కాస్త నిలవండీ!!! | food special pn pongal | Sakshi
Sakshi News home page

కాస్త నిలవండీ!!!

Published Sat, Jan 6 2018 12:48 AM | Last Updated on Sat, Jan 6 2018 12:48 AM

food special pn pongal - Sakshi

సంక్రాంతి... తెలుగువాళ్లకి పెద్ద పండగ... కాస్త పెద్దగానే జరుపుకుంటాం. అందుకే ఈ పండగకి నోట్లో వేసుకోగానే కరిగిపోయే పిండివంటలు చేస్తామా! అరిశలు, పనసతొనలు, గులాబీ గుత్తులు, కొబ్బరి బూరెలు, రిబ్బన్‌ పకోడా, సకినాలు,  మురుకులు లాంటి దక్షిణాది పిండివంటలను ఓపిగ్గా తయారు చేసి, డబ్బాల్లో దాచుదాం.  పండక్కే కాదు, పండగ వెళ్లిపోయిన తర్వాత కూడా అందరినీ కాస్త నిలవండీ అంటూ ప్రేమగా తినిíపిద్దాం. 

బాదం పూరీ
కావలసినవి: మైదాపిండి – కప్పు, బియ్యప్పిండి – అర కప్పు, బాదం పప్పులు – 20, పాలు – అర కప్పు, నెయ్యి – 3 టీ స్పూన్లు, నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా, పంచదార – కప్పు, ఏలకుల పొడి – అర టీ స్పూను, లవంగాలు – తగినన్ని, మిఠాయి రంగు – చిటికెడు

తయారి: ∙బాదం పప్పులను గంటసేపు నీళ్లలో నానబెట్టి, పొట్టు తీసి, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙ఒక పాత్రలో మైదాపిండి, బియ్యప్పిండి, బాదం పప్పుల ముద్ద వేసి బాగా కలపాలి ∙మిఠాయి రంగును టీ స్పూను నీళ్లలో కలిపి, జత చేయాలి ∙తగినన్ని పాలు జత చేసి చపాతీ పిండిలా కలిపి సుమారు అరగంటసేపు పక్కన ఉంచాలి ∙చిన్నచిన్న ఉండలుగా చేసి, పల్చని చపాతీలా ఒత్తి, పైన నెయ్యి పూయాలి ∙మధ్యకు మడతపెట్టి, మరోమారు నెయ్యి పూసి త్రికోణాకారంలో మడత పెట్టి, లవంగాన్ని మధ్యలో గుచ్చాలి ∙బాణలిలో నూనె కాగాక తయారుచేసి ఉంచుకున్న బాదం పూరీలను ఒక్కొక్కటిగా వేసి వేయించి, తీసి పక్కన ఉంచుకోవాలి ∙పంచదారకు తగినంత నీరు జత చేసి బాణలిలో వేసి, స్టౌ మీద ఉంచి పంచదార కరిగి తీగ పాకం రాగానే దించేయాలి ∙ఏలకుల పొడి జత చేసి బాగా కలపాలి ∙తయారుచేసి ఉంచుకున్న బాదం పూరీలను ఇందులో వేసి ఐదు నిమిషాల తరవాత తీసేయాలి.

కాయి హోళిగే

కావలసినవి: పూర్ణం కోసం: ఎండు కొబ్బరి తురుము – 2 కప్పులు, బెల్లం పొడి – ఒకటిన్నర కప్పులు, ఏలకుల పొడి – టీ స్పూను; పోలి తయారీ కోసం: మైదా పిండి – 2 కప్పులు, నువ్వుల నూనె – 3 టేబుల్‌ స్పూన్లు, పసుపు – అర టీ స్పూను

తయారి: ∙ఒక పాత్రలో జల్లించిన మైదా పిండి, పసుపు వేసి బాగా కలపాలి ∙స్టౌ మీద బాణలిలో బెల్లం పొడి, ఏలకుల పొడి, అరకప్పు నీళ్లు పోసి తీగపాకం వచ్చేవరకు కలపాలి ∙కొబ్బరి తురుము జత చేసి బాగా ఉడికి దగ్గర పడేవరకు కలిపి, దింపి చల్లారనివ్వాలి ∙ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి ∙కలిపి ఉంచుకున్న మైదాపిండిని కూడా చిన్న చిన్న ఉండలుగా చేసి, ఒక్కో ఉండను చేతితో పల్చగా ఒత్తి, కొబ్బరి పూర్ణం అందులో ఉంచి, చపాతీకర్రతో పల్చగా ఒత్తుతూ కొద్దిగా పొడి పిండి అద్దుతుండాలి. (పూర్ణం బయటకు రాకుండా జాగ్రత్తగా ఒత్తాలి) ∙స్టౌ మీద పెనం వేడయ్యాక, ఒత్తి ఉంచుకున్న కాయి హోళిగలను పెనం మీద వేసి కొద్దికొద్దిగా నూనె వేస్తూ బంగారు రంగులోకి వచ్చే వరకు కాల్చి తీసేయాలి ∙నెయ్యి జత చేసి వడ్డిస్తే రుచిగా ఉంటాయి ∙ఇవి మూడు నాలుగు రోజులు నిల్వ ఉంటాయి.

