చేతితో గుండ్రంగా వచ్చేలా ఒత్తాలి. పెనం వేడి చేసి, తయారు చేసి ఉంచుకున్న థాలీపీఠ్ను దాని మీద వేయాలి. రె ండువైపులా నూనె వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు కాల్చి వేడివేడిగా అందించాలి. కొత్తిమీర చట్నీ లేదా ఆలుగడ్డల కూరతో తింటే రుచిగా ఉంటాయి. రాజ్గిరా థాలీపీఠ్ కావలసినవి రాజ్గిరా పిండి - 3 కప్పులు ఆలుగడ్డలు - 4 (ఉడికించి, తొక్క తీసి, మెత్తగా మెదపాలి) పచ్చి మిర్చి - 2 (సన్నగా తరగాలి) జీలకర్ర - టేబుల్ స్పూను మెంతులు - 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు ఉప్పు - తగినంత నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు తయారీ మిక్సీలో కొత్తిమీర తరుగు, జీలకర్ర, పచ్చి మిర్చి, మెంతులు వేసి మెత్తగా ముద్ద చేయాలి. ఒక పాత్రలో రాజ్గిరా పిండి, మెదిపిన ఆలుగడ్డలు, తయారుచేసి ఉంచుకున్న కొత్తిమీర ముద్ద, ఉప్పు వేసి బాగా కలపాలి. కొద్దిగా నీళ్లు జత చేసి పిండిని గడ్డిగా కలిపి, మీడియం సైజు ఉండలు తయారుచేయాలి. మధ్యమధ్యలో రాజ్గిరా పిండి అద్దుతూ చపాతీ ఒత్తాలి. స్టౌ మీద పెనం ఉంచి, వేడయ్యాక తయారుచేసి ఉంచుకున్న చపాతీలు వేసి, రెండు వైపులా నెయ్యి వేసి బంగారు వర్ణంలోకి వచ్చేలా దోరగా కాల్చాలి. సేకరణ: డా. పురాణపండ వైజయంతి, సాక్షి, చెన్నై (ఇందులో ఉపయోగించిన సింఘారా పిండి, కుట్టు పిండి, రాజ్గిరా పిండి.... సూపర్మార్కెట్లో రెడీగా దొరుకుతాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటితో చేసిన పదార్థాలు ఉపవాసం ఉన్నవారు సైతం తినవచ్చు) -
మాంసానికి ‘శ్రావణం’ ఎఫెక్ట్
30 శాతం పడిపోయిన విక్రయాలు అమ్మకాల్లేక వ్యాపారులు విలవిల సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఈ ఆదివారం మాంసం, చేపల వ్యాపారులకు షాక్ ఇచ్చింది. శ్రావణ మాసం పూజలు కారణంగా మాంసం, చేపల విక్రయాలకు డిమాండ్ పడిపోయింది. ఆదివారం ఒక్కరోజే అమ్మకాలు 30 శాతం మేర పడిపోయాయి. సాధారణంగా ప్రతి ఆదివారం నగరంలో సుమారు 550-600 టన్నులకు పైగా చికెన్, 220-280 టన్నుల మటన్, 80-120 టన్నుల మేర చేపల విక్రయం జరుగుతుంది. అయితే, ఈ ఆదివారం చికెన్ 300 టన్నుల లోపు అమ్ముడు పోగా, మటన్ సుమారు 170 టన్నులు, చేపలు 20 టన్నులు మాత్రమే అమ్మకాలు జరిగినట్టు వ్యాపార వర్గాల అంచనా. ఇప్పుడు శ్రావణ మాసం కావడంతో చాలామంది పూజలు, వ్రతాలతో మాంసాహారానికి దూరంగా ఉంటారు. ఈ కారణంగానే డిమాండ్ పడిపోయిందని వ్యాపారులంటున్నారు. ముషీరాబాద్‌లోని ఒక్క దయారా ఫిష్ మార్కెట్‌కే ప్రతీ ఆదివారం 70-80 టన్నుల చేపలు దిగుమతి అవుతుంటాయి. అయితే, ఇప్పుడు పెద్దగా వ్యాపారం లేకపోవడంతో ఈ ఆదివారం కేవలం 20 టన్నుల లోపే సరుకు దిగుమతి అయినట్టు తెలిసింది. దిగిరాని ధరలు.. చికెన్, మటన్, చేపలకు డిమాండ్ తగ్గినా రిటైల్ మార్కెట్లో ధరలు మాత్రం తగ్గలేదు. పౌల్ట్రీ ఫారం దగ్గర లైవ్ కోడి కేజీ రూ.65 పలకగా.. హోల్‌సేల్‌గా రూ. 71కు చేరింది. అదే రిటైల్ మార్కెట్లోకి వచ్చేసరికి కేజీ రూ.83 ప్రకారం విక్రయించారు. ఇదే చికెన్ (స్కిన్‌తో) కేజీ రూ.116కు, స్కిన్లెస్ రూ.136 ప్రకారం విక్రయించారు. అలాగే మటన్ కేజీ రూ.400-500, బోన్‌లెస్ రూ.600-650కు విక్రయించగా, చేపలు రవ్వ కేజీ రూ.60-70, బొచ్చె రూ.70-80, కొరమీను రూ.300-400, గోల్డ్ ఫిష్ రూ.70, రొయ్య, రూ.200-250 ప్రకారం అమ్మారు. అయితే, నగరంలో అన్నిచోట్లా ఈ ధరలు ఒకేలా లేవు. గిరాకీని బట్టి ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ధర నిర్ణయించి సొమ్ము చేసుకున్నారు.సాయంత్రానికి చేపల రేట్లు కాస్త తగ్గినా చికెన్, మటన్ ధరలు మాత్రం తగ్గలేదు. -
ఆరోగ్యానికి సెనగలు
శ్రావణ మాసం... ఇంటింటా సెనగలు కొలువుతీరే మాసం... నోములు... వ్రతాలు... పూజలు... పండుగలు... ఇళ్లన్నీ ఆకుపచ్చని తోరణాలు, పసుపు పచ్చని చేమంతులతో కళకళలాడుతుంటాయి... ఎవరో ఒక అతిథి ఇంటికి రావడం... వాయినాలు ఇవ్వడం... పుచ్చుకోవడం... ఏదైతేనేం... ఇల్లంతా సెనగలే సెనగలు... ఒక్కసారి ఆలోచనకు పదును పెట్టండి... సెనగలతో వంటలను అలంకరించండి... సంప్రదాయంగా చేసే హయగ్రీవతో పాటు... పాఠోళీ, గుత్తి కూరలు... ఎన్నో... ఎన్నెన్నో చేసుకుందాం... శరీరానికే కాదు ఆరోగ్యానికి కూడా నగలు సమకూర్చుకుందాం... సెనగల కూర కావ లసినవి: సెనగలు - కప్పు; పసుపు - పావు టీ స్పూను; ఉల్లి తరుగు - అర కప్పు; చిన్న ఉల్లిపాయలు - 4 (సూపర్ మార్కెట్లో దొరుకుతాయి); పచ్చి మిర్చి - 3 (పొడవుగా మధ్యకు కట్ చేయాలి); కరివేపాకు - 4 రె మ్మలు; మిరప్పొడి - టీ స్పూను; పసుపు - టీ స్పూను; ఎండు మిర్చి - 2; కొబ్బరి తురుము - అర కప్పు; చిన్న ఉల్లిపాయలు - 2 (సన్నగా తరగాలి); ధనియాలు - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు (ధనియాల పొడి కూడా వాడుకోవచ్చు) మసాలా కోసం: సోంపు - పావు టీ స్పూను, ఏలకులు - 2, లవంగాలు - 3, దాల్చినచెక్క - చిన్న ముక్క, మిరియాలు - నాలుగు గింజలు తయారి: సెనగలను ముందు రోజు రాత్రి నానబెట్టాలి మరుసటి రోజు ఒక గిన్నెలో... నానబెట్టిన సెనగలు, ఉప్పు, పసుపు వేసి కుకర్‌లో ఉడికించాలి (ఉడికించిన నీళ్లను పక్కన ఉంచి, గ్రేవీ కోసం వాడుకోవాలి) బాణలిలో టీ స్పూను నూనె వేసి కాగాక ధనియాలతో పాటు మిగిలిన మసాలా దినుసులు కూడా వేసి వేయించాలి చిన్న ఉల్లిపాయల తరుగు జత చేసి బాగా వేయించాక, కొబ్బరి తురుము వేసి గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించి, దించి చల్లారాక, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి మరొక బాణలిలో కొబ్బరి నూనె వేసి కాగాక, ఆవాలు, ఎండు మిర్చి వేసి వేయించాలి ఉల్లి తరుగు, చిన్న ఉల్లిపాయల తరుగు, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు వేసి వేయించాలి పసుపు, మిరప్పొడి జత చేసి కొద్ది సేపు