
కొత్త రుచులను పరిచయం చేస్తున్న కర్రీ పాయింట్లు
ఇళ్లలోనూ వంటావార్పుకు అప్పుడప్పుడు బ్రేక్
పుట్టగొడుగుల్లా కర్రీస్ విక్రయ కేంద్రాలు
ఉరుకులు పరుగుల జీవితంలో ప్రత్యేకమైక సమయాన్ని కేటాయించి వంటలు చేసుకోవడం చాలా మందికి కష్టతరంగా మారింది. హోటల్స్‌లో భోజనం కూడా ఖర్చుతో కూడుకుంది కావడంతో అన్నం మాత్రం వండుకుని కర్రీస్‌ను బయట కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. దీంతో నగరంలో వీధికో కర్రీస్ పాయింట్లు వెలిశాయి.
నగరంలోని కర్రీస్ పాయింట్లకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. అందుకు తగ్గట్లు కొత్త రుచులతో ఆహార ప్రియులకు రోజుకో ఒక స్పెషల్ కర్రీని పరిచయం చేస్తున్నారు. నాన్‌వేజ్ ఐటమ్స్‌లో కొత్త రకాలను పరిచయం చేస్తూ కర్రీస్ సెంటర్లు నగర వాసుల మన్నలను పొందుతున్నాయి. 17 ఏళ్ల క్రితం మాగుంట లేఅవుట్ ప్రాంతంలో గంగోత్రి కర్రీస్ పాయింట్ ఏర్పాటు చేశారు. అప్పట్లో కర్రీస్ పాయింట్‌లను పరిచయం చేసింది వారే. అయితే ప్రస్తుతం ఆ కర్రీ పాయింట్ లేదు.
దాదాపు 400పైగా కర్రీ పాయింట్స్
నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో కర్రీ పాయింట్స్ అనేకం వెలిశాయి. ఒక్క స్టోన్‌హౌస్‌పేట, బాలాజీనగర్, నవాబుపేట, కిసాన్‌నగర్, మైపాడుగేటు ప్రాంతాల్లోనే 70 కర్రీస్ పాయింట్‌లు ఉన్నాయి. అదే విధంగా హరనాథపురం, చిల్డ్రన్స్‌పార్క్, చిన్నబజారు, పెద్దబజారు, వీఆర్సీ సెంటర్, మద్రాసు బస్టాండు, దర్గామిట్ట, వేదాయపాళెం, అయ్యప్పగుడి ఇలా ప్రధాన ప్రాంతాల్లోని అధిక సంఖ్యలో కర్రీస్ పాయింట్లు వెలిశాయి. ఇలా మొత్తం దాదాపు 400కు పైగా కర్రీస్ పాయింట్‌లు ఉన్నాయి.
చదవండి: నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలు
నిత్యావసరాల ఖర్చులు పెరగడంతో...
గతంతో పోలిస్తే కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. దీంతో ఇంట్లో గ్యాస్, నిత్యావసర వస్తువులకు ఖర్చు చేయడం కన్నా రూ.20 నుంచి రూ.30లకు ఒక కర్రీ ప్యాకెట్ రావడంతో వాటిపైనే ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. సాంబార్, పప్పు, రసానికి కలిపి రూ.60 నుంచి రూ.80లు వెచ్చిస్తే నలుగురు వ్యక్తులు తినేందుకు సరిపోతుంది. ఇంట్లో అన్నం వండుకుని కర్రీస్ కొనుగోలు చేస్తే రోజు గడిచిపోతుంది.
జీవనోపాధికి దోహదం
హోటల్స్‌లో పనిచేసిన అనుభవం ఉన్నవారు, సొంత కాళ్లపై నిలబడాలనే ఉద్దేశంతో ఉన్న వారు కర్రీ సెంటర్ల ఏర్పాటుకు ముందుకు వస్తున్నారు. ఇంటి పెద్ద మాత్రమే కాకుండా ఇంట్లోని భార్య, పిల్లలు కర్రీ పాయింట్‌లో అవసరమైన పనులు ఒకరికి ఒకరు సహాయ పడుతూ బుతుకు జీవనాన్ని నెట్టుకొస్తున్నారు. ఉదయం 4 నుంచి కర్రీకి సంబంధించి కూరగాయలు, ఇతర వస్తువులను సమకూర్చుకుంటారు. ఉదయం 11 గంటలకే అన్ని రకాల కర్రీస్‌ను అందుబాటులో ఉంచుతారు. సాయంత్రానికి తిరిగి మళ్లీ వంటకాలు చేయాల్సి ఉంది. కుటుంబ సభ్యులు అందరూ కలిసి పనులను పంచుకుంటారు. వీరిలో రుచిని, నాణ్యతను అందించిన వాళ్లకు మాత్రమే ఆదరణ లభిస్తుంది.

సండే స్పెషల్స్
ఆదివారం వచ్చిందంటే నగర వాసులు సినిమాలు, షికార్లుకు వెళ్తుంటారు. రోజంతా పిల్లలతో గడుపుతుంటారు. బయట వంటకాలు రుచి చూసేందుకు ఇçష్ట పడుతుంటారు. దీంతో ఆదివారం హోటల్స్‌తో పాటు కర్రీ సెంటర్‌లు కూడా ప్రత్యేకంగా నాన్‌వెజ్ రుచులను అందుబాటులోకి తెస్తుంటాయి. రాగి సంగటితో పాటు బొమ్మిడాయల పులుసు, రొయ్యలు, చికెన్, మటన్‌లో ఫ్రైలు, కర్రీల విక్రయాలు చేస్తుంటారు. సాధారణ రోజులో కన్నా ఆదివారం తమ వ్యాపారం జోరుగా ఉంటుందని కర్రీ పాయింట్ నిర్వాహకులు చెబుతున్నారు.
చదవండి: వాకింగ్ చేస్తూనే మృత్యు ఒడికి.. సీసీటీవీలో దృశ్యాలు
వివిధ రకాల పచ్చళ్లు...
కర్రీ పాయింట్లలో అనేక రకాల పచ్చళ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కొన్ని కర్రీ సెంటర్‌లు వారంలో ప్రతిరోజు ఒక్కో రకం పచ్చళ్లను అందుబాటులో ఉంచుతుంటాయి. అదే విధంగా కారపు పొడులు సైతం విక్రయిస్తున్నారు. అదే విధంగా నాన్‌వెజ్‌లో ఫ్రై ఐటమ్స్, వెజ్‌లో కూడా పలు కొత్త రకాల ఫ్రై ఐటమ్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు.

రుచి, నాణ్యత ఉంటేనే..
చాలా కాలంగా కర్రీ పాయింట్ నిర్వహిస్తున్నా. అయితే రుచి, నాణ్యత ఇవ్వగలిగితేనే కస్టమర్లు మళ్లీ మళ్లీ వస్తారు. కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు హెచ్చుతగ్గులు ఉన్నా కస్టమర్ల కోసం అందుబాటు ధరల్లో విక్రయాలు చేస్తుంటాం.
– వెంకటేశ్వర్లు, కర్రీ పాయింట్ నిర్వాహకుడు
Comments
Please login to add a commentAdd a comment