పనస తొనలు
కావలసినవి: మైదాపిండి – అర కేజీ, పంచదార – అర కేజీ, ఉప్పు– తగినంత, ఏలకుల పొడి  – చిటికెడు, నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా

తయారి: ∙ఒక పాత్రలో మైదా పిండి,  ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలపాలి ∙కొద్దిగా నూనె వేసి కలిపి, అరగంట తరవాత చిన్న చిన్న ఉండలు చేసి, చపాతీలా ఒత్తాలి ∙చాకుతో మధ్యలోకి నాలుగైదు గీతలు పెట్టి కట్‌ చేయాలి. (అంచులలో కట్‌ చేయకూడదు) ∙పనసతొన మాదిరిగా మడవాలి ∙పెద్ద పాత్రలో పంచదార, నీళ్లు, ఏలకుల పొడి వేసి స్టౌ మీద ఉంచి తీగ పాకం వచ్చాక దింపేసి, తయారుచేసి ఉంచుకున్న పనస తొనల మీద పంచదార పాకం అద్దుకునేలా కలపాలి ∙చల్లారాక డబ్బాలో నిల్వ చేసుకోవాలి.

మంగళూరు బన్స్‌
కావలసినవి: అరటిపండ్లు – 2 (మీడియం సైజువి), పంచదార – మూడు టేబుల్‌ స్పూన్లు, జీలకర్ర పొడి – అర టీ స్పూను, ఉప్పు – చిటికెడు, బేకింగ్‌ సోడా – రెండు చిటికెలు, పెరుగు – 2 టేబుల్‌ స్పూన్లు, గోధుమ పిండి – ఒకటì న్నర కప్పులు, నెయ్యి – టీ స్పూను, నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా

తయారి: ∙ఒక పాత్రలో అరటిపండు తొక్క తీసి మెత్తగా అయ్యేవరకు మెదపాలి ∙పంచదార జత చేసి మరోమారు మెత్తగా అయ్యేవరకు కలపాలి ∙గోధుమపిండి, పెరుగు, ఉప్పు, నెయ్యి, బేకింగ్‌ సోడా, జీలకర్ర పొడి జత చేసి చపాతీ పిండిలా కలపాలి ∙పిండి చేతికి అంటుతున్నట్లుగా ఉంటే కొద్దిగా నూనె జత చేసి, రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచాలి ∙మరుసటి రోజు ఫ్రిజ్‌లో నుంచి బయటకు తీసి, మూడు గంటలు ఉంచాలి ∙పిండిని చిన్న చిన్న ఉండలుగా చే సి, ఒక్కో ఉండను పూరీలా ఒత్తాలి ∙బాణలిలో నూనె కాగిన తరవాత  ఒక్కో మంగళూరు బన్స్‌ని వేసి వేయించాలి ∙బాగా పొంగిన తరవాత పేపర్‌ నాప్‌కిన్స్‌ మీదకు తీసుకోవాలి ∙ ఇవి వారం రోజుల వరకు నిలవ ఉంటాయి. 

మురుకులు
కావలసినవి: బియ్యప్పిండి – 4 కప్పులు, పుట్నాల (వేయించిన సెనగపప్పు) పిండి – కప్పు, నువ్వులు – టీ స్పూను, ఎర్ర కారం – టీ స్పూను, ఇంగువ – అర టీ స్పూను, కరిగించిన వెన్న – 3 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు – టీ స్పూను, నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా

తయారి: ∙రెండు కప్పుల నీళ్లలో ఉప్పు వేసి స్టౌ మీద ఉంచి నీళ్లు మరిగించాలి ∙మంట బాగా తగ్గించి, వేడి నీళ్లలో కొద్దికొద్దిగా బియ్యప్పిండి వేస్తూ ఉండ కట్టకుండా కలపాలి  పిండి బాగా చల్లారాక పుట్నాల పిండి, నువ్వులు,  ఎర్ర కారం, ఇంగువ, కరిగించిన నెయ్యి జత చేసి జంతికల పిండిలా కలపాలి ∙బాణలిలో నూనె పోసి కాచాలి ∙మురుక్కులు చేసే మౌల్డ్‌లో నక్షత్రంలా ఉండే ప్లేట్‌ ఉంచి, కలిపి ఉంచుకున్న పిండిని మౌల్డ్‌లో ఉంచి జంతికల మాదిరిగా నూనె పూసిన అరటి ఆకు మీద చుట్టాలి  సుమారు ఆరేడు ఒత్తిన తరవాత, కాగిన నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి . ఇవి చాలా కాలం నిలవ ఉంటాయి.

మోహన్‌ లడ్డు
కావలసినవి: పంచదార పొడి – కప్పు, బొంబాయి రవ్వ – కప్పు, ఉప్పు – అర టీ స్పూను, నీళ్లు – కప్పు, నెయ్యి – కప్పు, ఏలకుల పొడి – టీ స్పూను, జీడిపప్పులు – 10

తయారి: ∙ఒక పాత్రలో బొంబాయి రవ్వ, ఉప్పు వేసి స్పూనుతో కలపాలి ∙కొద్దికొద్దిగా నీళ్లు జత చేస్తూ చపాతీపిండిలా కలిపి, తడి వస్త్రం కప్పి అర గంట సేపటి తరవాత చిన్న చిన్న ఉండలుగా చేసి, ఒక్కో ఉండను చపాతీ మాదిరిగా కొంచెం మందంగా ఒత్తాలి ∙బాణలిలో నూనె కాగాక ఒక్కో పూరీని వేసి దోరగా వేయించి తీసేయాలి ∙పూరీలన్నీ వేయించిన తరవాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా విరిచి మిక్సీలో వేసి పొడి చేయాలి ∙పంచదార పొడి, ఏలకుల పొడి జత చేయాలి ∙బాణలిలో నెయ్యి వేసి కరిగించి, జీడిపప్పులు వేసి దోరగా వేయించి, కలిపి ఉంచుకున్న మిశ్రమానికి జత చేసి కలపాలి ∙కొద్దికొద్దిగా నెయ్యి జత చేస్తూ లడ్డూ మాదిరిగా చేస్తే మోహన్‌ లడ్డూ సిద్ధమైనట్లే.

గులాబీ గుత్తులు
కావలసినవి: మైదా పిండి – కప్పు, బియ్యప్పిండి – రెండు కప్పులకు కొద్దిగా తక్కువ, పంచదార – ముప్పావు కప్పు, నీళ్లు లేదా కొబ్బరి పాలు – తగినన్ని, ఏలకుల పొడి – టీ స్పూను, ఉప్పు – కొద్దిగా, నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా

తయారి: ∙పదార్థాలన్నిటినీ ఒక పాత్రలో వేసి తగినన్ని నీళ్లు జత చేసి దోసెల పిండి మాదిరిగా కలిపి 20 నిమిషాల పాటు పక్కన ఉంచాలి ∙ బాణలిలో నూనె కాగాక గులాబీ గుత్తుల మౌల్డ్‌ను నూనెలో ఉంచి వేడి చేయాలి ∙గులాబీ గుత్తిని పిండిలో ముంచి తీసి, నూనెలో మునిగేలా ఉంచి, జాగ్రత్తగా చెంచాతో గుత్తి నుండి విడివడేలా చేయాలి ∙ఈ విధంగా అన్నీ తయారుచేసుకుని డబ్బాలో నిల్వ చేసుకోవాలి.

కొబ్బరి బూరెలు
కావలసినవి: బెల్లం పొడి – పావుకేజీ, తడిగా ఉన్న బియ్యప్పిండి – అరకేజీ (బియ్యాన్ని ముందు రోజు రాత్రి నానబెట్టి, మరుసటి రోజు నీరు ఒంపేసి, పొడి వస్త్రం మీద ఆరబోసి, బియ్యం కొద్దిగా తడిగా ఉండగానే మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి. జల్లించి మెత్తగా ఉన్న పిండిని తడిగా ఉండగానే వాడుకోవాలి); కొబ్బరి తురుము – అర కప్పు, నువ్వులు – పావు కప్పు, నూనె – డీప్‌ ఫ్రై చేయడానికి తగినంత

తయారి: ∙బెల్లం పొడికి గ్లాసుడు నీరు జత చేసి బాగా కలిపి స్టౌ మీద ఉంచి, ఉండ పాకం వచ్చేవరకు కలిపి దించేయాలి ∙రెండు టేబుల్‌ స్పూన్ల నూనె, కొబ్బరి తురుము జత చేసి బాగా కలపాలి ∙నువ్వులు జత చేసి మరోమారు కలపాలి ∙బియ్యప్పిండి కొద్దికొద్దిగా వేస్తూ ఉండ కట్టకుండా కలుపుతుంటే బూరెల చలిమిడి తయారవుతుంది ∙చిన్న చిన్న ఉండలు చేసి పక్కన ఉంచాలి ∙బాణలిలో నూనె కాచాలి ∙అరటి ఆకు మీద లేదా ప్లాస్టిక్‌ కాగితం మీద కొద్దిగా నూనె పూసి, ఒక్కో ఉండను మందంగా ఒత్తి కాగిన నూనెలో వేయాలి ∙గోధుమరంగులోకి మారి బూరెల మాదిరిగా పొంగిన తరవాత చట్రంతో పేపర్‌ నాప్‌కిన్‌ మీదకు తీసుకోవాలి ∙చల్లారాక డబ్బాలో నిల్వ చేయాలి. ఇవి వారం రోజుల వరకు నిలవ ఉంటాయి.

రిబ్బన్‌ పకోడా
కావలసినవి: బాయిల్డ్‌ రైస్‌ – 2 కప్పులు, ఎండు మిర్చి – 10, వెల్లుల్లి ముద్ద  – టీ స్పూను, ఉప్పు – తగినంత, సెనగ పిండి లేదా పుట్నాల పిండి – అర కేజీ, ఇంగువ – పావు టీ స్పూను, వేడి నూనె – 3 టేబుల్‌ స్పూన్లు, నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా

తయారి: ∙బియ్యాన్ని రెండు గంటల సేపు నానబెట్టి, నీళ్లు పూర్తిగా ఒంపేసి, తడి ఆరాక,  గ్రైండర్‌లో వేసి మెత్తగా చేసి, ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙ సెనగ పిండి లేదా పుట్నాల పిండి, ఇంగువ, వెల్లుల్లి ముద్ద, 3 టేబుల్‌ స్పూన్ల వేడి నూనె జత చేసి జంతికల పిండిలా కలుపుకోవాలి ∙జంతికల గొట్టంలో రిబ్బన్లు తయారుచేసే ప్లేట్‌ ఉంచి, గొట్టంలో పట్టినంత రిబ్బన్ల పిండి ఉంచాలి ∙బాణలిలో నూనె కాగాక, మౌల్డ్‌ ఒత్తుతూ నూనెలోకి రిబ్బన్లు వేయాలి.

సకినాలు
కావలసినవి: కొత్త బియ్యం – కప్పు, వాము – టేబుల్‌ స్పూను, నువ్వులు – పావు కప్పు, ఉప్పు – తగినంత, నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా

తయారి: ∙ముందు రోజు రాత్రి బియ్యాన్ని నానబెట్టాలి ∙మరుసటి రోజు ఉదయం నీరు ఒంపేసి, బియ్యం మిక్సీలో వేసి పొడి చేసి, జల్లెడ పట్టాలి ∙వాము, నువ్వులు, ఉప్పు, తగినన్ని నీళ్లు జత చేసి పిండి చేతికి అంటకుండా జంతికల పిండిలా కలుపుకోవాలి ∙కొద్దికొద్దిగా పిండి చేతిలోకి తీసుకుని, శుభ్రమైన వస్త్రం మీద గుండ్రంగా నాలుగు రౌండ్లు వచ్చేవరకు కొద్దికొద్దిగా పిండి వదులుతూ తిప్పాలి ∙సుమారు పావు గంట సేపు వీటిని ఆరనివ్వాలి ∙బాణలిలో నూనె కాగాక తయారుచేసి ఉంచుకున్న సకినాలను గరిటెతో తీసి, నూనెలో వేసి బంగారురంగులోకి వచ్చేవరకు వేయించి తీయాలి.

అరిసెలు
కావలసినవి: పాత బియ్యం – 2 కేజీలు, అచ్చు బెల్లం – 2 కేజీల 800 గ్రా, నువ్వులు – 100 గ్రా., నూనె లేదా నెయ్యి – డీప్‌ ఫ్రైకి సరిపడా

తయారి: ∙బియ్యాన్ని రెండు రోజులు నానిన తరవాత రోజూ నీళ్లు మార్చాలి. లేదంటే బియ్యం వాసన వస్తాయి) బియ్యంలో నీళ్లు ఒంపేసి, నీడలో, పొడి వస్త్రం మీద సుమారు పది నిమిషాలు ఆరబోయాలి ∙నీళ్లన్నీ పోయి, బియ్యం కొద్దిగా తడిగా ఉండగానే మిక్సీలో వేసి బియ్యం మెత్తగా చేసి, జల్లించాలి. (పిండిమరలో పట్టించగలిగితే బాగుంటుంది. రోకళ్లతో దంచినా కూడా బాగుంటుంది) ∙»ñ ల్లంలో తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి, ఉండ పాకం వచ్చేవరకు బాగా కలుపుతుండాలి ∙చిన్న పాత్రలో కొద్దిగా నీళ్లు పోసి, అందులో బెల్లం పాకం వేసి ఉండలాగ అయ్యిందో లేదో పరిశీలించుకోవాలి ∙పాకం తయారయిందనిపించగానే స్టౌ మీద నుంచి దింపేసి, 2 టీ స్పూన్ల నెయ్యి, నువ్వులు వేసి కలపాలి ∙ బియ్యప్పిండి కొద్దికొద్దిగా వేస్తూ దగ్గరపడేవరకు కలుపుతుండాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాచాలి ∙బియ్యప్పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ∙ప్లాస్టిక్‌ కవర్‌కి నూనె పూసి, దాని మీద ఒక్కో ఉండను చేతితో కొద్దిగా పల్చగా ఒత్తి, కాగిన నూనెలో వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి ∙అరిసెల చట్రం మీద ఉంచి, గట్టిగా ఒత్తి నూనె తీసేయాలి ∙ఈ విధంగా అరిసెలన్నీ తయారుచేసుకుని, చల్లారిన తరవాత డబ్బాలో నిల్వ చేసుకోవాలి ∙అరిసెలు ఎన్ని రోజులైనా నిలవ ఉంటాయి.

బూందీ లడ్డు
కావలసినవి: సెనగ పిండి – 100 గ్రా., నీళ్లు – 110. మి.లీ., నూనె – అర టేబుల్‌ స్పూను
పాకం కోసం: పంచదార – 150 గ్రా., నీళ్లు – 100 మి.లీ., ఏలకుల పొడి – అర టీ స్పూను, పచ్చ కర్పూరం – కొద్దిగా, కుంకుమ పువ్వు లేదా పసుపు – చిటికెడు, పంచదార – పావు టీ స్పూను, జీడి పప్పులు – 10, కిస్‌మిస్‌ – 10, నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా, నెయ్యి – 2 టేబుల్‌ స్పూన్లు

తయారి: ∙ముందుగా సెనగపిండిని జల్లించాలి ∙పెద్ద పాత్రలో సెనగ పిండి, నీళ్లు వేసి గరిటె జారుగా వచ్చేలా పిండి కలుపుకోవాలి ∙అర టేబుల్‌ స్పూను నూనె జత చేసి మరోమారు కలిపి, మూత పెట్టి అరగంట సేపు పక్కన ఉంచాలి ∙ఏలకుల పొడి, పచ్చ కర్పూరం, కుంకుమ పువ్వు లేదా పసుపు, పావు టీ స్పూను పంచదారలను కలిపి పొడి చేసి పక్కన ఉంచాలి ∙బాణలిలో నూనె వేసి కాగాక...  కలిపి ఉంచుకున్న సెనగపిండిని బూందీ చట్రంలో వేసి నూనెలోకి పడేలా నెమ్మదిగా దూయాలి. ఈ విధంగా మొత్తం బూందీ తయారుచేసుకోవాలి ∙జీడిపప్పులు, కిస్‌మిస్‌లను కరిగిన నెయ్యిలో దోరగా వేయించి తీసేయాలి ∙ఒక పాత్రలో నీళ్లు, పంచదార వేసి, స్టౌ మీద ఉంచి, సన్నటి సెగ మీద తీగ పాకం వచ్చేవరకు కలిపి దింపేయాలి ∙ జీడిపప్పు, కిస్‌మిస్, ఏలకుల పొడి మిశ్రమం, బూందీలను పాకంలో వేసి బాగా కలపాలి ∙వేడిగా ఉండగానే బూందీ మిశ్రమం కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుంటూ లడ్డూలు తయారు చేయాలి ∙గంట సేపటి తరవాత డబ్బాలో నిల్వ చేసుకోవాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement