flower prices
-
పూల ధర.. జేబులదర..
ఆలమూరు: తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన కడియపులంక పూల మార్కెట్ శ్రావణ శోభతో కళకళలాడుతోంది. పూల దిగుబడికన్నా డిమాండ్ అధికంగా ఉండటంతో ధరలు మూడింతలు పెరిగాయి. వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల కొంతకాలంగా ఇబ్బందులు పడుతున్న పూల రైతులకు ప్రస్తుత ధరలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, విజయ దశమి, దీపావళి వంటి వరుస శుభకార్యాలు, నాలుగు నెలల పాటు వివాహాలు ఉండటంతో మార్కెట్ సందడిగా మారింది. అన్ని రకాల పూలకూ డిమాండ్కడియపులంక పూల మార్కెట్లో అన్ని రకాల పూలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. చామంతి, మల్లి, జాజులు, లిల్లీ రైతులకు ప్రస్తుత ధరలు సిరుల్ని కురిపిస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే పూల ధరలు మూడు రెట్లు పెరిగినా.. తోటలు ఖాళీ అవడంతో చాలామంది రైతులు నిరుత్సాహానికి గురవుతున్నారు. జిల్లాలో సాగు చేస్తున్న కొత్త రకం చామంతి పూలకు ఎండలను తట్టుకునే శక్తి ఉండటంతో జిల్లాలో కొంతమేర పూల దిగుబడి ఆశాజనకంగా ఉంది. వాతావరణ మార్పుల ప్రభావంతో పూల తోటలు ఎండిపోయి దిగుబడి గణనీయంగా పడిపోతోంది. దీంతో స్థానికంగా పండించే పూలు అవసరాలకు సరిపోని పరిస్థితి ఏర్పడింది.దిగుమతుల వల్లే..ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని నదీ పరీవాహక ప్రాంతాల వెంబడి సుమారు 5 వేల ఎకరాల్లో వివిధ రకాల పూల సాగు జరుగుతోంది. రైతులు పండించిన పూలను కడియపులంక పూల మార్కెట్‌కు తరలించి విక్రయాలు జరుపుతారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కడియం, ఆలమూరు, ఆత్రేయపురం, రాజమహేంద్రవరం రూరల్, సీతానగరం, కె.గంగవరం, కపిలేశ్వరపురం మండలాల నుంచి నిత్యం సుమారు 20 టన్నుల పూలు కడియపులంక మార్కెట్‌కు వస్తుంటాయి. ఇదే సమయంలో ఇతర రాష్ట్రాలకు, జిల్లాలకు ఎగుమతులు జరుగుతుండటంతో పూల కొరత ఏర్పడుతోంది. దీంతో మార్కెట్ డిమాండ్‌ను అనుసరించి కడియపులంక హోల్‌సేల్ వ్యాపారులు బెంగళూరు, చెన్నై, మహారాష్ట్ర నుంచి వివిధ రకాల పూలను దిగుమతి చేసుకుంటున్నారు. దీనికితోడు వరుస శుభకార్యాలు, దిగుమతుల ప్రభావంతో పాటు రవాణా ఖర్చులు పెరిగిపోవడంతో పూల ధర పెరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.అలంకరణ పూలకు భలే డిమాండ్శుభకార్యాల్లో అలంకరణకు ఉపయోగించే జర్బరా పూలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కల్యాణ వేదికలకు అవసరమయ్యే పూలు స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో బెంగళూరు, ఊటీ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇప్పటివరకూ రూ.40 పలికిన పది పూల కట్ట ధర ప్రస్తుతం రూ.110కి చేరింది. వివాహ, శుభకార్యాల వల్ల మంటపాలు అలంకరించే వారు జిల్లా నలుమూలల నుంచి భారీ స్థాయిలో ఆర్డర్లు పెడుతున్నారు. దీంతో డెకరేషన్ పూల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.ధర ఆశాజనకంఈ సీజన్లో అన్ని రకాల పూల ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. జిల్లాలో పూల దిగుబడి తగ్గడంతో మార్కెట్‌కు రికార్డు స్థాయిలో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు జరుగుతున్నాయి. ప్రస్తుతం శుభ ముహూర్తాలు వరుసగా రావడంతో పూల ధరలు ఇంచుమించు ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. – సాపిరెడ్డి సత్తిబాబు, పూల వ్యాపారి, కడియపులంకచామంతి సాగుతో లాభాలు ఇప్పటివరకూ అంతంత మాత్రంగానే ఉన్న పూల సాగు ప్రస్తుతం లాభాలను తెచ్చిపెడుతోంది. వరుసగా వివాహాలు, పండుగలు ఉండటంతో పూల ధర ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందని ఆశిస్తున్నాం. – మందపల్లి శ్రీధర్, ఉద్యాన రైతు, బడుగువానిలంక -
పూల ధరలు పైపైకి..
సాధారణంగా ఇంట్లో పూజలు, వివాహ శుభకార్యాలకు ఎక్కువగా పూలకు ప్రాధాన్యత ఇస్తారు. పూలను పూజిస్తూ దేవుళ్లుగా భావించే తెలంగాణ సంస్కృతికి అద్దం పడుతుంది బతుకమ్మ పండుగ. పూల పండుగ అంటే ఊరూ వాడ బతుకమ్మ సందడి. వివిధ రకాల పువ్వులతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను పూజిస్తారు. ఎంగిలి పూల బతుకమ్మ నుంచి మొదలైన పూల జాతర సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. వివిధ రకాల పువ్వుల్లో ఔషధ గుణాలుంటాయని, బతుకమ్మలను చెరువుల్లో నిమజ్జనం చేస్తే చెరువు నీటిలో ఉండే క్రిములు చనిపోయి నీరు శుభ్రమవుతుంది. అంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న బతుకమ్మ పండుగ పూలు సాగు చేసే రైతులను నిరాశకు గురి చేసింది. సాక్షి, సంగారెడ్డి: ముసురు వర్షాలతో పూలు మురిగిపోయి అనుకున్న దిగుబడి రాకపోవడంతో పండుగ సందర్భంగా బతుకమ్మ బంతి పైపైకి లేస్తోంది. పూల పండుగైన బతుకమ్మ పండుగ సందర్భంగా వివిధ రకాల పువ్వులకు ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా సద్దుల బతుకమ్మకు బంతి, ముద్ద బంతి, తంగెడు, చామంతి, పట్టుకుచ్చుల పువ్వులకు భలే గిరాకీ పెరిగింది. హుస్నాబాద్ పట్టణంలోని పందిల్లకు చెందిన గూళ్ల రవి తనకున్న భూమిలో బంతి, చామంతి, మల్లె, కనకంబురాల, పట్టుకుచ్చుల సాగు చేశాడు. సాగు చేసిన తోటలు కనువిందు చేస్తున్నాయి. బతుకమ్మ సందర్భంగా రవి ఎకరం కనకంబురాలు, 10 గుంటలు పట్టుకుచ్చులు, 10 గుంటలు బంతి, 10 గుంటలు మల్లె పూలు సాగు చేశాడు. ముసురు వర్షాలతో పూల సాగు అనుకున్నంత స్థాయిలో దిగుబడి రాలేదు. కొద్దోగొప్పో పూలు పూసిన బంతి పూలు గుత్తులతో నిగనిగలాడుతోంది. కిలోకి రూ.50కి పైనే.. సాధారణ రోజుల్లో ఒక కిలోకు రూ.30 ధర పలుకుతుందని, పండగ వేళల్లో మార్కెట్లో కిలో బంతికి రూ.50 పలుకుతుందని రైతు తెలిపారు. పూల సాగు లాభదాయకమని నమ్మిన రైతు రకరకాల పువ్వుల సాగుచేస్తున్నాడు. ప్రస్తుతం తెలంగాణ అంతటా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుతున్న వేళ బంతి పూల ధరలు ఆకాశనంటుతున్నాయి. ఏ పల్లె, ఏ ఊరు, ఏ వాడలో చూసిన బతుకమ్మ ఆటలతో మహిళలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పూల ధరలకు రెక్కలచ్చాయి. తుంపురు వర్షాలతో, ఉన్న నీటితో వ్యవసాయం సాగు చేస్తున్న రైతులు పూల తోటలపై ఎక్కువ దృష్టి సారించకపోవడంతో బతుకమ్మ పండుగకు అవసరమయ్యే పూల ధరలు కొండనెక్కి కూర్చున్నాయి. మరో మూడు రోజుల్లో పూల జాతర రానుండటంతో బంతి పూల ధరలు జనానికి చుక్కలు చూపెట్టనున్నాయి. మండుతున్న ధరలు ఓ వైపు బతుకమ్మ సంబరాలు, మరో వైపు వర్షాలు లేక పూల తోటల సాగు తగ్గిపోవడంతో పూల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. బతుకమ్మ పండుగ సందర్భంగా హుస్నాబాద్ మార్కెట్లో పూల ధరలు మండుతున్నాయి. బంతి కిలోకు రూ.100, చామంతి కిలోకు రూ.400, కాగడ మల్లెపువ్వులు రూ.700, గులాభి రూ.400 ధరలు పలుకుతుండటంతో జనాలు బెంబలెత్తిపోతున్నారు. దీంతో పాటుగా పట్టుకుచ్చుల పువ్వులు ఒక్క కట్టకు రూ.20 పలుకుతుంది. ఇది కూడ నేరుగా రైతులు అమ్మితేనే ఈ ధర పలుకుతుంది. బతుకమ్మ పండుగ సందర్బంగా గునుగు. తంగేడు, పట్టు కుచ్చులు, చామంతి, బంతి పువ్వులను అధికంగా వాడుతారు. ప్రస్తుతం ఉన్న ఈ పూల ధరలు బతుకమ్మ పండుగ వరకు ఇంకా పెరగవచ్చని పూల వ్యాపారులు చెబుతున్నారు. పూల ధరలు పెరిగినయ్ బతుకమ్మ సందర్భంగా పూల ధరలు పెరిగినయ్. గతం కంటే ఈ ఏడాది పూల దిగుబడి తగ్గడంతో ధరలు అంతకంతకు పెరిగాయి. హోల్‌సెల్ ధరలు సైతం ఎక్కువ పెంచారు. బంతిపూలు కిలోకు రూ.100కు పైగా అమ్ముతున్నాం. పూల డిమాండ్‌ను బట్టి పండుగ రోజున బంతి పూల ధర రూ.200 వరకు పెరిగే అవకాశాలున్నాయి. – షబ్బీర్, పూల వ్యాపారి, హుస్నాబాద్ దిగుబడి తగ్గింది పండుగను బట్టి పూల సాగు చేపడుతాను. బతుకమ్మ పండుగ సందర్భంగా 10 గుంటల్లో బంతి పూల విత్తనాలు చల్లితే, సగం నష్టం వచ్చింది. ముసురు వర్షాలతో పూలు మురిగిపోయి అనుకున్నంత స్థాయిలో దిగుబడి రాలేదు. ఈ పువ్వులను సిద్దిపేట, హుస్నాబాద్ మార్కెట్‌కు తరలించి అమ్ముతున్నాను. కిలోకి రూ.50 ధర పలుకుతోంది. – గూళ్ల రవి, రైతు, పందిల్ల -
గులాబి@400, చామంతి@500
హైదరాబాద్ : రేపు శ్రావణ శుక్రవారం కావడంతో పూలు, పూజ సామాగ్రి కొనుగోళ్లలో మహిళలు మునిగిపోయారు. దీంతో పూల మార్కెట్ల వద్ద రద్దీ ఎక్కువైంది. ఇదే అదనుగా భావించిన పూల విక్రయదారులు పూల రేట్లను అమాంతం పెంచేశారు. గురువారం సాయంత్రం దిల్సుఖ్నగర్ కొత్తపేటలోని పూల మార్కెట్లో బంతిపూలు కిలో రూ.100కు , గులాబి కిలో రూ.400లు, చామంతి పూలు కిలో రూ.500లు పలుకుతుండటంతో మహిళలు అవాక్కవుతున్నారు. నిన్న మొన్నటి వరకు 50-60 రూపాయలు ఉన్న బంతిపూలు రూ.100కు కూడా లభించకపోవడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పుష్పవిలాపం
మొయినాబాద్, న్యూస్‌లైన్: మొన్నటి వరకూ ‘వికసించిన’ పూలు ప్రస్తుతం ‘విలపిస్తున్నాయి’. ధరలు అమాంతం పడిపోయాయి. చేలల్లో నిండా పూచిన పూలను చూసి ఆనందపడ్డ రైతన్నకు మార్కెట్‌కు వెళ్లగానే నిరాశ ఎదురవుతోంది. కనీసం కూలీలకు సరిపోయే డబ్బులు కూడా రావడంలేదు. మార్కెట్లో పూలు అమ్ముడుపోకపోవడంతో కొంతమంది పారబోసివెళ్తున్నారు. సంక్రాంతి పండుగకు ముందు పూలకు మంచి ధరలు ఉన్నాయి. పండుగ తరువాత ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వేల రూపాయలు ఖర్చుపెట్టి సాగుచేస్తే ధరలు లేక నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని గుడిమల్కాపూర్ పూలమార్కెట్ అందుబాటులో ఉండటంతో రైతుల్లో పూలసాగుపై ఆసక్తి పెరిగింది. మండలంలోని అమ్డాపూర్, కాశీం బౌలి, ముర్తూజగూడ, శ్రీరాంనగర్, సురంగల్, కేతిరెడ్డిపల్లి, నక్కలపల్లి, ఎత్బార్పల్లి, తోలుకట్ట, చిన్నషాపూర్, అప్పారెడ్డిగూడ, పెద్దమంగళారం, చిలుకూరు తదితర గ్రామాల్లో పూలు అధికంగా సాగు చేస్తున్నారు. బంతి, చామంతి, సిల్పర్, చాందిని, హాస్టల్, గులాబి తదితర రకాలు పండిస్తున్నారు. తగ్గిన గిరాకీ... సంక్రాంతికి ముందు కిలోకు రూ.50 నుంచి రూ.100 వరకు ఉన్న ధరలు ఇప్పడు రూ.30 నుంచి రూ.5కు పడిపోయాయి. డిసెంబర్లో అయ్యప్ప స్వామి పూజలు ఉండటంతో పూలకు గిరాకీ బాగుండేది. ప్రస్తుతం పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండగలు ఏవీ లేకపోవడంతో మార్కెట్లో ధర పడిపోయింది. నారు పోసినప్పటి నుంచి పూలు పూసే వరకు ఖర్చు అధికంగా ఉంటుంది. ఈ ఖర్చులన్నీ పక్కన పెట్టినా ప్రస్తుతం పూలు తెంపి మార్కెట్‌కు తరలించడానికి అయ్యే ఖర్చులు కూడా రావడంలేదని రైతులు వాపోతున్నారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉండటం, వివిధ జాతరలు ఉండటంతో ధరలు పెరుగుతాయని ఆశిస్తున్నారు. ఖర్చులు కూడా రావడం లేదు.. మార్కెట్లో పూల ధరలు పూర్తిగా పడిపోయాయి. కష్టపడి సాగుచేసి పూలు తీసుకుని మార్కెట్‌కు వెళ్తే కనీసం ఖర్చులు కూడా రావడంలేదు. చేలల్లోనే పూలు వదిలేస్తే మళ్లీ కొత్తపూలు పూయవని తెంపాల్సి వస్తోంది. ధరలు ఇలాగే ఉంటే వేలల్లో పెట్టుబడులు నష్టపోవాల్సి వస్తుంది. - అవురం కృష్ణ, ముర్తూజగూడ శుభకార్యాలు లేకపోవడంతోనే.. చాందిని పూలు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. మార్కెట్లో ధర మాత్రం కిలో రూ.8 ఉంది. పూలు తెంపి అమ్మి తే కూళ్లు కూడా రావడంలేదు. ప్రస్తు తం చాలామంది పూలసాగు చేశారు. ఆ పూలన్నీ ఇప్పుడే వస్తున్నాయి. శుభకార్యాలు లేకపోవడంతో మార్కెట్లో పూల ధర పడిపోయింది. - కడెపు అంజిరెడ్డి, అమ్డాపూర్ మార్కెట్లో పూల ధరలు పూలపేరు- ప్రస్తుతం (కిలో)- గతనెల (కిలో) బంతి- రూ. 10-12 -రూ. 35-40 చామంతి- రూ. 40-45- రూ. 100-120 సిల్పర్ -రూ. 20-25- రూ.70-80 చాందిని- రూ. 8-12- రూ.50-60 టైగర్ గులాబి- రూ. 35-45- రూ. 100-110 ఫైవ్‌స్టార్ గులాబి -రూ. 30-40- రూ. 100-110