samaikandhra
-
ప్రజాస్వామ్యం ఖూనీ
కడప రూరల్, న్యూస్‌లైన్ : భారతదేశ వ్యవస్థకు దిశ, దశలు నిర్దేశించే సాక్షాత్తు పార్లమెంటు నిండు సభలో సీమాంధ్ర ఎంపీలపై దాడి జరగడం దారుణమని సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు ధ్వజమెత్తారు. సీమాంధ్ర ఎంపీలను ఒంటరిగా చేసి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఎంపీలు దౌర్జన్యానికి పాల్పడటం దారుణమన్నారు. ఆ మేరకు ఎంపీలను సస్పెండ్ చేసినందుకు నిరసనగా గురువారం స్థానిక నాగార్జున మహిళా డిగ్రీ కళాశాల నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా సమైక్యాంధ్ర జేఏసీ జిల్లా కన్వీనర్ సింగారెడ్డి శ్రీరామచంద్రారెడ్డి మాట్లాడుతూ గురువారం పార్లమెంటులో కాంగ్రెస్, యూపీఏ, తెలంగాణకు చెందిన ఎంపీలు గుండాల్లా ప్రవర్తించి సీమాంధ్ర ఎంపీలపై దాడులకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. ఈ సంఘటనతో ఈరోజు ప్రజాస్వామ్యం ఖూనీ అయినరోజని, పార్లమెంటు చరిత్రలో బ్లాక్‌డేగా అభివర్ణించారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ బిల్లుకు సంబంధించి సందేహాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ అవేవి పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడం ఏమిటని ప్రశ్నించారు. తక్షణమే స్పీకర్ స్పందించి ఎంపీలపై సస్పెండ్‌ను ఎత్తివేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. మెడికల్, పారా మెడికల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వారణాసి ప్రతాప్‌రెడ్డి, విద్యార్థి జేఏసీ జిల్లా కన్వీనర్ రవిశంకర్‌రెడ్డిలు మాట్లాడుతూ కాంగ్రెస్ చెప్పిందే శాసనం కాదన్నారు. పార్లమెంటులో సీమాంధ్రుల ఎంపీల పట్ల వ్యవహారించిన తీరు దారుణంగా ఉందన్నారు. జగ్జీవన్‌రామ్ కుమార్తె అయిన స్పీకర్ మీరాకుమార్ ఎంపీలపై సస్పెన్షన్‌ను ఎత్తి వేయాలన్నారు. బాధ్యత గల స్పీకర్, సోనియాగాంధీకి కీలుబొమ్మగా మారడం దారుణమన్నారు. ప్రధాని మన్మోహన్సింగ్, స్పీకర్ మీరాకుమార్, సోనియాగాంధీకి వ్యతిరేకంగా చేసిన నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఈ కార్యక్రమంలో నాగార్జునమహిళా డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ బెరైడ్డి రామకృష్ణారెడ్డి, చిన్న సుబ్బయ్య యాదవ్, కళాశాల విద్యార్థినిలు పాల్గొన్నారు. -
నేడు జిల్లా బంద్
అనంతపురం అర్బన్/ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రకు మద్దతుగా గురువారం జిల్లా బంద్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, పార్టీ నేత ఎర్రిస్వామిరెడ్డి, నగరాధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఉదయం 6 గంటలకు నగరంలోని నందిని హోటల్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహం వద్దకు సమైక్యవాదులు, పార్టీ శ్రేణులు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలు, విద్యాలయాలు, కళాశాలలు స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌కి సహకరించాలని కోరారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు సీమాంధ్ర దోహులని ధ్వజమెత్తారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోకుండా యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మొదటి నుంచి సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నారన్నారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వైఎస్ జగన్ పోరాడారన్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని కాంగ్రెస్, టీడీపీలకు తప్పకుండా బుద్ధి చెబుతారన్నారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం వారు ప్రకటన విడుదల చేశారు. ఉదయం నుంచే నియోజకవర్గ కేంద్రాల్లో రాస్తారోకోలు నిర్వహించాలని, రహదారులను దిగ్బంధించి వాహనాల రాకపోకలను అడ్డుకోవాలని శంకరనారాయణ సూచించారు. బంద్ ప్రభావం ఢిల్లీకి తాకాలని, పెద్దలకు కనువిప్పు కలిగేలా ఉండాలన్నారు. నేడు ప్రైవేట్ పాఠశాలల బంద్ రాష్ట్ర విభజన అంశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ గురువారం జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల బంద్ పాటించనున్నట్లు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం జిల్లా అధ్యక్షుడు కుసుమ పుల్లారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు -
పెట్రోల్ బంకులు, సినిమా థియేటర్ల మూత
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రభుత్వ ఉద్యోగుల నిరవధిక సమ్మె మంగళవారం నాటికి ఏడో రోజుకు చేరుకుంది. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపు మేరకు ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నగరంలోని పెట్రోల్ బంకు, సినిమా థియేటర్లను మూతవేయించారు. ఉదయం ఆరు గంటలకల్లా అసోసియేషన్ నాయకులు పెట్రోల్ బంకుల వద్దకు చేరుకుని వాటిని మూసివేయించారు. 11 గంటలకు సినిమా థియేటర్ల వద్దకు చేరుకుని సినిమా ప్రదర్శనలను నిలిపివేయాలని కోరారు. దీంతో థియేటర్ల యజమానులు సినిమా ప్రదర్శనలను నిలిపివేశారు. నగరంలో మోటార్ సైకిళ్లతో ర్యాలీగా బయలుదేరి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అవకాశవాద రాజకీయాలను ఎండగట్టారు. అనంతరం ప్రకాశం భవనం వద్ద సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీఎన్జీఓ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావం నుంచి ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగుతున్న సమయంలో కొంతమంది రాజకీయ నాయకులు తెలంగాణ చిచ్చు రగిల్చారని విమర్శించారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగు మాట్లాడే వారందరినీ రెండుగా చీల్చేందుకు కుట్ర పన్నారన్నారు. తెలంగాణ బిల్లును అసెంబ్లీలో ఏ విధంగా తిప్పికొట్టారో పార్లమెంటులో కూడా సీమాంధ్రకు చెందిన మంత్రులు, ఎంపీలు అదే విధంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ బిల్లు విషయంలో సీమాంధ్రుల మనోభావాలను గుర్తెరిగి ముందుకు సాగాలని, లేకుంటే వారికి రాజకీయ మనుగడ ఉండదని బండి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విద్యాశాఖ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర నాయకుడు ఏ స్వాములు మాట్లాడుతూ అసెంబ్లీలో తిరస్కరించిన తెలంగాణ బిల్లును పార్లమెంటులో పెట్టడం నిరంకుశ విధానాలకు అద్దం పడుతుందన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల సంఘ నాయకుడు కే శరత్‌బాబు మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమం చివరి దశకు చేరుకుందని, ఈ తరుణంలో ఉద్యోగస్తులంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. విభజన విషయంలో డ్రామాలాడితే సీమాంధ్ర ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఏపీఎన్జీఓ అసోసియేషన్ నగర అధ్యక్షుడు సయ్యద్నాసర్మస్తాన్వలి మాట్లాడుతూ సీమాంధ్ర ఎంపీలు తెలంగాణ బిల్లును అడ్డుకోకుంటే వారికి రాజకీయ సమాధి కట్టేందుకు ఇక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కోయ కోటేశ్వరరావు, జిల్లాపరిషత్ ఉద్యోగుల సంఘ నాయకులు శ్యాంసన్, విజయలక్ష్మి, వీరనారాయణ, మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పీ మాధవి, వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు మూర్తి, సర్వే ఉద్యోగుల సంఘం నాయకుడు కే శివకుమారి, ప్రభుత్వ డ్రైవర్ల సంఘ జిల్లా కార్యదర్శి ప్రసన్నకుమార్, నీటిపారుదల ఉద్యోగుల సంఘ నాయకులు ఆర్సీహెచ్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేడు జాతీయ రహదారి దిగ్బంధనం రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయకుండా సమైక్యంగా ఉంచాలని కోరుతూ సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఏపీఎన్జీఓ అసోసియేషన్ జిల్లా శాఖ బుధవారం జాతీయ రహదారి దిగ్బంధం చేయాలని నిర్ణయించింది. జాతీయ రహదారి దిగ్బంధనం తీవ్రత ఢిల్లీ పెద్దలను కదిలించే విధంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలను సమీకరించి జాతీయ రహదారిని దిగ్బంధించనున్నారు. ఆఖరి పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నాయకులు కోరారు. -
నిరసన జ్వాల
సాక్షి, నెల్లూరు: విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎన్జీఓలు చేపట్టిన సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాలో మంగళవారంతో ఆరో రోజుకు చేరింది. ఎన్జీఓలు, సమైక్యవాదులు జిల్లా వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, మోటారు బైక్ ర్యాలీలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేశారు. రాష్ట్ర విభజనకు పూనుకుంటే సీమాంధ్రలో కాంగ్రెస్‌కు పుట్టగతులు ఉండవన్నారు. సమైక్యాంధ్ర సాధించేవరకు ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. పాణ త్యాగాలకు వెనుకాడబోమని హెచ్చరించారు. ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసనలు తెలిపారు. ఎన్జీఓల దీక్షలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. నెల్లూరు నగరంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యోగులు ఎన్జీఓ భవన్ నుంచి మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమా థియేటర్లను మూయించారు. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో వీఆర్సీ కూడలిలో విద్యార్థులు యూపీఏ దిష్టి బొమ్మను దహనం చేశారు. కావలిలోఎన్జీఓ నేతలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. పొట్టిశ్రీరాములు విగ్రహం సెంటర్ ట్రంకురోడ్డుపై రాస్తారోకో చేశారు. దీంతో వాహనాల రాక పోకలకు అంతరాయం కలిగింది. వాకాడులో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం స్థానిక అశోక్స్తంభం సెంటర్లో మానవహారం ఏర్పాటు చేశారు. దీంతో రాకపోకలు స్తంభించాయి. వెంకటగిరిలో సమైక్యాంధ్రకు మద్దతుగా, జయప్రకాష్ నారాయణపై తెలంగాణ వాదులు దాడిని నిరసిస్తూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం నుంచి పట్టణ వీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. -
‘అశోక్’ మాటలు నమ్మవద్దు
కడప రూరల్, న్యూస్‌లైన్: ఎన్జీఓ నాయకుడు అశోక్‌బాబు సమైక్యాంధ్ర ఉద్యమాలను నీరుగారుస్తున్నారని, ఆయన సమైక్య ద్రోహి, ఎవరూ ఆయన మాటలు నమ్మవద్దని సమైక్యాంధ్ర ప్రజా సంఘాల జేఏసీ ఛెర్మైన్ కారెం శివాజీ అన్నారు. సోమవారం స్థానిక వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో సమైక్యాంధ్ర ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్జీఓ నాయకుడు అశోక్‌బాబు తాను సమైక్యవాదినంటూ సీమాంధ్ర ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. మెరుపు సమ్మెలు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామంటూ ఏమీ చేయకుండా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రం విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు హైదరాబాద్‌తో ముడిపడి ఉన్నాయని, అలాంటిది విభజన అన్ని ప్రాంతాలకు అనర్థదాయకమన్నారు. తెలంగాణా బిల్లుకు వ్యతిరేకంగా ఈనెల 20వ తేదిన చేపడుతున్న ఛలో హైదరాబాద్ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, గిరిజన విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ నాయక్, కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు విపి నారాయణస్వామి మాట్లాడుతూ కేంద్రం విభజన బిల్లును వెనక్కి తీసుకొని రాష్ట్రంలో అనిశ్చితికి తెరదించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు శరత్‌బాబు, సుధాకర్, రామచంద్రయ్య, కొండయ్య, సింగరయ్య, ప్రకాశమ్మ, రత్నమ్మ పాల్గొన్నారు. -
సబ్‌ప్లాన్‌తో సంక్షేమ హాస్టళ్లకు మహర్దశ
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్ : ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు రూ.2 వేల కోట్లు వెచ్చించి సంక్షేమ హాస్టళ్లకు మహర్దశ పట్టించబోతున్నామని రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. సూళ్లూరుపేటలో శనివారం రాత్రి నిర్వహించిన ఫ్లెమింగో ఫెస్టివల్-14 ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. దళిత, గిరిజన విద్యార్థులకు హాస్టళ్లలో సౌకర్యాలను మెరుగుపరిచి నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అంబేద్కర్ విదేశీ విద్య పేరుతో ప్రతిభావంతులైన 44 మంది ఎస్సీ,ఎస్టీ విద్యార్థులను అమెరికాకు పంపామని చెప్పారు. ఆరు లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కూడా మరో రూ. 2 వేల కోట్లు మంజూరు చేశామన్నారు. పేదరికం నిర్మూలన చేయడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. అందరం సమైక్యాంధ్ర ఉద్యమంలో నిమగ్నమైనందున ఫ్లెమింగో ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహించలేకపోయామన్నారు. భవిష్యత్తులో వైభవంగా నిర్వహించి ఈ ప్రాంత ప్రకృతి ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేం దుకు కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి మాట్లాడుతూ శాసనసభ, శాసనమండలిలో సీమాంధ్ర ప్రజా ప్రతినిధులం తమ గళాన్ని వినిపించుకోలేని పరిస్థితుల్లో ఉన్నామన్నారు. అదేమని అడిగితే తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులు చేయిచేసుకునే పరిస్థితులు రావడం దురదృష్టకరమన్నారు. ఎమ్మెల్యే పరసా రత్నం మాట్లాడుతూ ఏటా మూడు రోజుల పాటు ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణకు కోటి రూపాయలు కేటాయించాలన్నారు. సూళ్లూరుపేట పట్టణ అభివృద్ధికి రూ.14 కోట్లు మంజూరు చేయాలని కోరారు. పక్షుల పండగలో పాలుపంచుకున్న వారందరికీ కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ ఆధ్వర్యంలో మెమెంటోలు అందజేశారు. -
అమీతుమీ!
సాక్షి ప్రతినిధి, అనంతపురం : రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం అసెంబ్లీ వేదికగా అమీతుమీకి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు. చంద్రబాబు వైఖరితో టీడీపీ ఎమ్మెల్యేలు ఇరకాటంలో పడగా.. తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడితే అధిష్టానం ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందేమోనని కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై రాష్ట్ర విభజనకు పూనుకున్నాయి. తెలంగాణ ఏర్పాటుకు టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్రానికి లేఖ ఇవ్వగా.. దాని ఆధారంగా సీడబ్ల్యూసీ రాష్ట్ర విభజనకు జూలై 30న గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు కేంద్ర మంత్రి మండలి కూడా ఆమోదించింది. అనంతరం తెలంగాణ ముసాయిదా బిల్లును రాష్ట్రపతికి పంపారు. అక్కడి నుంచి బిల్లు శాసనసభకు చేరనుంది. ఈ బిల్లులు శీతాకాల సమావేశాల్లోనే చర్చకు వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో గురువారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలపై ‘అనంత’ ప్రజానీకం ప్రత్యేక దృష్టి పెట్టారు. తాము ఎంచుకున్న ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాల మేరకు నడుచుకుంటారా? అధిష్టాన వర్గాలకు తలొగ్గుతారా? అన్న ఆందోళన నెలకొంది. వైఎస్ఆర్సీపీ అధినేత స్ఫూర్తితో ఆ పార్టీ శ్రేణులు సమైక్యాంధ్ర మహోద్యమంలో కదం తొక్కుతున్నాయి. శాసనసభ వేదికగా సమైక్య నినాదాన్ని ప్రతిధ్వనింపజేస్తామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు బి.గురునాథ్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఉద్ఘాటిస్తున్నారు. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కవడాన్ని శాసనసభ వేదికగా నిరూపిస్తామని స్పష్టీకరిస్తున్నారు. టీడీపీ అధినేత ఇప్పటికీ సమైక్యాంధ్ర నినాదం చేయకపోవడాన్ని.. తెలంగాణ ఏర్పాటుకు మద్దతుగా కేంద్రానికి ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోకపోవడాన్ని వారు ఉదహరిస్తున్నారు. ఇది టీడీపీ ఎమ్మెల్యేలను ఇరకాటంలో పడేస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేలు శాసనసభ వేదికగా సమైక్య నినాదం చేసినా.. అదంతా ఆ పార్టీ అధినేత చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంలో భాగమేననే భావన ప్రజల్లో బలంగా వ్యక్తమవుతోంది. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆపార్టీ అధిష్టానానికి దాసోహమంటున్నారు. అధిష్టానం విధానానికి వ్యతిరేకంగా పనిచేస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జంకుతున్నారు. -
సేవాభారత్ ట్రస్టు దాతృత్వం
బెంగళూరు,న్యూస్‌లైన్ : నగరంలోని సేవాభారత్ ట్రస్టు దాతృత్వాన్ని చాటుకుంది. రెండు నెలలుగా సమైకాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న ఏపీఎస్ ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు దసరా పండుగ సందర్భంగా ట్రస్టు తరఫున నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. శనివారం కెంపేగౌడ బస్టాండ్‌లో ఆంధ్రప్రదేశ్ రిజర్వేషన్ కౌంటర్ వద్ద 18 కుటుంబాలకు 25 కిలోలు చొప్పున బియ్యం, కిలో కందిపప్పు, చక్కెర, గోధుమపిండి, లీటరు వంటనూనె ట్రస్ట్ తరఫున విశ్రాంత ఉపాధ్యాయుడు రంగస్వామినాయుడు అందజేశారు. అనంతరం ట్రస్టు అధ్యక్షుడు బండి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ ఉద్యమంలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులను ఆదుకునేందుకు ప్రవాసాంధ్రులు ముందుకు రావాలన్నారు. చిన్న రాష్ట్రాలతో అభివృద్ధి సాధ్యం కాదనేందుకు జార్ఖండ్, ఉత్తరాంచల్ తదితర రాష్ట్రాలే నిదర్శనమన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఒకే భాష కలిగిన తెలుగు ప్రజలందరూ కలిసి ఉండేలా సమైక్యాంధ్ర సాధనకు కృషి చేయాలన్నారు. -
బాబు తీరు తమ్ముళ్లు బేజారు
సాక్షి, తిరుపతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీరుతో తమ్ముళ్లు బేజారవుతున్నారు. పార్టీ విధానం ఏంటో తేల్చి చెబితే ఏదో ఒక చోటైనా పరువు కాపాడుకోవచ్చని భావిస్తున్నారు. రాష్ట్ర విభజన విషయంలో అధినేత తీరును తీవ్రంగా తప్పుబడుతున్నా రు. ఈ పరిస్థితుల్లో పార్టీ జెండా మోయడం కంటే తప్పుకోవటమే మేలని జిల్లాలో కొంద రు తమ్ముళ్లు భావిస్తున్నారు. జిల్లాలో ఉధృతంగా సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం లో మనస్ఫూర్తిగా పాల్గొనలేక లోలోన మదనపడుతున్నారు. సమైక్యాంధ్రకు కట్టుబడి ఉంటున్న పార్టీలో చేరడం మంచిదని భావిస్తున్నట్లు సమాచారం. అలా చేరలేని పక్షంలో తటస్తంగా ఉండడమే మంచిదని భావిస్తున్నా రు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఓసారి సమైక్యాంధ్ర అని, మరోసారి ప్రత్యేక తెలంగాణకు అనుకూలమని కేంద్రానికి లేఖ లు పంపడాన్ని తప్పుపడుతున్నారు. తెలంగాణలో ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో విభజనకు అనుకూలంగా లేఖ పంపిన విషయాన్ని తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోయారు. అంతటితో ఆగకుండా ఇటీవల కాంగ్రెస్ దొంగ నాటకాలాడుతోందంటూ బస్సుయాత్ర చేయడంపై మండిపడుతున్నారు. బస్సుయాత్ర ప్రారంభించి సీమాంధ్రలో పరువు కాపాడారని భా వించే సమయంలో మధ్యలో ముగించుకుని హడావుడిగా ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా తెలంగాణలో కూడా బస్సుయాత్ర చేసేందుకు పార్టీ నేతలు చేస్తున్న ప్రయత్నాలను తప్పుపడుతున్నారు. పార్టీలో ఉండాలా? బయటకు వెళ్లిపోవాలా? గంటకో నిర్ణయం తీసుకునే పార్టీ అధినేతపై తమ్ముళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ విభజనకు అనుకూలమని తేలిపోయింది. అదే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్యాయం పేరుతో జనంలోకి దూసుకుపోతోంది. జిల్లాలో పెదిరెడ్డి మిథున్‌రెడ్డి ఆధ్వర్యంలో పలుచోట్ల సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యమాలను కొనసాగిస్తూ ముందుకెళుతోంది. తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి సమైక్యాంధ్ర కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు. పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలు గట్టిగా ఉద్యమిస్తున్నారు. టీడీపీ అందుకు పూర్తి వ్యతిరేకంగా ఉంది. చిత్తూరు, తిరుపతికి చెందిన నలుగురు తెలుగు తమ్ముళ్లు అధినేతపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. పార్టీ పరువును గంగలో కలిపిన ఘనత చంద్రబాబుకే దక్కిందని మండిపడుతున్నారు. అధినేత తీరును బట్టే జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమంపై తెలుగు తమ్ముళ్లు పెద్దగా దృష్టి సారించలేదు. తటస్తంగా ఉద్యమంలో పాల్గొంటూ సమైక్య జెండాతో ముందుకు వెళ్తున్నారు. తిరుపతిలో కొందరు తెలుగు తమ్ముళ్లు పార్టీ జెండాతో వెళితే పరువు పోతుందని భావించి విద్యాసంస్థల అధినేతలతోనూ, ఉద్యోగులతోనూ కలసి ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఒకరిద్దరు మాత్రం జిల్లాలో పార్టీ జెండాలతో రిలేదీక్షలు చేస్తూ ఉనికిని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం. -
కృష్ణా జిల్లా బంద్‌కు ఏపీఎన్జీవోల పిలుపు
విజయవాడ : సమైక్యాంధ్రకు ఏపీ ఎన్జీవోలు రెండు రోజుల పాటు కృష్ణా జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్‌కు పిలుపునివ్వటంతో అత్యవసర సేవలు మినహా సినిమా, వర్తక, వాణిజ్య, వ్యాపార , రవాణా రాకపోకలు బంద్ కానున్నాయి. కాగా సమైక్యాంధ్రకు మద్దతుగా విజయవాడ ఆటోనగర్‌లో చిన్నతరహా పరిశ్రమల వ్యాపారులు మంగళవారం భారీ భైక్ ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది వ్యాపారులు ఈ ర్యాలీలో పాల్గోన్నారు. ఆటోనగర్ నుంచి బెంజిసర్కిల్ వరకూ ర్యాలీ చేపట్టి బెంజి సర్కిల్లో కేసిఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సమైక్యాంధ్రకు మద్దుతుగా, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా చేసిన నినాదాలతో విజయవాడ హోరెత్తిపోయింది. ఆరు వారాల నుంచి సీమాంధ్ర స్తంభించిపోయినా కేంద్రంలో చలనం లేదని ఉద్యమకారులు మండిపడ్డారు. ఇప్పటికైనా ఢిల్లీ పెద్దలు రాష్ట్ర విభజనపై ప్రకటనను వెనక్కి తీసుకోవాలని వ్యాపారులు డిమాండ్ చేశారు. తెలంగాణా ఉద్యమం కేవలం రాజకీయ ప్రయోజనం కోసమే చేసిందని వారన్నారు. రాష్ట్రాన్ని విభజించబోమని ప్రకటన వచ్చే వరకూ ఉద్యమం కొనసాగుతుందని చిన్నతరహా పరిశ్రమల వ్యాపారులు తేల్చి చెప్పారు. -
సమరం నిర్విరామం
సాక్షి నెట్వర్క్ : సీమాంధ్ర జిల్లాల్లో సమైక్యాంధ్ర ఉద్యమం హోరెత్తుతోంది. ఐదు వారాలుగా సాగుతున్న పోరాటం 36వరోజు బుధవారం కూడా ఉధృతంగా ఎగసింది. ఊరూవాడా ఆందోళనలు పోటెత్తాయి. కళాకారుల నిరసన ఒంగోలులో రంగస్థల కళాకారులు, సంగీత కళాకారులు భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా అధికారులు విభజనవల్ల జరిగే నష్టాల గురించి పల్లెవాసులకు వివరించేందుకు బస్సుయాత్ర ప్రారంభించారు. ఒంగోలు కార్పొరేషన్ ఉద్యోగులు భిక్షాటన చేసి నిరసన తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ రాష్ట్రపతిని కోరుతూ శ్రీ పొట్టి్ర శీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన విద్యార్థులు లక్ష పోస్టుకార్డుల ఉద్యమం చేపట్టారు. నెల్లూరులో ఆర్టీఓ ఉద్యోగులు తమ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ వాహన ర్యాలీ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో విద్యార్థులు భారీ మానవహారంగా నిలబడి సమైక్య నినాదాలు చేశారు. రెవెన్యూ ఉద్యోగులు సోనియా చిత్రపటానికి రక్తాభిషేకం చేశారు. రాజమండ్రి పుష్కరఘాట్‌లో ఉద్యానవన శాఖ ఉద్యోగులు రోడ్డుపై మొక్కలు నాటారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆశ్రం ఆసుపత్రి వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించి, రోడ్డుపై కబడ్డీ ఆడారు. ఫైర్‌స్టేషన్ సెంటర్లో స్వర్ణకారులు రోడ్డుపైనే ఆభరణాలు తయారుచేసి నిరసన తెలిపారు. కేంద్రమంత్రి చిరంజీవి తన పదవికి రాజీనామా చేయాలని, లేదంటే చిరు కుటుంబ సభ్యుల సినిమాలను బహిష్కరిస్తామని సమైక్యవాదులు హెచ్చరించారు. వెనక్కి నడిచి ఉద్యోగుల నిరసన రాష్ట్రం విడిపోతే అభివద్ధిపథంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ 40 ఏళ్లు వెనక్కి వెళ్లిపోతుందంటూ విజయనగరంలో ఉద్యోగులంతా వెనక్కి నడుస్తూ నిరసన వ్యక్తంచేశారు. ఎస్.కోటలో పలువురు ఉద్యోగులు శిరోముండనం చేయించుకున్నారు. ఓ మహిళా ఉద్యోగి కూడా శిరోముండనం చేయించుకుని నిరసన వ్యక్తంచేశారు.విశాఖపట్నంలో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, సిబ్బంది చెత్తఎత్తి రోడ్లు ఊడ్చారు. ఆంధ్రా యూనివర్సిటీ ఇన్‌గేట్ వద్ద విద్యార్థులు రోడ్డును దిగ్బంధించారు. చోడవరం, కొత్తూరు జంక్షన్లో రజకులు రోడ్డుమీదే దుస్తులు ఉతుకుతూ నిరసన వ్యక్తంచేశారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో 700 మందికి పైగా విద్యార్థులు సైకిల్ యాత్ర చేపట్టారు. పులివెందులలో జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి పూల అంగళ్ల కూడలిలో మానవహారం నిర్మించారు. కడప రిమ్స్, రాయచోటిలో ప్రభుత్వ వైద్యులు విధులను బహిష్కరించి ఉస్మానియా ఘటనకు నిరసన వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలో విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు శ్రీకూర్మం నుంచి శ్రీకాకుళం వరకు భారీ బైక్ ర్యాలీ చేశారు. పాలకొండ, పలాసల్లో ఉపాధ్యాయులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. కర్నూలు జిల్లా డోన్‌లో రైతులు ఎడ్ల బండ్లతో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కర్నూలు కలెక్టరేట్ వద్ద కళాకారుల జేఏసీ ఆధ్వర్యంలో ‘పొలికేక’ పేరిట సాగిన ఆటాపాట సమైక్యవాదుల్లో ఉత్సాహం నింపింది. విభజన జరిగితే అనంతపురం పూర్తిగా ఎడారిగా మారుతుందంటూ ఐకేపీ ఉద్యోగులు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. తాడిపత్రిలో ఆర్టీసీ జేఏసీ నేతలు కూరగాయల దండలు ధరించి నిరసన తెలిపారు. అనంతపురంలో మంగళవారం నిర్వహించిన ‘అనంత జనగర్జన’కు వస్తున్న ఎస్కేయూ విద్యార్థులు, సమైక్యవాదులను పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ బుధవారం ఇటుకలపల్లి పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించారు. విజయవాడలో ఉద్యమకారులు కోర్టు భవనాల ప్రాంగణానికి తాళాలు వేశారు. ఏపీఎన్జీవోలు, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో రహదారుల అష్ట దిగ్బంధం చేశారు. గుడివాడ 72 గంటల బంద్ విజయవంతంగా ముగిసింది. రోడ్డుపైనే నిద్రించి... చిత్తూరుజిల్లా పీలేరులో జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి రోడ్డుపైనే నిద్రించి నిరసన తెలిపారు. మదనపల్లెలో మిట్స్ కళాశాల విద్యార్థులు వెయ్యి మీటర్ల జాతీయ జెండాను తయారుచేసి, బసినికొండపై ర్యాలీ నిర్వహించారు. శ్రీకాళహస్తిలో విద్యార్థులు, పొదుపు సంఘం సభ్యులు భారీ ర్యాలీ నిర్వహించారు. -
త్వరలో సమైక్యాంధ్రపార్టీ రాబోతున్నది: ఎంపీ రాయపాటి సాంబశివరావు
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలే అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ పార్లమెంట్ సభ్యుడు రాయపాటి సాంబశివరావు ఆదివారం ఓ సభలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్రంలో ఎవరూ గెలిచే అవకాశం లేదని రాయపాటి తేల్చేశారు. అంతేకాక త్వరలోనే సీమాంధ్రలో కొత్తపార్టీ వచ్చే అవకాశం ఉంది అని జోస్యం చెప్పారు. సెప్టెంబర్ 6 తేది తర్వాత సీమాంధ్ర ప్రాంత ఎంపీలు కీలక నిర్ణయం తీసుకోనున్నారని రాయపాటి తెలిపారు. త్వరలోనే ఎంపీలందరూ కీలక సమావేశం ఏర్పాటు చేయనున్నారన్నారు. త్వరలోనే సమైక్యాంధ్ర పార్టీ రాబోతున్నదని ఎంపీ రాయపాటి సూచనప్రాయంగా తెలిపారు. -
కొనలేం.. తినలేం
