అమ్మా! ఇంకొకటి!!! | Special story to Snacks | Sakshi
Sakshi News home page

అమ్మా! ఇంకొకటి!!!

Published Sat, Oct 20 2018 12:27 AM | Last Updated on Sat, Oct 20 2018 12:27 AM

Special story to Snacks - Sakshi

దసరా అయిపోయింది... కాని సరదా అయిపోలేదు...పండుగ వంటకాలు తిన్న పిల్లలకుకొత్తగా ఏదైనా తినాలన్న సరదా ఇంకా అలాగే ఉంది... సోమవారం నుంచి స్కూళ్లు...దీపావళి దాకా మళ్లీ పిండివంటలు ఉండవు... ఈ మధ్యలో క్విక్‌గా చేసుకునే,  కిక్‌ ఉన్న స్నాక్స్‌ పిల్లల కోసం...

ఆలు చీలా
కావలసినవి: బంగాళ దుంపలు – 3; కార్న్‌ ఫ్లోర్‌ – 2 టేబుల్‌ స్పూన్లు; సెనగ పిండి – 2 టేబుల్‌ స్పూన్లు; మిరియాల పొడి – అర టీ స్పూను;  జీలకర్ర – అర టీ స్పూను; పచ్చి మిర్చి తరుగు – ఒక టీ స్పూను; ఉల్లికాడల తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు; ఉప్పు – తగినంత; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా

తయారీ:ముందుగా బంగాళ దుంపలను శుభ్రంగా కడిగి తొక్క తీసి, తురుముకుని తగినన్ని నీళ్లలో పది నిమిషాలు నానబెట్టాక, నీళ్లను గట్టిగా పిండి తీసేయాలి. (తడి లేకుండా చూసుకోవాలి) ∙ఒక పాత్రలో కార్న్‌ ఫ్లోర్, సెనగ పిండి, బంగాళ దుంప తురుము, మిరియాల పొడి, జీలకర్ర, పచ్చి మిర్చి తరుగు, ఉల్లికాడల తరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి      పిండి మరీ పల్చగా అనిపిస్తే మరి కాస్త పిండి జత చేయాలి ∙స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక, కొద్దిగా నూనె వేయాలి. పిండి మిశ్రమం కొద్దిగా తీసుకుని పెనం మీద పల్చగా పరవాలి ∙మంట మీడియంలో ఉంచి, చీలాను రెండు వైపులా నూనె వేసి కాల్చి తీసేయాలి.ఇవి గ్రీన్‌ చట్నీతో రుచిగా ఉంటాయి.

ముంబై  ఐస్‌ హల్వా
కావలసినవి: పాలు – ఒకటిన్నర కప్పులు;పంచదార – ఒక కప్పు;నెయ్యి – పావు కప్పు; కార్న్‌ ఫ్లోర్‌ – పావు కప్పు; మిఠాయి రంగు – చిటికెడు (నారింజ రంగు);ఏలకుల పొడి – పావు టీ స్పూను; 
బాదం పప్పుల తరుగు – ఒక టేబుల్‌ స్పూను; పిస్తా తరుగు – ఒక టేబుల్‌ స్పూను

తయారీ :ఒక పాత్రలో పాలు, పంచదార, కార్న్‌ ఫ్లోర్, నెయ్యి వేసి బాగా కలిపి స్టౌ మీద సన్నటి మంట మీద ఉంచి, ఆపకుండా కలుపుతుండాలి ∙ ఐదు నిమిషాల తరవాత మిశ్రమం బాగా చిక్కబడ్డాక, మిఠాయి రంగు (నారింజ రంగు) జత చేయాలి ∙ ఒక టీ స్పూను నెయ్యి జత చేసి మరోమారు బాగా కలపాలి ∙ ఏలకుల పొడి జత చేసి మరోమారు కలిపి, మిశ్రమం బాగా ఉడికించాలి ∙ అవసరమనుకుంటే మరికాస్త నెయ్యి జత చేయాలి. ఉడికిన మిశ్రమాన్ని బటర్‌ షీట్‌ మీదకు తీసుకోవాలి ∙ పైన మరో బటర్‌ షీట్‌ ఉంచి, చపాతీ కర్రతో పల్చగా వచ్చేలా నెమ్మదిగా ఒత్తి, పైన వేసి బటర్‌ షీట్‌ను చేతితో జాగ్రత్తగా తీసేయాలి ∙ పిస్తా, బాదం తరుగును హల్వా మీద పల్చగా చల్లి, సుమారు రెండు గంటలపాటు గట్టిపడేవరకు ఆరనివ్వాలి లేదంటే పావుగంట సేపు ఫ్రిజలో ఉంచి తీయాలి ∙ చాకు సహాయంతో బటర్‌ షీట్‌తో కలిపి కట్‌ చేయాలి. దీనిని ఫ్రిజ్‌లో ఉంచితే సుమారు పది రోజుల పాటు నిల్వ ఉంటుంది.

పోహా  పకోరా
కావలసినవి: పల్చటి అటుకులు – ఒక కప్పు; ఉల్లి తరుగు – ఒక టేబుల్‌ స్పూను;ఉడికించిన బంగాళ దుంప – 1;అల్లం పేస్ట్‌ – అర టీ స్పూను;పచ్చి మిర్చి తరుగు – ఒక టీ స్పూను;కొత్తిమీర తరుగు – ఒక టీ స్పూను;కరివేపాకు – రెండు రెమ్మలు; మిరప కారం – పావు టీ స్పూను;వాము – పావు టీ స్పూను; ఆమ్‌చూర్‌ పొడి – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; వేయించి పొడి చేసిన పల్లీలు – 2 టేబుల్‌ స్పూన్లు; సెనగపిండి – 3 టేబుల్‌ స్పూన్లు; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా

తయారీ:ముందుగా అటుకులను తగినంత నీటిలో రెండు నిమిషాలు ఉంచి, శుభ్రంగా కడిగి ఒక పాత్రలోకి తీసుకోవాలి. (నీరు ఎక్కువగా ఉంటే తీసేయాలి)   ∙ఉల్లి తరుగు, ఉడికించిన బంగాళ దుంప, అల్లం పేస్ట్, పచ్చి మిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, కరివేపాకు వేసి కలపాలి ∙మిరప కారం, వాము, ఆమ్‌ చూర్, ఉప్పు జత చేసి మరోమారు కలపాలి ∙ పొడి చేసిన పల్లీలు, సెనగ పిండి జత చేసి పకోడీల పిండిలా కలపాలి ∙ స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాగనివ్వాలి  ∙కలిపి ఉంచుకున్న పిండిని కొద్దిగా చేతిలోకి తీసుకుని చిన్న సైజు బాల్‌లాగ గుండ్రంగా చేయాలి ∙ కాగిన నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి ∙ టొమాటో సాస్‌తో తింటే రుచిగా ఉంటాయి.

బ్రెడ్‌ మసాలా దోసె
కావలసినవి:బ్రెడ్‌ స్లైసులు – 8; బొంబాయి రవ్వ – అర కప్పు;బియ్యప్పిండి – 2 టేబుల్‌ స్పూన్లు; పెరుగు – పావు కప్పు;నీళ్లు – తగినన్ని; ఉప్పు – తగినంత; నూనె – దోసెలు కాల్చడానికి తగినంత;
స్టఫింగ్‌ కోసం – ఆలూ భాజీ / పొటాటో మసాలా/ బంగాళ దుంపల కూర

తయారీ:బ్రెడ్‌స్లైసులు తీసుకుని వాటి అంచులను కట్‌ చేసి తీసేయాలి. బ్రెడ్‌ను చేతితో మెత్తగా పొడిలా చేయాలి ∙పెద్ద ముక్కలు ఉండకుండా జాగ్రత్తపడాలి ∙బొంబాయి రవ్వ, బియ్యప్పిండి, పెరుగు, నీళ్లు, ఉప్పు జత చేసి బాగా కలిపి అరగంట సేపు నానబెట్టాలి ∙అర గంట తరవాత వీటిని మిక్సీలో వేసి మెత్తగా దోసెల పిండిలా రుబ్బుకోవాలి ∙స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక కొద్దిగా నూనె వేయాలి ∙పిండిని గరిటెతో తీసుకుని పెనం మీద వేసి పల్చగా దోసెలా సమానంగా పరిచాక, పైన ఆలూ భాజీ/పొటాటో మసాలా/బంగాళ దుంప కూరను కొద్దిగా ఉంచి, దోసె కాలాక రోల్‌ చేసి ప్లేట్‌లోకి తీసుకోవాలి ∙కొబ్బరి చట్నీ,సాంబారుతో వేడివేడిగా అందించాలి.

సాబుదానా  ఇడ్లీ
కావలసినవి:సాబుదానా (సగ్గు బియ్యం) – అర కప్పు; ఇడ్లీ రవ్వ – ఒక కప్పు; పెరుగు – 2 కప్పులు; నీళ్లు – తగినన్ని; ఉప్పు – రుచికి తగినంత; బేకింగ్‌ సోడా – చిటికెడు ; జీడిపప్పు పలుకులు – ఒక టేబుల్‌ స్పూను; నూనె – కొద్దిగా

తయారీ:ముందుగా సగ్గు బియ్యాన్ని తగినన్ని నీళ్లలో శుభ్రంగా కడగాలి ∙ఒక పాత్రలో సగ్గు బియ్యం, ఇడ్లీ రవ్వ వేసి, పెరుగు జత చేసి బాగా కలపాలి ∙కొంచెం నీళ్లు కూడా జత చేసి బాగా కలిపి ముందు రోజు రాత్రంతా నానబెట్టాలి ∙(సగ్గుబియ్యం విరిగిపోకుండా జాగ్రత్త గా కలపాలి) ∙పిండి మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీరు జత చేసుకోవచ్చు∙ఉప్పు జత చేసి మరోమారు కలపాలి. ఇడ్లీలు వేసే ముందు చిటికెడు బేకింగ్‌ సోడా జత చేయాలి ∙ఇడ్లీ రేకులకు నూనె పూయాలి ∙రేకుల మీద ముందుగా జీడిపప్పు పలుకులు వేసి, ఆ పైన సాబుదానా ఇడ్లీ పిండి ఒక గరిటెడు వేయాలి ∙ఇలా ఇడ్లీలన్నీ వేసి కుకర్‌లో ఉంచి విజిల్‌ లేకుండా మూత పెట్టి, స్టౌ మీద ఉంచి పది నిమిషాల తరవాత దింపేయాలి ∙కొద్దిగా వేడి తగ్గిన తరవాత ఇడ్లీలను ప్లేటులోకి తీసుకోవాలి ∙కొబ్బరి చట్నీ, పల్లీ పొడి, సాంబారులను నంచుకుని తింటే రుచిగా ఉంటుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement