సాక్షి, ముంబై: నగరంలో తెలుగు ప్రజలు ఆదివారం పోచమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. శ్రావణ మాసం ఆదివారం నుంచి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఈ శ్రావణ మాసాన్ని కచ్చితంగా పాటించేవారు గణేశ్ ఉత్సవాలు పూర్తయ్యేంతవరకు మద్యం, మాంసానికి దూరంగా ఉంటారు. దీంతో మాంసాహారం తినేవారు ఈ శనివారం లోపు పోచమ్మ పండుగ చేసుకోవాల్సి వచ్చింది. ఆ ప్రకారం ఇదే ఆఖరు ఆదివారం కావడంతో ప్రజలు పెద్ద ఎత్తున పోచమ్మ పండుగను జర్పుకున్నారు.
పోచమ్మ గుడులన్నీ ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులతో కిటకిటలాడాయి. కామాటిపుర, వర్లీలోని భోగాదేవి తదితర పోచమ్మ ఆలయాలన్నీ సందడిగా కనిపించాయి. ఎంతో ఓపిగ్గా మహిళలు, పిల్లలు క్యూలో నిలబడి పోచమ్మకు కోళ్లు, మేకలు, నైవేద్యాలు సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. కొందరు భాజాబజంత్రీలతో తలపై బోనాలు పెట్టుకుని గుడికి చేరుకున్నారు. పూజలుచేసి నైవేద్యాలు సమర్పించారు. మరికొందరు స్థానికంగా ఉంటున్న వారందరు కలిసికట్టుగా ఒకేచోటా ఈ పండుగను జరుపుకున్నారు.
ఠాణేలో...
ఠాణేలోని తెలుగు సేవా మండలి సభ్యులు ఆదివారం పోచమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఉదయమే పిల్లలు, మహిళలు,ృవద్ధులు శాస్త్రినగర్‌లో ఉన్న జానకీమాత దేవి మందిరానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఇక్కడి తెలుగు ప్రజలు జానకీమాత దేవినే పోచమ్మ తల్లిగా భావిస్తారు. వెంట తెచ్చుకున్న మేకలు, కోళ్లు బలిచ్చారు. నైవేద్యాలు సమర్పించి తమ మొక్కుబడులు తీర్చుకున్నట్లు ఆ సంస్థ సభ్యులు మెంగు రమేశ్, మెంగు లింగన్న, గుండారపు పుల్లయ్య, గంగాధరి శంకర్ తదితరులు చెప్పారు.
ఘాట్కోపర్‌లో...
కామ్‌రాజ్‌నగర్‌లోని తెలుగు రహివాసి సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానిక పోచమ్మ గుడిలో ఆదివారం ఉదయం పోచమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఇక్కడుంటున్న దాదాపు 500లకుపైగా తెలుగు కుటుంబాలు కలిసి ఈ పండగను జరుపుకోవడం విశేషం. ఈ సందర్భంగా మేకలు బలిచ్చి తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. పండుగను పురస్కరించుకుని ఆలయాన్ని వివిధ రకాల పూలతో అలంకరించారు. భక్తులు ఇబ్బందులు పడకుండా తగిన ఏర్పాటుచేసినట్లు ఆ సంస్థ అధ్యక్షుడు గుల్లే గంగాధర్, శంకర్ నాయక్, బాస శంకర్, జక్కుల తిరుపతి, కట్ట అశోక్, గుర్రం శ్రీనివాస్, తిక్కు నాయక్, సత్యనారాయణ తదితరులు చెప్పారు.
బోరివలిలో..
బోరివలి, న్యూస్‌లైన్: మలాడ్‌లోని తెలంగాణ ప్రజలు ఆదివారం అశోక్‌నగర్‌లోని బాన్ డోంగిరిలో తెలుగు సమాజ్ సొసైటీ ఆధ్వర్యంలో పోచమ్మ, ముత్యాలమ్మ, మైసమ్మ, నల్లపోచమ్మ అమ్మవార్లకు బోనాలు ఘనంగా నిర్వహించారు. ఇక్కడ 650 గజాల స్థలంలో నలుగురు అమ్మవార్ల మందిరాలు ఉన్నాయి. స్థానిక ఆగన్న కుటుంబం నుంచే మొదట పెద్ద బోనం వెళుతుంది.
తర్వాత మిగతా బోనాలను అమ్మవారికి సమర్పిస్తారు. కాగా, ఇక్కడ భవన నిర్మాణ కార్మికులు ఎక్కువగా ఉంటారు. అమ్మవారికి ప్రతి ఏటా మొక్కులు చెల్లించుకుంటామని వారు తెలిపారు. కార్యక్రమంలో పి.ప్రభాకర్ రావు, జి.రాజ్ కుమార్, డి.కిషన్ రావు, డి.పాపారావు, వి. చిన్నికిష్టయ్య, ఎల్.కిషన్ రావు, పి.శ్రీనివాసరావు, జె.తిరుపతిరావు, బి.రాజన్న, ఎం.రవీందర్‌రావు, జి.రామారావు తదితరులు పాల్గొన్నారు.
ముంబైలో బోనాలు
Published Mon, Jul 21 2014 10:44 PM | Last Updated on Sat, Sep 2 2017 10:39 AM
Advertisement