మాంసానికి ‘శ్రావణం’ ఎఫెక్ట్
- 30 శాతం పడిపోయిన విక్రయాలు
- అమ్మకాల్లేక వ్యాపారులు విలవిల
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఈ ఆదివారం మాంసం, చేపల వ్యాపారులకు షాక్ ఇచ్చింది. శ్రావణ మాసం పూజలు కారణంగా మాంసం, చేపల విక్రయాలకు డిమాండ్ పడిపోయింది. ఆదివారం ఒక్కరోజే అమ్మకాలు 30 శాతం మేర పడిపోయాయి. సాధారణంగా ప్రతి ఆదివారం నగరంలో సుమారు 550-600 టన్నులకు పైగా చికెన్, 220-280 టన్నుల మటన్, 80-120 టన్నుల మేర చేపల విక్రయం జరుగుతుంది. అయితే, ఈ ఆదివారం చికెన్ 300 టన్నుల లోపు అమ్ముడు పోగా, మటన్ సుమారు 170 టన్నులు, చేపలు 20 టన్నులు మాత్రమే అమ్మకాలు జరిగినట్టు వ్యాపార వర్గాల అంచనా.
ఇప్పుడు శ్రావణ మాసం కావడంతో చాలామంది పూజలు, వ్రతాలతో మాంసాహారానికి దూరంగా ఉంటారు. ఈ కారణంగానే డిమాండ్ పడిపోయిందని వ్యాపారులంటున్నారు. ముషీరాబాద్‌లోని ఒక్క దయారా ఫిష్ మార్కెట్‌కే ప్రతీ ఆదివారం 70-80 టన్నుల చేపలు దిగుమతి అవుతుంటాయి. అయితే, ఇప్పుడు పెద్దగా వ్యాపారం లేకపోవడంతో ఈ ఆదివారం కేవలం 20 టన్నుల లోపే సరుకు దిగుమతి అయినట్టు తెలిసింది.
దిగిరాని ధరలు..
చికెన్, మటన్, చేపలకు డిమాండ్ తగ్గినా రిటైల్ మార్కెట్లో ధరలు మాత్రం తగ్గలేదు. పౌల్ట్రీ ఫారం దగ్గర లైవ్ కోడి కేజీ రూ.65 పలకగా.. హోల్‌సేల్‌గా రూ. 71కు చేరింది. అదే రిటైల్ మార్కెట్లోకి వచ్చేసరికి కేజీ రూ.83 ప్రకారం విక్రయించారు. ఇదే చికెన్ (స్కిన్‌తో) కేజీ రూ.116కు, స్కిన్‌లెస్ రూ.136 ప్రకారం విక్రయించారు.
అలాగే మటన్ కేజీ రూ.400-500, బోన్‌లెస్ రూ.600-650కు విక్రయించగా, చేపలు రవ్వ కేజీ రూ.60-70, బొచ్చె రూ.70-80, కొరమీను రూ.300-400, గోల్డ్ ఫిష్ రూ.70, రొయ్య, రూ.200-250 ప్రకారం అమ్మారు. అయితే, నగరంలో అన్నిచోట్లా ఈ ధరలు ఒకేలా లేవు. గిరాకీని బట్టి ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ధర నిర్ణయించి సొమ్ము చేసుకున్నారు.సాయంత్రానికి చేపల రేట్లు కాస్త తగ్గినా చికెన్, మటన్ ధరలు మాత్రం తగ్గలేదు.