శుచిభరితం...కడు రుచిభరితం | Shravan month special food items | Sakshi
Sakshi News home page

శుచిభరితం...కడు రుచిభరితం

Published Tue, Aug 18 2015 3:28 AM | Last Updated on Sun, Sep 3 2017 7:37 AM

శుచిభరితం...కడు రుచిభరితం

శుచిభరితం...కడు రుచిభరితం

ఆకాశంలో నల్లటి మేఘాలు...  నేల మీద తెల్లటి ముత్యపు చినుకులు...
ఇదీ శ్రావణమాసం!
వాన చినుకులు చిటపటమంటుంటే... నోటికి కూడా కరకరలు కావాలనిపిస్తుంది...
పవిత్ర శ్రావణం కొందరికి ఉపవాస మాసం...  కొందరికి పిండివంటల మాసం.
అందుకే ఆ కొందరు, ఈ కొందరు ఆరగించడానికి
వీలైన శుచిభరిత, రుచిభరిత వంటకాలను మీకు అందిస్తున్నాం.

 
శ్రావణ మాసంలో శాకాహారం
భారతీయుల క్యాలెండర్ ప్రకారం శ్రావణం వానలు దండిగా, కుంభవృష్టిలా కురుస్తూ, వరదలు వచ్చే మాసం. ఈ వానలు సాధారణంగా జూలై నెల మధ్య భాగంలోప్రారంభమై, ఆగస్టు మాసం వరకు కొనసాగుతాయి. ఎక్కువ మంది ఈ మాసంలో మాంసాహారం తీసుకోరు. ఇది మతపరంగా కంటె కూడా సంప్రదాయంగా వస్తున్న అలవాటు. శ్రావణంలో కేవలం శాకాహారం మాత్రమే తినడానికి ఆధ్యాత్మికతతో పాటు, శాస్త్రీయ కారణాలు కూడా చెబుతారు. వాటిలో ముఖ్యమైనవిగా కనపడేవి చూద్దాం...
 హిందువులకు శ్రావణం పవిత్ర మాసం. ఈ మాసమంతా చిన్నచితకా పండుగలు ఉంటాయి. రక్షాబంధన్, జంధ్యాల పౌర్ణమి, శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు, వరలక్ష్మీవ్రతం.
 
ఆధ్యాత్మికంగా...
శివునికి ప్రీతికరమైన మాసం. శివుని ఆరాధించడానికి పవిత్రమైన మాసం. ఈ మాసంలో ప్రత్యేకంగా శ్రావణ శివరాత్రిని నిర్వర్తిస్తారు. శ్రావణం అంటే వర్షాకాలం అని అర్థం. మామూలుగా శివరాత్రి అనేది ఫిబ్రవరి లేదా మార్చి మాసంలో వస్తుంది. ఈ శివరాత్రి మాత్రం వర్షకాలంలో వస్తుంది. ప్రతి సోమవారాన్ని శివుని ప్రీతిగా అర్చిస్తారు. ఈ సోమవారాలను శ్రావణ సోమవారాలుగా పూజిస్తారు. ఈ మాసంలో వచ్చే అన్ని సోమవారాలు ఉపవాసం ఉంటారు. అందువల్ల ఈ మాసంలో మాంసాహారం తీసుకోరు.
 
శాస్త్రీయంగా...
ఈ మాసంలో వర్షపాతం అధికంగా ఉండటం వల్ల నదులు పొంగిపొర్లుతూ, వరదలు వస్తాయి. పరిసరాలు అపరిశుభ్రంగా మారిపోతాయి. అంటువ్యాధులను వ్యాప్తి చేసే బ్యాక్టీరియా విపరీతంగా వ్యాపిస్తాయి. మాంసం మీద ఈ బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ మాసంలో మాంసం తినకుండా ఉండటం ఆరోగ్యకరమని భావిస్తారు.
 
మరొక కారణం...
అనేక జంతువులు ఈ మాసంలోనే సంతానోత్పత్తి చేస్తాయి. ఈ మాసంలో చేపలను పట్టడం నిషేధం. ఎందుకంటే చేపలన్నీ గుడ్లను తమ కడుపులో పొదువుకుని ఉంటాయి. పిల్లలకు జన్మనిచ్చే స్థితిలో ఉన్న చేపలను పట్టుకుని చంపడాన్ని పాపంగా భావిస్తారు. ఆ కారణంగా మాంసాహారం, చేపలను తినడాన్ని పాపంగా భావించి, కేవలం శాకాహారం మాత్రమే స్వీకరిస్తారు.
 
సింఘారే కీ పూరీ
కావలసినవి
సింఘారా (వాటర్ చెస్ట్‌నట్) పిండి - 2 కప్పులు
ఆలుగడ్డలు - 2
(ఉడికించి తొక్క తీసి మెదపాలి)
పుదీనా ఆకులు - అర కప్పు
(సన్నగా తరగాలి)
వాము - అర టేబుల్ స్పూను
పచ్చి మిర్చి - 2 (సన్నగా తరగాలి)
ఉప్పు - తగినంత
నీళ్లు - పిండి కలపడానికి తగినన్ని
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ: 
ఒక పాత్రలో అన్ని పదార్థాలను (నీళ్లు, నూనె మినహాయించి) వేసి బాగా కలపాలి.  తగినన్ని నీళ్లు జత చేసి చపాతీపిండిలా కలపాలి.  బాణలిలో నూనె పోసి కాచాలి.  పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి, పూరీలాగ ఒత్తాలి.  ఒక్కో పూరీని నూనెలో వేసి బంగారు వర్ణంలోకి వచ్చే వరకు రెండువైపులా కాల్చి తీసేయాలి.
 
కుట్టు కీ పూరీ
కావలసినవి
కుట్టు పిండి - 2 కప్పులు
ఆలుగడ్డలు - 2
ఉప్పు - తగినంత
నల్ల మిరియాల పొడి - అర టీ స్పూను
నెయ్యి లేదా నూనె - అర కప్పు
తయారీ:
  ముందుగా ఆలుగడ్డలను శుభ్రంగా కడిగి నాలుగు ముక్కలుగా కట్ చేసి కుకర్‌లో ఉంచి ఉడికించాలి.  తొక్క తీసి మెత్తగా మెదపాలి.  ఒక పాత్రలో కుట్టు పిండి, ఉప్పు, నల్ల మిరియాల పొడి, బంగాళదుంప ముద్ద వేసి గట్టిగా కలపాలి.  అవసరమనుకుంటే కొద్దిగా నీళ్లు జత చేసి బాగా కలిపి సుమారు అరగంటసేపు నాననివ్వాలి.  బాణలిలో నెయ్యి కాని, నూనె కాని వేసి కాచాలి.  పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని పూరీలా ఒత్తి కాగిన నూనెలో వేసి రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి.
 
సాబుదానా థాలీపీఠ్
కావలసినవి
సగ్గుబియ్యం - కప్పు
కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - తగినంత, పచ్చి మిర్చి - 2 (సన్నగా తరగాలి)
పల్లీలు - పావు కప్పు
(వేయించి పైన పొట్టు తీసి, కచ్చాపచ్చాగా పొడి చేయాలి)
నిమ్మరసం - టీ స్పూను, సింఘారా పిండి - పావు కప్పు
నూనె - వేయించడానికి తగినంత
తయారీ: 
సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి అరకప్పు నీళ్లలో సుమారు ఎనిమిది గంటలు నానబెట్టాలి.  మిగిలిన పదార్థాలకు నానిన సగ్గుబియ్యం జత చేసి ఒక పాత్రలో వేసి బాగా కలపాలి.  పిండిని చిన్న ఉండలా తీసుకుని, ఒక ప్లాస్టిక్ షీట్ మీద ఉంచి, ైెపైన మరొక ప్లాస్టిక్ షీట్ ఉంచి, చేతితో గుండ్రంగా వచ్చేలా ఒత్తాలి.  పెనం వేడి చేసి, తయారు చేసి ఉంచుకున్న థాలీపీఠ్‌ను దాని మీద వేయాలి.  రె ండువైపులా నూనె వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు కాల్చి వేడివేడిగా అందించాలి.  కొత్తిమీర చట్నీ లేదా ఆలుగడ్డల కూరతో తింటే రుచిగా ఉంటాయి.
 
రాజ్‌గిరా థాలీపీఠ్
కావలసినవి
రాజ్‌గిరా పిండి - 3 కప్పులు
ఆలుగడ్డలు - 4 (ఉడికించి, తొక్క తీసి, మెత్తగా మెదపాలి)
పచ్చి మిర్చి - 2 (సన్నగా తరగాలి)
జీలకర్ర - టేబుల్ స్పూను
మెంతులు - 2 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - తగినంత
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
తయారీ

మిక్సీలో కొత్తిమీర తరుగు, జీలకర్ర, పచ్చి మిర్చి, మెంతులు వేసి మెత్తగా ముద్ద చేయాలి.  ఒక పాత్రలో రాజ్‌గిరా పిండి, మెదిపిన ఆలుగడ్డలు, తయారుచేసి ఉంచుకున్న కొత్తిమీర ముద్ద, ఉప్పు వేసి బాగా కలపాలి.  కొద్దిగా నీళ్లు జత చేసి పిండిని గడ్డిగా కలిపి, మీడియం సైజు ఉండలు తయారుచేయాలి.   మధ్యమధ్యలో రాజ్‌గిరా పిండి అద్దుతూ చపాతీ ఒత్తాలి.  స్టౌ మీద పెనం ఉంచి, వేడయ్యాక తయారుచేసి ఉంచుకున్న చపాతీలు వేసి, రెండు వైపులా నెయ్యి వేసి బంగారు వర్ణంలోకి వచ్చేలా దోరగా కాల్చాలి.
 
సేకరణ: డా. పురాణపండ వైజయంతి,
సాక్షి, చెన్నై

 
(ఇందులో ఉపయోగించిన సింఘారా పిండి, కుట్టు పిండి, రాజ్‌గిరా పిండి.... సూపర్‌మార్కెట్‌లో రెడీగా దొరుకుతాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటితో చేసిన పదార్థాలు ఉపవాసం ఉన్నవారు సైతం తినవచ్చు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement