మొయినాబాద్, న్యూస్‌లైన్: మొన్నటి వరకూ ‘వికసించిన’ పూలు ప్రస్తుతం ‘విలపిస్తున్నాయి’. ధరలు అమాంతం పడిపోయాయి. చేలల్లో నిండా పూచిన పూలను చూసి ఆనందపడ్డ రైతన్నకు మార్కెట్‌కు వెళ్లగానే నిరాశ ఎదురవుతోంది. కనీసం కూలీలకు సరిపోయే డబ్బులు కూడా రావడంలేదు. మార్కెట్‌లో పూలు అమ్ముడుపోకపోవడంతో కొంతమంది పారబోసివెళ్తున్నారు. సంక్రాంతి పండుగకు ముందు పూలకు మంచి ధరలు ఉన్నాయి. పండుగ తరువాత ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వేల రూపాయలు ఖర్చుపెట్టి సాగుచేస్తే ధరలు లేక నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని గుడిమల్కాపూర్ పూలమార్కెట్ అందుబాటులో ఉండటంతో రైతుల్లో పూలసాగుపై ఆసక్తి పెరిగింది. మండలంలోని అమ్డాపూర్, కాశీం బౌలి, ముర్తూజగూడ, శ్రీరాంనగర్, సురంగల్, కేతిరెడ్డిపల్లి, నక్కలపల్లి, ఎత్‌బార్‌పల్లి, తోలుకట్ట, చిన్నషాపూర్, అప్పారెడ్డిగూడ, పెద్దమంగళారం, చిలుకూరు తదితర గ్రామాల్లో పూలు అధికంగా సాగు చేస్తున్నారు. బంతి, చామంతి, సిల్పర్, చాందిని, హాస్టల్, గులాబి తదితర రకాలు పండిస్తున్నారు.
తగ్గిన గిరాకీ...
సంక్రాంతికి ముందు కిలోకు రూ.50 నుంచి రూ.100 వరకు ఉన్న ధరలు ఇప్పడు రూ.30 నుంచి రూ.5కు పడిపోయాయి. డిసెంబర్‌లో అయ్యప్ప స్వామి పూజలు ఉండటంతో పూలకు గిరాకీ బాగుండేది. ప్రస్తుతం పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండగలు ఏవీ లేకపోవడంతో మార్కెట్‌లో ధర పడిపోయింది. నారు పోసినప్పటి నుంచి పూలు పూసే వరకు ఖర్చు అధికంగా ఉంటుంది. ఈ ఖర్చులన్నీ పక్కన పెట్టినా ప్రస్తుతం పూలు తెంపి మార్కెట్‌కు తరలించడానికి అయ్యే ఖర్చులు కూడా రావడంలేదని రైతులు వాపోతున్నారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉండటం, వివిధ జాతరలు ఉండటంతో ధరలు పెరుగుతాయని ఆశిస్తున్నారు.
ఖర్చులు కూడా రావడం లేదు..
మార్కెట్‌లో పూల ధరలు పూర్తిగా పడిపోయాయి. కష్టపడి సాగుచేసి పూలు తీసుకుని మార్కెట్‌కు వెళ్తే కనీసం ఖర్చులు కూడా రావడంలేదు. చేలల్లోనే పూలు వదిలేస్తే మళ్లీ కొత్తపూలు పూయవని తెంపాల్సి వస్తోంది. ధరలు ఇలాగే ఉంటే వేలల్లో పెట్టుబడులు నష్టపోవాల్సి వస్తుంది.
- అవురం కృష్ణ, ముర్తూజగూడ
శుభకార్యాలు లేకపోవడంతోనే..
చాందిని పూలు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. మార్కెట్‌లో ధర మాత్రం కిలో రూ.8 ఉంది. పూలు తెంపి అమ్మి తే కూళ్లు కూడా రావడంలేదు. ప్రస్తు తం చాలామంది పూలసాగు చేశారు. ఆ పూలన్నీ ఇప్పుడే వస్తున్నాయి. శుభకార్యాలు లేకపోవడంతో మార్కెట్‌లో పూల ధర పడిపోయింది.
- కడెపు అంజిరెడ్డి, అమ్డాపూర్
మార్కెట్‌లో పూల ధరలు
పూలపేరు- ప్రస్తుతం (కిలో)- గతనెల (కిలో)
బంతి- రూ. 10-12 -రూ. 35-40
చామంతి- రూ. 40-45- రూ. 100-120
సిల్పర్ -రూ. 20-25- రూ.70-80
చాందిని- రూ. 8-12- రూ.50-60
టైగర్ గులాబి- రూ. 35-45- రూ. 100-110
ఫైవ్‌స్టార్ గులాబి -రూ. 30-40- రూ. 100-110
పుష్పవిలాపం
Published Fri, Jan 24 2014 12:40 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement