చికెన్, మటన్‌కు తగ్గిన డిమాండ్!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మాంసం, చేపల విక్రయాలకు డిమాండ్ తగ్గిపోయింది. శ్రావణ మాసంలో పడిపోయిన విక్రయాలు ఇంకా పుంజుకోలేదు. ప్రస్తుతం దుర్గామాత నవరాత్రి పూజలు, వ్రతాల వల్ల చికెన్, మటన్, చేపలకు అంతగా గిరాకీ లేకుండా పోయిందని వ్యాపారులు వ్యాఖ్యానిస్తున్నారు. సాధారణంగా ఆదివారం వచ్చిందంటే చాలు... చాలామంది అది మాంసాహార దినంగా పరిగణిస్తుంటారు. అయితే... ఈ ఆదివారం మాత్రం మాంసం, చేపల వ్యాపారులకు షాక్ ఇచ్చింది. అమ్మకాలు 30-35శాతం మేరకు పడిపోయాయి.
సాధారణంగా ప్రతి ఆదివారం నగరంలో సుమారు 600-650 టన్నులకు పైగా చికెన్, 250-300 టన్నుల మటన్, 80-120 టన్నుల మేర చేపల విక్రయాలు సాగుతుంటాయి. అయితే... ఈ ఆదివారం చికెన్ 400టన్నుల లోపు అమ్ముడుపోగా, మటన్ సుమారు 180 టన్నులు, చేపలు 20 టన్నుల వరకు అమ్మకాలు సాగినట్టు వ్యాపార వర్గాల అంచనా. ఇప్పుడు దుర్గానవరాత్రి వేడుకలు జరుగుతుండటంతో చాలామంది పూజలు, వ్రతాలతో నియమ నిష్టలు పాటిస్తూ మంసాహారానికి దూరంగా ఉంటారు.
ఈ కారణంగానే చికెన్, మటన్, చేపలకు డిమాండ్ పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నాయి. ముషీరాబాద్‌లోని ఒక్క దయారా ఫిష్ మార్కెట్‌కు ఆదివారం 50-60 టన్నుల చేపలు దిగుమతి అవుతుంటాయి. అయితే... ఇప్పుడు పెద్దగా వ్యాపారం లేకపోవడంతో ఆదివారం కేవలం 20 టన్నుల లోపే సరుకు దిగుమతి అయినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
దిగివచ్చిన చికెన్..
చికెన్ ధరలు ఆదివారం బాగా దిగివచ్చాయి. పౌల్ట్రీ ఫారం దగ్గర లైవ్ కోడి కేజీ రూ.50లు ధర పలకగా... హోల్‌సేల్‌గా రూ.56లకు చేరింది. అదే రిటైల్ మార్కెట్లోకి వచ్చేసరికి కేజీ రూ.65ల ప్రకారం విక్రయించారు. ఇదే చికెన్ (స్కిన్‌తో) కేజీ రూ.90లకు విక్రయించగా, స్కిన్‌లెన్ రూ.110ల ప్రకారం విక్రయించారు. అలాగే మటన్ కేజీ రూ.450-500, బోన్ లెస్ రూ.650-700లకు విక్రయించగా, చేపలు రవ్వ కేజీ రూ.130, బొచ్చె రూ.120, కొరమీన్ రూ.150-800, గోల్డ్ ఫిష్ రూ.100, రొయ్య, రూ.200-250ల ప్రకారం విక్రయించారు. అయితే... నగరంలో అన్నిచోట్ల ఈ ధరలు ఒకేలా లేవు. గిరాకీని బట్టి ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ధర నిర్ణయించి సొమ్ము చేసుకున్నారు. ఒకచోట కిలో మటన్ రూ.450 ఉండగా, మరో చోట రూ.500లకు విక్రయించారు.