ఉదయగిరి, న్యూస్‌లైన్: నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటడంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. సంచి నిండా డబ్బు ఎత్తుకెళ్లినా, సరిపడా సరుకులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. వ్యాపారులు కృత్రిమ నిల్వలు సృష్టించి నిత్యావసర సరుకుల ధరలను ఆమాంతం పెంచేస్తున్నారు. అరికట్టాల్సిన అధికారులు, రాజకీయ నేతలు వ్యాపారులకు గుట్టుచప్పుడు కాకుండా సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పెరిగిన ధరలతో కనీసం ఒక పూటైనా పోషకాహారం తినే పరిస్థితి కనిపించడం లేదు. సమైక్యాంధ్ర ఉద్యమంతో వ్యాపారులు మరింత బరితెగించి ధరలు విచ్చలవిడిగా పెంచేస్తున్నారు. బియ్యం, పప్పుదినుసులు, నూనె, చింతపండు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఇతర మసాలా దినుసులు, ఒకటేమిటి..సరుకు ఏదైనా వాటి ధరలు చూసి వినియోగదారులు గుండెలు బాదుకుంటున్నారు. రూ.500 తీసుకెళితే చిన్న ప్లాస్టిక్ కవరునిండా సరుకులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లా అధికారులు సన్న బియ్యాన్ని అందరికీ అందుబాటులో ఉండేలా వివిధ కేంద్రాల్లో కిలో రూ.28కే అందించేందుకు తెరిచిన దుకాణాలు నేడు ఒక్కటీ కనిపించడం లేదు. నాణ్యమైన సన్నబియ్యం ప్రస్తుతం కిలో రూ.55 పలుకుతోంది. నిత్యం ఉపయోగించే శనగ నూనె రూ.110, పామాయిల్ రూ.65 పలుకుతోంది. కందిపప్పు రూ.75,పెసరపప్పు రూ.76,చక్కెర రూ.40కు చేరింది. చింతపండు రూ.116, మినప్పప్పు రూ.55, వేరుశనగ పప్పు రూ.86, శనగపప్పు రూ.75 ధర పలుకుతోంది. కొండెక్కిన కూరగాయల ధరలు జిల్లా కేంద్రంలో ఏసీ కూరగాయల మార్కెట్లో నిత్యం లక్షల్లో వ్యాపారం జరుగుతోంది. హైదరాబాద్, కడప, చిత్తూరు, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి కూరగాయలు దిగుమతి అవుతుంటాయి. ఎప్పుడూ కిటకిటలాడే ఈ మార్కెట్లో ధరలు చూసి వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. పదిరోజుల క్రితం రూ.10 పలికిన పచ్చిమిర్చి నేడు రూ.70కి చేరింది. కడప నుంచి దిగుమతి అయ్యే వంకాయలు 15 రోజుల క్రితం కిలో రూ.25 ఉంటే నేడు రూ.65. గత వారంలో కిలో క్యారెట్ రూ.30 ఉండగా నేడు రూ.60కి అమ్ముతున్నారు. కిలో పది పదిహేను రూపాయలు అమ్మే బీరకాయలు, మటిక్కాయలు కూడా రూ.40 పైనే పలుకుతున్నాయి. ఆలుగడ్డలు రూ.30, బీట్రూట్ రూ.60, క్యాబేజి రూ.30, గోరుచిక్కుళ్లు రూ.60 పలుకుతుండడంతో వినియోగదారులు హడలిపోతున్నారు. అల్లం ధర ఏకంగా రూ.150కి చేరింది. కన్నీరు తెప్పిస్తున్న ఉల్లిపాయలు వంటల్లో ఉల్లిపాయ ప్రాముఖ్యం అంతాఇంతా కాదు. అలాంటి నిత్యావసర ఉల్లిపాయ ధర చూస్తే మాత్రం వినియోగదారుడికి గుండె ఆగిపోయే పరిస్థితి నెలకొంది. జిల్లాలో రోజుకు 20 లారీల వరకు ఉల్లిపాయల వినియోగం ఉంది. వారం క్రితం కిలో రూ.30 ఉన్న ఉల్లి ప్రస్తుతం రూ.50కి చేరింది. మేలురకం ఉల్లిపాయలు ఏకంగా రూ.70కి ఎగబాకాయి. గ్రామీణ ప్రాంతాల్లో చిల్లరగా కొనే వినియోగదారులు వీటి వాడకాన్నే మానేసే పరిస్థితి కనిపిస్తోంది. అడ్డూ అదుపూ లేకుండా పెరిగిన ఉల్లిపాయల ధరలతో రోజుకు లక్షల్లో వినియోగదారులపై భారం పడుతోంది. పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు ఊహించని విధంగా పెరుగుతున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. దీంతో జిల్లా అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఇటీవల వచ్చిన వరదలు, సమైక్యాంధ్ర ఉద్యమం, తదితర కారణాలు చూపుతూ వ్యాపారులు సరుకులు బ్లాక్‌లో నిల్వచేసి కృత్రిమ కొరత సృష్టించి ధరలు అమాంతం పెంచేస్తున్నారు. -
ఆర్థిక స్తంభన
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమంతో జిల్లాలో ఆర్థిక స్తంభన ఏర్పడింది. ఉద్యోగులకు జీతాలు సైతం ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. నెలరోజులుగా అలుపెరగకుండా పోరాడుతున్నారు. జీతాలు లేకపోయినా సరే ఏదో విధంగా బతుకుతాం... అంటూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు నిరవధిక సమ్మెలో కొనసాగుతున్నారు. నిత్య జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతున్నా అన్ని వర్గాల ప్రజలు సమైక్య ఉద్యమంలో పాల్గొంటూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులకు అండగా నిలుస్తున్నారు. రాజకీయ సహకారం లోపించినా సమైక్య ఉద్యమం నెల రోజులు విజయవంతంగా జరిగిందనే అభిప్రాయం అన్ని వర్గాల్లో వ్యక్తమవుతోంది. పభుత్వ ఆదాయాన్ని గండి కొట్టడం ద్వారా ఆర్థికంగా బలహీనపరిస్తే విభజన నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టే అవకాశం ఉందని భావించిన ఉద్యోగ, ప్రజాసంఘాలు ప్రభుత్వ ఆదాయాన్ని భారీగా దెబ్బతీశాయి. ఒక్క కర్నూలు జిల్లా నుంచి ప్రభుత్వ ఆదాయానికి దాదాపు 82 కోట్లు గండి పడింది. జిల్లాలో దాదాపు 60 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు ఉన్నారు. వీరిలో పోలీసులు, మరికొంతమంది విధులు నిర్వహిస్తున్నా దాదాపు 45 వేల మంది సమ్మెలో ఉన్నారు. జిల్లా ట్రెజరీ పూర్తిగా బంద్ కావడం వల్ల ఆగస్టు నెల జీతాలు ఎవ్వరికీ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. అలాగే 30 వేల మంది పెన్షనర్లు కూడా పెన్షన్ పొందలేని పరిస్థితి ఏర్పడింది. పోలీసులు, జ్యుడీషియల్‌కు జీతాలు ఇవ్వాలని ట్రెజరీ డీడీపై ఒత్తిడి పెరుగుతోంది. ఇటు జేఏసీ నేతలు ఎవ్వరికీ ఇవ్వరాదని తెస్తుండటంతో ట్రెజరీ డీడీకి ఎటూ పాలు పోని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో దాదాపు వంద కోట్ల రూపాయలు జీతాలు, పెన్షన్ల రూపంలో చెల్లించాల్సి ఉంది. ఈ విషయంపై శనివారం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తిరగని బస్సులు.. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆర్టీసీ ఉద్యోగులందరూ సమ్మెలో పాల్గొనడంతో 970 బస్సులు డిపోకు పరిమితం అయ్యాయి. ఆగస్టు నెల మొత్తం మీద ఆర్టీసీ దాదాపు రూ.30 కోట్లు నష్టం వాటిల్లింది. పభుత్వానికి ఆదాయాన్ని ఇచ్చే శాఖల్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కీలకమైంది. ఆగస్టు నెలలో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు ద్వారా ప్రభుత్వానికి రూ.17.50 కోట్లు రావాల్సి ఉంది. విభజన నిర్ణయం ప్రకటించిన రోజు నుంచి అటెండర్ మొదలుకొని సబ్ రిజిస్ట్రార్ల వరకు ఆందోళనలు నిర్వహిస్తుండటంతో రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. వాణిజ్య పన్నుల శాఖ నుంచి వ్యాట్, అమ్మకపు పన్ను తదితర వాటి ద్వారా ఆగస్టు నెలలో రూ.27 కోట్లు రావాల్సి ఉంది. వ్యాపార, వాణిజ్యవేత్తలు ఆన్లైన్ ద్వారా వ్యాట్ చెల్లిస్తుండటం వల్ల 50 శాతం మాత్రమే ఆదాయం వచ్చింది. వాహనాల రిజిస్ట్రేషన్లు, రోడ్డు ట్యాక్స్ తదితర రూపాల్లో ఆదాయం రూ.12 కోట్లు రావాల్సి ఉన్నా సిబ్బంది సమ్మెలో ఉండటం వల్ల ఆదాయం భారీగా పడిపోయింది. అలాగే గనుల శాఖ ద్వారా ప్రభుత్వానికి లీజులు రాయల్టీలు, జరిమానాలు తదితర వాటి ద్వారా జిల్లా నుంచి ఈ నెలలో రూ.5 కోట్లు రావాల్సి ఉన్నా కోటి రూపాయలు కూడా రాలేదు. రూ.4 కోట్లకు పైగా ఆదాయానికి గండిపడింది. రెవెన్యూ శాఖ ద్వారా ప్రభుత్వానికి నాల, వన్‌టైమ్ కన్వర్షన్ తదితర రూపాల్లో ఆదాయం వస్తుంది. రెవెన్యూతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో దాదాపు రూ.7 కోట్ల మేర గండి పడినట్లు అధికార వర్గాలు తెలిపాయి. నిలిచిన ప్రజాపంపిణీ... సమైక్య ఉద్యమం కారణంగా సెప్టెంబర్ నెల ప్రజాపంపిణీ పూర్తిగా నిలిచిపోయింది. 10.5 లక్షల కుటుంబాలు సెప్టెంబర్ నెల సరుకులు పొందలేకపోతున్నారు. సరుకులు అందకపోయినా రాష్ట్రం సమైక్యంగా ఉంటే కడుపు నిండినట్లేనన్న అభిప్రాయం ఏర్పడుతోంది. -
నేటి నుంచి రిలే దీక్షలు
రావులపాలెం, న్యూస్‌లైన్ :సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం నుంచి జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేయనున్నారని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ కుడిపూడి చిట్టబ్బాయి తెలిపారు. జగన్ దీక్షకు మద్దతుగా జిల్లాలోని పార్టీ శ్రేణులు నేటి నుంచి రిలే దీక్షలు చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. శనివారం రావులపాలెంలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. జగన్ దీక్షకు మద్దతుగా జిల్లాలోని వైఎస్సార్ సీపీ నేతలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు, సీజీసీ, సీఈసీ సభ్యులు, మండల కన్వీనర్లు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు, వివిధ విభాగాల కన్వీనర్లు మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో రిలే దీక్షలు చేపడుతున్నట్టు ఆయన తెలిపారు. సమైక్యవాదులందరూ దీక్షలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయలేని పరిస్థితుల్లో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ చేపట్టిన దీక్షను ప్రభుత్వం భగ్నం చేసేందుకు ప్రయత్నించి తీరు అందరినీ తీవ్రంగా కలచివేసిందన్నారు. ఇటీవల విజయమ్మ దీక్షకు మద్దతుగా తాము చేపట్టిన బస్సుయాత్రకు కోనసీమ జేఏసీ మద్దతు తెలిపిందన్నారు. జేఏసీలు అన్నీ కలసి విజయమ్మ నేతృత్వంలో పనిచేయాలని కోరుకుంటున్నాయని ఆయన తెలిపారు. ప్రజల అభిమానాన్ని చూరగొన్న విజయమ్మ దీక్షను భగ్నం చేసేందుకు ప్రయత్నించిన తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. జిల్లాలో అమలాపురం పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో బస్సు యాత్రకు ప్రజల నుంచి అపూర్వమైన స్పందన వచ్చిందన్నారు. వైఎస్సార్ సీపీ సమైక్యాంధ్ర కోసం చిత్తశుద్ధితో పోరాటం చేస్తోందన్నారు. ప్రజాశ్రేయస్సు కోసం వైఎస్సార్ సీపీ పాటుపడతోందన్నారు. సమైక్యాంధ్ర కోసం తమ పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ఆదర్శంగా నిలిచారన్నారు. తొమ్మిది సంవత్సరాలు సీఎంగా పనిచేసిన చంద్రబాబు బస్సుయాత్ర ప్రకటించి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారన్నారు. టీడీపీ ధ్వంధ్వ వైఖరి, రెండు నాలుకల విధానాన్ని ప్రజలు గుర్తించారని చిట్టబ్బాయి విమర్శించారు. వైఎస్సార్ సీపీ ప్రజాపక్షాన పోరాటం చేస్తుందన్నారు. వైఎస్సార్ పీపీ కొత్తపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, అమలాపురం టౌన్ కన్వీనర్ మట్టపర్తి నాగేంద్ర, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పీఎస్రాజు, గొలుగూరి మునిరెడ్డి, బొక్కా వెంకటలక్ష్మి, మండల కన్వీనర్లు తమ్మన శ్రీను, దొమ్మేటి అర్జునరావు పాల్గొన్నారు. -
స్తంభించిన జనజీవనం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాలో ఉధృతంగా సాగుతోంది. సకలజనుల సమ్మెగా రూపాంతరం చెందిన తర్వాత ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. రాష్ట్ర విభజనను నిరసిస్తూ నగరం నుంచి పల్లె వరకూ అన్నివర్గాల ప్రజలు రోడ్డెక్కుతున్నారు. ఉద్యోగ, విద్యార్థి, వ్యాపార, కార్మిక సంఘాలు ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తున్నాయి. బస్సులు తిరగక పోవడం, వ్యాపార సంస్థలు మూతపడటంతో జనజీవనం స్తంభించింది. అయినా భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రజలు ఉద్యమానికి సహకారం అందిస్తున్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం వెలువడిన జూలై 30వ తేదీ తరువాత సమైక్యాంధ్ర ఉద్యమం మొదలైంది. ఉన్నతాధికారులు మినహాయిస్తే ఉద్యోగులు, సిబ్బంది అందరూ ఆందోళనబాట పట్టారు. ఈనెల 12న అర్ధ రాత్రి నుంచి ఉద్యోగులు, కార్మికులు, ఎన్జీఓలు సకలజనుల సమ్మె చేపట్టారు. వివిధ రూపాల్లో నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉద్యోగులెవరూ రాకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. చేసేదేమి లేక ఉన్నతాధికారులు సైతం కార్యాలయాలకు రావడం మానేశారు. మరోవైపు ఉద్యమాన్ని మరింత ఉధృ తం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సీమాంధ్రలోని 13 జిల్లాలో ఎన్జీఓ ప్రతినిధులు శుక్రవారం గుంటూరులో సమావేశమై ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. ఉద్యమాన్ని మరింత హోరెత్తించాలని తీర్మానించారు. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌పై ప్రభావం ఈనెల 19వ తేదీ నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులకు ఆదాయ, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు అవసరమవుతాయి. రెవెన్యూ ఉద్యోగులు సమ్మెలో ఉండటంతో ధ్రువీకరణ పత్రాల జారీ నిలిచిపోయింది. ఈ క్రమంలో కౌన్సెలింగ్ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. మరోవైపు సోమవారం నుంచి జిల్లాలో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. విద్యార్థుల చదువును దృష్టిలో ఉంచుకుని ఉద్యమం నుంచి స్కూళ్లకు మినహాయింపు ఇస్తూ జేఏసీ నాయకులు నిర్ణయం తీసుకున్నారు. స్కూళ్లు తెరిచినా ఉద్యమంలో తమ వంతు పాత్ర పోషిస్తామని ప్రైవేటు స్కూళ్ల యజమానులు ప్రకటించారు. బస్సులు తిరగకపోవడంతో ఆర్టీసీపై ప్రభావం చూపుతోంది. రోజూ రూ.90 లక్షల వరకు నష్టం వాటిల్లుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. -
సమైక్యం ఉధృతం
సాక్షి, నెల్లూరు : జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం 17వ రోజు మరింత ఉధృతంగా సాగింది. శుక్రవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నా ఉద్యమకారులు మొక్కవోని దీక్షతో ఆందోళనలు కొనసాగించారు. నగరంలో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం అధ్యాపకుల బృందం వీఆర్ హైస్కూల్ గ్రౌండ్లో, సమైక్య ఉపాధ్యాయ పోరాట సమితి వీఆర్సీ కూడలిలో రిలే దీక్షలు చేపట్టారు. ఆర్టీసీ ఉద్యోగులు వరుసగా మూడో రోజూ బస్టాండ్ ఎదుట వంటావార్పు నిర్వహించారు. విద్యుత్‌శాఖ మహిళా ఉద్యోగులు కార్యాలయం ఎదుట సోనియా మనసు మారాలని వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు. నగరంలో వాణిజ్య శాఖ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. గూడూరులో హిజ్రాలు సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించారు. సూళ్లూరుపేటలో వైఎస్సార్ సీపీ నేతలు బస్టాండ్ సెంటర్ నుంచి పొట్టిశ్రీరాములు విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు. వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ ఆధ్వర్యంలో వెంకటగిరిలోని అడ్డరోడ్డు సెంటర్లో వంటావార్పు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా పాఠశాలలు, కళాశాల ల బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సు లు కూడా పూర్తిస్థాయిలో తిరగడం లేదు. సమైక్య ఉద్యమంతో జిల్లాలో జన జీవనం స్తంభించింది. నగరంలో సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యం లో ఆత్మకూరు బస్టాండు కూడలిలో మానవహారం నిర్వహించారు. ఎన్జీఓ హోమ్‌లో అటవీశాఖ ఉద్యోగుల రిలే దీక్షలు చేపట్టారు. సమైక్యాం ధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో వీఆర్సీ కూడలిలో రాస్తారోకో నిర్వహించారు. ఆర్టీసీ బస్‌స్టేషన్ ప్రాంగణంలో కార్మికు లు వంటావార్పు నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట రెవెన్యూ అసోసియేషన్ సమైక్య నినాదంతో ఆందోళన నిర్వహించారు. వాణిజ్యపన్నుల శాఖ ఉద్యోగులు ఆ కార్యాలయం నుంచి వీఆర్సీ, చిన్నబజారు, పెద్దబజారు, సంతపేట ల మీదుగా తిరిగి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిం చారు. గూడూరు డివిజన్ హిజ్రాల సం ఘం ఆధ్వర్యంలో పట్టణంలో సోని యా, కేసీఆర్ దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించారు. రోడ్డుపై కబడ్డీ ఆడారు. అనంతరం శాపనార్థాలు పెడు తూ సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆర్టీసీలోని ఎన్ఎం యూ, ఈయూ సంఘాల ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు బత్తిని విజయ్‌కుమార్, కార్మికులతో కలిసి బస్సుల టాపుపై కూర్చొని ర్యాలీ నిర్వహించారు. అనంతరం హైవేని దిగ్బంధించారు. దీంతో సుమారు గంటకు పైగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కోట పట్టణంలో ఐసీడీఎస్ ఉద్యోగులు సమైక్యాంధ్ర కోసం ర్యాలీ నిర్వహించారు. కోవూరు ఎన్జీఓ హోంలో నాయీబ్రాహ్మణ సంఘం నాయకుల రిలే నిరాహారదీక్ష నిర్వహించారు. బుచ్చిరెడ్డిపాళెం వవ్వేరు బ్యాంకు ఎదుట సమైక్యాంధ్ర మండల జేఏసీ నాయకుల రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. సూళ్లూరుపేట పట్టణంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు దబ్బల రాజారెడ్డి, నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సెంటర్ నుంచి పొట్టిశ్రీరాములు విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సూళ్లూరుపేట జేఏసీ నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలుపుతూ దీక్షలో కూర్చున్నారు. నాయుడుపేటలో జేఏసీ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. గాంధీ మం దిరం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేశారు. పెళ్లకూరు మండలంలోని అక్కగారిపేట వద్ద హైవేపై రాస్తారోకో నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మను తగులబెట్టారు. ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్‌లో ఆపస్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు నిర్వహించారు. ఆత్మకూరు, ఏఎస్‌పేట, అనంతసాగరం మండలాల రెవెన్యూ ఉద్యోగులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ఉపాధ్యాయ సం ఘం నేతలకు మద్దతు ప్రకటించారు. ఆర్టీసీ బస్సులు నడవలేదు. పట్టణంలోని బాలికల గురుకుల కళాశాల నుంచి పట్టణ పురవీధుల్లో జేఏసీ ఆధ్వర్యంలో గురుకుల కళాశాల విద్యార్థులు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. వింజమూరులోని పోలీస్‌స్టేషన్ సమీపంలో ఎన్జీఓల ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు పదో రోజుకు చేరుకున్నాయి. పొదలకూరులో సమైక్యవాదులు రాస్తారోకో నిర్వహించి వాహనాల రాకపోకలు అడ్డుకున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వికలాంగ సేవాసంఘం ఆధ్వర్యంలో స్థానిక పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద వికలాంగులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వారి దీక్షకు కావలి ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు మద్దతు తెలిపారు. కావలి ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. తెలుగుతల్లి, అల్లూరి సీతారామరాజు, పొట్టిశ్రీరాములు, వీరపాండ్యఖడ్గబ్రహ్మన వేషాలతో ర్యాలీని నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు శుక్రవారం కూడా మూతపడ్డాయి. -
జోరు వర్షంలోనూ ఉద్ధృతంగా సమైక్య ఉద్యమం
వేర్పాటు వద్దంటూ నడిరోడ్డుపై శ్రావణ వరలక్ష్మీ పూజలు రాష్ర్టం సమైక్యంగానే ఉండాలని కోరుతూ పవిత్ర శ్రావణ శుక్రవారం రోజు సీమాంధ్రలోని జిల్లాల్లో మహిళలు నడిరోడ్డుపై వరలక్ష్మీ వ్రతాలు చేపట్టారు. సామూహిక పూజలు నిర్వహించారు. అధికార కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి ‘వేర్పాటు’ ప్రకటన వచ్చిన దరిమిలా కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఎగసిన సమైక్యాంధ్ర ఉద్యమం వరుసగా పదిహేడో రోజు శుక్రవారం కూడా ఉద్ధృతంగా సాగింది. పలు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నా సమైక్యవాదులు లెక్కచేయక పోరాటాన్ని సాగించారు. - సాక్షి నెట్వర్క్ సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉప్పెనలా సాగుతోంది. ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలతో హోరెత్తిస్తున్న సమైక్యవాదుల నిరసనలకు తోడు ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె, సకజల జన అందోళనలు మిన్నంటడంతో 13జిల్లాల్లో జనజీవనం స్తంభిస్తోంది. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయూలు మూతకొనసాగుతోంది. ఆర్టీసీ సర్వీసులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులపై జనాగ్రహం కొనసాగుతోంది. సోనియాగాంధీ, పీసీసీ చీఫ్ బొత్స, చిరంజీవిల దిష్టిబొమ్మల దహనాలు, శవయాత్రలు జరుగుతూనే ఉన్నాయి. విభజన విషయంలో యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ మనసు మారాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో సమైక్య వాదులు వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం తాలూకాఫీస్ సెంటర్లో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులు, పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్లో మహిళలు రోడ్డుపై శ్రావణ లక్ష్మీ పూజలు చేపట్టారు. నెల్లూరులో ట్రాన్స్‌కో ఆఫీసు ఎదుట మహిళా ఉద్యోగులు వరలక్ష్మీ వ్రతం నిర్వహించి సమైక్యాంధ్ర స్లిప్‌లు పెట్టి తాంబూలాలు పంచారు. అనంతపురంలో ఉపాధ్యాయ జాక్టో చేపట్టిన దీక్షా శిబిరంలోనే మహిళా ఉపాధ్యాయులు మహాలక్ష్మి వ్రతాన్ని పాటించారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో, వైఎస్సార్ జిల్లా కడపలోనూ, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం పూజారుల ఆధ్వర్యంలోనూ సమైక్యలక్ష్మి పేరిట శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే అర్ధశిరోముండనం పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే టీవీ రామారావు అర్ధశిరోముండనం చేరుుంచుకుని కాంగ్రెస్ వేర్పాటు వాదంపై నిరసన తెలిపారు. కొవ్వూరులోని ఉభయగోదావరి జిల్లాల నడుమ గల రోడ్ కం రైల్ వంతెనపై జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, వివిధ వర్గాల ప్రజలు వేలాదిగా తరలివచ్చి 3 గంటలపాటు మహాధర్నా చేశారు. విభజిస్తే వరికి ఉరే తణుకులో వ్యవసాయ శాఖ ఉద్యోగులు, ఎరువులు, పురుగు మందుల డీలర్లు ఎండిన వరి దుబ్బలను చేతపట్టుకుని రాష్ట్రాన్ని విభజిస్తే ‘వరి పంటకు ఉరి’ పడుతుందంటూ వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. ఈనెల 22న భీమవరంలో 50వేల మంది రైతులతో మహాసభ నిర్వమించనున్నట్లు రైతు సమాఖ్య రాష్ట్ర నాయకులు ఎంవీ సూర్యనారాయణరాజు ఆకివీడులో ప్రకటించారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాలని దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఏనాడూ ప్రయత్నించలేదని రాజకీయేతర ఐకాస చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలమోహన్‌దాస్ పేర్కొన్నారు. విశాఖలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విభజనకు వైఎస్ బీజం వేశారని కొందరు రాజకీయ నేతలు చెప్పడాన్ని తప్పుబట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ బస్సు యాత్రలు ప్రారంభం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి, అమలాపురం పార్లమెంటు నియోజక వర్గాల్లో బస్సు యాత్రలు ప్రారంభించారు. రాజమండ్రిలో వీఎల్ పురం సాయిబాబా ఆలయం వద్ద ఉదయం ప్రారంభమైన యాత్ర తొలిరోజు లాలాచెరువు వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వరకు జరిగింది. ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కర రామారావు, ఆదిరెడ్డి అప్పారావు, గోపాలపురం ఎమ్మెల్యే తానేటి వనిత, రాజమండ్రి పార్లమెంటరీ పార్టీ కో ఆర్డినేటర్ బొడ్డు వెంకట రమణచౌదరి తదితరులు పాల్గొన్నారు. అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ యాత్ర తొలిరోజు అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి మామిడికుదురు వరకు సాగింది. ఈ యాత్రలో పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, పార్టీ సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, రాష్ట్ర మహిళా విభాగం కన్వీనర్ కొల్లి నిర్మల కుమారి పాల్గొన్నారు. మంత్రి తోట నరసింహం సతీమణి వాణి కాకినాడలో సాగిస్తున్న నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున భగ్నం చేసి, ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఎడతెరపి లేని వర్షంలోనూ.. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో శుక్రవారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నా ఉద్యమకారులు ఆందోళనలు కొనసాగించారు. నెల్లూరు వీఆర్సీ కూడలిలో సమైక్య ఉపాధ్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఆర్టీసీ ఉద్యోగులు బస్టాండు ఎదుట వంటా వార్పు నిర్వహించారు. ఆర్టీసీ అద్దె బస్సుల ర్యాలీ సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో బస్సుయాత్రను శుక్రవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో ప్రారంభించారు. జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ అద్దె బస్సులతో శ్రీకాకుళంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా కేబుల్ ఆపరేటర్లు ప్రసారాలను నిలిపివేశారు. కృష్ణా కరకట్ట దిగ్బంధం కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలంలోని వల్లూరుపాలెంలో కేసిఆర్ దిష్టిబొమ్మతో ప్రధాన వీధుల వెంట శవయాత్ర నిర్వహించారు. అనంతరం మూడు గంటలపాటు కృష్ణా కరకట్టను దిగ్బంధించి పెద్దఎత్తన ఆందోళన చేయటంతో, భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. విజయవాడ-పులిగడ్డల మధ్య గంటలసేపు రాకపోకలు స్తంభించాయి. మచిలీపట్నంలో ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు వర్షంలో తడుస్తూనే దీక్షా శిబిరాల్లో కూర్చున్నారు. వాల్మీకుల భారీ ప్రదర్శన అనంతపురం జిల్లా పెనుకొండలో పార్టీలకు అతీతంగా వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో వేలాది మందితో భారీ ఎత్తున సమైక్యర్యాలీ నిర్వహించారు. హిందూపురంలో కురుబ సంఘం ఆధ్వర్యంలో, ముస్లింలు సోదలు భారీ ర్యాలీ చేపట్టారు. రాయదుర్గంలో రైతులు ఎద్దులబండ్లు కట్టుకుని పట్టణమంతా సమైక్యనినాదాలతో ర్యాలీ తీశారు. అనంతపురం నగరంలో డీఎంహెచ్ఓ, వైద్య ఆరోగ్యశాఖ జేఏసీ చేపట్టిన రిలేదీక్షలకు ఎమ్మెల్యే బి.గురునాథ్‌రెడ్డి సంఘీభావం ప్రకటించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎస్కేయూ విద్యార్థులు వర్శిటీ నుంచి కలెక్టరేట్ సమీపం వరకు ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ జిల్లాలో జోరు వానలో సైతం సమైక్య ఉద్యమ హోరు తగ్గలేదు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండాజిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు, మానవహారాలు, ఆందోళనలతో హోరెత్తించారు. కడపలో, రాయచోటిలో ముస్లింలు భారీ ర్యాలీని చేపట్టి నడిరోడ్డుపైనే ప్రార్థనలు చేశారు. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కమలాపురంతోపాటు జిల్లాలో పలుచోట్ల రహదారులను దిగ్బంధం చేశారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు సామూహిక సెలవులు తీసుకుని రిలే నిరాహారదీక్షలు ప్రారంభించారు. చీపురుపల్లిలో రాష్ట్రానికి చెందిన 9 మంది కేంద్ర మంత్రుల ఫొటోలపై గంగిరెద్దులు అని రాసి కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. రక్తం చిందించైనా.. తిరుపతి సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి జేఏసీ కన్వీనర్ డాక్టర్ సుధారాణి ఆధ్వర్యంలో శుక్రవారం సమైక్యాంధ్ర చార్ట్‌కు రక్తపు తిలకం దిద్దారు. రక్తం చిందించైనా రాష్ట్రాన్ని కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. చిత్తూరు జిల్లాలోని 13 ఆర్టీసీ డిపోల్లో బస్సులు రోడ్డెక్కలేదు. పుంగనూరులో ముస్లింలు ర్యాలీ నిర్వహించి, గోకుల్ కూడలిలో ప్రార్థనలు చేశారు. గుంటూరు జిల్లాలో అన్నిచోట్లా వైఎస్ఆర్ సీపీ నేతల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. గుంటూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు, నర్సులు మహాత్ముని బాటలో మేమూ.. అంటూ నోటికి మాస్క్‌లు, చెవుల్లో దూది, కళ్లకు నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. జీతాలు రాకుంటే ఉద్యమం దెబ్బతింటుంది.. ఎన్జీవోలపై టీజీ వివాదాస్పద వ్యాఖ్యలు కర్నూలు జిల్లాలో జోరువానలోనూ సమైక్యాంధ్ర ఉద్యమం ఉప్పెనై ఎగిసింది. కర్నూలులోని పాతబస్తీలో చిన్న వ్యాపారుల సంఘం నిర్వహించిన వంటావార్పు కార్యక్రమానికి హాజరైన మంత్రి టీజీ వెంకటేశ్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్జీవోల సమ్మెకు ఇది తగిన సమయం కాదని, వారు పునరాలోచించుకోవాలని సూచించారు. రెండు నెలలు జీతాలు రాకపోతే ఎన్జీవోల ఉద్యమం దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు. రాజకీయాల కోసం సమైక్యాంధ్ర ఉద్యమాల్లో పాల్గొనకుండా చిత్తశుద్ధితో పాల్గొనాలని సూచిం చారు. కర్నూలు నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్లో ప్రభుత్వ వైద్యులు, నర్సింగ్ కళాశాల విద్యార్థులు వర్షంలో తడుస్తూ మానవహారంగా ఏర్పడి రాస్తారోకో నిర్వహించారు. ఒంగోలులో ‘తెలంగాణ’ అధికారులకు సన్మానం ప్రకాశం జిల్లా ఒంగోలులో తెలంగాణ ప్రాంతానికి చెందిన జిల్లా విద్యాశాఖాధికారి రాజేశ్వరరావు, బీసీ సంక్షేమ శాఖ అధికారి మయూరిలను ఘనంగా సన్మానించారు. నగర ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. చీరాలలో ఆందోళన చేస్తున్న విద్యార్థులను కొట్టారంటూ ఎపీఎన్జీఓల ఆధ్వర్యంలో పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించి ఆందోళనకు దిగారు. దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గిద్దలూరులో ఆందోళనకారులు అటవీశాఖ కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఆగని మృత్యుఘోష శుక్రవారం ఒక్కరోజే ఆరుగురి కన్నుమూత సాక్షి నెట్వర్క్: ‘వేర్పాటు’ భయంతో ప్రాణాలు విడుస్తున్న వారి సంఖ్య ఇంకా తగ్గడం లేదు. ఒక్క శుక్రవారం రోజునే సీమాంధ్ర జిల్లాల్లో ఆరుగురు గుండెపోటుతో మృత్యువాత వడ్డారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో నాలుగు రోజులుగా చురుగ్గా పాల్గొంటున్న గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని దోబీఘాట్‌కు చెందిన పగిళ్ల నాగరాజు (24) శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందాడు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని గూబగుండం గ్రామానికి చెందిన నాగరాజు(34) టీవీలో విభజన, ఉద్యమం వార్తలు చూస్తూ గుండెపోటుతో మృత్యువాత పడ్డాడు. ఇదే జిల్లా తుగ్గలి మండలం రాంపల్లికి చెందిన పందికోన జయన్న(48) రాష్ట్రం విడిపోతే తనకు జీవనాధారం పోతుందేమోనన్న బెంగతో గుండె ఆగి శుక్రవారం కన్నుమూశాడు. సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటున్న అనంతపురం జిల్లా నార్పల మండలం నాయునిపల్లికి చెందిన వైఎస్సార్సీపీ అభిమాని సాయిరాం(47), పుట్టపర్తి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన పెయింటర్ అంజన్‌రెడ్డి (36), శెట్టూరు మండలం మాకొడికి చెందిన నేసే కిష్టప్ప (42) గుండెపోటుతో మృతి చెందినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. విమానం మోత! విజయవాడ, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావం ప్రయాణికులపై తీవ్రంగా ఉంది. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో బస్సు సర్వీసులు రద్దుచేసిన విషయం విదితమే. ఇక రైళ్ళలో విపరీతమైన రద్దీ నెలకొన్న నేపథ్యంలో విజయవాడ నుంచి ముఖ్య నగరాలకు వెళ్లే విమానాల చార్జీలు మోతమోగుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, ఖమ్మం, పశ్చిమగోదావరి జిల్లాల ప్రయాణికులకు అనువైన గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్వేస్ ధరలకు రెక్కలొచ్చాయి. గన్నవరం-హైదరాబాద్‌కు గతంలో ఉన్న రూ.2,600 టికెట్ రూ.7 వేలకు పెరిగింది. ఇక్కడి నుంచి హైదరాబాద్ మీదుగా ఢిల్లీ టికెట్ రూ.5,800 నుంచి రూ.12 వేలకు, బెంగళూరు టికెట్ రూ.2,700 నుంచి రూ.6 వేలకు, చెన్నైకు రూ.2,800 ఉన్న ధర దాదాపు రూ.6 వేలకు పెరిగాయి. టికెట్ల ధర మూడింతలు పెరిగినప్పటికీ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, వారి కుటుంబసభ్యులు విమానయానానికి పోటీపడుతుండటం గమనార్హం. కేశినేనీ.. ఇదేం పని? సాక్షి, విజయవాడ : తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తరహాలోనే ఆ పార్టీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి కేశినేని శ్రీనివాస్ (నాని) రెండు కళ్ల సిద్ధాంతం అమలు చేస్తున్నారు. సమైక్యవాదిగా ఉదయం పూట ఉద్యమంలో పాల్గొని బంద్‌లు చేయిస్తున్నారు. రాత్రయ్యేసరికి కేశినేని ట్రావెల్స్‌కు చెందిన బస్సుల్ని యథావిధిగా నడిపిస్తున్నారు. కేశినేని ట్రావెల్స్‌కు చెందిన 22 బస్సులు విజయవాడ నుంచి హైదరాబాద్, చెన్నై, కోయంబత్తూరు, బెంగళూరు, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు జోరుగా నడుస్తున్నాయి. సమైక్య ఉద్యమంలో ఆయన పాల్గొంటూనే, తనకు వచ్చే లక్షల రూపాయల ఆదాయానికి గండిపడకుండా జాగ్రత్తలు తీసుకోవడాన్ని టీడీపీ నేతలే తప్పుపడుతున్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రెండు కళ్ల సిద్దాంతంతో సీమాంధ్ర ప్రాంతంలో తలెత్తుకోలేకపోతున్నామని, ఇప్పుడు నాని వంటి వారి చర్యలతో ప్రజల్లో పార్టీ చులకనైపోతోందని ఆవేదన చెందుతున్నారు. కేశినేని ట్రావెల్స్ బస్సులు నడపటాన్ని ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆక్షేపిస్తున్నాయి. ప్రైవేటు ట్రావెల్స్ కూడా ఉద్యమంలో కలిసి రావాలని డిమాండ్ చేస్తున్నాయి. కేశినేని ట్రావెల్స్ బస్సుల్ని తొలుత ఆపేస్తే మిగిలిన ప్రైవేటు ట్రావెల్స్ కూడా ఆయన దారిలోకే వస్తాయని ఆర్టీసీ కార్మికులు పేర్కొంటున్నారు. -
అదే హోరు
సాక్షి, కడప : సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం జిల్లాలో 15 రోజులుగా ఉద్యమం సాగుతోంది. సమైక్య సమ్మెలో సకల జనులు చేయి కలుపుతూ ఉద్యమాన్ని రోజురోజుకు పతాక స్థాయికి చేరుస్తున్నారు. ఉద్యోగులు సమ్మె బాట పట్టడంతో ఉద్యమానికి మరింత ఊపొచ్చింది. జిల్లాలో పాలన పూర్తిగా స్తంభించిపోయింది. ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకోలేదు. ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు, మానవహారం, ధర్నాలు, విచిత్ర వేషధారణలతో ఎక్కడికక్కడ పల్లెజనాలు జాతీయ రహదారులపై కంచె వేసి వాహనాల రాకపోకలను అడ్డుకుంటున్నారు. వినూత్నరీతిలో నిరసనలు తెలియజేస్తున్నారు. దీంతో రవాణా వ్యవస్థ అతలాకుతలమవుతోంది. మొత్తం మీద జిల్లాలో ఉద్యమ నిరసన కెరటాలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. కలెక్టరేట్ వద్ద దీక్షలు చేస్తున్న వారికి సంఘీభావం తెలిపేందుకు అన్ని వర్గాల ప్రజలు ర్యాలీలతో తరలి వస్తుండడంతో కలెక్టరేట్ పరిసరాలు జన సంద్రమవుతున్నాయి. కలెక్టరేట్ వద్ద జేఏసీ, ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. విద్యార్థులకు రోడ్లపైనే యూనిట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైఎస్సార్సీపీ నేత నిత్యానందరెడ్డి ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమీపంలో వంటా వార్పు చేపట్టారు. వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్, ది కడప కిరాణా మర్చంట్ అసోసియేషన్, కడప ఫుడ్గ్రేయిన్ మర్చంట్ అసోసియేసన్, వైఎస్సార్ సీపీ యువజన విభాగం, ఏపీ రాష్ట్ర పోలీసు మినిస్ట్రీరియల్ స్టాఫ్, దేవునికడప ప్రజలు, శాలివాహనసంఘం, వైఎస్సార్ సీపీ మైనార్టీసెల్, ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు అసోసియేషన్, విద్యామందిర్, సిద్దార్థ ఇంగ్లీషు మీడియం పాఠశాల విద్యార్థులు, ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ ఉద్యోగుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించారు. విద్యుత్ ఉద్యోగులు సమైక్యాంధ్ర ఐకాస, న్యాయవాదుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి . వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి దీక్షలు బుధవారంతో మూడవ రోజు ముగిశాయి. దీక్షల్లో ఉన్న వారికి ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్సీపీ క్రమశిక్షణా సంఘం సభ్యుడు రఘురామిరెడ్డి, జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్‌రెడ్డి, ఈవీ సుధాకర్‌రెడ్డి తదితరులు తమ సంఘీభావాన్ని తెలిపారు. జమ్మలమడుగులో జై సమైక్యాంధ్ర అంటూ పాత బస్టాండు సమీపంలోని మూడంతస్తుల భవనం పైనుంచి బయపురెడ్డి అనే వ్యక్తి దూకాడు. దూదేకుల సంఘం, ఆర్ఆర్ సోషియో కల్చరల్ అసోసియేషన్, సెయింట్ మెరీస్ ఇంగ్లీషు మీడియం స్కూలు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయులు రోడ్డుపైనే యోగాచేశారు. ఎర్రగుంట్లలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఆర్టీపీపీ ఉద్యోగులు విధులు బహిష్కరించి రోడ్లపై నిరసన తెలియజేసి రిలే దీక్షలు ప్రారంభించారు. అన్ని చర్చిల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. పులివెందుల జేఏసీ ఆధ్వర్యంలో ట్రాన్స్‌కో, ఎల్ఐసీ ఏజెంట్లు, ఫుట్‌వేర్, పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు,. పూల అంగళ్ల వద్ద మానవహారాన్ని నిర్మించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు ఈసీ గంగిరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డిలు పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేశారు. వేముల ప్రాథమిక పాఠశాలకు చెందిన 370 మంది విద్యార్థులకు రోడ్డుపైనే యూనిట్ పరీక్షలు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కమలాపురంలో ఉద్యోగులు, అధ్యాపకులతోపాటు పడమటివీధి, పాత చర్చి, స్టాలిన్ వీధి యువజనులు భారీ ర్యాలీని నిర్వహించి సోనియాగాంధీ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. మైదుకూరులో ముస్లింల ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే డీఎల్ రవీంద్రారెడ్డి, టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్‌లు తమ సంఘీభావాన్ని తెలిపారు. రైల్వేకోడూరులో అన్ని రకాల వ్యాపారులు, దుకాణాల యజమానులు భారీ ర్యాలీ నిర్వహించి సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దగ్దం చేశారు. రాజంపేటలో జేఏసీ ఆద్వర్యంలో కొత్తబస్టాండు నుంచి వైఎస్సార్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బద్వేలులో బంద్ విజయవంతమైంది. పోరుమామిళ్లలో ఆర్యవైశ్యులు అన్ని దుకాణాలను మూసివేసి ర్యాలీ చేపట్టారు. ప్రొద్దుటూరు పట్టణంలో వైద్యులు, సిబ్బంది ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలకు శవయాత్ర చేసి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. రజకులు ర్యాలీ, మానవహారాన్ని నిర్మించారు. వినూత్నరీతిలో సోనియా, కేసీఆర్‌ల మాస్క్‌లను రెండు గాడిదలకు తగిలించి ఊరేగించారు. రాయచోటిలో జేఏసీ, న్యాయవాదుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. విద్యార్థులకు రోడ్డుపైనే యూనిట్పరీక్షలు నిర్వహించారు. -
రేపటి నుంచి రైతులతో కలిసి సమైక్య ఉద్యమం
అనంతపురం అగ్రికల్చర్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా 16 నుంచి రైతులతో కలిసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటామని వ్యవసాయశాఖ, అనుబంధ శాఖల అధికారులు నిర్ణయించారు. బుధవారం స్థానిక రైతుబజార్ సమీపంలోని కృషిభవన్‌లో వ్యవసాయశాఖ, ఉద్యానశాఖ, ఏపీఎంఐపీ, పశుసంవర్ధకశాఖ అధికారులు, అసోసియేషన్ నేతలు సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా తీసుకున్న విభజన నిర్ణయం వల్ల సీమాంధ్ర ప్రాంతంలో సమస్యలు ఎక్కువగా ఉత్పన్నమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల ప్రజల స్థితిగతులు దారుణంగా దెబ్బతింటాయన్నారు. 15 రోజులుగా ప్రజలు, ఉద్యోగ సంఘాలు చేస్తున్న ఉద్యమానికి బాసటగా నిలుస్తామని తెలిపారు. అందులో భాగంగా వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు పెద్ద ఎత్తున రైతులను సమీకరించి ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని నిర్ణయించారు. 16న నగరంలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. ఏపీ ఎన్జీఓ సమ్మెలో భాగంగా సీమాంధ్ర జిల్లాల్లో తమ శాఖల అధికారులు పాల్గొనేలా తమ వంతు చర్యలు తీసుకుంటామని నేతలు పేర్కొన్నారు. సమావేశంలో వ్యవసాయశాఖ జేడీ కె.సాంబశివరావు, ఏపీఎంఐపీ పీడీ ఎం.వెంకటేశ్వర్లు, ఏపీడీ రంగస్వామి, ఉద్యానశాఖ ఏడీ బీవీ రమణ, పశుసంవర్ధకశాఖ డీడీ డాక్టర్ జయకుమార్, ఆయా శాఖల అధికారులు వాసుప్రకాశ్, వెంకటప్రసాద్‌యాదవ్, చెన్నవీరాస్వామి, శ్రావణ్, చంద్రశేఖర్ హాజరయ్యారు. -
మీ మొహాలు చూడలేం
కదిరి, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా పదవులకు, పార్టీలకు రాజీనామా చేయకుండా మభ్యపెడుతున్న రాజకీయ నాయకుల వైఖరిని జనం సహించలేకపోతున్నారు. బుధవారం కదిరిలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులకు సమైక్యవాదుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. జేఏసీ ఏర్పాటు చేసిన సభకు సమైక్యవాదులు భారీగా తరలివచ్చారు. జేఏసీ నేతల ప్రసంగాలను ఎంతో ఓపికగా కూర్చుని విన్నారు. ఈలోగా టీడీపీ, కాంగ్రెస్ నాయకులు వేదికపైకి వెళ్లారు. వెంటనే అంతసేపు ఓపికగా కూర్చుని ఉన్న వారు వెంటనే లేచి వెళ్లిపోయారు. ‘మీ పదవి, పార్టీకి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనండి. అప్పుడు మాకెలాంటి అభ్యంతరం లేదు. అందాక మీ మొహాలు మాకు చూపకండి.. వేదికపై నుంచి దిగిపోండి.. మీ కల్లబొల్లి మాటలు వినే ఓపిక మాకు లేదు’ అని మహిళలు కుండబద్దలుకొట్టినట్లు మాట్లాడారు. టీడీపీ, కాంగ్రెస్ నాయకుల మాటలు వినకుండా వెళ్లిపోయారు. కూర్చోండమ్మా అని వారు బతిమలాడుకున్నా వినలేదు. వేదిక ఎక్కిన నాయకుల్లో టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కూడా ఉన్నారు. -
బీమా భవన్లో ఉద్రిక్తత.. ఏపీ, టీ ఎన్జీవోల పోటాపోటీ నినాదాలు
హైదరాబాద్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర కోసం ఏపీఎన్జీవోల సమ్మె, తెలంగాణకు అనుకూలంగా టీఎన్జీవోల సద్భావన యాత్రలతో స్వల్ప ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. బుధవారం అబిడ్స్ తిలక్ రోడ్డులోని బీమా భవన్లో ఏపీఎన్జీవోలు విధులు బహిష్కరించారు. భోజన విరామ సమయంలో టీఎన్జీవోల సద్భావన యాత్ర నిర్వహించేందుకు తెలంగాణవాదులు వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ‘బీమా భవన్ ఎదుట ఏపీఎన్జీవోలు ధర్నా చేస్తున్నారని, మీరు తర్వాత రావాలని’ ఏసీపీ జైపాల్ రెడ్డి భీమా భవన్ తలుపు మూసి టీఎన్జీవోలను నిర్బంధించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, తెలంగాణ ఉద్యోగులకు మధ్య తోపులాట జరిగింది. తెలంగాణ ఉద్యోగులు లోపలికి వచ్చి ఏపీఎన్జీవోలు చేస్తున్న ధర్నా వద్ద బైఠాయించారు. దీంతో ఏపీఎన్జీవోలు ‘జై సమైక్యాంధ్ర’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఇదే క్రమంలో ‘జై తెలంగాణ’ నినాదాలు జోరందుకోవడంతో పరిస్థితి గోదరగోళానికి దారి తీసింది. ఇరువర్గాలను తాడు సహాయంతో పోలీసులు వేరుచేశారు. ఇరువర్గాలకు సర్ది చెప్పి పంపించివేయడం తో వివాదం సద్దుమణిగింది. అంతా దుష్ర్పచారం..ఖండిస్తున్నాం : దేవీ ప్రసాద్ హైదరాబాద్‌లోని సీమాంధ్ర ఉద్యోగులను ఈ ప్రాంతం వదిలివెళ్లిపోవాలంటూ కొంతమంది బెదిరిస్తున్నారంటూ ఢిల్లీలో దుష్ర్పచారం చేస్తున్నారని, దానిని పూర్తిగా ఖండిస్తున్నామని తెలంగాణ ఉద్యోగ సంఘం నాయకులు దేవీప్రసాద్ అన్నారు. ఒకవేళ నిజంగా ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే తమకు ఫోన్ చేస్తే గంటలోపు అక్కడకు వచ్చి, వారిని కాపాడ తామని స్పష్టం చేశారు.ఏపీఎన్జీవోలకు తాము స్నేహహస్తం చాటుతున్నామని, కమిటీగా ఏర్పడి సమస్యలుంటే చర్చించుకుందామని దేవీప్రసాద్ పిలుపునిచ్చారు. బుధవారం ఎర్రమంజిల్‌లోని జలసౌధ కార్యాలయంలో తెలంగాణ ఇంజనీర్స్ జేఏసీ ఏర్పాటు చేసిన సద్భావన సదస్సులో ఆయన మాట్లాడారు. విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రులు చేసే సమ్మె దారుణమన్నారు. విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె చేస్తే తాము రెండు గంటలు అధికంగా పనిచేస్తామని ప్రకటించినా ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ, సచివాలయంలో అన్నిశాఖలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుంటారని సీమాంధ్ర ఉద్యోగులు నిరసన పేరుతో తెలంగాణ ఉద్యోగులను రెచ్చగొడుతున్నా వారికి ఎస్మా, 177 జీవో కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. మన పోరాటం సామాన్యులపై కాదు : కోదండరాం మన పోరాటం సీమాంధ్ర సామాన్య ప్రజలపై కాదని.. తెలంగాణను అడ్డుకునే కుట్రదారులతోనని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం పేర్కొన్నారు. బుధవారం విద్యుత్ సౌధలో తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చేపట్టిన నిరసనలో ఆయన మాట్లాడారు. ఈనెల 16 నుంచి ‘విభజనకు సహకరించండి- శాంతిని పెంపొందించండి’ నినాదంతో శాంతి ర్యాలీలు, సద్భావనా యాత్రలు నిర్వహిద్దామన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో సీమాంధ్రులు ఉండవద్దని ఇప్పటివరకు ఏ తెలంగాణ వ్యక్తి అనలేదని, కేవలం ఉద్యోగుల్లో మాత్రమే కొద్దిమార్పు ఉంటుందని చెప్పారు. గాయకుడు దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ సమైక్యాంద్ర ఉద్యమ జేఏసీ చైర్మన్‌గా ముఖ్యమంత్రి వ్యహరిస్తుంటే, కో చైర్మన్‌గా డీజీపీ దినేష్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘం నాయకుడు విఠల్, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, అద్దంకి దయాకర్, డాక్టర్ నర్సయ్య, మల్లేపల్లి లక్ష్మయ్య, తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ రఘు తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఉద్యోగులను ఉద్దేశించి ఫోన్లో మాట్లాడారు. -
నిరాక‘రణం’
తెల్లదొరల దాస్యశృంఖలాల నుంచి భరతమాతను విడిపించేందుకు అలనాడు మహాత్మా గాంధీ జాతిని ఏకం చేశారు. ఉప్పు సత్యాగ్రహం..ఖాదీ ఉద్యమంతో బ్రిటీష్ వారి గుండెల్లో వణుకు పుట్టించారు. శాంతియుత నిరసనలతోనే దేశా నికి స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టారు. నేడు సమైక్యాంధ్రప్రదేశ్ కోసం జిల్లా ప్రజలు అదే ఉద్యమాన్ని భుజానికెత్తుకున్నారు. తెలుగు జాతిని విడదీయవద్దంటూ రోడ్లెక్కి నినదిస్తున్నారు. ఉద్యోగులు, అధికారులు, కార్మికులు సహాయ నిరాక ‘రణ’ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేంత వరకు ఆందో ళనలు ఆపబోమని హెచ్చరిస్తున్నారు. సాక్షి, కర్నూలు: జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం రోజురోజుకూ ఉద్ధృతమవుతోంది. ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలు నిరవధిక సమ్మె చేస్తున్నారు. పట్టణాల్లో, పల్లెల్లో ప్రజలు ఐక్యంగా రాస్తారోకోలు, ధర్నాలు, వంటావార్పు, మానవహారాలు, ప్రదర్శనలు, శవయాత్రలు వంటి వినూత్న నిరసన కార్యక్రమాలతో సమైక్యవాణిని వినిపిస్తున్నారు. విభజన నిర్ణయాన్ని ఉపసహంరించుకునే వరకూ విశ్రమించేది లేదంటూ నినదించారు. సుమారు 50 శాఖలకు చెందిన 45వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు బుధవారం సమ్మెలో పాల్గొన్నారు. సుమారు రెండువేలకు మందికిపైగా ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కర్నూలు నగరంలో కేశవరెడ్డి విద్యా సంస్థలకు చెందిన ఉపాధ్యాయులు, సిబ్బంది.. వేల మంది విద్యార్థులతో కలిసి ఎన్టీఆర్ సర్కిల్ నుంచి తెలుగుతల్లి విగ్రహం వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్షలు చేపట్టిన 200 మంది ఉద్యోగులకు వైఎస్ఆర్సీపీ శాసనసభ పక్ష ఉపనేత శోభా నాగిరెడ్డి మద్దతు తెలిపారు. కేఈ సోదరులు కూడా వీరికి మద్దతు ప్రకటించారు. రాస్తారోకోలతో జాతీయ రహదారులపై రవాణా స్తంభించింది. న్యాయవాదులు చేపడుతున్న రిలే నిరాహారదీక్షలు కొనసాగాయి. ఆదోనిలో బుధవారం కూడా సమైక్యాంధ్ర ఉద్యమం ఉద్ధృతంగానే సాగింది. మేదరి సంఘం ఆధ్వర్యంలో పురుషులు, మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగులు రోడ్డుపై వంటా వార్పు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో ఆయా శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆర్డీఓ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డి, జేఏసీ నాయకులు పాల్గొన్నారు. ఆళ్లగడ్డ, రుద్రవరం, శిరివెళ్ల, చాగలమర్రి మండలాలలో ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ఆళ్లగడ్డలో ఆర్టీసీ బస్సులో డిపోకే పరిమితమయ్యాయి. బనగానపల్లె ఆర్టీసీ ఉద్యోగులు రిలే నిరాహారదీక్షలో పాల్గొన్నారు. ఆత్మకూరులో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు నోటికి కట్టుకొని మౌన ప్రదర్శన నిర్వహించారు. వీరు గౌడుసెంటర్ వద్ద మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. వెలుగోడు పొట్టి శ్రీరాములు సెంటర్లో వైఎస్ఆర్సీపీ శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, సోదరుడు బుడ్డా శేషారెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో పాటు మోటర్‌బైక్ ర్యాలీ నిర్వహించారు. కోడుమూరులో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు పట్టణంలో మౌన ప్రదర్శన చేపట్టారు. వీఆర్ఓలు, గ్రామసేవకులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి పాతబస్టాండ్‌లో రోడ్డుపై మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. సి.బెళగల్లో ఆర్ఎంపీలు, మెడికల్ షాప్ అసోసియేషన్ సభ్యులు ర్యాలీ నిర్వహించి రిలేనిరాహారదీక్షలో కూర్చున్నారు. పత్తికొండలో 11 రోజులుగా రిలే నిరాహారదీక్షలు చేస్తున్న ఉపాధ్యాయులకు మద్దతుగా దూదేకొండ గ్రాామానికి చెందిన ఎద్దులబండ్లతో బారీగా ర్యాలీ చేపట్టారు. హాసూరు గ్రామానికి చెందిన ప్రజలు స్కూటర్లు, ట్యాక్టర్లుతో ఐదు గంటల పాటు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మిగనూరులో జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పనిచేస్తున్న క్లరికల్ సిబ్బంది భోజన విరామం సమయంలో నల్లబ్యాడ్జిలను దరించి మౌన ప్రదర్శనను చేపట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. దీక్షలో కూర్చున్న వారికి ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి తనయుడు ఎర్రకోట జగన్మోహన్రెడ్డి మద్దతు ప్రకటించారు. డోన్ పట్టణంలో సమైక్యాంధ్ర కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో 14వరోజు రిలేనిరాహారదీక్షలు చేశారు. వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బుగ్గనరాజారెడ్డి ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర కోరుతూ ర్యాలీ నిర్వహించి దీక్షలు చేస్తున్న వారికి సంఘీభావం ప్రకటించారు. అనంతరం పట్టణంలోని సుందర్సింగ్కాలనీ, టీచర్సుకాలనీలో సమైక్యాంధ్ర గురించి వివరించే కరపత్రాలను బుగ్గన ఆధ్వర్యంలో కార్యకర్తలు పంపిణీ చే శారు. -
బంద్ సంపూర్ణం
సాక్షి, నెల్లూరు : రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సింహపురి వాసులు ఉద్యమాన్ని ఉధృతంగా కొనసాగిస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో 14 రోజులుగా చురుగ్గా పాల్గొంటున్న స్ఫూర్తితోనే ఎన్జీఓ, విద్యార్థి, ఉద్యోగ జేఏసీల పిలుపుమేరకు మంగళవారం బంద్ పాటించారు. బంద్ ప్రశాంతంగా, సంపూర్ణంగా జరిగేందుకు పూర్తి సహకారం అందించారు. ఫలితంగా జిల్లావ్యాప్తంగా వ్యాపార సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు పడ్డాయి. విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులతో పాటు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల పైకి వచ్చి సమైక్యాంధ్ర కోరుతూ ర్యాలీలు, రాస్తారోకో, ప్రదర్శనలతో పాటు దిష్టిబొమ్మల దహనం, వంటా వార్పు తదితర నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగడంతో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. నెల్లూరులో జరిగిన బంద్‌లో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, కోవూరులో ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ స్వార్థ రాజకీయం వల్లే రాష్ట్ర విభజన జరిగిందని ఎంపీ మేకపాటి ఆరోపిం చారు. సమైక్యాంధ్ర కోసం తమ పార్టీ అధ్యక్షుడితో పాటు 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారన్నారు.రాష్ట్ర విభజన ప్రకటనను ఉపసంహరించేంత వరకూ ఆందోళనలు ఉధృతం చేస్తామని జేఏసీ,ఎన్జీఓ, విద్యార్థి సంఘాలతో పాటు రాజకీయ నేతలు హెచ్చరించారు. నగరంలో ఉదయాన్నే బంద్ ప్రారంభమైంది. ఎన్జీఓలు, జేఏసీ చేపట్టిన ఆందోళనలకు వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, టీడీపీ నేతలు సంఘీభావం తెలిపారు. డీజిల్ బంకుల యజమానుల ఆందోళనకు వైఎస్సార్సీపీ నేతలు కోటరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్ మద్దతు ప్రకటించారు. వివిధ చేతి వృత్తి సంఘ నాయకులు, విద్యార్థులు, ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట ధర్నా, ఆందోళన చేశారు. కలెక్టరేట్ ఉద్యోగులను విధులకు వెళ్లకుండా అడ్డుకున్నారు. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో బస్టాండ్, వీఆర్సీ, గాంధీబొమ్మ సెంటర్లలో రోడ్డుపైన అల్పాహారం తిని, తలకిందులుగా నడిచి నిరసన వ్యక్తం చేశారు. వాహనాలను అడ్డుకున్నారు. దుకాణాలను మూసివేయిం చారు. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో పూలే విగ్రహం వద్ద మానవ హారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిబ్బందిని హాజరు పుస్తకంలో సంతకం కూడా చేయించకుండా విధులు బహిష్కరింప చేశారు. ఉదయగిరిలో ఎన్జీఓ, విద్యార్థి జే ఏసీ ఆధ్వర్యంలో బస్టాండు సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. వింజమూరులో విద్యార్థి జేఏసీ, ఎన్జీఓల ఆధ్వర్యంలో పట్టణంలోని పాత బస్టాండు నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించి దుకాణాలు మూసివే యించి బంద్ నిర్వహించారు. కలిగి రిలో వైఎస్సార్సీపీ నేత పావులూరి మాల్యాద్రిరెడ్డి ఆధ్వర్యంలో బస్టాండు సెంటర్లో నిరసన చేపట్టారు. వెంకటగిరిలో భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో కాశీపేట నుంచి అడ్డ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కారు స్టాండు కార్మిక సంఘం ఆధ్వర్యంలో అడ్డరోడ్డు సెం టర్ నుంచి పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి దుకాణాలను మూసి వేయించారు. కేసీఆర్ దిష్టిబొమ్మను ఊరేగించి కాశీపేట కూడలిలో దహనం చేశారు. దీంతో వెంకటగిరిలో ఆర్టీసీ బస్సులు పూర్తిగా నిలిచి పోయాయి. సూళ్లూరుపేటలో జేఏసీ, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. సూళ్ళూరుపేట జేఏసీ ఆధ్వర్యంలో పీర్లచావిడి సెంటర్లో రిలేదీక్ష ప్రారంభించారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. -
కిటకిటలాడుతున్న రైల్వేస్టేషన్
విజయవాడ, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రకు అనుకూలంగా ఏపీఎన్జీవోలు సోమవారం అర్థరాత్రి నుంచి చేపట్టిన నిరవధిక సమ్మెకు మద్దతుగా ఆర్టీసీ సిబ్బంది సమ్మెలో పాల్గొనడంతో బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో సోమవారం ఉదయం నుంచి రైల్వేస్టేష్‌లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఉదయం సమయంలో వెళ్లే ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌లు పినాకినీ, రత్నాచల్, శాతవాహన రైళ్లలో ప్రయాణికుల రద్దీ మరింత పెరిగింది. దీంతో బుకింగ్ కౌంటర్ల వద్ద పెద్ద ఎత్తున క్యూ ఏర్పడింది. అదే విధంగా మధ్యాహ్న సమయంలో జన్మభూమి, కృష్ణా, ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌లతో పాటు రాత్రి సమయాల్లో వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్లలో వెయిటింగ్ లిస్టు అమాంతం పెరిగి పోయింది. అంతేకాకుండా చుట్టుప్రక్కల ప్రాంతాలకు వెళ్లేందుకు పలువురు ప్రయాణికులు ప్యాసింజర్ రైళ్లను ఆశ్రయించారు. ముఖ్యంగా గుంటూరు, తెనాలి, విజయవాడ మధ్య తిరిగే సర్క్యూలర్ రైళ్లలో సాధారణ ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. అయితే దీనిపై అధికారులు స్పందిస్తూ ఇది సాధారణ రద్దీ మాత్రమేనని, బస్సులు నడవకపోవడంతో పెరిగిన రద్దీ కాదని అన్నారు. రానున్న రోజుల్లో పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. రద్దీ పెరిగితే పలు రైళ్లకు అదనపు బోగీలు, ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయడంతో పాటు టికెట్ల కౌంటర్లను పెంచుతామని సీనియర్ డీసీఎం ఎన్వి.సత్యనారాయణ తెలిపారు. డీఆర్ఎంతో సమావేశమైన రైల్వే ఎస్పీ సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీఎన్జీవోలు చేపట్టిన సమ్మెలో భాగంగా కొంతమంది నాయకులు డివిజన్ స్థాయిలో గురువారం రైల్‌రోకోలు చేపట్టనున్నట్లు రైల్వే ఎస్పీ డాక్టర్ సీహెచ్.శ్యామ్‌ప్రసాద్‌కు సమాచారమందడంతో ఆయన డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ రమేష్‌చంద్రతో కలిసి చర్చించిన అనంతరం డీఆర్ఎం ప్రదీప్‌కుమార్‌తో సమావేశమయ్యారు. రైళ్లకు ఎటువంటి ఆటంకం కలుగకుండా చూడటంతో పాటు ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని డీఆర్ఎం సూచించారు. ఉద్యమకారులు ఎవరైనా రైల్వే ఆస్తులకు కానీ, రైళ్లకు కానీ నష్టం కలిగించినట్లయితే కఠిన చర్యలు చేపట్టడంతో పాటు జైళ్లకు వెళ్లవలసి వస్తుందని సూచించాలని డీఆర్ఎం అధికారులకు సూచించారు. అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ సాంబశివరావు, రైల్వే డీఎస్పీ ఎస్.రాజశేఖరరావు, సీఐలు ఎం.రామ్‌కుమార్, రాజగోపాలరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యక్ష పోరాటాల్లోకి ఆర్టీసీ కార్మికులు సిహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం జరుగుతున్న వివిధ పోరాటాల్లో ఆర్టీసీ కార్మికులు కూడా ప్రత్యక్షంగా పా ల్గొనాలని నిర్ణయించినట్లు ఎంప్లాయీస్ యూ నియన్ సమైక్యాంధ్ర పోరాట సమితి అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఎన్జీఓ హోంలో ఏర్పాటుచేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. సమ్మె చేపట్టిన ఆర్టీసీ కార్మికులు బుధవారం నుంచి ఎన్జీఓల తో కలిసి ఆందోళనల్లో పాల్గొంటారని వెల్లడించారు. యాజమాన్య బెదిరింపులను లెక్క చేయకుండా రాయలసీమ, కోస్తాంధ్రలోని 13 జిల్లాలకు చెందిన అన్ని కేటగిరిల కార్మికులు సమ్మెలోకి వచ్చారని తెలిపారు. మంగళవారం రాస్తారోకోలు, మానవహారాలు,వంటావార్పు లు నిర్వహించారన్నారు. విశ్రాంత ఆర్టీసీ కార్మికులు కూడా సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనడం అభినందనీయమన్నారు. జిల్లా గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎన్.రామ్మూర్తినాయుడు మాట్లాడుతూ జిల్లాలో 2300 మం ది గెజిటెడ్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారని తెలిపారు. రాష్ట్రం విభజన జరిగితే 58 సంవత్సరాల అభివృద్ధి వెనక్కి వెళుతుందన్నారు. విద్య, ఉద్యోగ, వైద్య రంగాల్లో తీవ్రం గా నష్టపోవాల్సి వస్తుందని తెలిపారు. రాష్ర్ట ఆదాయంలో 65శాతం హైదరాబాద్‌తో కూడి న తెలంగాణా నుంచి వస్తుండగా సీమాంధ్ర నుంచి కేవలం 35శాతమే లభిస్తోందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో విభజన అంటూ జరిగితే ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి ఈ ప్రాంతంలో ఉండదన్నారు. ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కెవి శివారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 35వేల మంది వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు చెందిన ఉద్యోగులు సమ్మె చేపట్టారని తెలిపారు. మున్సిపల్ కార్మిక ఉద్యోగులు కూడా సమ్మెచేపట్టారని, అయితే తాగునీరు, శానిటేషన్, విద్యుత్ వంటి సమస్యలకు ఇబ్బంది కలగకుండా చూస్తారన్నారు. గతంలో పిఆర్సి వంటి తమ ఆర్థిక పరమైన డిమాండ్ల కోసం మాత్రమే ఆందోళనలు చేసిన తాము ఇప్పుడు రాష్ట్ర సమైక్యత కోసం ఉద్యమంలో పాల్గొంటున్నామన్నారు. సమ్మెలోకి వెళితే ఎస్మా ప్రయోగిస్తామంటూ ట్రెజరీ ఉద్యోగులకు బెదిరింపులు పంపడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేసి తక్షణం ఉద్యమంలోకి రావాలంటూ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సమైక్యాంధ్ర పోరాట సమితి కన్వీనర్ రాజేంద్రప్రసాద్, జోనల్ కార్యదర్శి జివి నరసయ్య, రీజనల్ ట్రెజరర్ నాగముని తదితరులు పాల్గొన్నారు. -
ఉధృతమైన ఉద్యమం కాంగ్రెస్, టీడీపీల్లో కలవరం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఉధృతమైన సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాకు చెందిన అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల నేతలను కలవరపరుస్తోంది. మనస్ఫూర్తిగా ఉద్యమంలో పాల్గొనలేక, అలా అని దూరంగా ఉండలేక ఈ పార్టీల నేతలు సతమతమవుతున్నారు. యూపీఏ ప్రభుత్వం తరఫున కాకుండా కాంగ్రెస్ పార్టీ ద్వారా విభజన ప్రకటన చేయడం ఆ పార్టీ నేతలను ఇరకాటంలో పడేసింది. కాంగ్రెస్‌కు, ఆ పార్టీ అధినేత్రి సోనియాకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పాల్గొనలేక, దూరంగా ఉండలేక ఆ పార్టీ నేతలు సతమతమవుతున్నారు. ఈ నిర్ణయం వల్ల రాయలసీమకు అన్యాయం జరుగుతుందని పార్టీ ప్రజాప్రతినిధులు పలువురు రాజీనామాలు సమర్పించి ఉద్యమంలో పాల్గొంటుండగా, తిరుపతి ఎంపీ చింతా మోహన్ ఇది తనకు సంబంధించిన విషయమే కాదన్నట్టు దూరంగా ఉంటున్నారు. సీమాంధ్రకు చెందిన మెజారిటీ కాంగ్రెస్ ఎంపీలు రాజీనామాలు చేసినా, పార్లమెంటులో ఆందోళన చేస్తున్నా చింతామోహన్ మాత్రం అన్నింటికీ దూరంగా తప్పించుకు తిరుగుతున్నారు. ఓటేసి గెలిపించిన ప్రజల కంటే కాంగ్రెస్ అధిష్టానం ఆశీస్సులే తనకు ముఖ్యమన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఇక మిగిలిన మంత్రులు రాజీనామా చేస్తే తాను చేస్తానని తన ఇంటిని ముట్టడించిన సమైక్యవాదులకు హామీ ఇచ్చిన మంత్రి గల్లా అరుణకుమారి ఆ హామీని అప్పుడే మరచిపోయారు. తమ కంపెనీ (అమరరాజా) ఉద్యోగులతో ఒక రోజు ర్యాలీ జరిపించి తన పని ముగిసినట్లు ఆమె ఉద్యమానికి దూరంగా ఉంటూ కాలక్షేపం చేస్తున్నారు. మంత్రులు, ఎంపీల రాజీనామాలే లక్ష్యంగా ఎన్జీవోల భారీ ఉద్యమం ప్రారంభమైన తరువాత కూడా ఆమె రాజీనామా గురించి మాట్లాడడం లేదు. విభజనకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ లేఖ ఇవ్వడమేగాక పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇప్పటికీ విభజనకే కట్టుబడి ఉండడం ఆ పార్టీ నేతలను అయోమయం లో పడేస్తోంది. చంద్రబాబు విభజనకు వ్యతిరేకంగా మాట్లాడకుండా ప్యాకేజీల గురించి మాట్లాడుతుండడంతో ఇక్కడి తెలుగు తమ్ముళ్లు ధైర్యంగా ఉద్యమంలో పాల్గొనలేకపోతున్నారు. జనాగ్రహానికి భయపడి కాస్త ఆల స్యంగా పదవులకు రాజీనామాలు సమర్పించిన జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఉద్యమంలో మాత్రం ఉత్సాహంగా పాల్గొనడం లేదు. చిత్తూ రు ఎంపీ శివప్రసాద్ పార్లమెంటులో సమైక్యగళాన్ని గట్టిగా వినిపిస్తున్న సమయంలో కూడా ఇక్కడి తెలుగుదేశం నేతలు మౌనంగానే ఉంటున్నారు. పలుచోట్ల సమైక్యవాదులు పార్టీ వైఖరి ని తప్పుపడుతుండడం, నేతలను నిలదీస్తుండడమే ఇందుకు కారణం. మంగళవారం సత్యవేడులో ఎమ్మెల్యే హేమలతను నిలదీసి, ఉద్యమంలో పాల్గొనేలా చేశారు. కాంగ్రెస్, దేశం నేతలు నాటకాలాడితే ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని ఎన్జీవో నేతలు హెచ్చరిస్తుం డడం వారిని కలవరపెడుతోంది. -
ఎక్కడి బస్సులు అక్కడే
కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఆందోళనల నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. నేషనల్ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్లు సీమాంధ్ర జేఏసీల ఆధ్వర్యంలో సమ్మె నోటీసులివ్వడంతో స్థానిక సంఘాలు మంగళవారం ఆందోళన బాటపట్టాయి. జిల్లాలోని 11 డిపోల్లో 970 బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సోమవారం వివిధ రూట్లలో వెళ్లిన దూర ప్రాంత సర్వీసులను రాత్రికి రాత్రే డిపోలకు రప్పించారు. నైట్ అవుట్ సర్వీసులను రద్దు చేశారు. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానికల్, శ్రామిక్, ఎలక్ట్రికల్ సిబ్బందితో పాటు కార్యాలయ సిబ్బంది సమ్మెలో పాల్గొనడంతో కర్నూలు రీజియన్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ఒకే రోజు ఆర్టీసీ ఆదాయానికి కోటి రూపాయలు పైగా నష్టం వాటిల్లిందని డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ వెంకటరామం తెలిపారు. బస్సుల బంద్‌తో ప్రయాణికులు రైళ్లను ఆశ్రయిస్తున్నారు. హైదరాబాద్, గుంతకల్, గుంటూరు, తిరుపతి, చిత్తూరు, చెన్నై ఎగ్మోర్, బెంగళూరు వంటి ప్రాంతాలకు వెళ్లే రైళ్లన్నీ కిక్కిరిశాయి. ఇదిలాఉండగా రాష్ట్ర విభజనను నిరసిస్తూ కార్మిక సంఘాలు నల్లబ్యాడ్జీలు ధరించి ప్రదర్శన నిర్వహించాయి. ఆందోళనల్లో ఎన్ఎంయూ నాయకులు మధుసూధన్, మద్దిలేటి, ఇస్మాయిల్ మద్దయ్య, నజీర్, సింగ్.. ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు మజీద్, ఎల్లన్న, ఎ.వి. రెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ నాయకులు ఎం.. కుమార్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు రవికుమార్‌లు సమ్మెకు మద్దతు ప్రకటించి ఆందోళనల్లో పాల్పంచుకున్నారు. -
విభజించే హక్కు సోనియాకు లేదు: సబ్బం హరి
సాక్షి, విశాఖపట్నం: తెలుగువాళ్లని విభజించే హక్కు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేదని ఆ పార్టీ ఎంపీ సబ్బం హరి వ్యాఖ్యానించారు. విభజనపై సోనియా నిర్ణయం తీసేసుకున్నారని, ఒక్కసారి మాట ఇస్తే ఆమె తప్పరని పార్టీ పెద్దలు వ్యాఖ్యానించడంపై ఆయన మండిపడ్డారు. తాను రాజకీయాల్లోకి రానని గతంలో సోనియా గాంధీ అన్నారని, మరి ఇప్పుడెందుకు రాజకీయాలు చేస్తున్నారని సబ్బం విమర్శించారు. ఒక్కసారి చరిత్రను గుర్తుచేసుకోవాలని ఆయన సోనియా గాంధీని కోరారు. ప్రధాని పదవి కోసం ఆమె అప్పట్లో ములాయం సింగ్, మాయావతి, జయలలిత తదితరుల్ని కలిసిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తాను రాజకీయాల్లోకి రానని చెబుతున్న ఆమె ఆ విషయాన్ని ఎందుకు గుర్తుచేసుకోవడం లేదని అడిగారు. సంఖ్య సరిపోకపోవడంతోనే నాడు ఆమె ప్రధాన మంత్రి కాలేదని గుర్తుచేశారు. మహాత్మా గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, ఎన్టీఆర్‌లు అందరూ దేశమైనా రాష్ట్రమైనా సమైక్యంగా ఉండాలని కృషి చేస్తే.. సోనియా మాత్రం విభజించడానికి చూస్తున్నారని ధ్వజమెత్తారు. విశాఖ బీచ్‌రోడ్డులో ఆదివారం ఆయన ‘సమైక్యాంధ్ర ఉద్యమం-అవగాహన సదస్సు’ పేరిట సభ నిర్వహించారు. తొలుత పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం పూలమాల వేశారు. పార్టీలు, కుల వర్గాలకతీతంగా సమైక్యాంధ్ర కోసం అంతా ముందుకు రావాలని కోరారు. త్వరలో పాదయాత్ర.. రాజీనామా విషయంలో వెనక్కు తగ్గేది లేదని హరి కుండబద్ధలు కొట్టారు. సమైక్యాంధ్ర ఉద్యమం కోసం తాను పాదం ముందుకు వేశానని, అందుకు వేదిక సిద్ధమైందని, ఉత్తరాంధ్ర జిల్లాల్లో త్వరలోనే పాదయాత్ర చేపడతానని, అంతా ముందుకు రావాలని కోరారు. వైఎస్సార్ తనకెంతో ఇష్టమైన నాయకుడని, ఆయనపై నిందలు మోపడం సబబుకాదని అన్నారు. రాష్ట్ర విభజనకు ఆయన ముందుకు వచ్చారని చెబుతున్న నాయకులు.. 60 ఏళ్లనుంచి తాము ఉద్యమం చేస్తున్నామని చెబుతున్న నాయకులు.. ఎవరైనా సరే వైఎస్సే విభజనకు ఆజ్యం పోశారని చెప్పగలరా అని ప్రశ్నించారు. తన పిల్లల కోసం, పదవుల కోసం సోనియా ప్రయత్నించారని, కానీ ఏనాడూ వైఎస్ తన పిల్లలకు పదవుల గురించి ఆలోచించలేదన్నారు. సమైక్యాంధ్ర కోసం ముందుకు రావాలని స్వర్గం నుంచి ఎన్టీఆర్ చంద్రబాబును కోరాలని, ఆయన మాట వినకపోతే కొడుకుల్నయినా కోరాలని సబ్బం అన్నారు. విశాఖ ప్రజలు పురందేశ్వరిని ఎన్నుకుంటే కనిపించకపోవడం ఘోరమన్నారు. తన కూతుర్ని ఉద్యమంలోకి పంపించాలని పైనున్న ఎన్టీఆర్‌ను కోరుకుంటున్నట్టు చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు రాజకీయ సమాధి తప్పదని హెచ్చరించారు. ఎన్టీఆర్ రాజకీయాల్లో ఉన్నప్పుడు చిరంజీవిది ఎక్స్ట్రా క్యారెక్టర్ అని, ఇప్పుడు ఎంతో ఎత్తుకు ఎదిగిపోయారని, రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంటే ఆయన మాత్రం కేరళలో పడవలకు జెండా ఊపుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజనపై ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వెల్లడించిన అభిప్రాయాలు సరైనవేనన్నారు. జనం కోసం జగన్.. ‘జనం కోసం జగన్ తిరుగుతున్నారనే ఆయన్ను జైల్లోకి పంపారు.. ఇప్పుడు ఉద్యమ కాగడాలతో విజయమ్మ, షర్మిల ముందుకు వచ్చారు’ అని సబ్బం అన్నారు. పదవుల్ని త్యజించిన విజయమ్మ, జగన్‌ల గొప్పతనాన్ని ఆయన అభినందించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమన్నారు. జగన్, విజయమ్మలను చూసి ఇతర రాజకీయ నేతలు ఎంతో నేర్చుకోవాలని చెప్పారు. కేసీఆర్‌ది అబద్ధాల కుటుంబం టీఆర్ఎస్ నేత కేసీఆర్‌ది అబద్ధాల కుటుంబం అని హరి ధ్వజమెత్తారు. తెలుగువారి ఉనికినే ప్రశ్నించే స్థాయికి ఆయన ఎదిగిపోయారని, హైదరాబాద్ వచ్చి తగిన సమాధానం చెబుతామని అన్నారు. త్యాగాలు చేసి సాధించుకున్న రాష్ర్టం మీ తాత సొత్తా అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఆయన ఏపీ రాక్షసుడు అని, అంతమొందించాల్సిందేనని అన్నారు. సమాజంలో చిచ్చుపెడుతున్నవారెవరైనా త్వరలో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. -
మార్మోగుతున్న సమైక్యనాదం
సాక్షి నెట్వర్క్: ఎందరో త్యాగధనుల ఫలమైన సమైక్యాంధ్ర ప్రదేశ్‌ను వేర్పాటువాదుల స్వార్ధం కోసం ముక్కలు కానివ్వమంటూ సీమాంధ్ర ప్రజ ఎలుగెత్తిచాటుతోంది. సమైక్యాంధ్ర పరిరక్షణ లక్ష్యంగా కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఎగసిన ఉద్యమం వెల్లువలా సాగుతోంది. రాష్ర్ట విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై జనాగ్రహావేశాలు వేర్పాటు ప్రకటన వెనక్కితీసుకునే వరకే చల్లారేలా కనిపించడం లేదు. వరుసగా పన్నెండురోజుల నుంచి మిన్నంటుతున్న ఆందోళనలు ఆదివారం నాడు కూడా ఉధ్ధృతంగా సాగాయి. రాస్తారోకోలు, ధర్నాలు, మానవహారాలతో అన్నిచోట్లా నిరసనజ్వాలలు హోరెత్తాయి. వేర్పాటు ప్రకటన దరిమిలా మొదలైన సోనియాగాంధీ, కేసీఆర్, చంద్రబాబుల దిష్టిబొమ్మల దహనాలు, శవయాత్రలు ఆదివారం కూడా యధావిధిగానే సాగాయి. చిత్తూరు జిల్లా కుప్పంలో కేసీఆర్, చంద్రబాబుల దిష్టిబొమ్మలను తగులబెట్టారు. అనంతపురం జిల్లా పామిడిలో ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోనియాగాంధీ దిష్టిబొమ్మను శవపేటికలో ఊరేగింపుగా తీసుకెళ్లి స్థానిక అంబేద్కర్ సర్కిల్లోని సమైక్య శిబిరం ఎదుట గుంతతీసి పూడ్చిపెట్టారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో భవన నిర్మాణ కార్మికులు కేసీఆర్ దిష్టిబొమ్మను ఇటుకలతో సమాధి చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో ఆందోళనకారులు ప్రజాకోర్టు నిర్వహించి సోనియా వేషధారికి దేశబహిష్కరణ, కేసీఆర్ వేషధారికి రాష్ట్ర బహిష్కరణ శిక్ష విధించారు. రోడ్లపైనే క్రైస్తవుల ప్రార్ధనలు సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం కర్నూలు జిల్లా కోడుమూరు, గూడూరులలో క్రిస్టియన్లు రోడ్లపైనే ప్రార్ధనలు నిర్వహించారు. చిత్తూరు జిల్లా కుప్పం, పలమనేరులో క్రైస్తవ సంఘాలు ర్యాలీ, ధర్నా నిర్వహించి నిరసన తెలియజేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో క్రైస్తవ సోదరులు ‘సమైక్య’ ప్రార్థనలు చేశారు. పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. రోడ్డుపై వలలతో మత్స్యకారుల నిరసన రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ విజయనగరంలో వందలాదిమంది మత్స్యకారులు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం అన్ని ప్రధాన కూడళ్లలో రోడ్డుపై వలలు వేసి చేపలు పడుతున్నట్టు వినూత్నంగా తమ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన జరిగితే నదీజలాల సమస్య ఏర్పడి తామందరి పరిస్థితి ఇలాగే ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయనగరంలోని ప్రధానవీధుల మీదుగా క్వారీ లారీలతో ర్యాలీ నిర్వహించారు. వేర్పాటు భూతం వదిలేందుకు పూజలు విజయనగరం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ పిలుపుమేరకు క్రీడాకారులు పట్టణంలోని ప్రధాన కూడళ్లలో క్రీడలు ఆడుతూ నిరసన ర్యాలీ చేపట్టారు. సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో సోనియా, దిగ్విజయ్, బొత్సల మాస్కులు ధరించిన వారిని హోమం వద్ద కూర్చోపెట్టి వేర్పాటు భూతం వదిలించేందుకు పూజలు జరిపించారు. ప్రకాశంలో వైఎస్సార్ సీపీ నేతల నిరవధిక నిరాహారదీక్ష ప్రకాశం జిల్లా పర్చూరులో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ గొట్టిపాటి నరసయ్య కుమారుడు భరత్, మరో ముగ్గురు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రెండో రోజుకు చేరింది. కనిగిరిలో వైఎస్సార్ సీపీ నేత రాజాల ఆదిరెడ్డి సమైక్య రాష్ట్రాన్ని కాంక్షిస్తూ పార్టీ కార్యాలయం ముందు నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. రేపటి నుంచి ‘తూర్పు’ బంద్ రాజమండ్రిలో ఆదివారం సమావేశమైన తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని విభాగాల జేఏసీలు 12, 13, 14 తేదీల్లో రాజమండ్రిలో విద్యాసంస్థల బంద్ నిర్వహించాలని, 13, 14 తేదీల్లో జిల్లా స్థాయిలో విద్యా, వ్యాపార వర్గాల బంద్ పాటించాలని నిర్ణయించాయి. కాకినాడలో మంత్రి తోట నరసింహం సతీమణి వాణి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఆదివారం రెండో రోజుకు చేరింది. గుంటూరులో రైళ్ల అడ్డగింత సమైక్యాంధ్ర జేఏసీ పిలుపులో భాగంగా ఆదివారం గుంటూరులో రైల్‌రోకోలు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా పలుచోట్ల రైళ్లను అడ్డుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ గుంటూరు నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి, సమైక్యాంధ్ర జేఏసీ గౌరవాధ్యక్షుడు పి.నరసింహారావు, కన్వీనర్ ఆచార్య ఎన్.శామ్యూల్ నేతృత్వంలో గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్లే సింహాద్రి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్ నుంచి వచ్చిన జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను అడ్డుకున్నారు. రైల్‌రోకో నేపథ్యంలో కేంద్ర భద్రతా దళాలు అన్ని రైల్వేస్టేషన్లలో ముమ్మరంగా గస్తీ నిర్వహించాయి. గుంటూరు జిల్లావ్యాప్తంగా సోమవారం ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలు, కళాశాలల నుంచి 30వేల మంది విద్యార్థులతో భారీ ర్యాలీకి సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్. శామ్యూల్ పిలుపునిచ్చారు. సోమవారం అర్ధరాత్రి నుంచి పశ్చిమగోదావరి జిల్లా నిరవధిక బంద్ ప్రారంభమవుతుండగా, ఏలూరు నగరంలో మాత్రం సోమవారం ఉదయం నుంచే బంద్ ప్రారంభం కానుంది. స్థానిక జేఏసీ ఈ మేరకు పిలుపునిచ్చింది. నేటి నుంచి నిరవధిక నిరాహార దీక్షల్లో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి వైఎస్సార్ జిల్లా కడప కలెక్టరేట్ ఎదుట సోమవారం నుంచి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు నోటికి నల్ల రిబ్బన్లు ధరించి మౌన ప్రదర్శన చేపట్టారు. పోరుమామిళ్ల, ప్రొద్దుటూరులో ముస్లింలు ఉద్యమంలో పాల్గొని తమ నిరసన తెలియజేశారు. కొనసాగుతున్న ‘అనంత’ బంద్ రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ తీరుకు నిరసనగా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయడానికి సంఘీభావంగా ఆ పార్టీ చేపట్టిన 48 గంటల జిల్లా బంద్ అనంతపురం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. పెనుకొండలో హిందూపురం టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్పను ఉపాధ్యాయులు అడ్డుకున్నారు. కృష్ణాజిల్లా విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద ఆదివారం ఒకరోజు సామూహిక సత్యాగ్రహం చేపట్టారు. కళాకారుల ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఎడ్లబండ్లతో పాలకొండ దిగ్బంధం వందలాది ఎడ్లబండ్లతో శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణాన్ని నిరసనకారులు దిగ్బంధించారు.శ్రీకాకుళంలో జిల్లా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. చెవిటి, మూగసంఘం నిరసన చిత్తూరు జిల్లా మదనపల్లెలో చెవిటి, మూగ సంఘం సబ్‌కలెక్టర్ కార్యాలయం ముందు సోనియా, దిగ్విజయ్ సింగ్‌లకు అట్టలతో సమాధులు కట్టి నిరసన తెలిపారు. పలమనేరులో టమాటా రైతులు భారీ ర్యాలీ నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. వికలాంగుల ర్యాలీ కర్నూలు, ఆలూరులలో వికలాంగులు భారీ ఎత్తున తరలివచ్చి సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. కర్నూలులో కురువ సంఘం ప్రతినిధులు, గొర్రెల కాపర్లు ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లతో ప్రదర్శన చేపట్టి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దేవనకొండలో వివిధ గ్రామాల నుంచి రైతులు ఎద్దుల బండ్లతో వచ్చి భారీ ర్యాలీ నిర్వహించారు. నంద్యాలలో గిరిజన మహిళలు ప్రధాన కూడళ్లలో సమైక్యాంధ్రకు మద్దతుగా నృత్యాలు చేశారు. విశాఖతీరంలో హోరెత్తిన సమైక్యనాదం సమైక్యాంధ్రపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎంపీ సబ్బం హరి నేతృత్వంలో విశాఖ బీచ్‌రోడ్డులో కార్యక్రమం జరిగింది. త్వరలో ఉత్తరాంధ్ర జిల్లాలో పాదయాత్ర చేస్తున్నట్టు హరి ప్రకటించారు. జగన్, విజయమ్మల రాజీనామాలపై హర్షం వ్యక్తం చేశారు. విశాఖలో రైల్‌రోకో నిర్వహించేందుకు సమైక్యాంధ్ర పొలిటికల్ జేఏసీ జె.టి.రామారావు ఆధ్వర్యంలో ఉద్యమకారులు ఆదివారం ఉదయం రైల్వేస్టేషన్‌కు వెళ్తున్న సమయంలో గేట్ వద్దే పోలీసులు అడ్డుకున్నారు. తిరుమలకు బస్సుల రాకపోకలపై నేడు నిర్ణయం తిరుమలకు రాకపోకలు చేసే భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన వారితో చర్చలు జరిపారు. ఈవిషయంపై జేఏసీ నాయకులు స్పష్టమైన హామీ ఇవ్వకపోగా నిర్ణయం సోమవారానికి వాయిదా వేశారు. చర్చల అనంతరం జేఈఓ మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగితే తిరుమలకు చేరుకునే భక్తులకు ప్రత్యామ్నాయం కల్పించలేమని తేల్చిచెప్పారు. బెజవాడలో 15నుంచి 108 గంటల దీక్ష సమైక్యాంధ్రనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ నగరంలో ఆగస్టు 15వ తేదీ నుంచి వందలాది వైద్యులతో 108 గంటల నిరాహార దీక్ష చేస్తున్నట్లు వైఎస్సార్ సీపీ వైద్య విభాగం రాష్ట్ర కన్వీనర్ గోసుల శివభారత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుంచి వైద్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈమేరకు ఆయన ఆదివారం వైఎస్సార్ జిల్లా కడపలో ఒక ప్రకటన విడుదల చేశారు. -
‘కావలి కాంగ్రెస్’లో సమైక్య విభేదాలు
కావలి, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమంలో ‘కావలి కాంగ్రెస్’లో విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. ‘నాకు తెలియకుండా కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించి బంద్, ఆందోళన తేదీలు ఖరారు చేస్తావా’ అంటూ ఏఎంసీ మాజీ చైర్మన్ గ్రంధి యానాదిశెట్టిపై మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరువురి మధ్య వాదోపవాదాలు జరిగాయి. శనివారం కావలి ఆర్అండ్బీ అతిథి గృహానికి వచ్చిన విష్ణువర్ధన్‌రెడ్డి ఈ విషయంపై గ్రంధిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రంధి కూడా అదే స్థాయిలో విష్ణుపై రుసరుసలాడారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సూచనల మేరకు గ్రంధి సమైక్యాంధ్ర ఉద్యమ ప్రణాళిక రూపకల్పనపై శుక్రవారం పట్టణంలోని హోల్‌సేల్ క్లాత్ మర్చంట్స్ కల్యాణ మండపంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం వీరి మధ్య చిచ్చు రగిల్చింది. సమావేశంలో ఈ నెల 13న బంద్‌ను, ర్యాలీ చేయాలని నిర్ణయించారు. ఈ విషయం విష్ణువర్ధన్‌రెడ్డికి మింగుడు పడలేదు. శనివారం కావలికి వచ్చిన ఆయన తన అనుచరులతో సమావేశం నిర్వహిస్తున్న సమయంలో యానాదిశెట్టి అక్కడికి వచ్చారు. నాకు తెలియకుండా బంద్, ఆందోళన తేదీని ఎలా ప్రకటిస్తావని విష్ణువర్ధన్‌రెడ్డి గ్రంధిపై అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఇద్దరి మధ్య వాదోపవాదనలు జరిగాయి. విష్ణు అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పార్టీలో ఇష్టానుసారంగా ఎవరికి వారు నడుచుకోవడం ఏమిటంటూ ప్రశ్నించారు. శుక్రవారం జరిగిన సమావేశంలో మంత్రి ఆనం పేరు ప్రస్తావించడమే ఈ రచ్చకు కారణంగా తెలుస్తోంది. ఇప్పటికే 13వ తేదీ బంద్, నిరసనలు చేయాలని ప్రకటించామని, ఇప్పుడు లేదంటే ఎట్లా అంటూ విష్ణుతో గ్రంధి మొరపెట్టుకున్నారు. అయితే ఈ విషయంలో కాస్త రాజీపడాలని గ్రంధి విష్ణుకి సూచించడంతో 12న నిరసన కార్యక్రమాలు, 13వ తేదీ బంద్ నిర్వహించేందుకు అంగీకారానికి వచ్చారు. -
సీమాంధ్రలో కొనసాగుతున్న సమైక్య ఉద్యమం
-
సీమాంధ్ర జిల్లాల్లో కొనసాగుతున్న ఆందోళనలు
హైదరాబాద్ : సీమాంధ్రలో ఉద్యమ సెగలు ఏమాత్రం చల్లారడం లేదు. రాష్ట్ర విభజనపై ఢిల్లీ పరిణామాల నేపథ్యంలో సీమాంధ్రుల ఆగ్రహ జ్వాల రోజురోజుకూ ఉధృతమవుతుంది. 11వ రోజు కూడా ర్యాలీలు, ఆందోళనలతో సీమాంధ్ర జిల్లాలు అట్టుడుకుతున్నాయి. మరోపక్క వివిధ సంఘాలు సమ్మెలకు పిలుపునిస్తుండటంతో పరిస్థితి మరింత భయానకంగా మారుతోంది. కర్నూలు జిల్లా కోడుమూరులో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బంద్ జరుగుతోంది. మరోవైపు జిల్లా వ్యాప్తంగా 910 ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. చిత్తూరు జిల్లాలోనూ బంద్ కొనసాగుతుంది. పదకొండో రోజు కూడా విద్యా సంస్థలు, దుకాణలు తెరుచుకోవటం లేదు. సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుపతిలో బంద్ జరుగుతుంది. జేఏసీ ఆధ్వర్యంలో తిరుపతిలో మహా ప్రదర్శన నిర్వహిస్తున్నారు. మరోవైపు మున్సిపల్ కార్యాలయంలో జేఏసీ చేపట్టిన నిరసన దీక్షలు 11వ రోజుకు చేరాయి. టీటీడీ ప్రధాన పరిపాలన భవనం వద్ద టీటీడీ ఉద్యోగుల దీక్ష ఆరోరోజుకు చేరుకుంది. మున్సిపల్ కార్యాలయం 11వ రోుజకు చేరిన జేఏసీ నిరసన దీక్షలు మరోవైపు సమైక్య వాణిని కాంగ్రెస్ అధిష్ఠానానికి వినిపించేందుకు 12వ తేదీ నుంచి ఢిల్లీలో నిఠాహార దీక్షలు చేపట్టనున్నట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు నిన్న వెల్లడించారు. సమైక్యాంధ్ర ప్రదేశ్ కోసం అపోహలు విస్మరించి అంతా ఒక్క తాటిపై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. -
స్వార్థంలేని సమైక్యాంధ్ర ఉద్యమం
పాలకొల్లు, న్యూస్‌లైన్: తెలంగాణ ఉద్యమం కేసీఆర్‌లాంటి స్వార్థ రాజ కీయ నాయకుల నుంచి వచ్చిందని, ఎలాంటి స్వార్థం లేని సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఎవరూ ఆపలేరని ఎమ్మె ల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యే అల్లు వెంకట సత్యనారాయణ, సమై క్యాంధ్ర పరిరక్షణ సమితి నాయ కులు డాక్టర్ కేఎస్‌పీఎన్‌వర్మ, కొప్పు సత్యనారాయణ, ముచ్చర్ల శ్రీరామ్ స్పష్టం చేశారు. పట్టణంలోని 930 డ్వాక్రాగ్రూపు సంఘ మహిళలు పట్ట ణంలో భారీ ర్యాలీ, 24, 25, 26 వార్డులకు చెందిన ప్రజలు వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు. ముస్లీం సోదరులు గాంధీబొమ్మల సెంటర్లోని రహదారిపై ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. నాయకులు వారు మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజ ల మనో భావాలకు అను గుణంగా రాష్ట్ర విభజన ప్రక్రియను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే బంగారు ఉషా రాణి, ఎమ్మె ల్సీ అంగర రామమోహన్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాబ్జి, వైఎస్సార్సీపీ నాయకులు గుణ్ణం నాగబాబు, యడ్ల తాతాజీ, సంగినీడి సూరి బా బు, చీకట్ల వరహాలు, ఇజ్జాడ చిన బాబు, కంది రామచంద్రరావు, గిం జాల సత్యశ్రీను, నడపన గోవింద రాజులు నాయుడు, రాజేష్‌కన్నా, పొట్నూరి శ్రీను, సత్తిబాబు, రావూరి పాల్గొన్నారు. -
YSR జిల్లాలో 8వ రోజు కొనసాగుతున్న బంద్
-
వైఎస్ఆర్ జిల్లాలో కొనసాగుతున్న నిరసనలు
కడప : విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ జిల్లావ్యాప్తంగా ఎనిమిదో రోజు కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. వారం రోజులుగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. మరోవైపు సమైక్యాంధ్ర జేఏసీ వారం రోజుల పాటు ప్రయివేట్ విద్యా సంస్థల బంద్‌కు పిలుపు నిచ్చింది. పులివెందులలోనూ బుధవారం ఉదయం బంద్ జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వంటా వార్పు కార్యక్రమం చేపట్టారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రొద్దుటూరులో బంద్ కొనసాగుతుంది. మరోవైపు జిల్లా వ్యాప్తంగా అన్ని వ్యాపార సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. ఎన్జీవోలు 12వ తేదీ నుంచి విధులు బహిష్కరించి దీర్ఘకాలిక సెలవులపై వెళ్లి ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. కర్నూలు జిల్లాలోనో ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కాగా, ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసనలు తెలుపుతున్నారు.