వేయించి, ఉడికించి ఉంచుకున్న నీళ్లు పోసి, మరిగాక కొబ్బరి పేస్ట్, ఉడికించిన సెనగలు వేసి బాగా కలిపి ఐదు నిమిషాలు ఉడికించాలి. బెండకాయ గుత్తి కూర కావలసినవి: బెండకాయలు - పావు కేజీ; నూనె - టేబుల్ స్పూను; స్టఫింగ్ కోసం: సెనగలు - కప్పు (ఉడికించి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి); పల్లీలు - 2 టేబుల్ స్పూన్లు (వేయించాలి); నువ్వులు - టేబుల్ స్పూను (వేయించాలి); అవిసె గింజలు - టేబుల్ స్పూను (వేయించాలి); పచ్చి మిర్చి ముద్ద - 2 టేబుల్ స్పూన్లు; అల్లం వెల్లుల్లి ముద్ద - 2 టీ స్పూన్లు; పసుపు - పావు టీ స్పూను; నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు; కొత్తిమీర - గుప్పెడు; ఉప్పు - తగినంత తయారి: అవిసె గింజలు, నువ్వు పప్పు, పల్లీలను విడివిడిగా మిక్సీలో వేసి పొడి చేసి పక్కన ఉంచాలి ఒక పాత్రలో... తయారుచేసి ఉంచుకున్న సెనగల ముద్ద, అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చి మిర్చి ముద్ద, పసుపు, నిమ్మరసం, కొత్తిమీర, ఉప్పు వేసి అన్నీ కలిసేలా కలపాలి బెండకాయలను శుభ్రంగా కడిగి తడిపోయే వరకు ఆరబెట్టి, రెండు వైపులా తొడిమలు తీసి, మధ్యకు గాటు పెట్టాలి. (బెండకాయ ముక్కలు కాకుండా జాగ్రత్త పడాలి) ముందుగా తయారుచేసి ఉంచుకున్న స్టఫింగ్ మిశ్రమాన్ని బెండకాయలలో జాగ్రత్తగా స్టఫ్ చేయాలి వెడల్పాటి బాణలిలో నూనె వేసి కాగాక బెండకాయలను ఒక్కొక్కటిగా వేసి, బాగా కలిపి మూత పెట్టి పది నిమిషాలు ఉంచాలి పల్లీ, నువ్వులు, అవిసె గింజల పొడుల మిశ్రమం వేసి కలిపి దించేయాలి. పాఠోళీ కావ లసినవి: సెనగలు - రెండు కప్పులు; ఉల్లి తరుగు - కప్పు; పచ్చి మిర్చి తరుగు - 3 టీ స్పూన్లు; కరివేపాకు - 4 రెమ్మలు; అల్లం తురుము - టీ స్పూను; నూనె - చిన్న గిన్నెడు; ఎండు మిర్చి - 4; సెనగపప్పు - 2 టీ స్పూన్లు; మినప్పప్పు - 2 టీ స్పూన్లు; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను, ఉప్పు - తగినంత తయారి: సెనగలను ముందు రోజు రాత్రి నీళ్లలో నానబెట్టాలి మరుసటి రోజు నీరు తీసేసి... అల్లం తురుము, పచ్చి మిర్చి, ఉప్పు జత చేసి మిక్సీలో వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి బాణలిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగాక, సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి కరివేపాకు, ఉల్లి తరుగు వేసి బాగా వేగాక, సెనగల ముద్ద వేసి కలిపి మూత ఉంచాలి (సన్నని మంట మీద మాత్రమే చేయాలి) మధ్యమధ్యలో బాగా కలుపుతూ నూనె జత చేస్తుండాలి బాగా విడివిడిగా అయ్యేవరకు ఉంచి దించేయాలి ఇది అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. హయగ్రీవ కావలసినవి: సెనగలు - కప్పు; బెల్లం తురుము - ఒకటిన్నర కప్పులు; కొబ్బరి తురుము - అర కప్పుస; ఏలకుల పొడి - టీ స్పూను; నెయ్యి - టేబుల్ స్పూను; జీడిపప్పు పలుకులు - 10; కిస్మిస్ - రెండు టేబుల్ స్పూన్లు తయారి: నానబెట్టి ఉంచుకున్న సెనగలకు రెండు కప్పులు నీళ్లు జత చేసి ఉడికించాలి ఒక పెద్ద పాత్రలో ఉడికించి ఉంచుకున్న సెనగలు, బెల్లం తురుము, కొబ్బరి తురుము, ఏలకుల పొడి వేసి స్టౌ మీద ఉంచాలి. (మంట బాగా తగ్గించాలి) బెల్లం పూర్తిగా కరిగి మిశ్రమం చిక్కబడ్డాక దింపేయాలి చిన్న బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీడిపప్పు పలుకులు, కిస్మిస్ వేసి వేయించి, సిద్ధంగా ఉన్న హయగ్రీవలో వేసి కలపాలి. -
ముంబైలో బోనాలు
సాక్షి, ముంబై: నగరంలో తెలుగు ప్రజలు ఆదివారం పోచమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. శ్రావణ మాసం ఆదివారం నుంచి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఈ శ్రావణ మాసాన్ని కచ్చితంగా పాటించేవారు గణేశ్ ఉత్సవాలు పూర్తయ్యేంతవరకు మద్యం, మాంసానికి దూరంగా ఉంటారు. దీంతో మాంసాహారం తినేవారు ఈ శనివారం లోపు పోచమ్మ పండుగ చేసుకోవాల్సి వచ్చింది. ఆ ప్రకారం ఇదే ఆఖరు ఆదివారం కావడంతో ప్రజలు పెద్ద ఎత్తున పోచమ్మ పండుగను జర్పుకున్నారు. పోచమ్మ గుడులన్నీ ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులతో కిటకిటలాడాయి. కామాటిపుర, వర్లీలోని భోగాదేవి తదితర పోచమ్మ ఆలయాలన్నీ సందడిగా కనిపించాయి. ఎంతో ఓపిగ్గా మహిళలు, పిల్లలు క్యూలో నిలబడి పోచమ్మకు కోళ్లు, మేకలు, నైవేద్యాలు సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. కొందరు భాజాబజంత్రీలతో తలపై బోనాలు పెట్టుకుని గుడికి చేరుకున్నారు. పూజలుచేసి నైవేద్యాలు సమర్పించారు. మరికొందరు స్థానికంగా ఉంటున్న వారందరు కలిసికట్టుగా ఒకేచోటా ఈ పండుగను జరుపుకున్నారు. ఠాణేలో... ఠాణేలోని తెలుగు సేవా మండలి సభ్యులు ఆదివారం పోచమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఉదయమే పిల్లలు, మహిళలు,ృవద్ధులు శాస్త్రినగర్‌లో ఉన్న జానకీమాత దేవి మందిరానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఇక్కడి తెలుగు ప్రజలు జానకీమాత దేవినే పోచమ్మ తల్లిగా భావిస్తారు. వెంట తెచ్చుకున్న మేకలు, కోళ్లు బలిచ్చారు. నైవేద్యాలు సమర్పించి తమ మొక్కుబడులు తీర్చుకున్నట్లు ఆ సంస్థ సభ్యులు మెంగు రమేశ్, మెంగు లింగన్న, గుండారపు పుల్లయ్య, గంగాధరి శంకర్ తదితరులు చెప్పారు. ఘాట్కోపర్లో... కామ్‌రాజ్‌నగర్‌లోని తెలుగు రహివాసి సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానిక పోచమ్మ గుడిలో ఆదివారం ఉదయం పోచమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఇక్కడుంటున్న దాదాపు 500లకుపైగా తెలుగు కుటుంబాలు కలిసి ఈ పండగను జరుపుకోవడం విశేషం. ఈ సందర్భంగా మేకలు బలిచ్చి తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. పండుగను పురస్కరించుకుని ఆలయాన్ని వివిధ రకాల పూలతో అలంకరించారు. భక్తులు ఇబ్బందులు పడకుండా తగిన ఏర్పాటుచేసినట్లు