కడియపులంక మార్కెట్‌లో మూడింతలు పెరిగిన ధరలు
వరుస శుభకార్యాలు, పండుగల జోరే కారణం దిగుమతులపైనే ఆధారం
ఆలమూరు: తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన కడియపులంక పూల మార్కెట్ శ్రావణ శోభతో కళకళలాడుతోంది. పూల దిగుబడికన్నా డిమాండ్ అధికంగా ఉండటంతో ధరలు మూడింతలు పెరిగాయి. వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల కొంతకాలంగా ఇబ్బందులు పడుతున్న పూల రైతులకు ప్రస్తుత ధరలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, విజయ దశమి, దీపావళి వంటి వరుస శుభకార్యాలు, నాలుగు నెలల పాటు వివాహాలు ఉండటంతో మార్కెట్ సందడిగా మారింది.
అన్ని రకాల పూలకూ డిమాండ్
కడియపులంక పూల మార్కెట్‌లో అన్ని రకాల పూలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. చామంతి, మల్లి, జాజులు, లిల్లీ రైతులకు ప్రస్తుత ధరలు సిరుల్ని కురిపిస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే పూల ధరలు మూడు రెట్లు పెరిగినా.. తోటలు ఖాళీ అవడంతో చాలామంది రైతులు నిరుత్సాహానికి గురవుతున్నారు.
జిల్లాలో సాగు చేస్తున్న కొత్త రకం చామంతి పూలకు ఎండలను తట్టుకునే శక్తి ఉండటంతో జిల్లాలో కొంతమేర పూల దిగుబడి ఆశాజనకంగా ఉంది. వాతావరణ మార్పుల ప్రభావంతో పూల తోటలు ఎండిపోయి దిగుబడి గణనీయంగా పడిపోతోంది. దీంతో స్థానికంగా పండించే పూలు అవసరాలకు సరిపోని పరిస్థితి ఏర్పడింది.
దిగుమతుల వల్లే..
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని నదీ పరీవాహక ప్రాంతాల వెంబడి సుమారు 5 వేల ఎకరాల్లో వివిధ రకాల పూల సాగు జరుగుతోంది. రైతులు పండించిన పూలను కడియపులంక పూల మార్కెట్‌కు తరలించి విక్రయాలు జరుపుతారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కడియం, ఆలమూరు, ఆత్రేయపురం, రాజమహేంద్రవరం రూరల్, సీతానగరం, కె.గంగవరం, కపిలేశ్వరపురం మండలాల నుంచి నిత్యం సుమారు 20 టన్నుల పూలు కడియపులంక మార్కెట్‌కు వస్తుంటాయి.
ఇదే సమయంలో ఇతర రాష్ట్రాలకు, జిల్లాలకు ఎగుమతులు జరుగుతుండటంతో పూల కొరత ఏర్పడుతోంది. దీంతో మార్కెట్ డిమాండ్‌ను అనుసరించి కడియపులంక హోల్‌సేల్ వ్యాపారులు బెంగళూరు, చెన్నై, మహారాష్ట్ర నుంచి వివిధ రకాల పూలను దిగుమతి చేసుకుంటున్నారు. దీనికితోడు వరుస శుభకార్యాలు, దిగుమతుల ప్రభావంతో పాటు రవాణా ఖర్చులు పెరిగిపోవడంతో పూల ధర పెరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అలంకరణ పూలకు భలే డిమాండ్
శుభకార్యాల్లో అలంకరణకు ఉపయోగించే జర్బరా పూలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కల్యాణ వేదికలకు అవసరమయ్యే పూలు స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో బెంగళూరు, ఊటీ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇప్పటివరకూ రూ.40 పలికిన పది పూల కట్ట ధర ప్రస్తుతం రూ.110కి చేరింది. వివాహ, శుభకార్యాల వల్ల మంటపాలు అలంకరించే వారు జిల్లా నలుమూలల నుంచి భారీ స్థాయిలో ఆర్డర్లు పెడుతున్నారు. దీంతో డెకరేషన్ పూల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.
ధర ఆశాజనకం
ఈ సీజన్‌లో అన్ని రకాల పూల ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. జిల్లాలో పూల దిగుబడి తగ్గడంతో మార్కెట్‌కు రికార్డు స్థాయిలో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు జరుగుతున్నాయి. ప్రస్తుతం శుభ ముహూర్తాలు వరుసగా రావడంతో పూల ధరలు ఇంచుమించు ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. – సాపిరెడ్డి సత్తిబాబు, పూల వ్యాపారి, కడియపులంక
చామంతి సాగుతో లాభాలు
ఇప్పటివరకూ అంతంత మాత్రంగానే ఉన్న పూల సాగు ప్రస్తుతం లాభాలను తెచ్చిపెడుతోంది. వరుసగా వివాహాలు, పండుగలు ఉండటంతో పూల ధర ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందని ఆశిస్తున్నాం. – మందపల్లి శ్రీధర్, ఉద్యాన రైతు, బడుగువానిలంక
Comments
Please login to add a commentAdd a comment