ఆ సంస్థ అధ్యక్షుడు గుల్లే గంగాధర్, శంకర్ నాయక్, బాస శంకర్, జక్కుల తిరుపతి, కట్ట అశోక్, గుర్రం శ్రీనివాస్, తిక్కు నాయక్, సత్యనారాయణ తదితరులు చెప్పారు. బోరివలిలో.. బోరివలి, న్యూస్‌లైన్: మలాడ్‌లోని తెలంగాణ ప్రజలు ఆదివారం అశోక్‌నగర్‌లోని బాన్ డోంగిరిలో తెలుగు సమాజ్ సొసైటీ ఆధ్వర్యంలో పోచమ్మ, ముత్యాలమ్మ, మైసమ్మ, నల్లపోచమ్మ అమ్మవార్లకు బోనాలు ఘనంగా నిర్వహించారు. ఇక్కడ 650 గజాల స్థలంలో నలుగురు అమ్మవార్ల మందిరాలు ఉన్నాయి. స్థానిక ఆగన్న కుటుంబం నుంచే మొదట పెద్ద బోనం వెళుతుంది. తర్వాత మిగతా బోనాలను అమ్మవారికి సమర్పిస్తారు. కాగా, ఇక్కడ భవన నిర్మాణ కార్మికులు ఎక్కువగా ఉంటారు. అమ్మవారికి ప్రతి ఏటా మొక్కులు చెల్లించుకుంటామని వారు తెలిపారు. కార్యక్రమంలో పి.ప్రభాకర్ రావు, జి.రాజ్ కుమార్, డి.కిషన్ రావు, డి.పాపారావు, వి. చిన్నికిష్టయ్య, ఎల్.కిషన్ రావు, పి.శ్రీనివాసరావు, జె.తిరుపతిరావు, బి.రాజన్న, ఎం.రవీందర్రావు, జి.రామారావు తదితరులు పాల్గొన్నారు. -
కల్యాణ మంటపాలు కళకళ
బళ్లారి అర్బన్, న్యూస్‌లైన్ : శ్రావణ మాసం పంచమి సందర్భంగా ఆదివారం బళ్లారిలోని కల్యాణ మంటపాలు పెళ్లిళ్ల సందడితో కళకళలాడాయి. ఆషాడం తదితర కారణాలతో రెండు నెలలుగా కళావిహీనమైన కల్యాణ మంటపాలు సందడి సందడిగా కనిపించాయి. నగరంలోని ప్రధాన కళ్యాణ మంటపాలన్నింటిలో కూడా పంచమి ముహూర్తాన పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక సత్యనారాయణపేట్ రాఘవేంద్రస్వామి కల్యాణమంటపం, కోర్టు రోడ్ కమ్మ సంఘం కల్యాణ మంటపం, రాజ్‌కుమార్ రోడ్ సెంటినరీ హాల్, బెంగళూరు రోడ్డులోని కన్యకాపరమేశ్వరి కళ్యాణమంటపం, పటేల్‌నగర్ ఉమామహేశ్వరి కల్యాణ మంటపం, సిరుగుప్ప, హొస్పేట రోడ్లలోని ఏసీ ఫంక్షన్‌హాల్, కొట్టూరు స్వామి కల్యాణ మంటపం, పార్వతినగర్ కల్యాణ మంటపం, బసవభవన్లలో పెళ్లి బాజాలు మోగాయి. సీమాంధ్రలో బంద్ కారణంగా అట్టుడికి పోతున్న నేపథ్యంలో బస్సులు తిరగకపోవడంతో వివాహానికి హాజరు కావాల్సిన బంధుమిత్రులు చాలా ఇబ్బందులు బడ్డారు. కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి వచ్చిన వారు ఇక్కడికి వచ్చి, తిరిగి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెద్ద కళ్యాణ మంటపాలు కిటకిటలాడాయి. మరికొన్ని కల్యాణ మంటపాలలో పెళ్లిళ్లు జరిగిన ఛాయలు కనిపించలేదు. రాఘవేంద్రస్వామి కల్యాణ మంటపంలో జనగణమన ఫెడరేషన్ సంస్థాపకులు, సమాజ సేవకులు ఎన్.గంగిరెడ్డి,రాజమ్మల కుమారుడు ఉమాకాంతరెడ్డి, హేమలతల పెళ్లి వైభవంగా జరిపించారు. వీరి పెళ్లికి మాజీ మంత్రి ముండ్లూరు దివాకర్‌బాబు, ఉరవకొండ ఎమ్మెల్సీ కే.శివరామిరెడ్డి, నారా ప్రతాప్‌రెడ్డి, భరత్‌రెడ్డి, అజయ్, గోవర్దన్, కార్పొరేటర్ మోత్కర్ శ్రీనివాస్, గోపాలరెడ్డి, వీరశేఖర్‌రెడ్డి, ఫణీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.